నల్గొండ

పేటకు నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 1: జిల్లాకేంద్రంగా మారి న సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్దికి సహకరిస్తానని, వివిధ అభివృద్ది పనులు చేపట్టేందుకు అధిక నిధులు మంజూరీ చేసేందుకు కృషిచేస్తానని రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ అభివృద్దికి అవసరమైన ఆర్ధిక వనరులు సమకూర్చాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుం టకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక గురువారం హైదరాబాద్‌లో మంత్రి కెటి ఆర్‌ను కలిశారు. ఈ సందర్బంగా మున్సిపాలిటీ అభివృద్దికి చేపట్టాల్సిన చర్యలు, కార్యక్రమాలు, కావాల్సిన నిధులపై మంత్రి కెటిఆర్‌తో చర్చించారు. ఇప్పటికే వ్యాపార, పారిశ్రామికంగా, విద్యాపరంగా అభివృద్ది చెందిన పట్టణం జిల్లాకేంద్రంగా మారడంతో అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన అభివృద్ది ప్రణాళికలను మంత్రి కి వివరించారు. పట్టణంలో మహాప్రస్థానం స్మశాన వాటిక నిర్మాణానికి రూ.2.99కోట్లు నూతన మున్సిపల్ భవన నిర్మాణానికి రూ.2.48కోట్లు, మంజూరీ చేయాలని, అదే విధంగా పారిశుధ్య, నీటి సరఫరా విభాగంలో అధనంగా సిబ్బందిని నియమించేందుకు ఆదేశాలు ఇవ్వాలని, మున్సిపాలిటీకి అధనంగా శానిటరి ఇన్స్‌స్పెక్టర్, ఆర్‌ఐ పోస్టులను మం జూరీచేయాలని, మెయిన్‌రోడ్డు, ఎంజీ రోడ్డు, కూరగాయాల మార్కెట్ రోడ్డులను విస్తరించేందుకు నిధులు మంజూరీచేయడంతో పాటు సంబంధిత శాఖల నుండి అనుమతులు ఇప్పించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన పురపాలక మంత్రి సూర్యాపేట పట్టణాభివృద్ది కోసం అన్ని విధాలుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చా రు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ పట్టణాభివృద్దికి సహకరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి కెటిఆర్, ప్రత్యేక చొరవ చూపిన విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

