లోకాభిరామం

రెండు వైపుల పదునున్న కత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పట్లో దీపాలంటే చమురు దీపాలే. ప్రమిదలో పత్తి వేసి, నూనె లేదా ఆముదం వేసి దీపం పెట్టుకునేవారు. అలా నడుస్తుంటే ఈ మట్టి నూనె రంగప్రవేశం చేసింది. దాని పేరే కిరోసిన్, గ్యాస్ నూనె, కిరసనాయిలు వగైరా వగైరా. దాన్ని కూడా ఓ పెద్ద మూకుడులో వేసి గుడ్డతో వేలంత వత్తి చేసి వెలిగించాడట ఒక ప్రబుద్ధుడు. ఇంకేముంది? క్షణాల్లోనే గుడిసె గుడిసంతా దీపమయి వెలగసాగిందట. ఇక్కడ తప్పెవరిది? నూనెదా? దానె్నలా వాడుకోవాలో తెలియని మనిషిదా?
ప్రభువులకు దయ కలిగితే మరణదండన విధించడం ఒకనాడు మామూలే. చంపడానికి రకరకాల మార్గాలు! ఫ్రాన్సులో మరణదండన అంటే కత్తితో తలని నరకడం! శాన్సన్ అనే తలారి ఉండేవాడు. అతని దగ్గర రెండు కత్తులుండేవి. నరకవలసిన తలలు ఎక్కువయ్యేసరికి కత్తులు మరీ మరీ సానపెట్టాల్సి వచ్చేది. అందుకని ఆయన మహా ఘనత వహించిన ప్రభుత్వం వారికి ఒక విన్నపం పెట్టుకున్నాడు. చంపవలసిన వాళ్లు చాలామంది ఉండడం వలన, నా పని సజావుగా జరగడంలేదు. ఏదయినా మార్గం ఆలోచించవలసిందీ అని ప్రభుత్వం వారు గిలొటిన్ అనే డాక్టర్‌ను సలహా అడిగారు. కనురెప్ప పాటులో తల ఇటు, మొండెం అటు పడేలా చాలా మానవత్వంతో చంపే ఒక యంత్రాన్ని ఆ డాక్టర్ తయారుచేసి పెట్టాడు. శాన్సన్ పని చాలా సులువయింది. సాంకేతిక శాస్త్రం పుణ్యమా అని వేల మందిని మానవత్వంతో చంపగలిగారు. గిలొటిన్ ప్రపంచ ప్రసిద్ధమయింది. చర్చ లేకుండా బిల్లులను అసెంబ్లీలో పాస్ చేయడాన్ని కూడా గిలొటిన్ అనే చోటికి వచ్చింది.
సాంకేతిక శాస్తమ్రు, సైన్సూ కలిసి మన జీవితాలను సుఖమయం, సౌకర్యవంతం చేస్తుండడం మనకు తెలుసు. మసి బారని వంటిల్లు ఉంటే మహిళలకు, మగవారికి కూడా మంచిదని పల్లెల్లో కూడా వంట గ్యాసు పంచి పెడుతున్నారు. ఎక్కడో ఖర్మానికి ఒక సిలిండర్ పేలిన నాడు మాత్రం ఈ సిలిండర్లు ఎప్పుడూ ఇంతే పేలుతూ ఉంటాయి’ అని వారం దాకా మన ఇంట్లో సిలిండరుని శత్రువుగా చూడడం మనకు తెలుసు.
పరిశోధనలు జరిగేది ఒక ఉద్దేశంతోనయితే, అందులోంచి వచ్చే ఫలితాలు మరో రకమయిన వాడకానికి దారితీయడం మామూలయింది. తుపాకి మందు, బాంబు, అణుశక్తి, రసాయనాలు వంటి సైన్సు, సాంకేతిక రంగాల ఫలితాలను తప్పుడు ప్రయోజనాలకు వాడడానికి ఉదాహరణగా చెప్పవచ్చు. సాంకేతిక ప్రగతి అనుకున్నది మనకు చెరుపు చేయడం మొదలయేసరికి, అసలు సైన్సు మీదే అనుమానం అపనమ్మకం రావడం సహజం.
సైన్సుగానీ, సాంకేతిక విజ్ఞానం గానీ, సొంతంగా తమకంటూ విలువలు కల్పించుకోలేవు. వాటి ప్రయోజనం, వాడకం, మనుషుల చేతుల్లోనే ఉంది. కూరలు తరుగుతుండవలసిన కత్తితో, వేళ్లూ, గొంతులు తరుగుతామంటే తప్పు కత్తిది కాదు కదా!
