లోకాభిరామం

పన్ను గురించి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోట్లో దంతాలుంటాయి. వాటిని కొంతమంది పళ్లు అంటారు. మరి కొంతమంది పండ్లు అంటారు. మాట్లాడేది ఒకే దంతం గురించి అయితే దాన్ని పన్ను అనాలి. పన్ను అని మరి ఇంకో మాట ఉన్నది. ప్రభుత్వానికి, మరొకరికి కట్టే రుసుము మొత్తాన్ని పన్ను అంటారు. జుట్టు పెంచుకుంటే పన్ను గట్టాలని ఒక ప్రభువు అన్నాడు. నా అంత నేను కష్టపడి అంతోయింతో సంపాదించుకుంటే, దాని మీద పన్ను గట్టమంటారు నేటి ప్రభువులు. ఈ రకంగా కట్టే రుసుములు ఒకటికన్న ఎక్కువ రకాలుగ ఉంటాయి. అప్పుడు వాటిని పన్నులు అంటారు. అంతేగాని పళ్లు, పండ్లు అనరు. మాటలకు కరువు వచ్చినట్టు రెండు పూర్తి వేరు విషయాలకు ఒకే మాటను ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. కానీ, ఒకే మాటకు రెండు వేరువేరు అర్థాలున్నాయని మాత్రం తెలుసుకున్నారు. అందుకే ఒకటి బహువచనంలో పన్నులు అయింది. ఇంకొకటి పండ్లు అయింది. నోట్లో పండ్లు వేరు. చెట్టు ఇచ్చే పండ్లు వేరు. బడికో, గుడికో పోవలసిన చిట్టి చిలకమ్మ తోటకెళ్లింది. పండు తెచ్చింది. గుటుక్కుమని తిన్నది. నేనుగాని ఆ పని చేస్తానంటే నాకు తన్నులు వడతయి. వాటిని తండ్లు అని గూడ అనవచ్చు. అందుకు ఎవరి అనుమతి అవసరం లేదు. తండ్లు దినడం, చాలామందికి తెలిసిన సంగతి!
నోట్లో ఉండే పండ్లకు, పళ్లకు ఏకవచనం పన్ను. చెట్టిచ్చే రకానికి ఏకవచనం పండు. బహువచనం అయితే గియితే పండులు కావాలెగానీ అది కూడ పండ్లు అయింది. వారు అన్నమాట (అనేమాట! అన్న, తమ్ముడు ఇక్కడ లేరు) వారలు, వారు, వాండ్లు అని వాళ్లు అని బహువచనం అవుతుంది.
పొద్దున్న లేవగనే పండ్లు తోముకోవాలె. అందుకోసమని పండ్ల పొడి అని ఒక పదార్థం ఉంటుంది. బొగ్గుపొడి కూడ ఉండవచ్చు. బొగ్గును పొడిగొడితే వచ్చేది బొగ్గుపొడి. కానీ పండ్లను పొడిగొడితే వచ్చిన పొడి పండ్ల పొడి. మారేవో పదార్థాలను పొడిగొట్టి ఈ పొడిని తయారుచేయవలసి ఉంటుంది. పండ్ల కొరకు వాడే పొడి పండ్ల పొడి. వంట కొరకు వాడే నూనె వంట నూనె. కానీ వంట పద్ధతిలో తయారుచేసిన ఆముదము వంటాముదము. నూల నుంచి, నువ్వుల నుంచి, (నీవును నువ్వు అని కూడ అంటారు గదా!) వచ్చిన నూనె నువ్వుల, నూల నూనె. తలకు రాసుకునేది తలనూనె. ఈ పద్ధతిన ముందుకు కదిలితే కండ్లనీరు, కన్నుల నీరు కారక తప్పదు. అది కంటి నుంచి కారే నీరు. అది సరేగాని, పండ్ల పొడి అంటే ఏవో పండ్లను పొడిగొట్టి తయారుచేసినది కానేకాదు. నోట్లోని పండ్లను ఊడగొట్టడం వీలు అవుతుందేమో (గొడ్డుటావు పితుక, కుండ గొంపోతే సరి! పండ్లు ఊడివస్తయి!) వాటిని పొడిగొట్టడము కుదిరే పనిగాదు. పండ్లను పొడిగొట్టే ప్రయత్నం చేయబోతే కూడ పండ్లు రాలుతయేమో?
