నల్గొండ

ఎమ్మెల్సీ ఎన్నికకు ‘తేరా’ నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*నేడు నామినేషన్ వేయనున్న రాజగోపాల్‌రెడ్డి
నల్లగొండ, డిసెంబర్ 7: నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం మరో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. టిఆర్‌ఎస్ అభ్యర్ధి తేరా చిన్నపరెడ్డి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జెసి వెంకట్రావుకు అందించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎంపికైన మాజీ ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తరుపునా నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. రాజగోపాల్‌రెడ్డి నేడు కాంగ్రెస్ శ్రేణుల ఊరేగింపుతో స్వయంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి పిసిసి చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్పీ నేత కె.జానారెడ్డి, ఎంపి గుత్తాతో పాటు పలువురు జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపికపై పిసిసి సాగించిన తాత్సర్యం కాంగ్రెస్ శ్రేణులను ఉత్కంఠతకు గురి చేసింది. పిసిసి నేత, పారిశ్రామిక వేత్త కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పేరును ఎమ్మెల్సీ టికెట్ రేసులో అధిష్టానం గట్టిగా పరిశీలించడం కూడా అభ్యర్ధి ఎవరన్నదానిపై ఆసక్తి రేపింది. అయితే టిఆర్‌ఎస్ పార్టీ ఫిరాయింపులను, క్యాంపు రాజకీయాలను తిప్పికొట్టాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో అధికార, ఆర్ధిక బలమున్న తేరా చిన్నపరెడ్డిని ఓడించేందుకు రాజకీయ, ఎన్నికల అనుభవం ఉన్న రాజగోపాల్‌రెడ్డి అభ్యర్ధిత్వం పట్ల కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది.
కెసిఆర్ పథకాలే గెలిపిస్తాయి : తేరా
ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసిన టిఆర్‌ఎస్ అభ్యర్ధి తేరా చిన్నపరెడ్డి విలేఖరులతో మాట్లాడుతు సీఎం కెసిఆర్ చేపట్టిన ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ప్రభుత్వ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు. ఈ నెల 9న మరోసారి పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్ వేస్తానన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం కెసిఆర్ చేస్తున్న కృషికి మద్ధతుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి డిండి ఎత్తిపోతల, వాటర్ గ్రిడ్, యాదాద్రి విద్యుత్ ఫ్లాంట్, యాదాద్రి దేవస్థానం అభివృద్ది వంటి అనేక అభివృద్ధి పథకాలు చేపట్టిందన్నారు. ఆసరా, కల్యాణలక్ష్మి, సన్న బియ్యం భోజనం వంటి 27వేల కోట్ల సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఎమ్మెల్సీగా తాను గెలుస్తానని గెలిచాక జిల్లా అభివృద్ధికి మరింత సేవ చేస్తానన్నారు.

