మెయన్ ఫీచర్

రైతుకు రెట్టింపు ఆదాయం అంటూ ప్రేక్షక పాత్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన ఆర్థిక సంస్కరణల అమలుతో గత మూడు దశాబ్దాలుగా భారతదేశం ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్థలలో ఒకటిగా ఎదిగినా, దేశంలో సంపద పెరుగుతున్నా, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు అనేక రెట్లు పెరుగుతున్నా గ్రామీణ, వ్యవసాయ రంగాలు మాత్రం శిథిలావస్థకు చేరుకొం టున్నాయి. ఆ రంగాలలో జీవం నింపే ప్రయత్నాలు చెప్పుకోదగిన విధంగా జరగడం లేదు. ప్రభుత్వం పెద్దలలో గాని, ప్రణాళికావేత్తలలో గాని వ్యవసాయానికి సంబంధించిన అవగాహన ఉన్నట్లే కనిపించడం లేదు.
స్వామినాథన్ కమీషన్ నివేదిక అమలు, రైతులకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ బీమా పథకం - అంటూ దాదాపు అన్ని రాజకీయ పక్షాలు హామీల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. కాని ఆచరణలో రైతుల ముఖంలో చిరునవ్వు కనిపించడం లేదు. రైతుల ఆత్మహత్యలకు అవకాశం లేని పరిస్థితుల కల్పన పట్ల దృష్టి సారించడం లేదు. తీవ్రమైన నిస్సత్తువుగా ఉన్న రైతులను రాజకీయ అవసరాల కోసం ఆకట్టుకోవడం కోసం వారికి వివిధ పేర్లతో నగదు నేరుగా పంపిణీ చేసే కార్యక్రమాలు చేపట్టాయి. నగదు పంపిణీలు ఏ రంగం లో కూడా ఉత్పాదికత పెంపుదలకు దారితీసిన దాఖలాలే లేవు.
ఇటువంటి నిస్పృహకర పరిస్థితులలో 2022 నాటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇస్తే రైతులలో ఒక విధంగా నూతన ఉత్సాహం కలిగింది. అయితే ఆయన నినాదాలు ఇవ్వడంలో నేర్పరి. అమలులో మాత్రం ఏ విషయంలో కూడా ప్రతిభ చూపలేక పోతున్నారు. అన్ని ప్రభుత్వా లలో వలే ఆయన ప్రభుత్వంలో సహితం రైతుల మంచి, చెడుల గురించి అవగాహన గలిగిన వారు లేకపోవడంతో ముందడుగు వేయలేక పోతున్నారు.
నేడు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక పోవడం. ఉత్పత్తులను దళారుల దోపిడీ లేకుండా అమ్ముకోగలిగిన వాతావరణం లేకపోవడం. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవసాయ మార్కెట్ లు రైతుల నిలువు దోపిడీకి కేంద్రాలుగా మారడం. ఆన్ లైన్‌లో ఎక్కడ మంచి ధర ఉంటే అక్కడ అమ్ముకోగలిగే విధంగా మోదీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ వ్యవస్థను అమలు జరిపినా దానికి పురిటిలోనే సంధి కొట్టింది.
మోదీ ప్రభుత్వంలో రైతు వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకుపోగల ప్రబుద్ధులే ఎక్కువగా కనబడుతున్నారు. కార్పొరేట్ రంగానికి పన్నులను భారీ స్థాయిలో తగ్గించ గలిగిన ప్రభుత్వం రైతుల పట్ల మాత్రం అటువంటి ఉదారత చూపించిన దాఖలాలు లేనే లేవు. మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఐదు సంవత్సరాల పాటు పప్పుధాన్యాలు దిగుమతి చేసుకోవడానికి బర్మా, టాంజానియా వంటి దేశాలతో ఒప్పందాలు చేసుకున్నారు. దానితో మన దేశంలో అపరాల దిగుమతు లు భారీగా పడిపోయి, వాటిని పండించే దేశంలోని రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు.
రైతులు పండించిన శనగలు ఇంకా భారీగా శీతల గిడ్డంగులలో మగ్గుతున్నాయి. ప్రభుత్వం చేసుకున్న ఈ దిగుమతి ఒప్పందాలు కేవలం ఒక రాష్ట్రానికి చెందిన వ్యాపారులకు భారీ లాభాలు తెచ్చి పెడుతూ ఉండడంతో వారి కోసం మన రైతుల ప్రయోజనాలకు దెబ్బ తీయడంతో పాటు, దేశంలో అపరాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే అవకాశం లేకుండా చేశారు.