అన్నట్లు వరిపంట పండుతుంది. అది ముందు కాయగా ఉండి, తరువాత పండుగా మారి, అంటే పండే పద్ధతి ఏమీ లేదు. వరి నుంచి ధాన్యం వస్తే పంట అంటారు. ఆ పంట పండింది అంటారు. ఈ పంటకు పన్ను ఉంటుంది. పంటితో నమిలి తింటారు. కానీ అది పన్ను కాదు. పంట. మామిడి, జామ మరో పండు కూడ పండుతుంది. వరిపంట, జొన్నపంట ఉంటాయి. మామిడి కాత మాత్రమే ఉంటుంది. ఆ దిగుబడిని ‘పంట’ అంటారా? ముందు మామిడి పిందెలు పుడుతయి. అవి పెరిగి పెద్దగవుతయి. తరువాత పాటు పడుతయి. ఆ తరువాత మాత్రమే పండవుతయి. లేదా పండుతయి. కాయలను అసహజంగా పిసికి పిసికి పండు చేయడం అని పద్ధతి ఉంది. రసాయనాల ప్రభావంతో పండించే పద్ధతి కూడ ఉంది మరి!
కొమ్మలు దుంకుడు, దూకడము మరీ ఎక్కువయినట్టుంది, గాని, మరల నొక పర్యాయము పండ్ల వద్దకు చేరుదము. చదువరీ! పండ్ల పుల్లయను వస్తు విశేషము ఒకటి యున్నదని దెలిసే యుండుననుకొందును! దీనికీ, తీపీ, పులుపు పండ్లకు సంబంధం లేదుగాక లేదు. పండ్లు, అనగా దంతములను దోముకునుటకు (కొనుటకు), వాడు(కునే) పుల్లను పళ్లపుల్ల అంటారు. మరింత వివరంగా అర్థం గావడానికి పలుదోంపుల్ల అని కూడా అంటారు. ఆ సంగతి మరచినవారు పందుంపుల్ల అందురు. పల్లెల్లో బతికేవారికి మాత్రమే ఏనాటికి ఆనాడు కొత్తపుల్ల వాడుకునే అవకాశం వుంటుంది. నాగరికత బలిసిన వారంతా ఒక ప్లాస్టిక్ పోగులపుల్ల తెచ్చుకుని నెలల తరబడి దానితోనే పళ్లు తోముకుంటారు. ఎంగిలి పుల్లను కడిగి, దాచుకునే దరిద్రం ఆలోచన ఒకప్పుడు అసహ్యం అనిపించి ఉంటుంది. ఉదయాన లేచి నెమ్మదిగా వెళితే ఎవరి వీలు, అలవాటు కొద్ది కావలసిన పుల్ల వాళ్లకు దొరుకుతుంది. అక్కడక్కడ రైల్వేస్టేషన్‌లో ‘యాప్పుల్లా’ అని అరుస్తూ అమ్మే సంగతి గమనిస్తే పల్లెకు వెళ్లినంత సంతోషం అవుతుంది. తరువాత మా అబ్దుల్లా గుర్తుకువస్తాడు.
పళ్లు తోమడానికి వేపపుల్ల మంచిది. నేస్తం చేయడానికి అబ్దుల్లా మంచివాడు. వేపలో కొంత చేదు ఉందిగానీ, వానిలో చేదు వెతికినా కనబడదు. వేపచెట్టులో ప్రతిభాగం చేదే. కానీ, ఆ చేదు కూడా శరీరానికి మంచిది అని కలకాలంగా తెలుసు. అందుకే కొంచెం శ్రమపడినా సరే, వేపపుల్ల, యాప్పుల్ల సంపాయించి పళ్లు తోముకోవడానికి ప్రయత్నిస్తారు. తోముకున్న తరువాత ఆ నోట్లో వేపచేదు, వేపనూనె ప్రభావం కొంచెంసేపు మిగలి ఉంటాయి. అలవాటయిన వారికి ఆ చేదు గుర్తుకు రాదు. అది లేకుంటేనే ఏదో వెలితిగా ఉన్నట్లు తోస్తుంది. ఇంతకు వేపపుల్ల, కొంత లేతగ ఉంటే బాగుంటుంది. ముదిరిన పుల్ల ముక్కలవుతుంది. బ్రష్‌గా నలగదు. మెత్తటి బ్రష్ తయారు అయితేనే తోముకోవడం బాగుంటుంది. అందరికీ, చెట్టు ఎక్కి వేపపుల్ల విరిచి తెచ్చుకునేంత వీలు లేకపోవచ్చు. అందుకే సులభంగా దొరికే పలుదోముపుల్లలు కూడ బోలెడు ఉన్నాయి. ప్రాంతాన్నిబట్టి, అక్కడ దొరికే రకాలలో మంచి వాటిని ఎంచుకుని వాడుకోవచ్చు. ‘ఉత్తమం ఉత్తరేణి, మధ్యమం మామిడాకు, కనిష్ఠం కానుగు పుల్ల’ అని, చిన్నప్పుడు సూత్రం చెప్పినరు.
