ఈ వారం స్పెషల్

వసంత గానం నవజీవన యానం (ఉగాది)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచపాదం పితరం ద్వాదశాకృతిం
దివ ఆహుః పరే అర్థే పురీషిణం
అధేమే అన్య ఉపరే విచక్షణం
సప్తచక్రే షడర ఆహురర్పితమితి
-ఋగ్వేదం
సర్వ ప్రపంచానికి పై భాగం నందుండి, తన కిరణముల పరిపాక విశేషము చేత, సంవత్సరము ఆయనము ఋతువులు మాసము పక్షము దినము మొదలైన కాల భేదాల్ని ఏర్పరుస్తున్నాడు - సూర్యుడని చెప్పింది - యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం ‘అరుణ మంత్రం’. కాలాన్ని ఏర్పరచి భాగ విభాగాలుగా ఉన్న సంవత్సరంగా కొలత ఇచ్చి, హేమంతమూ శిశిరమూ ఒక ఋతువుగా చెపితే అయిదు ఋతువులుగా లేక ఆరు ఆకులు అనగా ఆరు ఋతువులతో, ఏడు చక్రాల రథముతో, ఏడు గుర్రాలుగా చెప్పబడే ఏడు రంగులతో లేక వారములోని ఏడు దినములతో, పనె్నండు రూపాలు అనగా పనె్నండు నెలలుగా, అన్నిటికీ నియామకుడుగా, తండ్రిగా వ్యవహరిస్తున్నాడు సూర్యుడని ఋగ్వేదం చెప్తోంది.
కనుక జీవనానికి, కార్యకలాపాలకు మూల కారణం - సూర్య భగవానుడు. సూర్యుడు - శక్తి, చంద్రుడు - పదార్థము, సూర్యుని వెలుగు చేత ప్రకాశించేవాడు. గ్రహములకు భూమికి అగ్ని తత్వాన్ని, తేజస్సును ఇచ్చేవాడు - సూర్యుడు. వెలుగు చీకటుల, శక్తి పదార్థముల క్రియాక్రియల పరస్పర సమ్మేళనమే, అనంతమైన కాలంగా సృష్టి ప్రళయాలుగా, వ్యక్తమవుతుంది. ఇదే ‘కాల’ గమనానికి, గణనానికి మూలం. కాల సంబంధమైన పండుగ ‘ఉగాది’
‘ఉగాది’ అంటే ఏమిటి?
ఉగాది అంటే నూతన సంవత్సర ప్రారంభ దినం. గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, నూతన సంవత్సరానికి స్వాగతం పలికే రోజు. ఈ సంయోగ వియోగ సంధి రోజు ‘ఉగాది’. ‘ఉగాది’ అనే పదం ‘యుగాది’ అనే సంస్కృత పదానికి వికృతి రూపం. కనుక ‘ఉగాది’ అంటే యుగమునకు ఆది అని అర్థం.
‘ఉగము’ ఆదిగా గలది - ఉగాది. ‘ఉగము’ అంటే జన్మ, ఆయుష్షు, యుగము అనే అర్థాలున్నాయి. యుగము అనగా జన్మ అనే అర్థముంది. కనుక, ఉగాది అంటే జన్మాది, జన్మకు ఆది. జన్మాది ఎవరు? శ్రీమహావిష్ణువు. ‘జననో జన జన్మాదిః భీమో భీమ పరాక్రమః’ అన్నది విష్ణు సహస్ర నామం.
పరమాత్మ కాల స్వరూపుడు. యుగ, సంవత్సర, ఋతు, మాస స్వరూపుడు అని విష్ణు సహస్ర నామములు తెలియజేస్తున్నాయి. ‘అహః సంవత్సరలో వ్యాళః, ఋతుస్సుదర్శనః కాలః, ఉగ్రః సంవత్సరలో దాక్షీ వత్సరో వత్సలోవతీ’ దీనినిబట్టి సంవత్సరాది గూడ యుగాది - ఉగాది అవుతుంది.
