మెయిన్ ఫీచర్

ఆధునిక తెలుగు కవిత్వంలో లఘు కవితా ప్రక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక తెలుగు కవిత్వంలో వచన కవితది అగ్రస్థానం. అది గురజాడ నుండి, శ్రీనుండి, శేషేంద్ర నండి, తిలక్ నుండి, సినారె నుండి, ఆరుద్ర నండి, కుందూర్తి నుండి నేటి ఆధునిక కవి వరకు కాలముతోపాటు ముందుకు సాగుతూ సుసంపన్నమవుతూ వచ్చింది. కాలక్రమంలో నవ్యతను, నాణ్యతను, గాఢతను, క్లుప్తతను సంతరించుకొని కూడా ముందుకు నడిచింది. తన రూప నిర్మాణాన్ని కూడా మార్పు చేసుకుంటూ వచ్చింది. నాటి మహాభారతం పద్యంలో 18 పర్వాలైతే, నేటి ఆధునిక వచన కవిత 18 లైనే్ల అన్నారు పెద్దలు.
తెలుగు కవిత్వ సీమలో మినీ కవిత్వం 1980లలో విశిష్ట స్థానం వర్థిల్లింది, ప్రచారం పొందుతూ కూడా ముందుకు సాగింది. 1980లలో విజయవాడనుండి ‘యువస్వరాలు’ అనే ఒక సంకలనం వస్తుండేది నెల నెల యువ కవుల మినీ కవితలతో. అద్దేపల్లి మోహనరావు, శిరీష్‌కుమార్ లాంటి పెద్దల ఆధ్వర్యంలో సాంస్కృతి సమాఖ్య ద్వారా. వార పత్రికలో ఏమ్విఎల్ ఆదిగాగల కవుల మినీ కవితలు వస్తుండేవి. యువకవి అలిశెట్టి ప్రభాకర్ లాంటి కవి చిత్రకారుడు, చైతన్యవంతమైన మినీ కవితలు రాసి వాటికి బొమ్మలు కూడా వేసి మినీ కవితల చిత్ర ప్రదర్శనలు ఏర్పటుచేసిన సందర్భాలు ఉన్నాయి. మచిలీపట్నం నుండి డా. రావి రంగారావు విశేషముగా కృషిచేసినారు మినీ కవిత వ్యాప్తికోసం, వారు స్వయంగా పరిశోధన చేసి ‘మినీ కవిత శిల్పసమీక్ష’ గ్రంథాన్ని రాశారు. మచిలీపట్నం, విజయవాడలలో ఈ అంశంపై పలు వర్క్‌షాపులు నిర్వహించి మినీ కవితలు రాయడానికి ప్రోత్సాహం కల్పించారు. వారే ఎన్నో మినీ కవితా సంకలనాలు వ్రాశారు. అనేకసార్లు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కవితా సంకలనాలు తెచ్చారు. ఇక మినీ కవిత అంటే స్పష్టత, సూటిదనం, సంక్షిప్తత, సరళత, వ్యంగ్యం లక్షణాలు ఉంటాయన్నారు పెద్దలు. శీర్షిక కూడా తప్పకుండా ఉండాలి. ఎన్ని లైన్లలో వుండవచ్చు అంటే ఐదారు నుండి పదిలోపు వుంటే మినీ కవిత. శ్రీశ్రీ, కాళోజీ నుండి ఇప్పటివరకూ అపుడపుతూ ఎందరో మినీ కవితలు రాసినవారే.
నిప్పులు చిమ్ముకుంటూ / నింగికి నేను ఎగిరిపోతే / నిబిడాశ్చర్యంతో వీరు / నెత్తురు కక్కుకుంటూ / నేలకు నే రాలిపోతే / నిర్దాక్షిణ్యంగా వీరే -శ్రీశ్రీ
పుట్టు నీది / చావు నీది / గుండెల్లో కొత్తగా దిగబడే/ కాగితపు కత్తి/ కరెన్సీ నోటు - అలిశెట్టి
అమెరికా పిల్లలు / ఒక లక్ష్యంతో / వదిలిన బాణాలు / అవి తిరిగిరావు- రావి రంగారావు
ఇలా మూడు నాలుగు పాదాల కవితలు కన్పిస్తాయి. మినీ కవితల మార్గంలో వాటి లక్షణాలను పుణికిపుచ్చుకుని వచ్చినవే ఈ మూడు లైన్లలో వున్న హైకూ, నాలుగు లైన్లలో వున్న నానీ, నానో, ఆరు లైన్లలో వున్న రెక్క మరియు ఒకే వాక్యంలో వున్న ఏకవాక్య కవిత.
