లోకాభిరామం

వచ్చిన తెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేరుగల పండితులొకరు ఫేస్‌బుక్‌లో గణపురము చాంతాడంత సంస్కృత సమాసాలు ఒక దానికన్న ఒకటి పొడుగుగ తయారుచేసి ప్రదర్శనకు పెడితే, వాటి గురించి చర్చ మొదలయింది.
ఉన్నది తెలుగు అక్షరాలు. కాని ఆ మాటలు మాత్రము సంస్కృతము. వంశ సాంప్రదాయం కొందరికి వద్దన్నా సంస్కృత వంటబట్టింది. ఇది ఒంటబట్టింది, ఒంటికి పట్టింది. మెదడుకు ఎక్కింది అనవలసిన సందర్భము. ఈ సంస్కృతము వంట గురించి ఏకంగ ఒక పుస్తకము, కాదు గ్రంథము రాయవచ్చు. కాదు లిఖించవచ్చు.
సంస్కరింపబడిన భాష సంస్కృతము. అలనాడెప్పుడో పాణిని చేసిన వ్యాకరణము ఈనాటికి ఆ భాషను పట్టి నడుపుతున్నది. వేదములోని సంస్కృతములో ఈ వ్యాకరణము కనిపించదు. సంస్కృతములో ఇతర భాషల పదాలు కలిసిన దాఖలాలు లేవు. దేశంలో జనం పల్లెలతో సహా ఒకప్పుడు సంస్కృతంలో మాటలాడుకున్నరా? ఆ చర్చ మనకు ప్రస్తుతం అప్రస్తుతం. తెనుగు, తెలుగు అన్నది జనం నోళ్లలో నలిగి పెరిగిన భాష. అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్న’ అన్న మనిషిని కూడా, అది తెలుగా అని అడిగిన. అచ్చతెలుగు మాట్లాడడం మాకు రాదు, అని జవాబు. ఇంతకు అచ్చతెలుగు అంటే ఏమిటో తెలుసునా. ‘ముక్కంటి, అర పదమోముల వేలుపు అన్నా దొడ్డబెట్టిన వేల్పు గిడ్డి’ అన్నా అది అచ్చ తెలుగు. త్రినేత్రధారి శివుడు అంటే, మొదటిది సంస్కృతము, రెండవది ఆ భాష ఆధారంగా వచ్చిన తెలుగు మాట. డు, ము, వు లు ప్రథమా విభక్తి. శివ అనే మాట శివుడుగా తెలుగయింది. ఇవి అందరికీ తెలిసిన మాటలు.
మా పల్లెలో ‘మొల్ల బువ్వు’ అని ఒక అమ్మ ఉండేది. ప్దెద మనిషి గనుక ఉండేది అంటున్న. ఆమె అసలు పేరు ఏమి అన్నది నాకయితే తెలియదు. ఈ తెలిసిన నాలుగు అక్షరాల పేరులో రెండు మాటలు ఉన్నాయని అర్థం గావడానికే చాలకాలం పట్టింది. మల్లెలు, మొల్లలు, మరువము, దవనము ఇచట చల్లవాడినదెవరు? అని ఒక తాతగారు తమ రచనలో రాసినరు. మొల్ల అంటే ఒక పువ్వు అని అర్థం అయింది. కవయిత్రికి ఆ పువ్వు పేరు పెట్టినరని కూడ అర్థం అయింది. ఈ తురుక అమ్మకు గూడ మొల్ల అని పేరు పెట్టినరా?