కరవు బృందానికి సమస్యల ఏకరువు

తుర్కపల్లి, డిసెంబర్ 7 : మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర కరువు పరిశీలన బృందం ఉన్నతాధికారులతో సోమవారం మండలంలోని రుస్తాపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో వర్షాభావంతో ఎండిపోయిన పత్తి, కంది పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఎమ్మెల్యే గొంగిడి సునీతతో బృందం బ్రిజేష్ శ్రీ వాత్సవ, వెంకటేశ్వర్‌రావు, శ్రీనివాస్, వెంకటేశ్, కిషన్‌లు పాల్గొని రైతులతో మాట్లాడారు. మండలంలో గతంలో ఎన్నడు లేని విధంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, వర్షాలు పడతాయనే ఆశతో పంటలు వేసుకున్నామని, వర్షాలు పడక పంటలు ఎండిపోయి పెట్టిన పెట్టుబడులు రాలేదని బృందం సభ్యులతో రైతులు తమ ఆవేదనను వెలబుచ్చుకున్నారు. చెరువులు, కుంటలు, వ్యవసాయ బోరు, బావులు ఎండిపోయి తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. పశువులకు పశుగ్రాసం లేక ఇబ్బంది పడుతుందన్నారు. ఉపాధిహామీలో పనిదినాలను 200 రోజులకు పెంచాలని రైతులు కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం, ఫింఛన్ల ద్వారా జీవనోపాధి గడుపుతున్నామన్నారు. పంట నష్టపోయిన రైతులందరికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రైతులు తరుచుగా ఒక పంటపై ఆధారపడకుండా పంటల మార్పిడి చేసుకుంటూ, తక్కువ కాలంలో అధిక దిగుబడులు సాధించాలని బృందం సభ్యులు సూచించారు. ప్రధానంగా బృందం సభ్యులు, తాగు, సాగు, ఉపాధి, పశుగ్రాసం, ప్రజల జీవన శైలి తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, డ్వామా పిడి దామోదర్‌రెడ్డి, వ్యవసాయ శాక జెడి నర్సింహ్మరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రమణనాయక్, ఆర్డీవో మధుసూదన్, ఎడి మదన్‌కుమార్, తహశీల్దార్ నాగలక్ష్మి, ఎంపిడివో జలేందర్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం
ఆలేరు: ఆలేరు నియోజకవర్గ పరిధిలో కరువు తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకొస్తామని కేంద్ర కరువు పరిశీలన బృందం సభ్యులు వెంకటేశ్వర్‌రావు, శ్రీనివాస్, బ్రిజెష్ శ్రీ వాత్సావాలు తెలిపారు. సోమవారం నియోజకవర్గ పరిధిలో పలు మండలాలలో కరువు తీవ్రను అంచనా వేస్తూ మండల కేంద్రంలోని స్ధానిక రహాదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన కరువు తీవ్రత ఫోటో ఎగ్జీబిషన్‌ను వారు తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని కరువు తీవ్రతను కేంద్రం దృష్టికి నివేదిక రూపంలో అందిస్తామని, కరువు 7 మండలాలలో తీవ్రంగా ఉందని, తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, ఆర్డీవో మధుసూదన్, తహశీల్దార్ రాంమూర్తి, రెవెన్యూ సిబ్బంది, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బోదకాలు వ్యాధి నివారణకు
కృషి చేయాలి: జెసి
నల్లగొండ , డిసెంబర్ 7 : జిల్లాలో బోధకాలు నివారణకు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మాత్రలు పంపిణి చేసి బోధకాలు వ్యాధిని నివారించాలని జెసి వెంకట్రావ్ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 14న ప్రజలకు డిసి, ఆల్‌బెండాజోల్ మాత్రలు మిగించాలని, క్రిష్మస్ పురస్కరించుకొని ఈనెల 16న 1000మంది పేద క్రిష్టియన్లకు, అనాధ ఆశ్రమ నిరుపేదలందరికి బట్టల పంపిణి చేపట్టాలని, 19న విందు బోజనాలు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ హరితహరం కార్యక్రమం సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించామని, మొక్కల వివరాలను సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో డి ఆర్‌వో రవి, డి ఎంహెచ్‌వో భాన్‌ప్రసాద్ తదితరులు ఉన్నారు.

గ్రీవెన్స్ డేలో వినతుల వెల్లువ
నల్లగొండ , డిసెంబర్ 7 : జిల్లా నలుమూలల నుండి తమ సమస్యల పరిష్కారానికై కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతులు వెలువెత్తాయి. జిల్లాలోని వివిధ మండలాల నుండి ప్రజలు త్రాగునీటి సమస్య పరిష్కారానికై, వృద్ధాప్య, వికలాంగ, వితంతు ఫింఛన్లకై, ఆహార భద్రత కార్డులకై బారులుతీరి అధికారులకు విన్నవించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి మేటిరియల్స్, బిల్లులు అందలేదని, కరువు నష్టం అందించాలని, భర్త మృతి చెందడంతో ఇబ్బందులు పడుతున్నామని దేవరకొండ మండలం పెద్దతండాకు చెందిన కమిలిబాయ్ వినతిని అందజేసింది. ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజలు వినతులు అందించారు. మహాత్మాగాంధీ యూనివర్శీటీ పరిధిలో లా కళాశాల నడిపేందుకు పట్టణంలోని ఓ కళాశాలకు బార్ కౌన్సిల్ ఆప్ ఇండియా అనుమతిలేదని, ఇష్టారాజ్యంగా విద్యార్ధుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్ధి సంఘాల నాయకులు ఇందూరు సాగర్, కోట్ల అశోక్‌రెడ్డి, మురళీ కృష్ణ, ఏర్పుల శ్రవన్‌కుమార్, వేదవ్యాస్, మందడి సైదిరెడ్డి తదితరులు వినతిని అందజేశారు. సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపివేయాలంటూ పట్టణంలోని భారత్‌గ్యాస్ సమీపంలోని కాలనీవాసులు వినతి అందజేశారు.