మన గిడ్డంగులలో భారీ నిల్వలు ఉన్న వాటిని దిగుమతి చేసుకోవలసిన అవసరం ఎందుకు? పైగా నిల్వలతో నష్టపోతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించవలసిన దుస్థితి ఎందుకు కలుగు తున్నది? శనగల నిల్వలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన చెందుతూ ఉంటే గత ఏడాది అనేక ఆంక్షలతో ఏపీ ప్రభుత్వం కొద్దీ మంది రైతులకు క్వింటాల్‌కు రూ. 1500 చొప్పున పరిహారం చెల్లించింది. ప్రత్తి, పొగాకు రైతులు సహితం గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతుంటే పట్టించుకున్న నాథులే లేరు.
ప్రస్తుతం గిట్టుబాటు ధరలు లేక సుబాబుల్ రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. దాదాపు అన్ని కోస్తా జిల్లాల్లో ఈ పంటను పండిస్తుండగా, మొత్తం పంటలో 45 శాతం వరకు లక్ష ఎకరాలలో ప్రకాశం జిల్లాలోనే పండిస్తున్నారు. ఆ తర్వాత నెల్లూరు, గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలో సహితం ఎక్కువగా పండిస్తున్నారు. 2003-04లో రైతులు సుబాబుల్ కర్ర టన్నుకు రూ.4,200 నుండి రూ.4,400 వరకు అమ్ముకోగలిగారు.
పాదయాత్ర సందర్భంగా సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే సుబాబుల్ టన్నుకు రూ 4,000, జమాయిలుకు రూ 4,200గా ధరలు నిర్ణయించి, ఆ మేరకు కొనుగోలు చేయాలని పేపర్ మిల్స్ వారిని ఆదేశించినా ధరలు పడిపోవడం ఆగలేదు. ప్రస్తుతం టన్నుకు రూ 1,800 నుండి రూ.2,200 మాత్రమే ధర లభిస్తున్నది. అంటే సగానికి సగం ధర పడిపోయింది.
ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి రాగానే టన్నుకు రూ 4,400 ధర వచ్చేటట్లు చేస్తానని హామీ ఇచ్చారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెటింగ్ శాఖ మంత్రి సంబంధిత రైతు నాయకులు, శాసనసభ్యులు, పేపర్ మిల్లుల వారితో సమావేశాలు అయితే పెట్టారు. ముఖ్యమంత్రికి పరిస్థితులను వివరించారు. కానీ ప్రభుత్వం పక్షాన ఎటువంటి ఉపశమనం రైతులకు లభించడం లేదు.
జమాయిలు, సుబాబుల్ ధరలు విపరీతంగా పడిపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. రైతులు అమ్మే సుబాబుల్, జామాయిల్ కర్రపై అధిక మొత్తంలో 18 శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేస్తున్నారు. మరోవంక దిగుమతి అవుతున్న వేస్ట్ పేపర్, కాగితపు గుజ్జు, వుడ్‌చిప్స్‌లపై 2017లో కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను పూర్తిగా రద్దు చేసింది. దీనితో కాగితపు గుజ్జు, వేస్ట్ పేపర్ దిగుమతులు సాలీనా 30 లక్షల టన్నుల వరకు జరుగుతున్నాయి. దానితో రైతులు పండించే ఈ పంటలకు డిమాండ్‌ను హరించి వేస్తున్నాయి.
అదే కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ మహమ్మారికి కారణమైన పొగాకును, సిగరెట్ లను తాగవద్దని చెబుతూ పెద్ద ఎత్తునప్రచారం చేస్తున్నది. పొగాకు పంటను పండించ వద్దని రైతులను కోరుతున్నది. కానీ పొగాకు వేలం కేంద్రాలలో ఆ పంటపై 5 శాతం మాత్రమే జీఎస్టీని వసూలు చేస్తున్నది. పొగాకు వేలం కేంద్రాలలోకి అంతర్జాతీయ కొనుగోలుదారులు పాల్గొనేటట్లు చేయాలని రైతులు దశాబ్దాలుగా కోరుతున్న సిగరెట్ పారిశ్రామిక వేత్తల ఒత్తిడిలకు లొంగిపోయి కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అంటే ఎవ్వరు అధికారంలో ఉన్నప్పటికీ మన ప్రభుత్వ విధానాలు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా, రైతుల ప్రయోజనా లకు విఘాతం కల్గించే విధంగా మాత్రమే ఉంటున్నాయి.