అమ్మా నన్ను అమ్మకే..
దేవరకొండ, డిసెంబర్ 1: దేవరకొం డ నియోజకవర్గంలో అప్రతిహాతంగా కొనసాగుతున్న అడపిల్లల అమ్మకాలు, భ్రూణహత్యలు, అనాధలుగా శిశుగృహకు అప్పగించడం లాంటి సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తుండడంతో గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చే లక్ష్యంతో జనమైత్రి పోలీస్‌లో భాగంగా గురువారం దేవరకొండలోని జడ్పీ బాలుర ఉన్నతపాఠశాల ఆవరణలో నిర్వహించిన అమ్మా నన్ను అమ్మకే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, జిల్లా పరిషత్‌చైర్మెన్ బాలూనాయక్‌లు పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మానవులు అన్ని విధాల అభివృద్ధి లోకి వచ్చినా ఆడ పిల్లల పట్ల సమాజంలో ఇంకావివక్ష చూపడం అనైతిక చర్యగా జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్ప ల్ అభివర్ణించారు. దేవరకొండ నియోజకవర్గంలో అత్యధికంగా వెలుగులోకి వస్తున్న ఆడపిల్లల అమ్మకాలు, హత్య లు, అనాధలుగా శిశుగృహల్లో వదలడం లాంటివి పునరావృతం కాకుండా గిరిజనుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో జనమైత్రి పోలీస్ లో భాగంగా గురువారం దేవరకొండ పట్టణం లోని జడ్పీ బాలుర ఉన్నతపాఠశాలలో నిర్వహించిన అమ్మానన్ను అమ్మకే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, జడ్పీ చైర్మెన్ బాలూనాయక్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ తాను జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంరతం జిల్లా సమస్యలపై పలువురు ప్రజాప్రతినిధులను కలవగా దాదాపు అందరూ దేవరకొండ నియోజకవర్గంలో జరుగుతున్న శిశువిక్రయాలు, శిశు హత్యలు, ఆడపిల్లలను అనాధలుగా శిశుగృహల్లో వదులుతున్న విషయానే్న ప్రధాన సమస్యగా చెప్పారని అన్నారు. దీంతో ఇలాంటి విషసంస్కృతిని ఎలాగైనా పారదోలాలన్న లక్ష్యం తోనే మా ఇంటి మహాలక్ష్మి పేరుతో జిల్లాలో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. లింగ వివక్షత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి అమ్మా నన్ను అమ్మకే పేరుతో పోలీస్‌శాఖ అధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల కలెక్టర్ ఉప్పల్ ఎస్పీ ప్రకాశ్‌రెడ్డిని అభినందించారు. ఆడ, మగ నిష్పత్తి లో తేడా ఎక్కువగా ఉండడం వల్ల ఇది సమాజంలో పలు అనర్ధాలకు దారి తీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడ అయినా మగ అయినా తేడా లేదని ఆడపిల్లను చదివిస్తే వారు కూడా అన్ని రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఆడపిల్లలకు ఉచితంగా విద్య, వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం అనేక పధకాలను ఏర్పాటు చేసిందని కలెక్టర్ ఉప్పల్ చెప్పారు.
జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ బీహార్‌లో ఒక గ్రామంలో ఆడపిల్లలు అనే వారే లేకపోవడంతో ఆ గ్రామం చాలా దుర్భర పరిస్ధితులు ఎదుర్కొంటుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను అందిస్తే ఆడపిల్ల అయినా మగ పిల్లవాడైనా ఉన్నత స్ధాయికి ఎదుగుతారని అన్నారు. దేశాన్ని పాలించిన ఇందిరాగాంధీ, క్రీడాకారులు పివి సింధూ, నైనా సెహ్వాల్, సానియామీర్జా లాంటి వారు దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారన్నారు. సంక్షేమ హాస్టల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న మూడావత్ పూర్ణ అనే విద్యార్ధిని వౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించి ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టను మరింత పెంచిందన్నారు. అబార్షన్‌లు చేయకుండా రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులు తమ బాధ్యతలను గుర్తెరిగా ప్రవర్తించాలని కోరారు. ఐదు వారాల గర్భం దాటితే వైద్య కారణాలతో అబార్షన్ చేయాల్సి వస్తే టీం ఆఫ్ డాక్టర్స్ సూచనల మేరకే అబార్షన్ చేయాలని కాని కొంత మంది వైద్యులు ఇలాంటి నిబంధనలను పాటించకుండా అనైతికంగా అబార్షన్‌లకు పాల్పడుతున్నారని ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా అబార్షన్‌లు చేసే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆడపిల్లలు, మహిళలపై వేదింపులకు పాల్పడే పోకిరీల పీచమనచడానికి షీటీమ్స్ పని చేస్తున్నాయని చెప్పారు. జనమైత్రి పోలీస్ కార్యక్రమంలో భాగంగా త్వరలో మహిళలకు ఆర్ధికంగా ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతామని ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు.
నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆడపిల్ల లేనిదే అమ్మ లేనిదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తే మంచిదన్నారు. అమ్మ లేనిదే నేను లేను, మీరు లేరు అన్నారు. ఆడపిల్లలు పుడితే వారిని సాకడం భారంగా భావించే అలోచన గిరిజనుల్లో ఎక్కువగా ఉందన్నారు. వీరిలో ఈ ఆలోచనను దూరం చేసేందుకు గిరిజనుల్లో ఉన్న అనుమానాలను దూరం చేసేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అమ్మానన్ను అమ్మకే లాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయం అన్నారు. రాష్ట్రంలో చందంపేట మండలంలో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉందన్నారు. ఇక్కడ కేవలం 45 శాతం అక్షరాస్యత నమోదై ఉందన్నారు. ఆ మండలంలో 220 టీచర్ పోస్ట్‌లకు గాను 180 పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయంటే ఆ మండలంలో పరిస్ధితులు ఎలా ఉన్నాయో అర్ధం అవుతోందన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌లు కల్పించడం వల్ల మహిళలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభివృద్ధి లోకి వచ్చారన్నారు.
ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ ఆడపిల్లలను చంపడం, అమ్మడం లాంటి ఘటనలు దేవరకొండ నియోజకవర్గం లోనే జరుగుతున్నాయని ప్రచారం లోకి రావడం నిజంగా బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వెలుగులోకి వస్తున్నా 1995 సంవత్సరంలో తొలి సారి ఆడపిల్లలను దత్తత పేరుతో ఇతరులకు అప్పగించడం లాంటి ఘటన చందంపేట మండలంలో వెలుగులోకి రావడంతో నియోజకవర్గానికి చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక గిరిజనులను మోసం చేస్తున్న దళారులు దత్తత ఇస్తే మీ పిల్ల ఆనందంగా ఉంటుందని మాయమాటలు చెప్పి ఇతరులకు అప్పగిస్తున్నారని ఈ పిల్లలు ఏమవుతున్నారన్న విషయాన్ని తల్లిదండ్రులు ఆలోచిస్తే బాగుంటుందన్నారు. అధికసంతానంతో బాధ పడుతున్న వారు తమ పిల్లలను దత్తత ఇవ్వాలనుకుంటే చట్ట ప్రకారమే దత్తత ఇవ్వాలే తప్ప దళారులకు అప్పగించవద్దన్నారు. ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షతను రూపుమాపేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని రూపొందించడం పట్ట సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్‌చైర్మెన్ బాలూనాయక్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల కాలంలో వెనుకబడ్డ నియోజకవర్గంగా పేరుపడ్డ దేవరకొండ ప్రస్తుతం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందన్నారు. డిండి ఎత్తిపోతల పధకం పూర్తయి నియోజకవర్గానికి సాగునీరు అందితే ఇలాంటి దురాచారాలు కనిపించకుండా పోయే అవకాశం ఉందన్నారు. ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఆర్ధిక సమస్యల కారణం గానే గిరిజనులు ఆడపిల్లలను అమ్మడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కొంత మంది చేసే ఇలాంటి పనుల వల్ల మొత్తం గిరిజన జాతే అవమానాలకు గురి కావాల్సి వస్తోందని జిల్లా పరిషత్ చైర్మెన్ బాలూనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడి ఎస్ పిడి పుష్పలత, డి ఎస్పీ చంద్రమోహన్, డి ఈ వో చంద్రమోహన్, జడ్పీటీసి ఆలంపల్లి నర్సింహ్మ, నగరపంచాయతి చైర్మెన్ కేతావత్ మంజ్యానాయక్, ఎంపిపి మేకల శ్రీనివాస్‌యాదవ్, వైస్ ఎంపిపి దూదిపాళ వేణూధర్‌రెడ్డి, సిడిపివో సక్కుబాయి, షీటీమ్ సి ఐ అనురాధ, గ్రామ్య డైరెక్టర్ రుక్మిణీరావు, వైద్య సిబ్బంది, అంగన్‌వాడి సిబ్బంది, కళాశాల, పాఠశాల విద్యార్ధినులు, డివిజన్ పరిధి లోని సి ఐలు, ఎస్ ఐలు తదితరులు పాల్గొన్నారు.

