మనలో - మనం

మనలో మనం ( ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.వి.శివప్రసాదరావు, అద్దంకి, ప్రకాశం జిల్లా
ఐదు వందలు, వెయ్యి నోట్ల రద్దు పెద్ద మనుషులకు ముందే తెలుసని ప్రతిపక్షాల ఆరోపణ.
తమకు ముందే తెలియకపోయిందే అని అక్కసు.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
డొనాల్డ్ ట్రంప్‌ను మెజారిటీతో గెలిపించి ఆయన మాకొద్దని గొడవ చేయడమెందుకో?
గెలిపించిన వారు వేరు. గొడవ చేసేవారు వేరు...

రెండు వేల రూపాయల నోటు నీళ్లల్లో తడిపితే రంగుపోయి వెలిసిపోతే అది మంచినోటట. వెలవకుండా అలాగే ఫ్రెష్‌గా ఉంటే అది నకిలీదట. ఇదేమిటండి? రంగుపోతే చెల్లుతుందా?
అది పోయే రంగు కాదు.

కరుణాకర్ కొనె్న, లండన్
గురువుగారూ, ట్రంప్‌గారి గురించీ, అరమరికల అమెరికా గురించీ, మొన్న జరిగిన ఎన్నికల ఫలితాల మీదా, ప్రపంచం గ్లోబలైజేషన్ నుంచి క్రమంగా లోకలైజేషన్‌గా మారిపోవడం మీదా.. మీ నుంచి ఒక చిక్కని వ్యాసం ఆశించవచ్చా?
ఇప్పటికే అందరూ అన్నీ రాశారు. కొత్తగా రాయటానికి ఏమీ మిగలలేదు.

శ్రీనివాస్ ములుగూరి
గురువుగారు నమస్కారం. షాజహాన్ కన్నా వందల సంవత్సరాల ముందే తాజ్‌మహల్, తేజోమహల్ అనే పేరుతో విలసిల్లిన శివాలయం అని విన్నాను. నిజమేనా?
కాదు. అది హిందూ ప్రభువుల కోట.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
నల్లకుబేరులపై, దేశ విదేశాలలో గుట్టలు గుట్టలుగా పేరుకున్న నల్లధనంపై ప్రధాని మోదీ స్వతంత్రం వచ్చాక తొలిసారి కఠినాతి చర్యలు చేపట్టారన్నది నిర్వివాదాంశం. అయితే ఈ చర్యలను సమర్థించకుండా, ఇందులో దేశ ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చే అంశాలను వివరించకుండా, తాత్కాలికంగా ప్రజలకు ఎదురౌతున్న ఇబ్బందులను అదే పనిగా మీడియా హైలైట్ చేయడం ఎంతవరకు సమంజసం?
ఔను. కాని నాణేనికి రెండోవైపూ ఉంది.

గుండు రమణయ్య, పెద్దాపూర్
2000 నోటుతో సామాన్య ప్రజలకు లాభం ఉంటుందా?
చిల్లర దొరికితే అదే పదివేలు.

కర్ణాటకలో 2000 దొంగ నోటు పై మీ అభిప్రాయం?
అదే మన ప్రత్యేకత.

చోడవరపు నాగేశ్వరరావు, హైదరాబాద్
చెప్పేది వినకుండా, కళ్లతో చూడకుండా వితండవాదాలు అడ్డంగా చేసేవారికి కనువిప్పు ఎప్పుడు కలుగుతుందంటారు?
వారిని మించిన వితండవాది ఎదురైనప్పుడు.

ఎన్.ఆర్. సికిందరాబాద్
కాళహస్తి సిద్ధాంతిగారు హిల్లరి, ట్రంప్‌ల జాతకాలను పరిశీలించి ట్రంప్ విజయం అసాధ్యం అని సెలవిచ్చారు. మరిలా జరిగిందేమిటండి?
హిల్లరి విజయం అసాధ్యం అని సెలవిచ్చిన సిద్ధాంతులూ ఉన్నారు.

వై.శేషగిరిరావు, ధవళేశ్వరం
కాశ్మీర్‌లో 370 ఉంది కదా! అక్కడ ‘మోదీ రద్దు నోట్ల చట్టం’ చెల్లుతుందా? మనలాగే అక్కడ జనాలు కూడా ఎటిఎం ముందు ఖర్మకాలి దీనంగా ఏడుస్తూ నించుంటారా లేక రాళ్లతో కొడతారా?
రాళ్లు కొట్టటానికి డబ్బులిచ్చేవాళ్లు లేరు. (నకిలీ నోట్ల పరిశ్రమకు నడుం విరిగాక).

ఎం.కనకదుర్గ, తెనాలి
పలు రాష్ట్రాలలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం విద్యార్థులు మాతృభాషలలో మాట్లాడకపోతే జరిమానా విధిస్తున్నారట! మన గుంటూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలన్ని ఆంగ్ల మాధ్యమంలోనే నడవాలని విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. తల్లిదండ్రులు కూడా ఆంగ్లంలో తమ పిల్లలు మాట్లాడకపోతే వారి భవిష్యత్తు నట్టేట్లో కలిసిపోయినట్లు బాధపడిపోతున్నారని ప్రభుత్వం అంటోంది. ఏమిటండి మనకు ఈ ఖర్మ! ఆంగ్లం, ఫ్రెంచ్ వంటి పాశ్చాత్య భాషలు, హిందీ వంటి దేశీయ భాషల ప్రవాహంలో మాతృభాషలు కొట్టుకొనిపోవలసిందేనా?
మన ఖర్మకు మనమే కర్తలం.

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
క్రిస్టియానిటీ క్రైస్ట్‌లెస్ సొసైటీ అని చెప్తూ మరో వంక దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అడగటం సమంజసమేనా?
ఇచ్చేవాడున్నప్పుడు అడిగేవాడూ ఉంటాడు.

వెయ్యి నోట్ల స్థానే రెండు వేల నోటు ప్రవేశపెట్టినందువల్ల బ్లాక్‌మనీ ఇంకా పెరగదా?
ఆ నోటు ఎంతోకాలం ఉండదు.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
మోదీగారు స్వచ్ఛ భారత్‌ను బాగా నడిపిస్తున్నారని వెంకయ్య నాయుడుగారి ప్రశంస. నేతిబీరకాయలో నెయ్యిలాగే స్వచ్ఛ భారత్ ప్రకటనల్లోనూ, ఫొటోల్లోనూ కనబడ్తోంది గాని, రోడ్లు దుస్థితి, దోమల బెదడలో మార్పు రాదు సరికదా, అధ్వాన్నంగా తయారయ్యాయి. మరెందుకీ స్వచ్ఛ భారత్?
పబ్లిసిటీ కోసం.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com