ఉత్తరేణి చెట్టు పిచ్చిమొక్కగా పెరుగుతుంది. వైద్యంలో పనికి వస్తుందని అనగా విన్నాము. ఆ సంగతి మనకు అప్రస్తుతం. ఆ మొక్కను అందరూ గుర్తించ గలుగుతారని అనిపించడంలేదు. అదిగాని దొరికితే, దాన్ని ఏకంగా ఊడబీకాలి. వేరుతో పళ్లు తోమాలి. అందులో ఒక చక్కని వాసన ఉంటుంది. పేస్ట్ నుంచి బాగ రుద్దిన కొద్ది నురుగు కూడా వస్తుంది. నోరు శుభ్రం అవుతుంది. అందుకే దాన్ని ఉత్తమం అన్నారు. కానీ ఉత్తమం అన్నవి ఏవీ ఊరకే దొరకవు మరి! ఇదీ అంతే!
మామిడి ఆకుతో పళ్లు తోముకోవాలని ఎందుకు అన్నారో తోచదు. ఆకు లేతగా ఉంటే పనికివస్తుంది. ‘కంద అంటే బొంద’ అని బాపుగారి పద్ధతిలో ప్రాసగనుక, మామిడి మధ్యమం అన్నారేమో? ఇక మిగిలినది కానుగు పుల్ల అనబడు గానుగ పుల్ల. పల్లెల్లో ఈ చెట్లు ఎక్కడబడితే అక్కడ కనిపించేవి. కనుక సులభంగా దొరికేవి. పుల్ల ముందు పెళుసుగానే ఉంటుంది గానీ, నమిలితే మంచి బ్రష్ తయారవుతుంది. ఇందులో కూడా వేపలాగే ఒక రకం నూనె ఉంటుంది. గానుగ, కానుగు గింజల నుంచి నూనె తీసి పరిశ్రమలలో వాడుకుంటారు. ఈ నూనె నోటిలో చిత్రమయిన రుచి మిగిలించినట్లు గుర్తుంది. మొత్తానికి ఈ పలుదోముపుల్లలతో మవుత్‌వాష్, ఉచితంగా వస్తుందన్నమాట!
రామాయణంలో పిడకల వేటలాగ, పన్ను ఉపాఖ్యానంతో సంబంధం లేకుండా ఉన్నట్టు కనిపించే ఒక సంగతిని ఇప్పుడు గమనించెదము గాక. ఒకరు ఎవరికో అనారోగ్యం అవుతుంది. ఆ మనిషి కొంతకాలం మంచంలో ఉండవలసి వస్తుంది. ఆ సంగతి చెప్పడానికి మా వాళ్లు ‘పండిండు’ అంటరు. అంటే పడుకున్నాడని అర్థం. మరి కొన్ని ప్రాంతాలలో ‘పన్నడు’ అంటరు. సోమరిపోతులు తింటరు, పంటరు. మరొక పని చేయరు తెలుసా?
పళ్లపుల్లను వెతుకుతూ దూరంగా పోవడానికి వీలుగాని వయసులో మేమంతా బొగ్గుతో పళ్లు తోముకున్నాము. చిత్రం అనిపించవచ్చుగానీ, బొగ్గులు ఇక్కడ కనీసం రెండు రకాలు. ఒకటి పిడక బొగ్గు. రెండు కట్టెబొగ్గు. పిడకలను పేడలో, పెంటతో తయారుచేస్తరు. ఆ పశువులు తిన్న గడ్డి, ఆకులు, అలముల ఆధారంగా పెండ వేరువేరుగ ఉంటుంది. పల్లె పశువులకు కాగితాలు, కుళ్లిన అన్నము తినడానికి వీలు ఉండదు. కనుక ఆ కాలంలో పెండకూడ, (ఈరాటిక) అది పూర్తి వేరుగా ఉండేది. బొగ్గు నోటిలో వేసుకోవడానికి అనుమానం ఏనాడూ రాలేదు. కట్టెబొగ్గులో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఒక్కొక్క రకం కట్టె కాలిన తరువాత బొగ్గు నోట్లో వేసుకుని నమిలితే, నోరంత ఎర్రబడి, పుండ్లు పడేది. అయితే, అది అరుదుగా మాత్రమే జరిగేది! బొగ్గు నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు, దుర్వాసన మాయం అవుతుంది. ఇవాళటికీ ఫ్రిజ్‌లో వాసన తొలగించే ‘ఏర్పాటు’లో ఉండేది బొగ్గు మాత్రమే! ఆ బొగ్గును కరకర నమిలి, పళ్లు రుద్ది, కడుక్కుంటే, ‘తాజాదనం గ్యారంటీ’! పండ్లు, పళ్లు, తినే దంతాలు మిలమిల మెరిసిపోతాయి. గట్టి పళ్లు, పండ్లను, ఆఖ్రోట్‌లను కూడా కొరికి హాయిగా తినవచ్చు! ఇతి దంత వేదాంతం!

-కె.బి.గోపాలం