ప్రజలందరికీ శాస్ర్తియ దృక్పథం ఉండాలని అందరూ అంటూంటారు. అసలు సైన్సు, సాంకేతిక విజ్ఞానం, పనిచేసే తీరు గురించి, వాటి తత్వం గురించి అర్థం కానిదే శాస్ర్తియ దృక్పథం రావడానికి వీలు లేదు. కాలంతోపాటు అనుభవం, దాంతోపాటే అవగాహన ఏర్పడతాయి. ఈ ప్రపంచమంతా సైనే్స. ఈ ప్రపంచాన్ని నడిపించేది సైనే్స అనే వారున్నారు. అది అక్షరాలా నిజం. అయితే సైన్సును నడిపించే మనిషి కూడా నైతికంగా, సామాజికంగా సైన్సంత ఎత్తుకు ఎదిగితేనే గానీ, దానివల్ల అందరికీ పనికి వచ్చే ప్రయోజనాలు ఏర్పడవు.
ఆలోచన, అవగాహన పెరిగిన కొద్దీ విశే్లషణ మొదలవుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చెప్పిన సంగతులను ప్రశ్నించకుండా ఒప్పుకోవడం లేదు. అంటే వారికి శాస్ర్తియ దృక్పథం ఉందనే కదా అర్థం! 19వ శతాబ్దం ద్వితీయార్ధంలో పెద్దలెందరో సైన్సంటే ప్రగతి, మిగతావన్నీ తిరోగతి అని చెపుతుండేవారు. ఇక మతం, సైన్సుల మధ్యన జరిగిన రగడ గురించి మనమిప్పుడు చర్చించకుండా ఉండడం మంచిది.
సైన్సు సాంకేతిక విజ్ఞానమై మన ఉపయోగంలోకి వస్తుంది. చరిత్ర తొలినాళ్ల నుంచి బొటనవేలు, నిప్పు, చక్రం, ఆవిరియంత్రం, విద్యుత్తు, కంప్యూటర్, ఇంటర్నెట్ ఇలా వరుసగా సాంకేతిక విజ్ఞానం తన అవతారాలను ప్రదర్శిస్తూనే ఉంది. ముందు ప్రతి కొత్త ఆవిష్కరణ జనాలను వెర్రెత్తిస్తుంది. అందరూ మన సమస్యలకు ఇదొక్కటే జవాబు అనుకుంటారు. సాంకేతిక విజ్ఞానం అంత గొప్ప ఆశలకు జవాబుగా నిలువలేక చతికిలబడుతుంది. దాంతో దాని మీద భక్తికన్నా భయం, ఆశకన్నా అపనమ్మకం మొదలవుతాయి. అందరి దృష్టి మరోవైపు మరలుతుంది. పట్టువదలక దాన్ని పట్టుకుని ఉండే వాళ్ల వల్ల సాంకేతిక విజ్ఞానం ఆ తర్వాత అసలయిన ప్రభావం చూపించడం మొదలెడుతుంది. యంత్రం విషయంలో జరిగింది ఇదే. ఇంటర్నెట్ విషయంలో జరుగుతున్నదీ ఇదే!
మానవునికి సైన్సు వల్ల జరగగలిగే ప్రయోజనాలను తలచుకుంటే వాటిని వాడుకోవడంలో మనమెంత విఫలమయ్యామో తెలుస్తుంది -అన్నాడు ఆల్‌ఫ్రెడ్ రస్సెల్ వాలేస్ తన వండర్‌ఫుల్ సెంచరీ -అనే గ్రంథంలో మనకు వినాశనం మీద గల ప్రేమ ప్రగతి మీద లేద’న్నాడాయన.
మనిషి సైన్సు సాయంతో చేసే వినాశనం ఎక్కువయ్యే కొద్దీ అసలు సైనే్స వినాశనం అనే ఆలోచన మొదలయింది. ఈ ఆలోచన 20వ శతాబ్దమంతా కొనసాగిందనవచ్చు. మానవుని అధికార వాంఛ, అత్యాశ మొదలయినవి నైతికతను వెనక్కు నెట్టి బాంబుల సంస్కృతిని తయారుచేశాయి. సైన్సు రాజకీయానికి ఆలంబనగా మారింది. అక్కడే చిక్కు మొదలయింది. సైన్సు మనకు శత్రువనే భావన తప్పు.
అలాగే సైన్సు సర్వ సమస్యలకు సమాధానం అనుకోవడమూ తప్పే!
మానవ జాతి చరిత్రనొకసారి పరిశీలిస్తే వ్యవసాయం మొదలుకొని నేటి ఇంటర్నెట్ దాకా ప్రగతి మొత్తం సైన్సు, సాంకేతిక విజ్ఞానాల ఆధారంగానే జరిగినట్టు తెలుస్తుంది. అయితే సైన్సు తనంతగా ప్రగతిని వెంట తేలేదు. దాన్ని వాడుకునేందుకు రకరకాల మార్గాలున్నాయి. పరిశోధన కోసం జంతువులను చంపడం తప్పు అని వర్‌డ్స్ వర్త్ మహాకవి నుంచి ఈనాటి వరకూ అంటూనే ఉన్నారు. సైన్సును సాధించేందుకు గల మార్గాలలో అదొకటి గదా! ప్రయోజనాన్ని బట్టి, అంటే ఫలితాలను వాడుకునే మనిషి తత్త్వాన్నిబట్టి సైన్సును తప్పు పట్టవచ్చునా? హిరోషిమాలో బాంబు మనిషి వేసిందా లేక సైన్సు వేసిందా?
