లోకాభిరామం

కేశవా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్యన ఒక కథ చదివాను. అది చైనా దేశపు కథ. ఒక చిన్న కుర్రవాడు బుర్ర గొరిగించు కోవడానికి పడిన కష్టం గురించి ఆ కథలో చెప్పాడు. నిజంగా ఆ దేశంలో కూడా వెంట్రుకలు కత్తిరించుకోవడం అనే మాటకన్నా బుర్ర గొరిగించుకోవడం అనే మాటే ఎక్కువగా వాడతారట. అది చదివిన తరువాత నాకు ఈ నాలుగు అక్షరాలు రాయాలి అనిపించింది. పుట్టిన తర్వాత కేశఖండనం లేదా పుట్టెంట్రుకలు అనేది భారీ ఎత్తున జరిగే ఒక తతంగం. నాకు మరి ఆ పర్వం ఎలా జరిగిందో నాకు తెలియదు కదా. చెప్పినవాళ్లు అంతకన్నా లేరు. మొత్తానికి నాకు జుత్తు పెద్దగా పెంచుకోవడం మొదటి నుంచి అలవాటు అయింది. ఎర్రగా బుర్రగా పండులాగా నిండుగా ఉండేవాడిని కాబట్టి నాన్న కూడా పెద్ద జుట్టు ఉంటేనే బాగుంటుంది అనుకునేవాడు. నిజానికి మా ప్రాంతంలో జుట్టు అంటే పిలక మాత్రమే. అలవాటయిపోయి నేను ఇక్కడ జుట్టు అన్న మాట వాడుతున్నాను. మొత్తానికి కటింగ్ అనే కార్యక్రమం చిన్నప్పటి నుంచి క్రమంగా జరుగుతూనే ఉన్నది. అంటే పంటకోత అని అర్థం. తల మీద పండిన పంటను కోస్తారు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. కటింగు చేయించుకోవాలి అనుమతి చిన్నప్పటి నుంచి మేము వాడుతున్న మాట. ఊర్లో మంగలి కుటుంబాలు ఉంటాయి. వాళ్లు ఊరిలోని ఇళ్లను పంచుకుంటారు. కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఊరు తిరిగినము అని వాళ్లు తమతమ ఇళ్ల సమూహాన్ని మార్చుకుంటారు. అదెందుకో గాని నాకు తెలిసినంత కాలంమా ఇంటికి మాత్రం మంగలి రాములు వాళ్లే ఆస్థాన మంగలిగా కొనసాగారు. నిజానికి రాములు పని ముగిసిన తరువాత మా ఇంటికి వచ్చేవాడు. ఇక్కడే అన్నయ్యతో ఆయన మిత్రుడు సుధాకర్‌తో కలిసి కాలక్షేపం చేసేవాడు. మొదటి ఇద్దరూ చదువుకున్న వాళ్లు. చదువుతున్న వాళ్లు. రాములుకు చదువు లేదు. అయినా సరే వీళ్లతో కలిసి ఉండేవాడు. నాకు గుర్తున్నంత వరకు రాత్రి భోజనానికి మేము లోపలికి వెళితే, సుధాకర్, రాములు మాఅతం వరండాలో కూర్చుని భోజనం చేసేవారు. ఆ రాములు మా కుటుంబానికి అంతా కటింగ్ చేసేవాడు. నిజానికి జుట్టు కత్తిరించుకోవడానికి మేము ఎక్కడికీ వెళ్లలేదు. రాములు తన సరంజామాతో మా ఇంటికి వచ్చేవాడు. ముందు అరుగు మీద కటింగ్ కార్యక్రమం జరిగేది. ఆ పూట బహుశా రాములు మధ్యాహ్నం భోజనం కూడా మా ఇంట్లోనే జరిగేది.