నేడు జిల్లాకు 150 కోట్ల కరెన్సీ

నల్లగొండ, డిసెంబర్ 1 : జిల్లాలోని బ్యాంకులకు నేడు 150 కోట్ల వరకు నూతన కరెన్సీ అందించడం జరుగుతుందని ఆర్ బి ఐ అధికారులు తెలిపినట్లుగా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ వెల్లడించారు. గురువారం బ్యాంకర్లు, వ్యాపార వర్గాలతో కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ బి ఐకి 20 కోట్లు, ఎస్‌బి హెచ్‌కు 40, ఇతర బ్యాంకులకు 80 కోట్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేసినందున పెట్రోల్ బంక్‌లు, రైస్‌మిల్లర్లు, ఎల్‌పిజి గ్యాస్ డీలర్లు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు పదివేల నగదు ఇవ్వాలని నిర్ణయించినందున బ్యాంకర్లు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఉద్యోగులకు 27 కోట్ల రూపాయలు, ఆసరా ఫించన్లకు 20 కోట్ల రూపాయలు నాలుగు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని బ్యాంకర్లను కోరారు. అసంఘటిత రంగ కార్మికులకు బ్యాంకు ఖాతాలో పనిచేసే ప్రక్రియకు సహాకరించాలని కోరారు. ప్రధానమంత్రి పసల్ భీమా యోజన పథకాన్ని జిల్లాలో రైతులందరికీ అందించేలా చూడాలని, యాసంగి సీజన్ పంటలకు ఈ భీమా పథకం ప్రీమియం చెల్లించేలా రైతులను చైతన్యవంతం చేయాలన్నారు. బ్యాంకర్లు తమ సర్వీసు ఏరియాలో ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసుకొని నగదు రహిత గ్రామంగా గుర్తింపు తెచ్చేవిధంగా కృషి చేయాలన్నారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పెట్రోల్ బంక్‌లో స్వైప్ మిషన్ల ద్వారా చెల్లింపుల సందర్భంగా ఖాతాదారునికి కొన్ని బ్యాంకులు సర్‌చార్జీలు వేస్తున్నాయని, సిమ్ బేస్‌డ్ ఈడిఎల్ యంత్రాలను సరఫరా చేయాలని పెట్రోల్ బంక్ ప్రతినిధులకు వివరించారు. రైస్‌మిల్లర్లు రైతులకు చెక్కులు జారీ చేస్తున్నాయని, కూలీలు, హమాలీలకు, ఇతర ఖర్చులకు నగదు చెల్లింపుకు చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యం, జేడిఏ నర్సింహ్మారావు, డిఎస్‌ఒ ఉదయ్‌కుమార్, వివిధ శాఖల బ్యాంకర్లు పాల్గొన్నారు.

