మీకు మీరే డాక్టర్

కాయగూరలు - 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుమ్మడికాయతో హల్వా, పులుసు, కూర, పచ్చడి
ఎర్రగా బొద్దుగా నున్నగా ఉన్న మగపిల్లల్ని గుమ్మడికాయతో పోల్చే అలవాటు మనది. గుమ్మడేడే గోపదేవీ - గుమ్మడేడే కన్నతల్లీ! గుమ్మడిని పొడచూపగదవే - అమ్మ గోపెమ్మా ॥ అంటూ స్ర్తిల పాటల్లో కృష్ణుణ్ణి గుమ్మడిపండుతో పోలుస్తూ ఎన్నో గీతాలున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో ఎర్ర గుమ్మడికాయని సూరిగుమ్మడి అని కూడా పిలుస్తారు. నిజానికి ఇది పండుగానూ, కూరగాయగానూ రెండు విధాలుగా తినదగిన ఆహార ద్రవ్యం. బాగా పండిన ఎర్ర గుమ్మడి కరుమూజా పండులాగా రుచికరంగా ఉంటుంది. సలాదుల్లో వాడుకోదగినదే! బూడిద గుమ్మడిని కాయగూరగానూ, గుమ్మడి పండుని పండ్ల జాతికి చెందినదిగానూ మనం మరిచిపోయాం. గృహ ప్రవేశాలప్పుడు గుమ్మం దగ్గిర గుమ్మడి పండుని పగలకొడితే ఇంట్లోకి ఆఎన్ని ముక్కలు చిందుతూ వచ్చి పడతాయో అంత సంపద వస్తుందని మన నమ్మకం. కొన్ని జాతుల వారికి దానిమ్మ పండుని ఇలా పగలకొట్టే సంప్రదాయం ఉంది. ఇంతలా గౌరవించే గుమ్మడిపండుని తినటం ఎందుకు మరచిపోతున్నామో తెలీదు.
అతిగా తింటే వాతాన్ని పెంచుతుంది. అందుకని దీన్ని తినటానికి కొందరు భయపడతారు. కానీ వేడిని తగ్గించే గుణం ఉంది. బలకరం. దీన్ని ఎక్కువగా ముక్కల పులుసు (్ధప్పళం)లో ఎక్కువగా వేస్తుంటారు. తియ్యకూరగా చేస్తుంటారు. హల్వా కూడా చేసుకోవచ్చు. సొరకాయ మాదిరే అన్ని రకాలుగానూ దీన్ని వండుకోవచ్చు. ఇది కొద్దిగా కష్టంగా అరిగే పదార్థం. అందుకని దీన్ని తిన్న రోజున శొంఠిపొడి కలిపిన మజ్జిగ తాగితే ఎలాంటి ఇమ్బందీ కలిగించకుండా ఉంటుంది. దీన్లో కేరట్‌తో సమానమైన కెరటీనాయిడ్లు ఉన్నాయి. అందుకని పక్కన పెట్టదగిన ఆహార ద్రవ్యం ఎంత మాత్రమూ కాదు.
చమ్మకాయలు
ఈ కాయలు చిన్న బాకు ఆకారంలో ఉంటాయి. కాబట్టి ఖడ్గశింబ అని పిలుస్తారు. బీన్స్ జాతికి చెందిన పెద్ద కాయ. చిక్కుడుకన్నా పెద్దదిగా ఉంటుంది కాబట్టి దీన్ని స్థూలశింబి అని కూడా పిలుస్తారు. రుచికరంగా ఉండే ఈ కాయల్ని ఇప్పటి తరం వారు మరిచిపోయారు. ఎవ్వరైనా పెరట్లో పండించుకుంటే తప్ప దొరకని పరిస్థితి. వీర్యవృద్ధిని కలిగించే అద్భుతమైన ద్రవ్యం ఇది. సరదాగా అప్పుడప్పుడు తినవల్సిన ద్రవ్యం. అతిగా తింటే వాతం చేస్తుంది. శనగలు లాగానే అజీర్తిని కలిగించే స్వభావం ఉంది. ఇదొక్కటే ఇబ్బంది కలిగించే అంశం. జీర్ణశక్తి బాగానే ఉన్నప్పుడు తప్పనిసరిగా తినవలసిన పదార్థం.
ఓమన
చాలా లేతగా ఉండే చింతకాయల్ని ఓమన చింతకాయలు లేదా వామన చింతకాయలు అంటారు. ముదిరిన చింతకాయలకన్నా, చింతపండుకన్నా తేలికగా అరిగే ఆహార ద్రవ్యం. మామిడి వడపిందెల్లాగానే ఇవి కొద్దిగా పులుపు, వగరు రుచులతో కూడి ఉంటుంది. కందిపప్పుని ఉడికించి, ఓమన చింతకాయల్ని గింజతో సహా గుజ్జుగా చేసి కలిపి పప్పుగా వండుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు కూరగా కూడా వండుకుంటారు. జొన్నన్నం, అరికల అన్నం ఇలాంటివి తినేవారికి, జొన్న రొట్టెలు తినేవారికి, చపాతీ పుల్కాలు తినేవారికీ నంజుడుగా ఇది బావుంటుంది కూడా! అతిగా తింటే ఎసిడిటీ, అజీర్తీ కలుగుతాయి. వేడి శరీర తత్వం ఉన్నవారికి జలుబు చేసే గుణం వీటికుంది.
గోరుచిక్కుడు
గోరుచిక్కుడు, ఉలవలు ఇవన్నీ ఒకే జాతికి చెందిన మొక్కలే. గుణం రీత్యా కష్టంగా అరుగుతాయి. కానీ, ఎక్కువ శక్తిదాయకంగా పని చేస్తాయి.