నాకు పెద్దగా జుట్టు పెంచుకోవడం అలవాటు అని చెప్పాను. నిజానికి అది హద్దులు మీరి ఒకప్పటికి నేను పుట్టపర్తి సాయిబాబాలాగా పెద్ద జుట్టుతో ఉండేవాడిని. ఉపనయనం సందర్భం నాకు బాగా గుర్తుంది. అప్పుడు నిజానికి బిఎస్సీలో ఉన్నాను. రాత్రి తలకు గుడ్డ కట్టుకుని పడుకునేవాడిని. లేదంటే జుట్టు చిక్కు పడుతుంది. నన్ను వడక పెండ్లికొడుకుగా చేస్తున్నారు. అంటే ముత్తయిదువలు అందరూ వచ్చి బొట్టు పెట్టి ఏవో లాంఛనాలు జరుపుతున్నారు. ఒక్కొక్కరే ఎడమచేతితో నా జుట్టును పైకి ఎత్తి పట్టుకుని బొట్టు పెడుతున్నారు. నాకు నా జుట్టు పట్ల గొప్ప గర్వంగా ఉంది. అయితే మరుసటి నాడు నిజమైన ఒడుగు తతంగం పాలమూరులో జరిగింది. అక్కడికి గద్వాల పెద్ద నాయన వచ్చారు. నాన్నను కూడా పట్టుకుని ఏరా అనగలిగిన ఒకే ఒక పెద్ద మనిషి గద్వాల పెద్ద నాయన. ఆయన చెబితే ఎదురు ఉండదని బహుశా పన్నాగం పన్నారు. ఎవరో వచ్చి పెద్దనాన్న పిలుస్తున్నాడు అని చెప్పారు. ఆయన ఎదుట నిలబడడానికి ధైర్యం ఉండేది కాదు. కనుక వినయంగా వెళ్లి తలవంచుకొని నిలబడ్డాను. నాయనా, శుభ్రంగా గుండు కొట్టుకో, అని మాత్రం అన్నారు ఆయన. నాకు గిర్రున కళ్లల్లో నీళ్లు తిరగడం మాత్రంగా ఉంది. గుండు కొట్టుకోక తప్పలేదు.
నిజానికి నేను గుండు కొట్టుకున్న సందర్భాలు జీవితంలో చాలా తక్కువగా ఉన్నాయి. ఒకటి రెండుసార్లు తిరుపతి వెంకన్నకు తలనీలాలు సమర్పించుకొన్నాను. ఆ తరువాత చాలాసార్లు తిరుపతి వెళ్లినా గుండు కొట్టుకోకుండా వచ్చిన సందర్భాలే ఎక్కువ. ఒకసారి తిరుపతిలో చిత్రమైన సంఘటన జరిగింది. తెల్లవారుజామున శాత్తుమురై జరుగుతుంది. సాంప్రదాయిక వైష్ణవ వేషంలో ఉంటే ఆ సమయంలో ఎటువంటి ఆక్షేపణ లేకుండా గుడిలోకి వదులుతారు. స్వామి ముందు చాలాసేపు నిలబడే అవకాశం దొరుకుతుంది. నేను బాగానే ఉన్నాను అనుకుని గుండు కొట్టుకోకుండానే వెళ్లి క్యూలో నిలబడ్డాను. తీరా లోపలికి వదలవలసిన చోట పెద్దాయన పక్కకు నిలబడమన్నాడు. నాకు అనుమానం వచ్చింది. ఆయన మీసాలు పెట్టుకుని శాత్తుమురైకి వస్తావా అని ప్రశ్నించాడు. అప్పుడు తెలిసింది నాకు మీసాలు ఉన్నాయి అన్న సంగతి. ఆ సమయంలో ఆలయంలోకి ప్రవేశించడానికి మరొక రకంగా ప్రత్యేక సదుపాయం ఉండేది కాబట్టి శాత్తుమురై తరువాత వేరువేరు సంస్థానాల ప్రభువుల ప్రతినిధులతో పాటు నిత్యకట్ల సేవలో భాగంగా దర్శనానికి వెళ్లాను.
తల జుట్టు పెంచుకోవడం, తగ్గించుకోవడం పెద్ద సమస్య కాదు. మీసాలు మాత్రం కనీసం మా వరకు సమస్య. సాంప్రదాయం ప్రకారం మాకు మీసాలు పెంచుకునే హక్కు లేదు. ఎందుకో తెలియదు. అయినా నేను మీసాలు పెంచుకున్నాను. చాలాకాలం వాటిని అలాగే కాపాడుకున్నాను. ఈ విషయంగా మరి కొంత సమాచారం చెప్పవలసి ఉంది.
