కృష్ణ

నేడు నగరంలో శ్రీవారి నమూనా ఆలయం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవిత్ర కృష్ణానది పుష్కరాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానంలో స్వామి వారి నమూనా ఆలయాన్ని ఈ నెల 7వ తేదీ ఆదివారం ప్రారంభించనున్నారు. ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు మహాసంప్రోక్షణను శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం కృష్ణానది జలాలను తీసుకువచ్చి మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారి నామూనా ఆలయంలో వైఖానస ఆగమోక్తంగా స్వామివారికి అన్ని సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
సుప్రభాతం: తిరుమలలో స్వామివారికి జరిగే తొలిసేవ సుప్రభాతం. శయన మండపంలో పట్టుపాన్పుపై శయనించి ఉన్న శ్రీనివాస ప్రభువును మేల్కొల్పడానే్న సుప్రభాతం అంటారు. ప్రతిరోజూ తెల్లవారుజామున బంగారు వాకిలి ముందు ఆచార్య పురుషులు ‘కౌసల్యా సుప్రజారామ..’ అంటూ సుప్రభాత శ్లోకాలను పఠిస్తారు.
తోమాల సేవ, కొలువు: తిరుమల ఆనంద నిలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూలవిరాట్టును, ఉత్సవ మూర్తులను ఇంకా ఇతర విగ్రహాలను పుష్పమాలలతో, తులసి మాలలతో అలంకరించే కార్యక్రమానే్న తోమాలసేవ అంటారు. భుజాల మీది నుంచి వేలాడేట్టుగా అలంకరించే శ్రీవారి పుష్పాలంకరణ విధానాన్ని తోళ్‌మాలై అంటారు. అదే తోమాలగా మారిందంటారు. తోళ్ అంటే భుజమని అర్థం.
అర్చన: జియ్యంగారులు అందించిన తులసిని స్వీకరించి అర్చకులు శ్రీవేంకటేశ్వర సహస్రనామావళితో శ్రీవారి పాదాలను అర్చన చేస్తారు. ఆ తరువాత శ్రీవారి పాదాల మీది తులసిని స్వీకరించి స్వామి వారి వక్షస్థలం మీది శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మహాలక్ష్మీ చతుర్వింశతి (24) నామాలతో అర్చిస్తారు.
నివేదన, శాత్తుమొర: అర్చన తర్వాత గర్భాలయంలో స్వామివారికి, ఇతర మూర్తులకు నివేదన జరుగుతుంది. లడ్డూలు, వడలు, దద్దోజనం, పులిహోర, పొంగళ్లు తదితర ప్రసాదాలను నివేదిస్తారు. తొలి నివేదనను మొదటి గంట, మధ్యాహ్నం నివేదనను రెండవ గంట, రాత్రి నివేదనను మూడవ గంట లేదా రాత్రి గంట అంటారు.
నివేదన తరువాత వైష్ణవాచార్య పురుషులు స్వామివారి సన్నిధిలో దివ్య ప్రబంధ పారాయణం ఉదయం, రాత్రి ఘనస్వస్తి, సాయంత్రం ఊంజల్ సేవ ఉంటుందని చెప్పారు. ప్రతి రోజూ సాయంత్రం నమూనా ఆలయం నుంచి ఊరేగింపుగా పద్మావతి ఘాట్‌కు వెళ్లి పుష్కర హారతి ఇవ్వడం ద్వారా కృష్ణమ్మకు శ్రీవారు ఆశీస్సులు అందిస్తారని తెలిపారు.
ఊంజల్ సేవ: శ్రీదేవి, భూదేవితో కూడిన మలయప్ప స్వామి ఊరేగింపుగా వచ్చి ఊంజల సేవలో పాల్గొంటారు.
ఏకాంతసేవ: ఏకాంత సేవను పాన్పుసేవ, పవళింపు సేవ అని కూడా అంటారు. వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టెమంచంపై భోగ శ్రీనివాసమూర్తిని వేంచేపు చేస్తారు. తాళ్లపాక వంశీయులు ఒకరు జోలపాట లేదా లాలిపాట గానం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అదే సమయంలో తరిగొండ వారి తరఫున హారతి పళ్లెం వస్తుంది.
ఇతర విశేషాలు: శ్రీవారి నమూనా ఆలయంలో ప్రతి రోజు లక్ష మందికి దర్శనం కల్పించేందుకు, అన్న ప్రసాదాల పంపిణీకి తితిదె విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆలయ ప్రాంగణంలో ఫలపుష్ప, ఫోటో, మ్యూజియం, ఆయుర్వేద, పుస్తక ప్రదర్శన శాలలను అద్భుతంగా ఏర్పాటు చేయనున్నది. ప్రతిరోజూ సాయంత్రం నమూనా ఆలయం నుంచి ఊరేగింపుగా పద్మావతి ఘాట్‌కు వెళ్లి పుష్కర హారతి ఇవ్వడం ద్వారా కృష్ణమ్మకు శ్రీవారు ఆశీస్సులు అందిస్తారు.