పరమాత్మకు యుగమునకు గల సంబంధము
యుగమునకు ఆది అంత్యములు పరమాత్మే. కనుక భగవంతునికి ‘యుగాదికృత్’ అని పేరు. ‘యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః’ (విష్ణు సహస్ర నామాలు) యుగమును సృష్టించటమే కాక, యుగమును నడిపేవాడు కూడా పరమాత్మే. కనుక ఆయనకు ‘యుగావర్తనుడ’ని పేరు. పరమాత్మను ‘సంవత్సరాయ నమః’ అని ప్రార్థిస్తాం. అనగా, సర్వము నందూ వశించేవాడు, సర్వమును తనయందే వశింప చేసుకొన్నవాడు కనుక స్వామిని ‘సంవత్సరః’ అన్నారు శంకరాచార్యులు.
కాల స్వరూపం
సంవత్సరమంటే కాలమే గదా. అందువలన పరమాత్మను ‘కాలయ నమః’ కాల కాలాయ నమః, కాల దర్పదమనాయ నమః’ అని స్తుతిస్తాం. ‘కా’ అంటే శుభములను, ‘ల’ అంటే అందించేది అని అర్థము. ‘అహమేవ అక్షయ కాలః’ అన్నాడు పరమాత్మ. అక్షయమైన కాలమును నేనే అన్నాడు.
‘ఉగాది’ విశేషార్థాలు
ఉగము ఆదిగా గలది ‘ఉగాది’. ‘ఉక్ ఆదౌ యస్యసః ఉగాదిః’ ఉగ్ ఆదియందు గల రోజు ఉగాది. ‘ఉ’ అంటే శివుడు. ‘ఉ’ ఆదిగా గలది - ఉమ. కనుక ఉగాది అంటే ‘ఉమ’ - ప్రకృతి శక్తి, బ్రహ్మ విద్య కుండలినీ యోగ శక్తి, చేతనా చేతన జీవరాశికి ప్రతీక. అంటే, సరైన జీవన విధానానికి ఉపకరించే అసలైన విద్యను నేర్చుకోటానికి ప్రారంభ దినము - ఉగాది.
‘ఉ’ అంటే ఉత్తమమైన, ‘గం’ అంటే జ్ఞానం. కనుక ‘ఉగం’ అంటే ఉత్తమమైన జ్ఞానం. అంటే పరమాత్మ, వేద జ్ఞానం - ధర్మ స్వరూపం. ‘ఉం పరమాత్మానం గమయతీతి ఉగం’ పరమాత్మ తత్త్వాన్ని తెలియజేసేది వేదము అనగా ధర్మము. ఉగాది అంటే ఉగమునకు ఆది. అనగా వేదమునకు ఆది - ఏమిటది? ఓంకారము. ఓంకార ప్రణవ నాదము. ప్రాణాగ్నుల కలయికతో నాదము ఏర్పడుతుంది. అదే దైవీ వాక్కు. ‘దైవీం వాచమన యన్త దేవాః తాం విశ్వ రూపాః పశోవదన్తి’ దైవీ వాక్కుగా సృజింపబడిన నాదాన్ని విశ్వమందున్న జీవులు పలుకుతూ ఉంటారు. ఆ నాదాన్ని ఇంద్రాది దేవతలు వ్యవహార యోగ్యమగునట్లుగా, అకారాది అక్షర స్వరూపము నొందించారు. అదే ప్రణవ నాదమయింది. ఈ ప్రణవ నాదమే - వేద పురాణాగమ శాస్త్రాదులకు ఆధారమైనది. ఇదే వేదనాదము. అవే సప్త స్వరములు. కనుక ఉగాది అంటే వేదములకు ఆదియందున్న స్వరము - ఓంకార ప్రణవ నాదమే, అని అర్థం. ‘యోవేదాదౌ స్వరప్రోక్తో వేదాంతేషు ప్రతిష్ఠితః’ అన్నది వేదం.