సర్వే ఆపాలని ధర్నా
మఠంపల్లి, డిసెంబర్ 1: మండలంలోని గుర్రంపోడు తండా వద్ద సర్వే నెం.540లో నిర్వహిస్తున్న సర్వేను ఆపాలంటూ గిరిజనులు గురువారం మఠంపల్లి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నెం.540లో తమ భూములు ఉన్నాయని వాటిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వాటిని నిరోదించేందుకే సర్వే ఆపాలని డిమాండ్ చేస్తున్నామని వారు తెలిపారు. కాగా కొన్ని సంవత్సరాలుగా తాము కబ్జాలో ఉన్నామని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఆందోళనకారుల వద్దకు వచ్చి విరమణ విరమింపచేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు ఆందోళన కొనసాగించారు. తహసీల్దార్ యాదగిరికి వినతిపత్రం అందించారు. దీంతో కొంతసేపు మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు పోలీసుశాఖ ఏర్పాటుచేసింది.

రెవెన్యూ సదస్సులను
సద్వినియోగం చేసుకోవాలి
యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితారామచంద్రన్
చౌటుప్పల్, డిసెంబర్ 1: ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గురువారం జరిగిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. రైతుల నుంచి వచ్చి దరఖాస్తులు, భూసమస్యలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూసమస్యలు, రికార్డులోని లోటుపాట్లను పరిష్కారం చేసేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. అవినీతిని అరికట్టేందుకే ప్రజల వద్దకు అధికారులు వచ్చి సమస్యలను తెలుసుకోని పరిష్కారం చేయడం కోసం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామాలలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం జరగాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి కొనుగోలు, అమ్మకాలను ఆన్‌లైన్ ద్వారా చేసేందుకు ప్రజలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ సదస్సులో ఎంపిపి చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, తహశీల్దార్ షేక్‌అహ్మద్, సర్పంచ్ రమనగోని దీపికశంకర్ తదితరులు పాల్గొన్నారు.

పోస్ట్ఫాసుల్లో పింఛన్‌లకై బారులు

నల్లగొండ, డిసెంబర్ 1: ఆసరా పింఛన్ డబ్బుల కోసం నెల రోజులుగా ఎదురుచూపులు పడిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, వృత్తిదారులు పోస్ట్ఫాసుల వద్ధ బారులు తీరారు. ఆక్టోబర్ నెల పింఛన్ పెద్దనోట్ల రద్ధు నేపధ్యంలో నవంబర్‌లో చెల్లింపు చేయలేదు. ఆలస్యంగా బుధవారం నుండి పంపిణీ చేపట్టగా పింఛన్ల పంపిణీ సమాచారం తెలుసుకున్న లబ్ధిదారులు గురువారం పెద్ద ఎత్తున పోస్ట్ఫాసుల వద్ధ బారులు తీరి పింఛన్ డబ్బులపై అవస్థలు పడ్డారు. పెద్ద నోట్ల రద్ధుతో మొదలైన సమస్యలు ఒకవైపు, ఆస రా పింఛన్ డబ్బుల రాక ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు.
రెవెన్యూ లక్ష్యాల సాధనలో పురోగమించాలి
నల్లగొండ టౌన్, డిసెంబర్ 1 : రెవెన్యూ శాఖ నిర్ధేశించిన లక్ష్యాలను గడువులోగా సాధించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కోరారు. గురువారం కలెక్టరేట్‌లో జేసి, డిఆర్‌ఒ, ఆర్‌డిఒ, ఏఒ లు, తహశీల్ధార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూసేకరణ, ల్యాండ్ రికార్డుల ఆధునీకరణ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. హరితహారంతో పాటు ప్రభుత్వం ప్రాధాన్యత పథకాలు మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూం, మూడు ఎకరాల భూపంపిణీవంటి పథకాలకు సంబంధించి రెవెన్యూ పరమైన పనులను సత్వరమే పూర్తి చేసి పథకాల పురోగతికి తోడ్పాటునివ్వాలన్నారు.