గోరుచిక్కుళ్లని తేలికగా అరిగే పద్ధతిలో వండుకోగలగాలి. అప్పుడే ఎలాంటి అపకారం చేయకుండా పని చేస్తాయి. అసలే వేడి చేసే స్వభావం ఉన్న గోరుచిక్కుళ్లని చింతపండు రసం పోసి వండితే మరింత వేడి చేసేదిగా మారిపోతాయి. అతిగా అల్లం వెల్లుల్లి మసాలాలు పోసి వండినా ఇలానే వేడిచేసి ఇబ్బంది పెడుతుంది. ఇవి లేకుండా గోరుచిక్కుళ్లను వండుకుంటే ఇందులో ఉండే వగరు, చిరుచేదుల్ని మనం సద్వినియోగం చేసుకోగలిగిన వాళ్లం అవుతాం. షుగరు వ్యాధి ఉన్నవారికి ఇలా వండుకుంటే గోరుచిక్కుళ్లు బాగా ఉపయోగపడతాయి. షుగరు వ్యాధి త్వరగా తగ్గుతుంది. కొందరు చింతపండు రసం, బెల్లం కలిపి వండుతారు. అది షుగరు రోగులకు, కీళ్లవాత రోగులకూ, ఉబ్బసం రోగులకూ హానిచేసేదిగా ఉంటుంది.
తంగేడు
లేత తంగేడు కాయలతో కూర, పులుసు, పచ్చడి చేసుకోదగినవిగా ఉంటాయి. షుగరు రోగులకు ఈ కాయలు అమృతంతో సమానం. స్థూలకాయం ఉన్నవారిక్కూడా మేలు చేస్తాయి. మూత్రపిండాల జబ్బులతో బాధపడేవారికి, డయాలసిస్ మీద ఉన్నవారికి తంగేడు లేత కాయల్ని వండిపెడితే చాలా మార్పు కనిపిస్తుంది. చాలా రుచికరంగా ఉంటాయి. కడుపులో నులిపురుగుల్ని ఇవి పోగొడతాయి. విరేచనం ఫ్రీగా అయ్యేలా చేస్తాయి. మొలల వ్యాధితో బాధపడేవారికి ఇవి తింటే మేలు కలుగుతుంది. అతిమూత్రం ఆగుతుంది. రాత్రిపూట మూత్రానికి లేవటం తగ్గుతుంది. ప్రోస్టేట్ గ్రంథిలో వాపు ఉన్నవారిక్కూడా ఇవి పెట్టదగిన ఆహారం. ఇవేవీ లేనివారు కూడా లేత తంగేడు కాయల కూర తింటూ ఉంటే చాలా బలకరమైన ఆహార ఔషధంగా పని చేస్తాయి.
పనసపొట్టు
లేత పనస కాయల్లో ఆహార పీచు (డయటరీ ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. చేతికి నూనె రాసుకుని, చాకచక్యంగా పనసకాయల్ని కత్తితో కొట్టి సన్నని చిన్న ముక్కలుగా తరుగుతారు. దీనే్న పనసపొట్టు అంటారు. గోదావరి జిల్లాల వారికి ఈ పంట ఎక్కువ కావటాన అక్కడ పనసపొట్టు కూర విందు భోజనాల్లో తప్పనిసరిగా ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో చాలామందికి పనసపొట్టు తెలీదు.
వేడిని తగ్గిస్తుంది. బలాన్నిస్తుంది. వీర్యంలో జీవకణాలు పెరిగేలా చేస్తుంది. కష్టంగా అరుగుతుంది. అందువలన కఫ, వాత వ్యాధులున్న వారు జాగ్రత్తగా తినాలి. కొవ్వు పెరిగేలా చేస్తుంది. నీళ్లల్లో వేసి ఉడికించి వార్చి, ఆ నీటిని తీసేసిన కూరని కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించి వండుకుంటే మంచిది. వండేప్పుడు కొద్దిగా ఆవపిండి కలిపి వండితే తేలికగా అరుగుతుంది. కొందరు చింతపండుతో పులుసు కూరగా వండుకుంటారు.
నేతి బీరకాయలు
నేతి బీరకాయల్ని ఘృతకోశాతీ అంటారు. ఇది నేతి బీర అనే తెలుగు మాటకి చేసిన సంస్కృతానువాదం అంతే!
కోశాతకీ అంటే బీర, ఘృతకోశాతకీ అంటే నేతిబీర.
చలవ చేయటంలో దీన్ని మించిన ద్రవ్యం లేదు. దీని పువ్వుల్ని, కాయల్నీ కూరగానూ, పప్పుగానూ, పచ్చడిగానూ వండుకుంటారు. చక్రాల్లా తరిగి బజ్జీలు వేస్తుంటారు. చాలా రుచిగా ఉంటాయి. శనగపిండినే వాడాలని లేదు. గోధుమ పిండి, రాగిపిండి, జొన్న పిండితో కూడా వండుకోవచ్చు. వేడి శరీర తత్త్వం ఉన్నవారికి ఎక్కువ మేలు చేస్తాయి. వెంటనే శరీరంలో వేడి తగ్గుతుంది. కడుపులో ఎసిడిటీ తగ్గుతుంది. అల్సర్లు తగ్గుతాయి. జీర్ణకోశ వ్యాధు లన్నింటిలోనూ వీటికి మంచి ప్రభావం ఉంది. శరీరంలో విష లక్షణాలను వెళ్లగొట్టే పీచు కలిగిన ఆహార ద్రవ్యాల్లో ఇది నాణ్యమైన ద్రవ్యం. దొరికితే వదలకండి. తప్పనిసరిగా తినేందుకు ప్రయత్నించండి.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com