గిలొటిన్‌తో ఉరిశిక్షకు గురయిన వారిలో ఫ్రెంచి శాస్తవ్రేత్త లెవోయిజే కూడా ఉన్నాడు. అతడి మరణాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ అతని మిత్రుడొకడు ఆ తలను ఒక క్షణంలో నరికారు. అయితే మరో శతాబ్దం గడిచినా ఈ దేశం అలాంటి మరొక తలను తయారుచేయలేదు’ అన్నాడు.
ఒక నిర్మాణాత్మక కార్యక్రమం పూర్తి కావడానికి సంవత్సరాలు, దశాబ్దాలు పడుతుంది. వినాశనానికి మాత్రం క్షణాలు చాలు. ఏళ్ల తరబడి సేకరించిన విజ్ఞానమంతా అలెగ్జాండ్రియా గ్రంథాలయంలో ఉండేది. ఒకనాటి అగ్ని ప్రమాదంలో అదంతా బూడిదయింది. సాంకేతిక విజ్ఞానం ఎంత పెరిగినా ఒక భవనాన్ని కట్టడానికి కనీసం నెలలు పడుతుంది. అదే సాంకేతిక విజ్ఞానం, అదే భవనాన్ని క్షణాల్లో కుప్పకూల్చగలుగుతుంది. ఇదంతా మనిషి చేతిలోని మర్మం కదా!
నిజానికి మనిషి వినాశనాన్ని ఇష్టపడడు. నాగరికత పేరున మానవజాతి బతుకు తీరే మారిపోయింది. నామమాత్రంగా ఉందేమో కానీ, బానిసత్వం పోయింది. స్ర్తిల స్థాయి పెరిగింది. యుద్ధాలు జరగనివ్వడంలేదు. అయినా అక్కడో ఇక్కడో, మనిషి లోపల గత తరాల వాసనగా మిగిలిన కరత్వం అప్పుడప్పుడు వారికి సైన్సు, సాంకేతిక విజ్ఞానం కొత్త వినాశన మార్గాలను అందజేస్తుంది. అంటే గతంలో వంద మంది చెడ్డవాళ్లు చేయలేని వినాశనాన్ని ఇవాళ ఒక పిచ్చివాడు చేయగలిగే వీలు కలిగింది. విచిత్రమైన పరిస్థితి అని ఒప్పుకోక తప్పదు. అలాగని మళ్లీ గతంలోకి వెళ్లిపోదామా?
సైన్సును కేవలం మంచి ప్రయోజనాలకు వాడుకునే నైతికత, సామాజిక బాధ్యత మరింతగా మన మనసుల్లో నాటుకోవాలి. నాణానికి ఎప్పుడూ రెండు వేపులుంటాయి. అందులో మనకు కావలసింది ఏదో నిర్ణయించేటప్పుడు మానవత్వం పరిమళించాలి. ఇందులో ముందుగా సైంటిస్టులకు, ఆ తర్వాత పాలకులకు, ఆ తర్వాత ప్రజలకు బాధ్యత ఉంటుంది. ఈ బాధ్యతలను ఎవరికి వారు సరిగా నిర్వహించాలంటే సైన్సును గురించిన అవగాహన అవసరం. దానితోపాటే నైతికతా ఉండాలి. సైన్సు మన ఈ నైతికతకు కొండంత అండ అవుతుంది. బలాన్నిస్తుంది.
సైన్సు అనేది తనంతకు తాను పెరిగే పదార్థం కాదు. అది జీవితం. అది సమాజం. చెడ్డ పేరయినా, మంచి పేరయినా వస్తే రెంటికి కలిపి రావలసిందే. నోరు మంచిదయితే ఊరు మంచిదన్నట్లు మనం మంచివాళ్లమయితే సాంకేతిక విజ్ఞానపు ప్రయోజనాలూ మంచివే అయితీరుతాయి.
భూమి చరిత్రలో మానవ చరిత్ర ఒక క్షణం కింద లెక్క. ఆ ఒక్క క్షణాన్ని అంధకారం చేయడమెందుకు. దొరికిన వెలుగును దారి చూపడానికి వాడుకుందాం. కిరసనాయిలును ఆలోచన లేకుండా ప్రమిదలో పోసి అంటిస్తే ఇల్లు తగలబడుతుంది. అప్పుడు మనం మనిషి అనిపించుకునే వీలుండదు. ఆలోచన, విచక్షణ, పరిశీలన, అనుభవం, ప్రయోగం, సిద్ధాంతం, ఇవన్నీ మనకు అండగా ఉండగా మనం చీకట్లో పడవలసిన అవసరం ఎక్కడిది. వీటన్నిటినీ కలిపితేనే వైజ్ఞానిక పద్ధతి ఏర్పడతాయి. కనీసం వీటి సాయంతోనయినా మనిషి తన జీవితంలో వెలుగులు నింపుకోవాలి.

-కె.బి.గోపాలం