నల్గొండ

గడువులోగా మిషన్ భగీరథ పూర్తి కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 23: జిల్లాలో మిషన్ భగీరథ పథకం పనులు నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. బుధవారం ఆయన ఆలేరు ప్రాంతానికి మిషన్ భగీరథ పథకం కింద కృష్ణా మంచినీటిని అందించే పానగల్ ఉదయ సముద్రం చెరువులో నిర్మాణంలో ఉన్న పంపింగ్ స్టేషన్ పనులను పరిశీలించారు. అనంతరం ఫ్లోరైడ్ పీడిత 600గ్రామాలకు, నల్లగొండ మున్సిపాల్టీకి కృష్ణా రక్షిత తాగుజలాలు అందిస్తున్న ఉదయ సముద్రం నీటి శుద్ధి కేంద్రాన్ని తనిఖీ చేసి నీటి శుద్ధికి తీసుకుంటున్న చర్యలను తనిఖీ చేసి క్లోరినేషన్ చేస్తున్న ప్రక్రియను పరిశీలించి స్వయంగా నీటిని తాగి పరిశీలించారు. అక్కడి నుండి కట్టంగూర్ ఎన్టీఆర్ కాలనీ, చెర్వు అన్నారం ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను, నిర్మాణంలో ఉన్న మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్న మిషన్ భగీరథ పనులకు నిధుల కొరత లేనందునా పనులు సకాలంలో పూర్తి చేసి ఈ డిసెంబర్ నాటికి లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతాలకు మంచినీటి సరఫరా జరిగేలా చూడాలన్నారు. ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు నాణ్యత ప్రమాణాల మేరకు నీటిని శుద్ధి చేసి కృష్ణా రక్షిత మంచినీటి ప్రజలకు సక్రమంగా అందించాలన్నారు. క్లోరినేషన్ చేయడంలో ప్రామాణికత మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ పాపరావుతో పాటు ఇతర అధికారులు ఉన్నారు.
రేవంత్‌పై రమణ, బాబుకు బిల్యా ఫిర్యాదు
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, నవంబర్ 23: నల్లగొండ రైతు పోరుయాత్ర సభకు అధ్యక్ష బాధ్యతలను జిల్లా పార్టీ అధ్యక్షుడైన తనకు కాకుండా, పార్టీ నల్లగొండ అసెంబ్లీ ఇంచార్జీ కంచర్ల భూపాల్‌రెడ్డికి అప్పగించడంపై కె.బిల్యానాయక్ బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణకు రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. పోరుయాత్ర సందర్భంగా తనకు ప్రాధాన్యతనివ్వకుండా రేవంత్‌రెడ్డి అనుచితంగా ప్రవర్తించాడని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బిల్యా కోరారు. రేవంత్ తీరుపై గురువారం చంద్రబాబుకు సైతం ఫిర్యాదు చేసేందుకు మోత్కుపల్లి వర్గీయులతో కలసి బిల్యా సిద్దమవుతున్నారు.
గ్యాంగ్‌స్టర్ నరుూం కేసు..
ఐదుగురు నిందితులపై చార్జ్జిషీట్
మిర్యాలగూడ టౌన్, నవంబర్ 23: మిర్యాలగూడ ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మూడు గ్యాంగ్‌స్టర్ నరుూం కేసుల్లో ఒక కేసులో ఐదుగురు నిందితులపై చార్జీషీటును ఒన్‌టౌన్ పోలీసులు స్థానిక జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశారు. నిందితులైన నరుూం అత్తా సుల్తానాబేగం, నరుూం భార్య హసీనా, నరుూం అక్క సలీమా, బావమరది సాదిక్, సాదిక్‌భార్య ఫర్జానాలపై చార్జీషీటు దాఖలు చేశామని ఒన్‌టౌన్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ డి.బిక్షపతి తెలిపారు. ఈ కేసులో నరుూం కూడ నిందితుడేనని చనిపోయాడు కాబట్టి చార్జీషీటు లేదని ఆయన అన్నారు.
ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం
* త్వరలో జిల్లాస్థాయి షటిల్ పోటీల నిర్వహణ
* ఎంపికైన క్రీడాకారులకు గోపీచంద్ అకాడమీలో శిక్షణ
* పేట కలెక్టర్ సురేంద్రమోహన్
సూర్యాపేట, నవంబర్ 23: ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కళాశాలలో రూ. 70లక్షల వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియంలో షటిల్, టేబుల్ టెన్సిస్ కోర్డులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ త్వరలో జిల్లాలో బాలుర, బాలికల షటిల్ పోటీలు నిర్వహించి ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులకు గోపిచంద్ అకాడమిలో శిక్షణ ఇప్పించనున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారిని ఒలంపిక్స్‌స్థాయికి తీర్చిదిద్దాలన్నారు. ఆధునిక సదుపాయాలతో కళాశాలలో నిర్మించిన ఇండోర్ స్డేడియం జిల్లాకేంద్రంగా ఎదిగిన సూర్యాపేట ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని చెప్పారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పచుకొని లక్ష్యసాధనకు సమగ్ర కార్యచరణ ప్రణాళికతో ముందుకు సాగితే ఎంచుకున్న రంగంలో విజయం సాధించవచ్చునన్నారు. 1985లో సర్వేల్ పాఠశాలలో తాను చదువుకుంటున్న రోజుల్లో పాఠశాలకు చెందిన కలెక్టర్‌ను చూసి తాను కలెక్టర్ కావాలన్న లక్ష్యన్ని ఏర్పచుకొని పట్టుదలతో చదివి ఈ స్థాయికి చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజి యూనివర్సిటి వైస్‌చాన్స్‌లర్ ఖాల్త్ఫా ఉస్సేన్, కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రాచారి, జిల్లా బ్యాడ్‌మెంటన్ కార్యదర్శి రాంచందర్‌రావు, ఉస్మానీయా పట్ట్భద్రుల సంఘం అధ్యక్షుడు హరినాధ్‌రెడ్డి, వైస్ చైర్మన్ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి
* అధికారులకు కలెక్టర్ ఆదేశం
కట్టంగూర్, నవంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి స్వచ్చమైన మంచినీటిని అందించే లక్ష్యంతో ప్రారంభించిన మిషన్ భగీరథ పనులను జిల్లాలో నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. బుధవారం మండలపరిధిలోని అయిటిపాముల రిజర్వాయర్ వద్ద నిర్మిస్తున్న ఓవర్‌హెడ్ ట్యాంక్, సంపుల నిర్మాణ పనులను పరిశీలించారు. అదే విధంగా ఎన్టీ ఆర్‌నగర్ వద్ద జరుగుతున్న పైపులైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మానసపుత్రికగా భావిస్తున్న ఈ పథకం పనుల్లో జాప్యంచేస్తే ఇంత మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.
నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తిచేసేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. పైపులైన్ల నిర్మాణ పనుల్లో సమస్యలు ఉత్పన్నమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి సత్వరమే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ పాపారావు, కట్టంగూర్ ఎంపిడివో గోనె మోహన్‌రావు, తహశీల్దార్ ప్రమీళలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ప్రమాదాల నివారణకు ఆర్ట్ ఏర్పాటు
* ఎస్పీ పరిమళ వెల్లడి
సూర్యాపేట, నవంబర్ 23: జిల్లాపరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు యాక్సిడెంట్ రెజల్యూషన్ టీమ్( ఆర్ట్)ను ఏర్పాటుచేసినట్లు సూర్యాపేట ఎస్పి పరిమళ హనానూతన్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఆర్ట్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని రహదారులపై ప్రమాదాలను ఆరికట్టడంతో పాటు ఒకసారి ప్రమాదాలు జరిగిన చోట మరోసారి ప్రమాదాలు జరగకుండా నివారించే లక్ష్యంతో ఈ కమిటీని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో పోలీస్, ఆర్ అండ్‌బి, పంచాయితీరాజ్, మున్సిపల్ అధికారులు, రవాణా, ఆర్టీసీ, జాతీయ రహదారి నిర్వాహణ బాధ్యతను పర్యవేక్షిస్తున్న జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారన్నారు. ఈ బృందం రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే ప్రమాద స్థలికి వెళ్లి ప్రమాదం జరిగేందుకు గల కారణాలను తెలుసుకొని ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు నివారించేలా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పి గంగారామ్, డిఎస్పి సునీతామోహన్, పిఆర్ ఈఈ మనోహన్, ఆర్‌అండ్‌బీ డిఈ మహిపాల్‌రెడ్డి, ఎంవీఐ కొండయ్య, జిఎంఆర్ మేనేజర్ శ్రీ్ధర్‌రెడ్డిలతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్ర ఏజెంట్ రేవంత్
* వచ్చే ఎన్నికల్లో టిడిపికి డిపాజిట్లు దక్కవు
నల్లగొండ టౌన్, నవంబర్ 23: చంద్రబాబుకు, ఆంధ్ర రాష్ట్రానికి ఏజెంట్‌గా పనిచేస్తు తెలంగాణ రైతుల సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తున్న రేవంత్‌రెడ్డి కపటనాటకం తెలంగాణలో సాగబోదని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. బుధవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు నల్లగొండ రైతు పోరు సభలో మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బ్రదర్స్‌ను చెల్లని రూపాయినోట్లు అంటు రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలను చిరుమర్తి తీవ్రంగా ఖండించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన జైలుకెళ్లిన దొంగ రేవంత్‌రెడ్డి తెలంగాణకోసం పదవీ త్యాగం చేసి ఆమరణ దీక్ష చేసిన కోమటిరెడ్డిని విమర్శించే అర్హత ఎక్కడిదన్నారు. చెల్లని రూపాయి ఎవరో ఓటుకు నోటు కేసులో ప్రజలందరికి తెలిసిపోగా నయాపైసాకు కూడా పనికిరాకుండా పోయిన చరిత్ర రేవంత్‌రెడ్డి విస్మరించడం సిగ్గుచేటన్నారు. రోజంతా కెసిఆర్‌పై తొడగొడుతు రాత్రిల్లు కెసిఆర్, హరీష్‌రావుల కాళ్లు పట్టుకుంటు మోసపూరిత రాజకీయాలు సాగిస్తున్న రేవంత్‌ను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చే డబ్బులతో తెలంగాణలో దొంగ రాజకీయం సాగిస్తున్న రేవంత్‌రెడ్డి పిచ్చిప్రేలాపనలు మానకపోతే తగిన గుణపాఠం తప్పదన్నారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా అభివృద్ధికి వేలకోట్ల పనులు జరిపించిన కోమటిరెడ్డిని విమర్శించే స్థాయి రేవంత్‌కు లేదన్నారు. 50లక్షలు ఖర్చు చేసి రైతుపోరుయాత్ర సభ పెట్టి టిడిపికి బలం పెరిగిందంటు సంకలు గుద్ధుకోవడం టిడిపి నేతల అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కార్పోరేట్ వ్యాపారుల దగ్గర వసూళ్లు సాగిస్తు రాజకీయాలు చేస్తున్న రేవంత్‌రెడ్డి భవిష్యత్‌లో రాజకీయ పిచ్చోడిగా మారడం ఖాయమన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి పార్టీ మరింత దిగజారిపోయిన డిపాజిట్లు కూడా దక్కని దుస్థితి తప్పదన్నారు. ఈ సమావేశంలో డిసిసి నాయకులు కటికం సత్తయ్యగౌడ్, డిసిసిబి డైరక్టర్ సంపత్‌రెడ్డి, మాజీ జడ్పీటీసి గుమ్మల మోహన్‌రెడ్డి, జడ్పీటీసి శ్రీనివాస్, సత్తయ్యయాదవ్, కత్తుల కోటి, జూకురి రమేష్, సమీ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిష్టాత్మకంగా పెద్దగట్టు జాతర