హైకూ జపనీస్ కవితా ప్రక్రియ. 17వ శతాబ్దం నుండి విశేష ఆదరణ పొందిన ఈ ప్రక్రియ తెలుగులో దిగుమతి అయింది. జపాన్‌లో భాషో, యోసాబుసాన్, ఇస్సా అన్న ముగ్గురు కవులు హైకూకు అపారమైన కీర్తిప్రతిష్ఠలు తెచ్చారు. మూడు పాదాలలో 17 మాత్రలు ఉంటాయి. ఇస్మాయిల్, గాలి నాసరరెడ్డి, పెన్నా శివరామకృష్ణ లాంటివారు ఆ ఛందస్సును పాటిస్తూనే రాశారు. చినుకుల చిత్రాలు, సులోచనాలు లాంటి సంకలనాలు పెన్నావారు వెలువరించారు. తలతోటి పృధ్వీరాజ్ ఏకంగా ఓ హైకూ క్లబ్‌ను స్థాపించి విస్తృత ప్రచారం చేసి అనేక సంకలనాలు వేస్తూ, వేసినవారికి అవార్డులు కూడా ప్రదానం చేశారు. ఇంకా రూప్‌కుమార్ డబ్బీకార్ హైకూ సారస్వతం, డా. అద్దేపల్లి రామమోహనరావు, బి.వి.వి.ప్రసాద్, లలితానంద ప్రసాద్, వరలక్ష్మి, శిఖా ఆకాష్, దాట్ల దేవదానంరాజు, పులిపాటి పరమేశ్వరి హైకూ సంపుటాలు వెలువరించారు.
సమీక్షకుడు/ పచ్చిపాలమీగడ / వెతికే అత్త- మూసిన కన్ను / నాలోని లోకానికి / రహస్య ద్వారం- పెన్నా శివరామకృష్ణ, వాగు ప్రవాహానికి / అన్నీకొట్టుకుపోతున్నాయి/ చంద్రుడు తప్పించి - తలతోటి పృధ్వీరాజ్.
నానీలు నాలుగు పాదాలలో వున్న లఘు కవితా రూపాలు. సృష్టికర్త డా.ఎన్.గోపి. గోపీ మాటల్లోనే నానిల గూర్చి చిన్న పద్యాలు మరీ చిన్నవి కాదు. నానీలు అతి బిగింపు, అవసరమైన సడలింపు లేకుండా రూపొందిన 20 నుండి 25 అక్షరాల విస్తీర్ణంగల చట్రం. నానీలు అంటే నావీ నీవీ వెరసి మనవి అని అర్థం. రెండు పాదాలు ఒక భావాంశగా, నాలుగు పాదాలు కలిసి రెండు భావాంశాలుగా వేరు చేసుకోవాలి. రెండు భావాలు ఒకదానికొకటి వైరుధ్యంగా, సాదృశ్యంగా అల్లుకోవచ్చు. సమన్వయం సాధించాలి.
నానోలు తెలుగు లఘు కవిత్వంలో సూక్ష్మ కవిత్వం. పాదానికి ఒకే పదం, నాలుగు పాదాలు. నాలుగు స్వతంత్రమైన పదాలతో ఇమిడి వుండి ఒక అద్భుతమైన భావాన్ని చెప్పే సూక్ష్మ కవిత ఇది. మొదటగా వేసిన పుస్తకం ఈగ హనుమాన్ నుండి వచ్చింది. సాహిత్య నానోలు, అక్షరాణువులు వంటివి సంకలనాలుగా వచ్చాయి. గరికపాటి మణిందర్, పోతగాని సత్యనారాయణ, కొట్టి రామారావు, భీంపల్లి శ్రీకాంత్, రాధికా కేశవదాస్‌లు నానోలు రాస్తున్నారు. ఒక వాక్యాన్ని నాలుగు పదాలు విడగొట్టి చెబితే అది నానో కాదు. చదివితే వాక్యంలా స్ఫురించకూడదు. చదువు / అందరిది / ఉద్యోగం / కొందరిది, అక్షరం / తపస్సు / కవిత్వం/ అమృతం- సబ్బని, మనిషి / మనస్సు / నిర్మలం / ఆరోగ్యం - కాకరపర్తి పద్మజ.
