లోకాభిరామం

భలే మంచిరోజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిత్రులారా! ఇవాళ భలే మంచిరోజు. అనగా సుదినము. ఎందుకని అడుగుతారేమో. నా బుర్ర చించుకుని అందులోని సంగతులను మీతో పంచుకుని, నా ఆనందాన్ని పెంచుకుని, మిమ్మల్ని చట్నీలో ముంచుకొని.. ఇక చాలుగానీ, ఆనందించడానికి నాకు అవకాశం దొరికింది కదా! నేను ఆ పని గనుక చేయగలిగితినా నాకిది తప్పకుండా మంచిరోజు అవుతుంది. మీకూ మంచిరోజుగానే ఉంటుంది అని హామీ ఇస్తున్నాను. ఇన్నాళ్లుగా, ఇనే్నళ్లుగా నేను మీ బుర్రలు తింటూనే ఉన్నాను. అయినప్పటికీ నా బుర్ర పెరగలేదు. మీ బుర్ర తరగలేదు. కనుకనయినా కావలసినంత భరోసాగా ముందుకు సాగండి.
త్యాగరాజస్వామి వారు కాపీరాగంలో దినమే సుదినము అని కీర్తన రాశారు. ఆ పాటను పండితులు ఎవరూ పాడుతున్నట్టు కనిపించదు, వినిపించదు. ఎందుకు అన్న ప్రశ్న మీరు నన్ను కాదు అడుగవలసింది, వెళ్లి ఆ పండితులను అడగాలి. కానీ మీకందరికీ సంగీత కచేరీలకు వెళ్లే అలవాటు ఉన్నదీ లేనిదీ నాకు తెలియదు కదా! నేను అప్పుడప్పుడు వెళతాను. బాగుంటే వింటాను. లేకుంటే ఆవులించి లేచి వెళ్లిపోతాను. కచేరీ ముగిసినదాకా ఉండి పాటల గురించి వారితో మాట్లాడే వెసులుబాటు, ఓపిక నాకు లేవు, ఒప్పుకుంటున్నాను. ఇంతకూ త్యాగయ్య ఏ దినాన్ని సుదినం అన్నారు? ఆయనకు ఈ ప్రపంచంలో తెలిసింది ఒకే ఒక్క విషయం. అది రామభక్తి. మృదంగం పెట్టుకుని తంబూర శృతి చేసుకుని రాముని గురించి పాడితే అది సుదినమట. ఆ రకంగా చూస్తే ప్రతిదినమూ సుదినమే. హాయిగా దేవుని పేరు పాడుకోవడానికి ముహూర్తం అవసరం లేదు. మూడ్ బాగుండనవసరం లేదు. పాడాలని మనసుకు తోచిన తరువాత మూడ్ దానంతట అదే సర్దుకుని మూడు పాటలు, నాలుగు భజనలుగా ఆనాడు ముందుకు సాగుతుంది. అది సుదినం అవుతుంది. అది సరేగానండీ, ఈ కాపీ రాగం ఏమిటీ? ఏ రాగాన్ని కాపీ కొడితే కాపీ రాగం అవుతుంది? అప్పుడు రెండూ ఒకే రకమయిన రాగాలు ఉంటాయి కదా? కనుక ఇది ఖచ్చితంగా కాపీ రాగం అయి ఉండదు. తుండీర మండలం మనిషి అంటే తమిళనాడు మనిదన్ అనగా అరవాయనగారు మనం తాగే కాఫీని కాపీ అని పలుకుతారు. ఈ రాగానికీ, ఆ కాఫీకి ఏమైనా సంబంధం ఉందా? హిందుస్తానీ సంగీతంలో కూడా ఈ రాగం ఉంది. దాన్ని కాఫీ అని పిలవడం కూడా విన్నాను. కాఫీ రుచిగా ఉంటుంది. ఈ రాగం అంతకన్నా రుచిగా ఉంటుంది. మరి ఈ రాగం కనుగొనే నాటికి మన దేశంలో కాఫీ తాగే అలవాటు ఉందా అన్న విషయం గురించి కొంత పరిశోధన సాగించాలి.