కనుక స్వరము కూడా ఉగాదే. సారమతి రాగం దేశాది తాళ కీర్తనలో ‘ప్రాణానల సంయోగము వల్ల ప్రణవ నాదము సప్త స్వరములై బరగ’ అని, రూపక తాళం ఆరభి రాగ కీర్తనలో ‘వేద పురాగమ శాస్త్రాదుల కాధారవౌ’ అని, జగన్మోహిని రాగం, రూపక తాళంలో ‘శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా’ అని కీర్తించిన బ్రహ్మ విద్యా సార్వభౌముడు శ్రీ త్యాగరాజ స్వామి, ఉగాది విశేషాలను గంభీరంగా స్ఫూర్తిదాయకంగా అందించాడు. ఉగాది రోజున తప్పకుండా మననం చేసుకోవలసిన కీర్తనలు.
ఉగ+ఆది= ఉగా. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. సృష్టి కార్యం ప్రారంభింపబడిన దినమే, ఉగాది.
వసంత ఋతువు
‘మధుశ్చమాధవశ్చ వాసంతికావృతూ’ అన్నది శ్రుతి. చైత్ర వైశాఖ మాసములు కలది వసంత ఋతువు. నవ్య చైతన్యాన్ని ప్రసాదించే ఋతువు - వసంత ఋతువు. పౌర్ణమి చిత్తా నక్షత్రంతో కూడి ఉండే మాసం - చైత్రమాసం. ‘ఇంద్రస్య చిత్రా’. చిత్తా నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు. చిత్తా నక్షత్రం కుజునిది. కుజుడు అగ్ని సంబంధమైన గ్రహం.
విశాఖా నక్షత్రంతో కూడిన పౌర్ణమిగల మాసం - వైశాఖ మాసం. విశాఖా నక్షత్రానికి అధిపతి - గురుడు. చైత్రమాసంలో సూర్యుడు మేష రాశిలో ఉంటాడు. వైశాఖ మాసంలో - వృషభ రాశిలో ఉంటాడు. ఈ రెండు నెలలు వసంత ఋతువు. కుజ, గురులు - సూర్యునికి మిత్రులు. ఇంద్రాగ్నులు సూర్య స్వరూపులు. చిత్తా, విశాఖా నక్షత్ర కాంతులు - సూర్య తేజస్సు. కనుక, రవి - మేష, వృషభ రాశులలో ఉన్నపుడు కలిగే ప్రకృతి శోభ దాని ప్రభావము, ఇంద్రాగ్నుల, చిత్తా విశాఖా నక్షత్రముల ప్రభావముల మేలు కలయికతో వచ్చేది వసంత ఋతువని జ్యోతిష వేద శాస్తమ్రులు పేర్కొన్నాయి.
వసంత ఋతువులో సకల జీవులకు మానసిక శారీరక బలం కలుగుతుంది. శరీరంపై మానసిక ప్రభావంతో జ్ఞాన సముపార్జనకు దోహదం చేస్తుంది. బుద్ధి వికాస లబ్ధి జరుగుతుంది. వసువులు దేవతలుగా గలది - వసంత ఋతువు. దాని ఆగమనంతో ప్రకృతిలో నూతన తేజోత్సాహం కలిగి, నవ జీవన వెలుగు ద్యోతకమవుతుంది. అందుకే, ‘ఋతూనాం కుసుమాకరః’ ‘ఋతువులలో వసంత ఋతువును నేనే’నని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సెలవిచ్చారు. ఇది వసంత ఋతువు ప్రత్యేకత. ఋతువులలో మొదటిది వసంతం, మాసములలో మొదటిది చైత్రము, పక్షములలో మొదటిది శుక్ల పక్షం, తిథులలో మొదటిది శుక్ల పక్షం, తిథులలో మొదటిది పాడ్యమి, నక్షత్రములలో మొదటిది అశ్వని, వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్ల పక్షంలో సూర్యోదయానికి పాడ్యమి తిథి ఉన్న రోజున సంవత్సర ఆరంభముగా నిర్ణయించి ఆ రోజు ‘ఉగాది’ పండుగను జరుపుకుంటారు.