ఆన్‌లైన్ చెల్లింపులకు గాంధీనగర్ ఎంపిక
సూర్యాపేట, డిసెంబర్ 1: నగదు రహిత లావాదేవీల విధానాన్ని అమలుపర్చే చర్యల్లో భాగంగా జిల్లాపరిధిలోని గాంధీనగర్ గ్రామాన్ని ఎంపికచేసి త్వరలో ఆన్‌లైన్ ద్వారా బ్యాంకు లావాదేవీలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఢిల్లీలో నీటి అయోగ్ సభ్యులు అమితాకాంత్ జిల్లా కలెక్టర్‌లతో నిర్వహించిన వీడియో కాన్షరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కామన్ సర్వీస్ సెంటర్‌లను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. నగదు రహిత విధానాన్ని ప్రజలు అధికంగా వినియోగించుకునేలా మోబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. మొదటి విడతగా జిల్లాలో 20మంది వ్యాపారస్థులకు స్వైప్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చి వారికి 100మంది వినియోగదారులను అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గాంధీనగర్ గ్రామాన్ని డిజిటలైజేషన్ చేసి ఆన్‌లైన్ విధానం ద్వారా బ్యాంక్ సేవలు అందించేందుకు ఐసిఐసిఐ బ్యాంక్ అంగీకరం తెలిపినట్లు వివరించారు. ఈ వీడియో కాన్షరెన్స్‌లో ఎంపిపి వట్టె జానయ్య, ఎంపిడివో నాగిరెడ్డి, డిఆర్‌డిఎ ఏపిడి కాళిందిని, ఐసిఐసిఐ క్లస్టర్ బ్రాంచి మేనేజర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.

కొసరు చెల్లింపులు కొందరికే..

నల్లగొండ, డిసెంబర్ 1: పెద్ద నోట్ల రద్ధు పిదప బ్యాంకుల్లో గురువారం మళ్లీ రద్ధీ పెరిగింది. ఒకటవ తారీఖు కావడంతో నెల వేతనాల కోసం ఉద్యోగస్తులు, పింఛన్‌దారులైన రిటైర్డ్ ఉద్యోగులు బ్యాం కుల వద్ధ బారులు తీరారు. ప్రభుత్వం 10వేల చొప్పున ఉద్యోగులకు, పింఛన్‌దారులకు డబ్బులిస్తామన్నప్పటికి అందుకు కావాల్సిన నగదు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల బ్యాంకులకు అందలేదు. దీంతో ఉన్న కొద్దిపాటి నగదును ముం దుగా వచ్చిన వారికి చెల్లించిన బ్యాంకర్లు తదుపరి కొందరికి రెండు నుండి నాలుగువేల చొప్పున తగ్గించి చెల్లించి మరికొందరికి సర్ధుబాటు చేశారు. మెజార్టీ ఉద్యోగులకు, పింఛన్‌దారులకు బ్యాంకర్లు తమ వద్ధ నగదు లేదంటు 10వేల చెల్లింపు సైతం చేయలేమంటు చేతులెత్తేశారు. ముందుగా ఊహించినట్లుగానే ఉద్యోగులు, పింఛన్‌దారులకు చెల్లింపులు చేయడంలో ప్రభుత్వం, బ్యాంకర్లు విఫలమయ్యారు. చెల్లింపులకే తమ వద్ధ నగదు లేనప్పుడు ఇక ప్రత్యేక కౌంటర్లు ఎందుకన్నట్లుగా బ్యాం కర్లు వ్యవహరించారు. ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్ బ్యాంకులకు సైతం పెద్దగా నగదు రాకపోవడంతో ఉద్యోగులకు ఒకటవ తారీఖు వేతనాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు, పింఛన్‌దారులకు చెల్లింపులకు 250కోట్లు అవసరముండగా బ్యాంకర్ల వద్ధ 44కోట్లలో ఉద్యోగులకు, పింఛన్‌దారులతో పాటు ఖాతాదారులకు చెల్లింపుల్లో సర్ధుబాటు చేశారు. రిజ ర్వ్ బ్యాంకు నుండి గురువారం తెల్లవారుజాముకల్లా వేతనాలు, పింఛన్‌దారులకు చెల్లింపు చేసేందు కు 150కోట్లు మూడు జిల్లాల పరిధిలోని బ్యాం కులకు అందుతాయన్న ప్రచారం జరిగినప్పటికి బ్యాం కులకు ఎలాంటి నగదు చేరలేదు. దీంతో ఉద్యోగులు, పింఛన్‌దారులు వేతనాలకు, పింఛన్ డబ్బులకు కటకడలాడారు.
ఇస్తామన్న 10వేలు సైతం ఇవ్వకపోతే ఎలా అంటు రిజర్వ్‌బ్యాంకుపై, ప్రభుత్వంపై ఆగ్రహం వెళ్లగక్కారు. 10వేలతో పిల్లల ఫీజులు, అద్దెలు, రుణాల చెల్లింపులు, ఇతర అవసరాలు ఎలా తీర్చుకునేదంటు ఉద్యోగస్తులు వాపోయారు. దఫాలుగానైనా వారం రోజుల్లో మొత్తం వేతనం, పింఛన్‌డబ్బుల చెల్లింపు పూర్తి చేయాలంటు వారు డిమాండ్ చేశారు.