అయ్యలారా! ఓపికగా వింటున్నారు. అమ్మలారా! మీరు అంతకన్నా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక నేను మరింత ముందుకు కదిలి మీ బుర్ర గుంజు రుచి చూడకపోతానా? అన్నట్టు నాకొక పాట గుర్తుకు వస్తున్నది. ఆయనగారు ఒక్కరే కూచుని ‘్భలే మంచిరోజు, పసందయిన రోజు’ అని పాడేసుకుంటూ ఉంటారు. సినిమా పేరు ‘జరిగిన కథ’ అని జ్ఞాపకం. అవునండీ, సీరియల్ అయితే జరిగిన కథ చెప్పి, ఆ తరువాత జరుగవలసిన కథ చూపించవచ్చు. మరో వారానికి అది జరిగిన కథ అయిపోతుంది. అంతేకానీ, సినిమాకు జరిగిన కథ ఎలాగండి. మరేదయినా సినిమా కథను అందుకుని ఇందులో కొనసాగిస్తే, పాత సినిమాది జరిగిన కథ, ప్రస్తుత సినిమాది కొత్త కథ కావాలి కదా! జరిగిన కథ అని సినిమా తీస్తే అందరూ ఎలా ఒప్పుకున్నారు. సరే, ఫరవాలేదు అనుకుందాము. పాత సినిమాల్లో పెళ్లిచూపులు, వీణపాట తప్పకుండా ఉండేవి. ఆ సందర్భంలో త్యాగరాజస్వామి పాటలను కూడా వాడుకునేవారు. ఇక మరొక పద్దతిగా ధనికుల ఇంట్లో పియానో అని ఒక పెద్ద వాయిద్యం ఉండేది. అది చేటంతకన్నా పెద్దగా ఉండేది. దానిముందు పీట వేసుకుని కూచుని నాయకుడు, నాయకురాలు దుఃఖంగానో, ఆనందంగానో పాటపాడటం అప్పట్లో ఆనవాయితీ. ఈ భలేమంచిరోజు అనే పాట అసలు సిసలయిన పియానో పాట. మామూలుగానయితే అతని పాటకు రియాక్షన్ ఇస్తూ చుట్టూ కొంతమంది ఉంటారు. పాడుతున్న మనిషి వాళ్ల ముఖాలు చూస్తూ పాట సాగించడం కూడా మామూలే. మొత్తానికి గజిబిజిలో పడి పియానో వాయించడం ఆపేస్తారు. అసలు పియానో పాటలలో పియానో చప్పుడును కలపడం మరిచిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ పాటను జగ్గయ్యగారు పాడతారు. పాట జరిగినంతసేపూ ఆయనే కనబడతారు. కనీసం ఆయన కుడి చేతిని కూడా రీడ్స్ మీద కదిలించిన పాపాన పోరు. ఎడమ చేయి కదలనే కదలదు. మామూలుగానయితే మాటల మధ్యన ఉండే బ్రిడ్జ్ మ్యూజిక్ సమయంలో పియానో వాయించినట్టు చూపిస్తారు. ఈ పాటలో అట్లా చూపించిన ఆనవాలు కూడా లేదు. పాటలో మధ్యన కూడా పియానో ధ్వనులు వినిపించిన జ్ఞాపకం లేదు. మీట్యూబ్స్‌లో అంటే యూట్యూబ్‌లో ఈ మాట ఉండి తీరుతుంది. ఉపన్యాసం తరువాత ఇంటికి వెళ్లి ఆ సంగతి ఏదో తేల్చుకుంటాను. హాట్ హాట్‌గా అప్పుడే వేసిన అట్టువలె మాట్లాడే వాడికి ముందే ట్యూబ్‌లు, టయర్లు చూచి మాట్లాడేటంత ఓపిక, తీరిక ఉండదు మరి. కనుక ఈ విషయానికి ఇప్పటికి తెదింపుదాము. మరి మంచిరోజు గురించి ముచ్చటను మాత్రం మరింత ముందుకు సాగిద్దాము.
సంస్కృతంలో ఒకే అర్థం వచ్చే మాటలు చాలా ఉంటాయి. అటువంటి మాటలను శ్లోకాలుగా కట్టి నోటికి నేర్చుకునే పద్దతి కూడా ఉంది. ఇంగ్లీషులో నిఘంటువు ఉంటుంది. దాన్ని డిక్షనరీ అంటారు. నానార్థాల డిక్షనరీని తిసారస్ అంటారు. అచ్చం ఇదే పద్ధతిలో అంటే ఈ రెండవ పద్ధతిలో సంస్కృతంలో అయిదు పుస్తకాలు ఉన్నాయి. అందులో అమరకోశం అన్నది అన్నిటికన్నా పేరుగన్నది. యస్యజ్ఞాన దయాసింధో అని మొదటి శ్లోకం ఉంటుంది. నేర్చుకున్నవాళ్లకు నేర్చుకున్నంత. లేని వాళ్లకు గోడదాటితే అదే సందో! నన్ను ఎవరూ బలవంత పెట్టకుండానే అమరం చాలా చదువుకున్నాను. తరువాత వైజయంతి అనే మరొక పదకోశాన్ని కూడా తెచ్చుకున్నాను. దాన్ని నాకంటే ఎక్కువ అవసరంగల వాళ్లు ఎత్తుకుపోయారు. అయినా ఈ వైజయంతి గురించి చాలామందికి తెలియదు. అది పక్కన పెట్టి మంచిరోజు గురించి మాట్లాడితే, అమరకోశంలో ఒక మాట గుర్తుకు వస్తున్నది. ‘మేఘచ్ఛనే్నన్హిదుర్దినం’ అంటుంది ఆ మాట. సరిగా రాశానో లేదో గుర్తులేదు. మొత్తానికి మబ్బులు పట్టిన రోజును సంస్కృతంలో దుర్దినం అంటారట. వానా వానా వెళ్లిపో అని అర్థం వచ్చే పిల్లలపాట ఒకటి ఉంది. ఆ పాట పుట్టిన లండన్‌లో ఏడాది పొడవునా వాన కురుస్తుంది. కనుక వానను వెళ్లిపొమ్మన్నారు. అచ్చంగా అదే పద్దతిలో మబ్బులు కమ్మిన ప్రతిరోజును ఇక్కడ చెడ్డ రోజు అంటున్నారు. నీటి కరువుతో కటకటలాడే మనలాంటి వాళ్లకు మబ్బు మేనమామగారికన్నా మంచి చుట్టంలాగా కనిపించొద్దు. కనుక మన వద్ద మబ్బు వచ్చిన రోజే మంచిరోజు. బయటకు వెళ్లి చూచే ఓపిక లేదు. ఇవాళ సుదినం అంటే మంచిరోజు అని అన్నాను కాబట్టి నా మాట నిజం కావడానికన్నా ఒకటో, అరో మబ్బు తునక ఆకాశంలో ఉండి తీరుతుంది.