ఇలా పాటించాలి...
ఉగాది రోజున ఉదయమే లేచి, అభ్యంగన స్నానం చేయటం మన సంప్రదాయం. ఇళ్లను, ముంగిళ్లను ద్వారాలను మామిడాకు తోరణాలతో కనుల పండువుగా అలంకరించి, సంవత్సరాధి దేవతను పూజిస్తారు. ‘మరీచిః దుర్ముభాభ్యానం మన్యుం మర్కట మాశ్రీతమ్, వివృతాస్యం జగద్భీతిదాయకం సంశ్రయేముదే’ ఈ దుర్ముఖి నామ సంవత్సరానికి ‘మరీచి’ దేవత. ఈ శ్లోకాన్ని పఠిస్తే సర్వ శుభములు కలుగుతాయి.
వేరొక సిద్ధాంతరీత్యా దుర్ముఖి నామ సంవత్సరాధి దేవత మరీచి - సూర్య కిరణములు అనగా సూర్యభగవానుడు. దీని గురించి అమరకోశము నందలి వ్యాఖ్యానము చూడవచ్చు. ఆదిత్య హృదయ స్తోత్రము నందు ‘హరిదశ్వస్సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్’ ఈ ఉగాది రోజున దీపారాధన చేసి ఆదిత్య హృదయ స్తోత్రం చదివి, దేవతారాధన చేసుకుంటే, గ్రహ పరిస్థితులెట్లా ఉన్నా, సంవత్సరాధి దేవత అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్య భాగ్యం లభిస్తుంది, సర్వ కార్యములు జయప్రదమవుతాయి.
పంచాంగ శ్రవణం
తిథి వార నక్షత్ర యోగ కరణములతో కూడినది - పంచాంగం. తిథి వలన సంపద వారము వలన ఆయుష్షు, నక్షత్రము వలన పాప పరిహారము, యోగము వలన వ్యాధి నివారణం, కరణము వలన కార్యానుకూలత చేకూరుతాయి. పంచాంగ శ్రవణము వలన - నవగ్రహముల ధ్యానము వలన కలిగే శుభ ఫలితాలు కలుగుతాయి.
ప్రాచీన మహర్షులు, ప్రతి సంవత్సరానికి పరిపాలకులను నిర్ణయించారు. ప్రభవ నుండి అక్షయ వరకూ ఉండే అరవయి సంవత్సరములకు, ఉగాది వచ్చిన సమయాన్ని, వారాన్నిబట్టి ఏయే గ్రహములకు ఏయే అధికారుములు సంక్రమిస్తాయో, తెలియజేసేది - పంచాంగం. నవనాయక ఫలితములతోపాటు వర్లలగ్న జగర్లగ్న ఫలితములు, ఆదాయ వ్యయములు రాశి ఫలితాలను రాజపూజ్య, అవమానములను, కందాయ ఫలములను బేరీజు వేసి తెలియపరిచేది ఉగాది పంచాంగం.
పంచాంగం వినటం వలన సంవత్సరమంతా శుభము కలుగుతుంది. శత్రు బాధలు ఉండవు. చెడు కలల వలన కీడు తొలగుతుంది. గంగలో స్నానం చేసినంత పుణ్యం, గోదానంతో సమానమైన మేలు చేకూరుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది, సంతాన సౌభాగ్యం లభిస్తుంది. అనేక శుభ ఫుణ్య కర్మలు నిర్వహించటానికి పంచాంగం సాధనమవుతుంది. పంచాంగం శ్రవణం చేసిన వారికి ఆయా గ్రహముల తేజస్సు సంక్రమిస్తుంది. సూర్యుని వలన తేజస్సు, చంద్రుని వలన వైభవము, భాగ్యము, కుజుని వలన సర్వశుభములు, బుధుని వలన బుద్ధి వికాసము, గురుని వలన జ్ఞానము, గురుత్వము, శుక్రుని వలన సుఖము, శని వలనల దుఃఖ రాహిత్యము, ఆయుర్వుర్ధి, రాహువు వలన ప్రాబల్యము, కేతువు వలన బంధుప్రీతి తన వారిలో ప్రాముఖ్యత చేకూరుతాయి. పంచాంగ శ్రవణమంటే విష్ణ్వార్చన. యజ్ఞోవైవిష్ణుః. కనుక పంచాంగం శ్రవణం వలన యజ్ఞ్ఫలం లభిస్తుంది.