* కలెక్టర్ సురేంద్రమోహన్
సూర్యాపేట, నవంబర్ 23: సూర్యాపేట జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా జరగనున్న దురాజ్‌పల్లి శ్రీలింగమంతులస్వామి పెద్దగట్టు జాతరను యాదవుల సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ తెలిపారు. బుధవారం చివ్వెంల మండలపరిధిలోని దురాజ్‌పల్లి పెద్దగట్టును సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలను జాతర జరిగే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది నిర్వహించిన జాతరకు 30లక్షల మంది భక్తులు వచ్చారని ఈసారి జాతరకు 40లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనాతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లుచేయనున్నట్లు తెలిపారు. దేవాలయానికి 16.30 ఎకరాల భూమి ఉందని అట్టి భూమి కొంత అన్యక్రాంతమైన్నందున మొత్తం భూమిని కొలతలు వేసి రక్షించే విధంగా చర్యలు చేపట్టాలని చివ్వెంల తహశీల్దార్‌ను ఆదేశించారు. దేవాలయానికి సమీపంలో 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నందున అట్టి భూమిలో ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు అంచనాలు రూపొందించాలని పంచాయితీరాజ్ అధికారులను ఆదేశించారు. మాగమాసం మొదటి ఆదివారం రోజు జాతర ప్రారంభం అవుతుందని జాతర తేదీల నిర్వాహణలపై యాదగిరిగుట్ట పుజార్లను పిలిపించి ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో ఉన్న వ్యర్ధాలను తొలగించి పరిశుభ్రం చేయాలని ఈవోను ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు గాను చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేయాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. కోనేరులో ఉన్న నీరు అపరిశుభ్రంగా ఉన్నందున ఆ నీటిని తొలగించి పరిశుభ్రమైన నీటితో నింపాలని, కోనేరు చుట్టు పెన్సింగ్ వేయించాలని ఆలయ ఈవోకు సూచించారు. మన రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షాలది మంది భక్తులు తరలిరానున్నందున వారి ఎలాంటి ఇబ్బందులకు గురికుండా పకడ్భందిగా ఏర్పాట్లు చేపట్టాలని కోరారు.
సంక్షేమ పథకాలను
నీరుగార్చడానికే పెద్ద నోట్ల రద్దు
* డిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్
ఆత్మకూర్( ఎం), నవంబర్ 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను నీరు గార్చడానికే 500, 1000 నోట్లను రద్దు చేసిందని కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసి ఆర్ నల్లధనం విడిపించుకోవడానికే నరేంద్ర మోడీ వద్ద చర్చ జరిపాడని ఆయన ఆరోపించారు. ప్రధానిని కలిసిన విషయం ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ 500,1000 నోట్లు మార్చడం పట్ల కొత్త నోట్లు, చిల్లర విషయంలో ప్రజలు నానాతంటాలు పడుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్దితో పేద, మధ్య తరగతి వర్గాలకు హానీ కలుగకుండా చూడాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దును రహస్యంగా చేయడం పట్ల కేసి ఆర్ సంక్షేమ పథకాలను నిలిపివేయడం జరుగుతుందని ఆయన ఆరోపించారు. పండగలు, పబ్బాలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇవ్వలేక డబ్బు లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టులను మేధావులు వ్యతిరేకిస్తుంటే ఇప్పుడున్న ప్రాజెక్టులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పజెప్పి కమీషన్ల కోసం ఆంధ్రా పాలకులకు ఇవ్వడం పట్ల ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు అండగా ఉండి సమస్యల పరిష్కారానికి పోరాడుతామన్నారు.