అవి నేను వరంగల్‌లో చదువుకుంటున్న రోజులు. క్లాసులో ఉండే అమ్మాయిలతో నేను చాలా కలివిడిగా ఉండేవాడిని. మరొక విషయం కూడా చెప్పాలి. నాది మూన్ ఫేస్, లేదా చాకొలెట్ ఫేస్ అనే పద్ధతి ముఖం. సూటిగా చెప్పాలంటే నా ముఖంలో మగతనం, మొరటుతనం అంతగా కనిపించవు. నా మిత్రురాళ్లు ఒకనాడు నా తల బాగా గట్టిగా దువ్వి, ఒక స్కార్ఫ్ కట్టి అద్దం తెచ్చి చూపించారు. అమ్మాయిలాగ ఉన్నావు తెలుసా అన్నారు. హాయిగా నవ్వుకున్నారు. నాకేమీ పెద్ద అవమానం అనిపించలేదు. కానీ ఆ అమ్మాయిలలో నన్ను బాగా అభిమానించిన ఒకానొక అమ్మాయి నాకు ఒక సలహా ఇచ్చింది. హాయిగా మీసాలు పెంచుకో, బాగుంటావు అన్నది. నేను ఏ మాత్రం కుదరదు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోరు అన్నాను. ఏం భాగ్యం? ఇంటి పంట కదా! ఎప్పుడు పడితే అప్పుడు కోసుకోవచ్చు.. అంటూ చెప్పిన సలహా నాకు ఇవ్వాళటి వరకు గుర్తుంది. కనుక ధైర్యంగా మీసాలు పెంచుకున్నాను. అందరూ బాగుంది అన్నారు. నాకు కూడా బాగానే ఉంది. కానీ పెద్దలు బాగుంది అనాలి కదా! అది జరిగే సంగతి కాదు అన్న అనుమానం మనసులో పీకుతూనే ఉంది. మొత్తానికి సెలవులు వచ్చాయి. ఇంటికి వెళ్లవలసి వచ్చింది. వెళ్లే ముందు మీసాలు తీసేద్దాం అనుకున్నాను. పల్లెలో ఇంటికి చేరుకున్నాను. పల్గడి అనే గేటు దాటి ముందుకు వెళుతున్నాను. వరండలా పలక పీట మీద నరసింహస్వామి లాగా మా నరసింహస్వామి అంటే నాన్న కూచుని ఉన్నాడు. తలవంచుకుని లోపలికి పోతున్నాను. ఆయన పలకరించాడు. తల పైకి ఎత్తవలసి వచ్చింది. చూచి భలే అన్నాడు నాన్న! మీసాలు బాగున్నాయి. అట్లనే ఉంచుకో అని నాన్న అనడంతో నాకు ఆశ్చర్యం కలిగింది. అంతకన్నా ఎక్కువ ఆనందం కలిగింది. నాన్న నుంచి అప్రూవల్ దొరికిన తరువాత ఇక ప్రపంచానికి భయపడే అవసరం లేదు. కనుక చాలాకాలం పాటు మీసాలు పెంచుకున్నాను. ఇప్పటికీ పాత ఫఒటోలలో నా మీసాలు ముఖం చూస్తే నాకే సరదాగా ఉంటుంది.