ఈ సందర్భంగా గత ఏడాది అక్టోబర్ - నవంబర్ ప్రాంతంలో ఒంగోలుకు వచ్చిన కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రిని రైతులు ఆచార్య ఎన్.జి.రంగా కిసాన్ సంస్థ ఆధ్వర్యంలో కలిసి సుబాబుల్, జామాయిల్ లపై విధించిన 18 శాతం జీఎస్టీని పూర్తిగా తొలగించి, వేస్ట్ పేపర్, కాగితపు గుజ్జుల దిగుమతులపై 15 శాతం సుంకం విధించాలని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు కోస్తా ఆంధ్రాలోని అన్ని పార్టీల ఎంపీలకు వినతి పత్రాలు పంపారు. అయితే వారి మొర విన్నవారే కనిపించలేదు. ఈ విషయమై తగు సహాయం చేయగలనని ఏపీ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు భరోసా ఇచ్చినా, ఆయన మాటకు కూడా ఈ ప్రభుత్వంలో విలువ ఉన్నట్లు కనిపించడం లేదు.
2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేయమని తరచూ హామీలు ఇస్తున్న ప్రధాన మంత్రి ఆ దిశలో రైతు ప్రతినిధులతో సమాలోచనలు జరిపి ఒక నిరిదష్టమైన కార్యాచరణను రూపొందించుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికే మూడేళలు గడించింది. ఆ దిశలో ఏ మేరకు ముందడుగు వేసారో, ఇంకా చేయవలసింది ఏముందో అంటూ ఒక పత్రం ప్రకటిస్తే ఈ హామీ అసలు స్వరూపం వెల్లడి కాగలదు. ఈ సంవత్సర బడ్జెట్‌లో వ్యవసాయానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా కేటాయించామని చెబుతున్నారు. కానీ అందులో రైతులకు నగదు పంపిణీకి, బీమా పథకానికి సుమారు లక్ష కోట్లు ఖర్చు అవుతుంది.
వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం పట్ల తగు దృష్టి సారించినట్లు కనిపించడం లేదు. కిసాన్ బీమా పథకం సహితం ఎక్కువగా ప్రైవేట్ బీమా కంపెనీలకు మాత్రమే ప్రయోజనం కలిగిస్తున్నది. ప్రభుత్వ బీమా కంపెనీలను కాదని వీటి ద్వారా పథకం అమలుకు ప్రయత్నిస్తూ ఉండడంతో భారీ కుంభకోణా లకు దారితీస్తున్నట్లు జమ్మూ, కాశ్మీర్‌లో స్వయంగా అప్పటి గవర్నర్ బహిర్గతం చేయడం తెలిసిందే.
అమెరికా వంటి సంపన్న దేశాలే బులెట్ రైల్ పథకాలు ఆర్థ్ధికంగా వెసులుబాటు కావని తిరస్కరిస్తూ ఉంటే భారత్ మాత్రం అహ్మదాబాద్ నుండి ముంబై వరకు నిర్మించడం పట్ల ఉత్సాహం చూపడం గమనిస్తుంటే ప్రభుత్వ ప్రాధాన్యతలు గాడి తప్పుతున్నట్లు భావించవలసి వస్తుంది. అందుకోసం రూ 1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నది . అందుకోసం వేలాదిమంది రైతులను నిరాశ్రయులను కావించడానికి సహితం వెనుకాడటం లేదు.
రైతులకు పెట్టుబడుల కోసం అంటూ కేంద్రం ఇస్తున్న సుమారు రూ 70,000 కోట్లతో పాటు ప్రతి రాష్ట్రం నుండి రూ 5,000 కోట్ల చొప్పున సేకరించి ఒక బృహత్తర ధరల స్థిరీకరణ సంస్థను ఏర్పాటు చేస్తే ధరలు పడిపోయి నప్పుడు రైతులను ఆదుకోవడానికి బ్రహ్మాండమైన వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కాగలదు. రైతులను దళారులు, వ్యాపారుల దోపిడీల నుండి కాపాడడానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు రైతుల ఆదాయం రెట్టింపు చేయడం సాధ్యం కాగలదు. రైతులను ఆర్థిక సహాయం కోసం చేతులు చాపే బిచ్చగాళలుగా చూడకండి. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఆత్మాభిమానం మెండుగా ఉన్న అరుదైన జాతిగా వారిని గుర్తించండి. వారి కష్టానికి తగిన ఫలితం లభించే వ్యవస్థలు ఏర్పాటు చేయండి. వారికి ప్రభుత్వం ధర్మాలు చేయవలసిన అవసరం ఉండదు.

- చలసాని నరేంద్ర