ప్రశ్నకు జవాబు చెప్పుకునే లోగా చిన్న శాఖాచంక్రమణము. అనగా కొమ్మదూకుడు. అనగా మరొక విషయము గురించి చెప్పడము. ఒకానొక టీవీ వారికి స్క్రిప్టు రాస్తూ మాటకు మాటగా అనువాదం అవసరం గనుక తుర్క్ అనే మాటకు ‘తురకలు’ అని రాసిన. అక్కడి అధికారులు (!) దానికి ఆక్షేపణ చెప్పినరు. ‘అయ్యా టర్కీ అని ఒక దేశమున్నది. దాని అసలు పేరు తుర్కిస్తాన్. ఆ దేశపు సంతతి వారు తుర్క్‌లు. వారిని తెలుగులో తురకలు అంటరు అని వివరించిను. కాదు, కూడదు, ముస్లిములు, ముసల్మాన్‌లు అనాలె అని పట్టుబట్టినరు. మీ యిష్టం, అని వదిలిపెట్టిన. అప్పుడు నాకు కన్యాశుల్కంలోని ‘ఈ తురకెవడోయ్?’ అన్న డవిలాగు అనబడు డయలాగు అనబడు మాట గుర్తు అనబడు జ్ఞప్తికి వచ్చినది. తురక అన్న మాట వీండ్లకు తిట్టులాగ వినిపిస్తన్నదని అర్థమయింది. తురకలు అందరు ముసల్మానులు. అంతేగాని, ముసల్మానులు అందరు తురకలు గారు. అరబ్బులు, ఫారసీలు వంటి వారు మరెందరో ఉంటరు. వినదలుచుకోని వారికి చెప్పడం వీలుగాదు.
మళ్ల వెనుక కొమ్మకు! అంటే మొల్ల బువ్వు ముందరికి. ఊరిలో హిందువులకు ఒక పురోహితుడు, బాపనయ్య, పంతులు ఉన్నట్టే, తురకలకు, ముసల్మానులకు ఒక వౌల్వీ, ముల్లా ఉండాలె. చాల చోట్ల ఉంటడు. ఈ ముల్లా మాటల్లో పడి మొల్ల అవుతడు. ఆయన భార్య మొల్లబూ అవుతుంది. బూ, బువా అన్న మాటకు పెద్దమ్మ వంటి అర్థం ఉన్నది. బూ+అమ్మ=బువ్వమ్మ. అనగా తురక స్ర్తి. అమ్మ అన్న మాట చేర్చకుంటే బువ్వు! ఎంత బాగున్నది? అసలు సిసలయిన సాంప్రదాయిక, ఉర్దూ, అరబిక్, ఫార్సీ మాటలను అందమయిన తెనుగుగా మార్చిన చందము, వీనుల విందుగ ఉంది గదా!
నెల్లూరు వారు, ఎవరయినా ఆదరబాదరగా పరుగెత్తి పోతుంటే, అశానుశానంటా పూడిశినాడుబా అంటరు. ఈ మాటకు అర్థమేమి అని ఎవరన్న ఆలోచించితిరా? మొహర్రం, ముహర్రం అనే మాటకు మనకు తెలిసిన పేరు పీర్ల పండుగ! అది నిజానికి పండుగ కాదు. శ్రాద్ధము, లేదా తద్దినాన్ని పెద్దల పండుగ అంటరు గనుక పీర్ల పండుగ కూడ ఒక రకంగ సరయిన మాట. అయితే, దసరా, దీపావళి వంటి పండుగలు కావు ఈ పీర్ల, పెద్దల పండుగలు. హసన్, హుసేన్ అనే రాజకుమారులు దుల్హా (పెళ్లికొడుకు)గా ఉండి కూడా, ఈ అలంకారంతోనే పోయి యుద్ధం చేసి చనిపోయినరు. వారి కథ వినదగ్గది. కానీ సందర్భము కాదు. హసన్, హుసేన్‌లో ఆదరబాదరగా యుద్ధానికి పోయినరు. కనుక తొందరగ పోతున్నవారంత హసన్, హుసేన్ అంటూ వెళ్లినట్లు, పూడిసినట్టు లెక్క. ఈ హసన్, హుసేన్‌లు మన హైదరాబాద్ ప్రాంతంలో ఆశన్న, ఊశన్నగా మారినరు. వారి జ్ఞాపకం కొరకు, తొమ్మిది దినాలు ఏటేటా శోకం పాటించే తంతు ముహర్రం. తాజియా అనే పీర్‌లు వారికి గుర్తులు. పల్లెలకు పోతే అంత హిందువులే ఉండి పీర్ల పండుగ నడిపిస్తరు. హుసేన్ బాద్‌షా పేరు ఉసెన్‌పచ్చ పీరు. ఓ కాసిమన్న ఒక మొగువాలి (వౌలా అలి) పీరు కూడ ఉంటయి. శిగము అనగా పూనకం వచ్చిందంటూ తాజియాలను ఎత్తుకోని కొందరు ఊరంత తిరుగుతరు. అస్సోయ్, దూలా అంటే హసన్, దుల్హా అంటూ అందరు వారి వెంట పరుగెత్తుతరు. పదవనాటి వరకు వారికి పూజలు, నైవేద్యాలు, చివరకు పీర్లు బాయిలో పడతయి. వచ్చే ఏడు తిరిగి నిలవడతయి. ఆశన్న అని పేరుంటే దాని అసలు రూపం హసన్ అంటే వింటరా? మా ఆశారాజు పేరు హసన్ బాద్‌షా! మరి! అన్నా! విన్నవా?