రెక్కలు. రెక్కల గురించి చెబితే ఆషామాషీ కవిత్వం కాదు. కవితలకు రెక్కలొస్తే అవి విహంగాల్లా ఎగురుతాయి సాహితీలోకంలో. బతుకు మూలాల్లోంచి జీవనసారాన్ని మథించి రాయాలి. 2003లో రెక్కలు, వచనాలు తొలుతగా సుగంబాబు ప్రచురించారు. మోపిదేవి రాధాకృష్ణ కాంతి కెరటాలు రెక్కల పుస్తకం వచ్చింది. తెలంగాణ రెక్కలు, వెలుతురు వలయాలు, త్రివేణి రెక్కల శతకం, ఆమని లాంటి సంకలనాలు వచ్చాయి. మల్లవరపు చిన్నయ్య, కైలాసపతిరావు, పద్మకళ, రుద్రారం శ్రీనివాస్‌రెడ్డి తదితర 150 మంది కవులు రాస్తున్నారు.
ఏకవాక్య కవితలు. క్లుప్తత, గాఢతతో సాగుతూ, కవిత స్థాయిని ప్రతిఫలిస్తాయి. విశిష్టమై భావం, భాష, రక్తంలో ప్రవహించే ఒక అసాధారణ వాక్యం మాత్రమే కవిత కాగలదు అని గుంటూరు శేషేంద్రశర్మ చెప్పినట్లు ఏకవాక్య కవిత రచనలు వచ్చాయి. వాక్యం రసాత్మకం పేరిట గ్రంథ రూపం దాల్చాయి. 90 ఏళ్ళ క్రితం విశ్వకవి రవీంద్రనాధ్ ఠగూర్ ఏకవాక్య కవితలకు అంకురార్పణ చేశారు, స్ట్రే బర్డ్స్ అనే ఆంగ్ల సంకలనం ద్వారా. కేతవరపు రాజ్యశ్రీ వెనె్నల పక్షులు, సిరిమల్లెలు పేరిట సిరి వడ్డె, పూలపిట్ట అంటూ స్వర్ణలత నాయుడు ఏకవాక్య గ్రంథాలను అందించారు. ప్రేమస్వరాలు, అక్షర సౌరభాలు కూడా వచ్చాయి. ‘నీ ఒక్క చూపులో వెయ్యి కృతజ్ఞతలు, వెయ్యి స్వాగతాలు. బతుకు పుస్తకంలో అపురూపంగా నువ్వొక నెమలీకలా. నీ కళ్లల్లోకి సూటిగా చూశాను. రెండు భూ ప్రపంచాలు. నువ్వు ప్రవహిస్తున్న నదివి. నది అంచులను ముద్దాడుతున్న తీరాన్ని నేను’- మొదలైన ఏకవాక్య కవితలు సబ్బని ప్రేమస్వరాలు లోనివి.
చివరగా కవిత్వం ఎప్పటికీ కాలక్షేపానికి రాయకూడదు. దానికి ప్రయోజనం ఉండాలి. నిర్మాణ శిల్పం ఉండాలి. ఈ విషయాలన్నీ కవులకు తెలియాలి. కవిత్వం రాయడం ఈజీ అని భ్రమపడేవాళ్లు చాలామంది వున్నారు. నాలుగు లైన్లలో రాస్తే నాని, మూడు లైన్లలో రాస్తే హైకూ, నాలుగు పదాలతో రాస్తే నానో, ఆరు లైన్లలో రాస్తే రెక్కలు, ఒక వాక్యంలో రాస్తే ఏకవాక్య కవిత అని అనుకొని వ్రాసే క్రమంలో కవులు వుంటే వాళ్లు మంచి కవిత్వాన్ని వ్రాయలేరు. కవిత్వ సీమను సుసంపన్నం చేయలేరు. అది అర్థవంతమైన స్వతస్సిద్ధమైన ధార. కవిత్వం ఒక ఆల్కెమీ. దాని రహస్యం కవికే తెలుసు. పెద్దనకు తెలుసు. శ్రీశ్రీకి తెలుసు. శ్రీనాథుడికి తెలుసు అన్న రహస్యాన్ని గుర్తించి రచన చేయాలి. అప్పుడే కవిత్వం వర్థిల్లుతుంది. ప్రజలను ఆనందపరుస్తుంది. కొనియాడబడుతుంది.

- డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