ఉగాది: కాల నిజ స్వరూపం
ఆదిశంకరుల హితబోధ
‘దినయామిన్యౌ సాయంప్రాతః, శిశిర వసన్తౌ పునరాయాతః, కాలః క్రీడతి గచ్చత్యాయుః, తదపిన ముఞ్చత్యాశావాయుః’ - శంకర భగవత్పాదులు.
రాత్రింబవళ్లు ఉదయాస్తమానాలు; ఆకురాలే కాలమూ - చిగురించే కాలాలూ మళ్లీ మళ్లీ వస్తుంటాయి. కాలం అన్నిటికన్నా బలీయమైంది. దాని క్రీడా విలాసాలతో ఆయుష్షు క్షీణిస్తూనే ఉంటుంది. తరాలు గడుస్తూనే ఉంటాయి. అయినా మనిషిలో ఉండే స్వార్థం, మూర్ఖత్వం తొలగవు. ‘కాలః క్రీడతి’ అన్నారు శంకరులు. మానవుని వివేకాన్ని నాశనం చేసి అతని పతనానికి మూలమైనవి - ధన జన వన గర్వాల. మానవుడు వీటి ద్వారా ఎంత విర్రవీగినా ‘కాలం’ ప్రతికూలమైతే, క్షణాల మీద పేకమేడల్లా కుప్పకూలిపోతాయి. ‘మాయామయ పాద మఖిలం హిత్వా, బ్రహ్మ పదం త్వం ప్రవిశ విదిత్వా’ అన్నారు శంకర భగవత్పాదులు. మానవుడు తన పరిధిని తెలిసికొని, వ్యక్తిగతంగా, సమష్టిగా, స్వార్థరహిత బుద్ధితో మంచి నడతతో ధన జన వన గర్వాది సవస్త మాలిన్యాలనూ విడిచిపెట్టి శాశ్వతానందాన్ని నాశనం లేని స్థితిని కలిగించే పరమాత్మ సాన్నిధ్యాన్ని, సర్వ సమభావనతో పొందాలన్నారు. ఇదే ‘కాలం’ యొక్క నిజ స్వరూపం. ఉగాది పండుగనాడు తప్పకుండా మననం చేసికోవలసిన విషయం, ఉగాది పండుగకు స్ఫూర్తినిచ్చేది.
కాల ప్రాముఖ్యత
యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకంలో కాల ప్రాముఖ్యత విశేషంగా చెప్పబడింది. ఏ సమయంలో ఏ పని చేయాలో, ఆ సమయంలో ఆ మంచి పని చేస్తే మంచి ఫలితాల్ని పొందుతారని, కాల ప్రాముఖ్యాన్ని తెలియజేయబడింది. ఇది ఉగాది అనగా కాల సంబంధమైన పండుగకు స్ఫూర్తినిస్తుంది.
కాలము భగవంతుని స్వరూపం. అటువంటి కాలమును దైవచింతచే గడుపు వివేకులకు కాల నిమిత్తమైన భయముండదు. అలాగాక, ప్రపంచ విషయాసక్తులమై యున్నంత వరకు వ్యర్థముగా కాలహరణమే అవుతుంది. ఎంత కాలము ఎచ్చట ఏమనుభవించినా, పక్షులు తిరిగి తిరిగి తమ గూటికే చేరునట్లు, జన్మాది నీ దివ్య చరణములనే ఆశ్రయించి యున్న నన్ను రామా, రక్షించటానికి నీవే కాలహరణము చేస్తున్నావని, శుద్ధ సావేరి రాగంలో ‘కాలహరణమేలరా హరే సీతారామ, చుట్టిచుట్టి పక్షులెల్ల చెట్టు వెదకు రీతి భువిని పుట్టగానె నీ పదముల బట్టుకొన్న నన్ను బ్రోవ కాలహరణమేలరా’ అన్న త్యాగరాజ స్వామివారి కీర్తన ఉగాది పండుగనాడు జ్ఞప్తి చేసుకోవలసిన కీర్తన.