స్కాలర్‌షిప్ దరఖాస్తులకు గడువు పెంచాలి
మిర్యాలగూడ, డిసెంబర్ 1:విద్యార్ధులు ఆన్‌లైన్‌లో స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచాలని కోరు తూ బిసి విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆర్డీఓ కిషన్‌రావుకు వినతిపత్రం అందచేశారు. ఈసందర్భంగా బిసి విద్యార్ధి సంఘం రాష్ట్ర కార్యదర్శి పగిడి జీడయ్యయాదవ్ మాట్లాడు తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14లక్షల మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తుంటే స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ గడువు ముగిసేనాటికి సుమారు 4లక్షల మంది విద్యార్ధులు అనేక మంది విద్యార్ధులు దరఖాస్తులు చేసుకోలేకపోయారని అన్నారు. ప్రభుత్వం కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటుచేసిన దృష్ట్యా ఆయా మండలాలకు కోడ్‌లు ఇవ్వకపోవడం, మీసేవా కేంద్రం లో కుల, ఆదాయ సర్ట్ఫికెట్లు రాకపోవడం వలన దరఖాస్తు చేసుకోలేకపోయారని, అంతేకాకుండా ఆన్‌లైన్ సర్వర్ సమస్య వల్ల కూడా స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోలేకపోయారని ఆయన అన్నారు.

ఎడమ కాల్వకు నీరు విడుదల
మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 1: కృష్ణానదీ జలాల బోర్డు తెలంగాణాకు నీటి కేటాయింపు చేసిన అనంతరం నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటివిడుదల షెడ్యుల్ విడుదల చేస్తామని స్థానిక ఎన్‌ఎస్‌ఎల్‌బిసి ఒ అండ్ ఎం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ నర్సింహా తెలిపారు. గురువారం స్థానిక కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణానదీ నీటి జలా ల పంపకం విషయంపై ఒకసారి సమావేశం జరిగింది, అందులో ఎలాంటి నిర్ణయం జరగలేదని, శుక్రవారం నాడు జరిగే సమావేశంలో తెలంగాణాకు నీటి కేటాయిం పు జరుగుతుందని ఆయన అన్నారు. అనంతరం నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు ప్రాంతంలో రబీలో ఆరుతడి పంటల సాగుకై నీటి విడుదల షెడ్యుల్ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.

3నుండి టోల్‌ట్యాక్స్ వసూలు

నల్లగొండ, డిసెంబర్ 1 : జాతీయ రహదారి 65 కేతేపల్లి టోల్‌ప్లాజా రవాణా రుసుము 3వ తేదీ నుండి వసూలు చేస్తారని భారత జాతీయ రహదారి అథారిటీ ఎన్‌హెచ్‌ఏఐ పిడి రమేష్‌రెడ్డి తెలిపారు.
2వ తేదీ అర్ధరాత్రి వరకు టోల్‌ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిందని, తిరిగి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మూడవ తేదీ నుండి టోల్‌ఫ్లాజా రుసుము వసూలు చేస్తారని తెలిపారు. స్వైప్ లేదా పేటిఎం అప్లికేషన్ ద్వారా నగదు రహితంగా కూడా చెల్లింపులు జరుపవచ్చని ఆయన తెలిపారు.