సారా రహిత జిల్లాగా నల్లగొండ
* నేడు అధికారిక ప్రకటన
* ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనసూయదేవి
నల్లగొండ , డిసెంబర్ 7 : జిల్లాలో సారా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని, 95శాతంపైగా సారా అమ్మకాలు నియంత్రణలో ఉన్నాయని, సారా రహిత జిల్లాగా నల్లగొండ పేరు తెచ్చుకుంటుందని ఎక్సైజ్ శాఖ డిప్యూటి కమీషనర్ అనసూయదేవి అన్నారు. సోమవారం జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 1139 రెవెన్యూ గ్రామాలలో ఎక్కడైనా సారా విక్రయాలు జరిగితే తమ దృష్టికి తీసుకరావాలన్నారు. ఇప్పటికే పిడియాక్ట్ కింద 4కేసులు నమోదు చేశామని, నల్లబెల్లంపై ఒక కేసు, సారాతయారీపై 3కేసులు నమోదు అయ్యాయని, జిల్లాలో 2423 బైండోవర్ కేసులు నమోద్ చేశామన్నారు. జిల్లాలో 31మందిని అరెస్ట్ చేశామని, వీరి నుండి 5లక్షల 35వేల రూపాయలు జరిమాన విధించామని రెండవసారి పట్టుబడితే 1లక్ష రూపాయల జరిమాన ఉంటుందని, మరల సారాను విక్రయిస్తే సంవత్సరంపాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 1211 కేసులు నమోదు చేసి, 801మందిని అరెస్ట్ చేశామన్నారు. పోలీస్, రెవెన్యూ సమన్వయ సహాకారంతో జిల్లాను సారారహిత జిల్లాగా చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమీషనర్ సురేష్‌రాథోడ్, డి ఈ ఐ శ్రీనివాస్, సి ఐ దత్తురాజ్‌గౌడ్‌లు పాల్గొన్నారు.

ఘనంగా సాయుధ దళాల పతాక దినోత్సవం
నల్లగొండ , డిసెంబర్ 7 : సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో మాజీ సైనిక సంక్షేమం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీని జెసి వెంకట్రావ్, ఎస్పీ విక్రమ్‌జిత్‌దుగ్గల్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా సైనిక సంక్షేమం సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంది పాపిరెడ్డి, కొల్లోజు వెంకటాచారిలు మాట్లాడుతూ 1965లో యుద్దం జరిగి నేటికి 50సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ పూర్తి అయ్యిందని, ఈ యుద్దంలో వీరోచితంగా పోరాడి ఉద్యోగ విరమణ పొందిన వారిని సన్మానించడం తమ కర్తవ్యం అన్నారు. మాజీ సైనికుల సమస్యలపై ముఖ్యమంత్రి కెసి ఆర్‌ను కలవగా 3వేల ఫింఛన్‌ను 6వేలకు పెంచడం హార్షనీయమన్నారు. అదే విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తామని చెప్పారన్నారు. ప్రభుత్వం రిటైర్డ్ సైనికులకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధలలో 5శాతం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సైనిక ఉద్యోగులకు భూములు కేటాయించాలని, కొన్ని చోట్ల కేటాయించిన రెవెన్యూ అధికారుల అసమర్ధత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఏలాంటి ఇబ్బందులు లేకుండా స్థలాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మాజీ సైనికులను సన్మానించారు. అదే విధంగా మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్‌రెడ్డి, ఇంద్రయ్య, సత్యనారాయణరెడ్డి, మారయ్య, శ్రీనివాస్‌రెడ్డి, కేశవరావు, కృష్ణారెడ్డి, ఉదయ్‌సింగ్, చినవెంకట్‌రెడ్డి, యాదగిరి, మహ్మద్‌అలీ, మురళీధర్‌రావు, అనితాశర్మ, హశీం, నర్సింహ్మ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మిషన్ ఇంద్రధనుష్‌పై పరిశీలన
తిప్పర్తి, డిసెంబర్ 7 : ప్రాంణాంతకమైన వ్యాధుల నుండి రక్షించే వ్యాధి నిరోధక టీకాలను ప్రతి చిన్నారికి తప్పకుండా వేయించాలని ఇంద్రధనుష్ ప్రోగ్రాం అధికారి విశ్వశాంతి సూచించారు. మండల కేంద్రంలో సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా పరిశీలించి మాట్లాడారు. తిప్పర్తి పరిధిలోని బిసి కాలనీ, నూకలవారిగూడెం, అంగన్‌వాడీ కేంద్రాల రిజిష్టర్‌ను, పిల్లల హాజరును గమనించారు. మండలంలో మిషన్ ఇంద్రధనుష్ అమలు చేస్తున్న తీరుతెన్నులను ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికి ఇంకా 37మంది చిన్నారులు వ్యాధి నిరోధక టీకాలను వేయించుకోకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతి, సిహెచ్‌వో చంద్రయ్య పాల్గొన్నారు.