కొత్తచొక్కా వేసుకోవాలి. ఇవాళ నాకు మంచిరోజేనా? అని అడిగారు ఎవరో. అవును మరి, నేను పంచె కట్టుకుని ముఖాన బొట్టు పెట్టుకుని మరీ తిరుగుతూ ఉంటే అడగకమానుకుంటారా? అయినా ఇవాళ మంచిరోజు కాదు అన్న సంగతి ఉన్నట్టుండి చెప్పడం ఎట్లాగ? ఇలాంటి ప్రశ్న అడిగితే ఒకసారి ఒక అమాయకురాలు ఏళ్లు లెక్కపెట్టి చెపుతావు కదా అన్నది. ఇవి సంవత్సరాలు కావు. నా చేతివేళ్లు. నామ నక్షత్రం, నిత్య నక్షత్రం తెలిస్తే ఆ రెంటిమధ్యన వారసులెక్కబెట్టి నిత్యగ్రహచారం చెప్పే పద్ధతి ఉంది. నక్షత్రాలు 27. కనుకనే మనవాళ్లు తెలివిగా ఈ నిత్య గ్రహాచారాన్ని తొమ్మిదికి కుదించారు. నామనక్షత్రం మంచి నిత్య నక్షత్రానికి లెక్కిస్తూ తొమ్మిది వచ్చిన ప్రతిసారీ మళ్లీ మొదటికి రావాలి. అప్పుడు తొమ్మిదికన్నా తక్కువ అంకె ఒకటి మిగులుతుంది. ఇక గ్రహచారం ఆ అంకెను బట్టి జన్మ, సంపత్తు, విపత్తు, క్షేమం, ప్రత్యక్తార, సాధనం, నైధనం, మిత్రం, పరమమైత్రం అని తొమ్మిది తారలుగా చెపుతారు. దీనే్న తారాబలం అంటారు. వీటిలో మంచివి, చెడ్డవి మాట అర్థంతోనే తెలుస్తుంది. ఇక మంగళవారం మంచిది కాదు. అష్టమి కష్టపడుతుంది లాంటివి కూడా కొన్ని ఉండనే ఉన్నాయి. అంటే తిథి వార నక్షత్రాలను లెక్కిస్తూ ఆ అయ్యగారు కొత్త చొక్కా వేసుకోవడానికి మంచి రోజు అవునో కాదో చెప్పవచ్చు. అయినా ఆనాటి నక్షత్రం గుర్తుండాలిగా? ఆయనగారి నక్షత్రం ఆయనగారికి గుర్తుండాలిగా? లేకుంటే ఆయనగారి పేరుంది. పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి ఆయనకు ఒక నక్షత్రాన్ని నిర్ణయించవచ్చు. అందుకు, చూ, చే, చోల- అశ్వని.. అన్న సూత్రాలు నాకు గుర్తుండాలిగా? అయ్యా, మంచిరోజు అంటే పరిస్థితి ఇలాగ ఉంటుందండి. అయినా పట్టించుకోకుండా నేను మంచి రోజు అన్నాను. ఇంతసేపు మాట్లాడాను. మీరంతా విన్నారు. మరి ఇక మంచి రోజు కాక ఇవాళ మరింక ఎలాంటి రోజు అవుతుంది.
ఒక పెద్దాయన అచ్ఛేదిన్ ఆనేవాలే హై అన్నాడు. మంచిరోజులు రానున్నాయి ఆ మాటకు అర్థం. అందరూ వస్తాయి అనే అనుకున్నట్టు ఉన్నారు. వచ్చాయి అని ఎవరికీ నమ్మకం కలిగినట్టు లేదు. అంతా గలిసి ఆయన మీదకు దండెత్తుతున్నారు. ఆయన అచ్చేదిన్ వస్తున్నాయా? ఇంతటితో ఈనాటి మంచి రోజు నాకు చాలు. మీరు కూడా మరింత ముందుకు సాగండి.

-కె.బి.గోపాలం