మా ఊర్లో అంటే మహబూబ్‌నగర్‌లో ఇంటికి దగ్గలోనే 40 ఇళ్లలో గడ్డం గోపాలచారి అని ఒక పెద్దాయన ఉండేవాడు. బహుశా ఎక్సైజ్ శాఖలో అధికారి. ఆయనకు గడ్డం లేదు. నేను మాత్రం గడ్డం గోపాలాచారిని అయ్యాను. గడ్డం పెంచుకోవడం కొంత బద్ధకం కారణంగా అయితే మరి కొంత ముఖానికి మగతనం కలిగించే కోరిక కారణంగా మొదలైంది. మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధనలో ఉన్నప్పుడు గడ్డం పెంచుకునే అలవాటు మొదలైంది. ఖర్చు మిగులుతుంది. కాలం మిగులుతుంది. గంభీరంగా కనిపిస్తాము. అన్ని రకాల గడ్డం బావుంటుంది. కనుక చాలాకాలం అది కొనసాగింది. పెళ్లి నిశ్చయమైంది. ఎదురుకోళ్లు కూడా జరిగాయి. మా ఆవిడ ఎవరో తెలియని దూరపు బంధువు కాదు. స్వయానా మేనమామగారి కూతురు. ఇట్లాగే గడ్డం పెట్టుకుని పెళ్లి చేసుకుంటావా అని ఒక ప్రశ్న అడిగింది. కనుక మర్రోజు ఉదయం, కేవలం లాంఛనంగా జరగవలసిన క్షురకర్మ నా గడ్డాన్ని బలిగా తీసుకున్నది. పెళ్లి ఫొటోలలో నేను మళ్లీ అమ్మాయి ముఖంతో కనిపించినట్టు ఉన్నాను. కొంతకాలం పాటు గడ్డం చేసుకున్నాను. కానీ మళ్లీ గడ్డం పెంచుకోవడం మొదలైంది. ఇప్పటికీ ఆ గడ్డం అలాగే కొనసాగుతున్నది. ఎప్పుడో ఒకసారి గడ్డం తీసేద్దాం అనిపించింది. షాప్‌కెళ్లాను. బాలు అనే నా ఆస్థాన మంగలిని గడ్డం తీసేసెయ్ అని అడిగాను. ఆశ్చర్యంగా అబ్బాయి మీకు గడ్డం ఉంటేనే బాగుంటుంది సార్, నేను తీయను గాక తీయను అని తెగేసి చెప్పాడు. ఇక చేయగలిగింది లేకపోయింది. గడ్డం తల చుట్టూ తీసేసిన మిగతా మూడు సందర్భాలను గురించి చెబితే మనసు ఒకసారి భారంగా మారుతుంది. నాన్న పోయాడు, ఆరేళ్ల తర్వాత అమ్మ పోయింది. ఈ మధ్యనే అన్నయ్య పోయాడు. ఆ సందర్భాలలో మాత్రం ఆచారం ప్రకారం నేను నా గడ్డం మీసాలు తీసేశాను. నెమ్మది నెమ్మదిగా నా ఆకారం ఆరుతూ కనిపిస్తూ ఉంటే మునుముందు ఏం చేయాలి అన్న అనుమానం మొదలైంది. నా పిల్లలను సలహా అడిగాను. ఇద్దరూ ఏకంగా నీకు గడ్డం జుట్టు పెద్దగా ఉంటేనే బాగుంటుంది అన్నారు. ఇంకేముంది? మళ్లీ జుట్టు పాతదారిలో కొనసాగుతున్నది.
కానీ ఇప్పుడు ఒక చిన్న తమాషా ఉంది. చిన్నప్పుడు జుట్టు తల మీద చాలా దట్టంగా ఉండేది. ఉంగరాలు తిరుగుతూ ఉండేది. కనుక పెరిగిన అది ఒక రకంగా గుబురుగా తయారై వింతగా కనిపించింది. ఇప్పుడు బట్టతల రాలేదు గాని వెంట్రుకలు బాగా పలచనై పోయాయి. అవి తలను పూర్తిగా కప్పుతూ ఉన్నాయా లేదా అంటే అనుమానం! కనుకనే నాకు జుట్టు బాగా చిన్నదిగా పెట్టుకుంటే బాగుంటుందేమో అన్న భావన కలిగింది. పిల్లలు ఆ నిర్ణయాన్ని వీటో చేశారు. సరే ఎలా ఉంటే అలాగే పెరుగుతుంది.
నేను చెప్పింది అంతా నా గురించి కాదు. నా జుట్టు గురించి! అంతే నా అహంకారం గురించి! అహంకారం అన్న భావం ఎప్పుడూ లేదు. దేవుడి ముందు సమర్పణ భావంతో తలనీలాలు ఇస్తారట. ఆ తరువాత గుండులు కప్పుకోవడానికి టోపీలు కొనుక్కుంటారు మరి. అప్పుడు కారం సమర్పణ భావం లేనట్టే కదా?
నాకు నా మీద ప్రేమ లేదు. నా జుట్టు మీద అంతకన్నా లేదు. పిల్లల నిర్ణయం ప్రకారం జుట్టు కొనసాగుతుంది. నేను కూడా కొనసాగుతాను.

-కె.బి.గోపాలం