కాలం అపరిమితమైంది. అపరిమితమైన కాలంలో చాలా పరిమితమైనది మానవ జీవితం. మనిషి మనిషిగా పుట్టటమే ఒక వరం. కాలం విలువను జీవితం విలువను గుర్తించి, తనలోని పశు రాక్షస ప్రవృత్తిని రూపుమాపుకొని, మానవతా విలువలను పెంచుకుని, అంతర్లీనంగా ఉన్న దివ్య ప్రకృతిని ప్రజ్వలింప జేసికొని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసికోవటమే జ్ఞాన సముపార్జన. ఆ విధంగా జీవిత చరితార్థతను పొందించేది ఉగాది.
నదిని దాటటానికి ఇవతలి ఒడ్డున పడవను ఎక్కుతాం. నడిపేవారు దిగమనే వరకు అవతలి ఒడ్డు వచ్చిందని తెలియదు. సుఖానుభవంతో కాలపరిమితి తెలియదు. వయసు తీరిపోతుంది. ఇది మానవ జీవితానికి అవతలి ఒడ్డు. వయసునది, కాలము నావ. వయసు అనే నదిని దాటటానికి కాలమనే పడవలో ప్రయాణం చేసేటప్పుడు, నావలోని తోటి ప్రయాణీకులను అనగా తనతో సమాజంలో జీవించే వారిని ఏకాత్మతా భావంతో దర్శించి మానవ సేవలో మాధవ సేవను దర్శించి సర్వ మానవ సౌభ్రాత్రతతో విశ్వ మానవ కళ్యాణాన్ని వీక్షించాలని చెప్తోంది - ఉగాది పండుగ, శ్రీ దుర్ముఖి నామసంవత్సరాది. *
..........................
ఉగాది పచ్చడి
నివేదన చేసిన ఉగాది పచ్చడిని తినడం ఈ పండుగ ప్రత్యేకత. ప్రకృతి కొత్తగా ప్రసాదించిన ఫల పుష్పాదులను, అర్థం పరమార్థం గల సంప్రదాయంతో తీసికోవడం - ఉగాది పచ్చడి విశిష్టత. సర్వకాలములలోనూ సమతుల్యమైన ఆరోగ్యాన్ని పొందడానికి దోహదపడేది ప్రకృతి ప్రసాదం - వేపపువ్వు. జీవితాన్ని సమదృష్టితో చూడాలనే ఆధ్యాత్మికతను తెలియజేసేది - ఉగాది పచ్చడి. వేపపువ్వు, మామిడి, బెల్లం, కొత్త చింతపండు, ఉప్పు, కారం (పచ్చిమిర్చి సన్నని ముక్కలు)- షడ్రుచుల సమ్మేళనంగా సమతుల్య జీవన విధానాన్ని ప్రకృతిపరంగా నిర్వచిస్తోంది ఉగాది పచ్చడి. జఠరాగ్నిని ప్రజ్వలింపజేసి, శే్లష్మాన్ని హరించి, రక్తశుద్ధిని చేసి, ఆకలిని పెంపొందింపజేసి, మనోవ్యాధిని నశింపజేసి శాంతిని కలిగించే ఉగాది పచ్చడిని ‘శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం’ అని పఠిస్తూ సేవిస్తే ఆయుర్వుద్ధి జరుగుతుందని ఆయుర్వేద విజ్ఞాన శాస్త్రం పేర్కొన్నది.

-పసుమర్తి కామేశ్వరశర్మ