బస్టాండ్‌లో కమిషన్ మర్చంట్
బ్యాగు నుండి 8.47లక్షలు మాయం
మిర్యాలగూడ , డిసెంబర్ 7: పట్టణంలోని ఆర్టీసి బస్టాండ్‌లో హాలియా వెళ్లేందుకు బస్సు ఎక్కిన తన బ్యాగులో నుండి 8.47 లక్షల రూపాయలు మాయమయినట్టు ప్రయాణీకుడు, కమీషన్ మర్చంట్ మునగాల చక్రవర్ధన్ సోమవారం సాయంత్రం టూటౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కోదాడకు చెందిన కమీషన్ మర్చంట్ చక్రవర్ధన్ ధాన్యం సంబంధించిన డబ్బులు రైస్‌మిల్లర్ రేపాల లక్ష్మికాంతం మిల్లు నుండి సుమారు 8,47,045 రూపాయలు తీసుకుని తన బ్యాగులో వేసుకుని సాయంత్రం 4 గంటలకు ఆటోలో బస్టాండ్‌కు వచ్చాడు. బస్టాండ్ సమీపంలోని హోటల్‌లో భోజనం చేసి హాలియా వెళ్లేందుకు బస్సు ఎక్కి కూర్చున్న అనంతరం బ్యాగు జిప్ తెరచి ఉండటం గమనించి చూడగా అందులో పెట్టిన డబ్బులు మాయమైనట్టు పోలీసులకు తెలిపారు. భోజనం చేసే సమయంలో డబ్బులున్నాయని, బస్సు ఎక్కే సమయంలోనే ఎవరో తీసి ఉంటారని అనుమానాన్ని వ్యక్తం చేశాడు. టూటౌన్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ కె.పాండురంగారెడ్డి తన దర్యాప్తు బృందాలను రంగంలోకి పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.

‘ఎంపిటిసిల ఫోరం అభ్యర్థులనే గెలిపించాలి’
నల్లగొండ , డిసెంబర్ 7 : స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న ఎంపిటిసిల ఫోరం ప్రకటించిన అభ్యర్ధులనే గెలిపించాలని, తద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు మిట్ట పురుషోత్తం అన్నారు. సోమవారం స్దానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపిటిసిలకు గౌరవ వేతనం చెల్లిచడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని, ఎంపిటిసిలకు నిధులు కేటాయించకపోవడం వల్ల స్ధానిక ప్రజలలో గుర్తింపు లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ జ్యోతి కమిటీలో చోటు దక్కకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లాలో 835 మంది ఎంపిటిసిలు ఉన్నారని, పార్టీలు తమను ఉత్సవ విగ్రహాలుగా చూస్తూ ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వడంలేదన్నారు. పార్టీలకతీతంగా ఎంపిటిసిలైన స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు తమ ఆత్మ ప్రభోదం మేరకే జిల్లాలోని ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, కౌన్సిలర్లు ఓట్లు వేసి గెలిపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.