కొన్ని మాటలు ఎట్ల వస్తయో తెలియదు. ఆమె నా ముందుకు వచ్చి నీ గురించే వస్తున్న అన్నది. నా గురించి ఆలోచించవచ్చు. మాట్లాడవచ్చు. అంతేగాని నా గురించి రావడమేమి? వస్తేగిస్తే నా కొరకు గదా? అన్నది నా అనుమానము. మా పల్లెలో ఒకప్పుడు ‘నీ శావడికే ఒచ్చిన’ అని అంటే అందరికి అర్థమయ్యేది. ఈ శావడి ఎక్కడి మాట? తమిళంలో శెంకువడి అని ఒక మాట ఉన్నది. అసలింతకు పల్లెలోగూడ ఈ మాట ఎవరు వాడరనీ, ఎవరికీ అది ఇప్పుడు అర్థంగాదని నా అనుమానం. నేను సుత వస్తున్న, నేను సహ వస్తున్న అంటే నేను గూడ వస్తున్న అని అర్థము తెలుసా? పట్నంలో శాలిబండ - హైదరాబాదు వారు నేను భీ వస్తున్న అనేవారు. ఇప్పటికీ అంటున్నరేమో? సుత, సహ అంటే ఉర్దూ ప్రభావం కానే కాదు.
వాడు మట్టం తినేసినడు, అన్నది ఒక అమ్మగారు. మట్టం అనేది ఒక పదార్థంగాదు. ఒక పదార్థాన్ని వాడు మట్టం తిన్నడు. అంటే మొత్తం తిన్నడు. నేలమట్టంగ తిన్నడు. ఏమి మిగలకుండ తిన్నడు అని గద భావము! తిన్నడూ సరిపాయె! అంటే, అంతటితో వ్యవహారం ముగిసింది, అని అర్థం చేసుకోవాలి.
సంస్కృతములాగ, మాదిరి, వలె, పోలికన తెలుగు ఒక మూసలో బిగిసి సాగలేదు. కనుకనే ఏ ఊరి భాష ఆ ఊరిది. వాయించాడు అంటే ఏమన్నట్లు? ఓలమ్మో! ఎట్టీసినాడే అంటే తెలుగు మాట్లాడే అందరికి అర్థమవుతుందా? పెడిమెరిల్ల అని ఒక మాట ఉన్నది. అర్థము తెలిసిన వాండ్లంత చెయ్యి ఎత్తండి! నాకు కనిపించలేదు కనుక, అటువంటి మాటలు మరికొన్ని ఉత్తరము మీద రాసి పంపించండి! పంచుకుందము! అది మెడిమెరిల్ల అయింది, అంటే ఉండవలసిన తీరుగ లేదు, అని అర్థం. కాలు మణగవడింది, అంటే పెడిమెరిల్ల అయింది, అని అర్థం. ఒంకర, వంకర, టింకర అయిందని అర్థం!
సంస్కృతం ఎక్కడికీ పోదు. దేశమంత దాన్ని కాపాడే వాండ్లు ఉన్నరు. చిక్కాకోలు అను శ్రీకాకుళం నుంచి, ఆపైన బరంపురం, మరింత మీద నుంచి, కింద కర్నాటక, పక్కన తమిళనాడు, మారాష్ట్రం దాక ఉన్న ‘మన’ తెనుగును కాపాడవలసిన సమయమిది. పాత మాటలు, కొత్త మాటలు, అన్నీ కలిపి మాట్లాడుతుంటే, భాష బతుకుతుంది. అచ్చ తెనుగు అక్కర్లేదు. వచ్చిన తెలుగు మాట్లాడండి. పిల్లలకు నేర్పండి!

కె. బి. గోపాలం