నల్గొండ

‘ప్రలోభాలతోనే రవీంద్ర పార్టీ మారాడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 17: అధికార పార్టీ చూపిన ప్రలోభాలకు ఆశపడే దేవరకొండ ఎమ్మెల్యే ఆర్.రవీంద్రకుమార్ నాయక్ సిపిఐని వీడి టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించాడని సిపిఐ జిల్లా పార్టీ కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు నియోజకవర్గ అభివృద్ధికి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు సాధనకే తాను పార్టీ మారినట్లుగా రవీంద్రకుమార్ చెప్పుకోవడం బూటకమని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుకు అభివృద్ధి ముసుగు వేసి టిఆర్‌ఎస్‌లో చేరిన రవీంద్రకుమార్ తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలను, కమ్యూనిస్టు పార్టీని మోసం చేశారని దుయ్యబట్టారు. వెంటనే రవీంద్రకుమార్ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ ప్రజాతీర్పు కోరాలని డిమాండ్ చేశారు. ఆయన గతంలో పార్టీ వేదికలపై నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందనిగాని, డిండి ప్రాజెక్టు సమస్యపైగాని ఎప్పుడు చెప్పలేదన్నారు. కమ్యూనిస్టు పార్టీకి 40ఏండ్లుగా సేవలందించిన ఎంతోమంది సీనియర్లను కాదని సామాజిక వర్గం కోణంలో రవీంద్రకుమార్‌కు రెండుసార్లు ఎమ్మెల్యేగా, సర్పంచ్‌గా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా పార్టీ అవకాశం కల్పించిందన్నారు. కాంట్రాక్టుల కోసం, ఉన్న ఆస్తులను రక్షించుకోవడం కోసం పార్టీలు మారే ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రేరణతో, టిఆర్‌ఎస్ ప్రలోభాలతో రవీంద్రకుమార్ టిఆర్‌ఎస్‌లో చేరారన్నారు. టిడిపి నుండి కాంగ్రెస్‌కు, కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌కు పార్టీలు మారిన గుత్తా జిల్లాలో అందరికంటే ఎక్కువగా పార్టీలు మారాడని విమర్శించారు. సీఎం కెసిఆర్ పార్టీ ఫిరాయింపులతో ప్రతిపక్షాలను లేకుండా చేయాలనుకోవడం అవివేకమని, నేతలు పార్టీలు మారిన కార్యకర్తల అండతో, కొత్త తరం నాయకులతో పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ మనుగడ సాగిస్తాయన్నారు. రవీంద్రకుమార్ పార్టీ మార్పుతో దెబ్బతిన్న కమ్యూనిస్టు పార్టీని దేవరకొండ డివిజన్‌లో మళ్లీ బలోపేతం చేసేందుకు సిపిఐ పునరంకితమవుతుందన్నారు. రవీంద్రకుమార్ వెంట వెళ్లిన జిల్లా కమిటీ సభ్యులు చింతపల్లి మండలం బొడిగం భూపాల్, నరేందర్‌రావు, చందంపేట బి.శ్రీనివాస్, దేవరకొండ టి.కృష్ణయ్య, దూస్రునాయక్, పిఏపల్లి మండలం పి.రంగారెడ్డిలను సిపిఐ నుండి బహిష్కరిస్తున్నట్లుగా ఆదిరెడ్డి ప్రకటించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు నెల్లికంటి సత్యం, పల్లా నరసింహరెడడ్డి, పల్లా దేవందర్‌రెడ్డి, కాంతయ్య, వెంకటేశం, లెనిన్ పాల్గొన్నారు.