నమ్మండి! ఇది నిజం!!

ప్రేమకి నేను పేదనుకాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగల్ చక్రవర్తి షాజహాన్, తన భార్య ముంతాజ్ 1632లో మరణించినప్పుడు ఆమె మీది ప్రేమకి ఓ ఆకృతిని ఇచ్చాడు. అదే ఆగ్రాలోని తాజ్‌మహల్. చక్రవర్తులకే కాదు. ప్రేమ అనే సంపద మానవులు అందరికీ ఉంటుంది. అందరూ ఆ ప్రేమని బయటికి వ్యక్తీకరించలేరు. కానీ కొందరు సామాన్యులు తమ భార్య లేదా ప్రియురాలి మీద ప్రేమని వింత పద్ధతుల్లో వ్యక్తీకరించారు. వారిలో ఒకరు ఫైజుల్ హసన్ ఖాద్రీ. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్ జిల్లాక చెందిన ఫైజుల్‌కి, తాజ్‌ములీకి 1953లో వివాహమైంది. వీళ్లకి పిల్లలు లేరు. ఓసారి ఇతను భార్యతో తమ గ్రామం నించి ఆగ్రాకి వెళ్లి, తాజ్‌మహల్ని చూశాడు.
అక్కడ తన భార్య ‘మరణానంతరం ఎవరైనా తమని అసలు గుర్తుంచుకుంటారా?’ అని అడిగితే ‘నువ్వు ముందు పోతే, నేను నిన్ను గుర్తుంచుకునేలా చేస్తాన’ని మాట ఇచ్చాడు.
ఆమె పధ్నాలుగో ఏట, పదిహేడేళ్ల ఖాద్రీని పెళ్లి చేసుకుంది. ఎంతో మృదువుగా మాట్లాడే ఆమెని అంతా ఇష్టపడేవారు. చదువు రాని ఆమెకి ఖాద్రీ ఉర్దూ భాషని నేర్పించాడు. ఏభై ఎనిమిదేళ్లు ఇద్దరూ కలిసి జీవించాక, దురదృష్టవశాత్తు ఆమెకి గొంతు కేన్సర్ వచ్చింది. డాక్టర్లు దాన్ని గుర్తించలేక పోయారు. నగరంలోని పెద్ద డాక్టర్స్ అప్పటికే ఆలస్యమైందని చెప్పారు. 2011 డిసెంబర్‌లో తాజ్‌ములీ బేగం కేన్సర్‌తో మరణించింది. మరణించిన తన భార్యకి మాట ఇచ్చినట్లుగా, ఆమె జ్ఞాపకార్థం ఖాద్రీ తమ ప్రేమని ప్రదర్శించాడు - ఓ కట్టడం ద్వారా. దాన్ని కూడా తాజ్‌మహల్ మోడల్‌లోనే నిర్మించడం విశేషం. ఇది తాజ్‌మహల్‌కి డూప్లికేట్ అని చెప్పచ్చు. దీన్ని అస్గర్ అని పిలుస్తారు.
ఐతే తాజ్‌మహల్ నిర్మాణానికి ఎంత కాలం పట్టిందో తెలియదు కానీ, ఫైజుల్ హసన్ ఖాద్రీ తమ గ్రామం కాసర్ కలన్‌లో మూడేళ్లు కష్టపడి దీన్ని నిర్మించాడు. తన పొలం, భార్య బంగారు నగలు, ఇంట్లోని వెండి అమ్మగా వచ్చిన డబ్బుతో దీన్ని నిర్మించాడు. పొలాన్ని 6 లక్షలకి, భార్య బంగారాన్ని లక్షన్నర రూపాయలకి అమ్మి దీన్ని ఆరంభించాడు. ఇంతదాకా 11 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.
దీనికి నాలుగు వైపులా గల మినార్ల ఎత్తు సుమారు 25 అడుగులు. చుట్టూ చెట్లు నాటి భవంతి ముందు చిన్న సరస్సుని కూడా ఏర్పాటు చేశాడు. పోస్టుమాస్టర్‌గా పని చేసి రిటైరైన ఖాద్రీ తన పెన్షన్ మొత్తాన్ని మాత్రం ఉంచుకుని మిగిలినదంతా ఈ స్మారక నిర్మాణానికే వెచ్చించాడు. దీని చుట్టూ పార్క్‌ని అభివృద్ధి చేయాలని కూడా అతని కోరిక. ఐతే తన మరణానికి మునుపు దీన్ని పూర్తి చేయాలన్నది ఆయన కోరిక.
గోడలకి బయట, లోపల పాలరాళ్లు అతికించడానికి ఇంకా ఆరేడు లక్షలు పట్టచ్చని అతని అంచనా. చాలామంది ఇతని అవసరాన్ని గుర్తించి, ధన సహాయం చేయడానికి ముందుకు వస్తే తీసుకోలేదు. అది తన భార్య మీద ప్రేమతో చేసే వ్యక్తిగత ఖర్చుగా అతను భావించాడు. ఓసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈయన్ని లక్నోకి పిలిపించి ధన సహాయం చేస్తానని చెప్తే మర్యాదగా తిరస్కరించాడు.
‘మా గ్రామంలోని స్కూల్‌ని ఎడ్యుకేషన్ బోర్డ్ గుర్తిస్తే నాకు అదే పదివేలు’ ఆయన్ని కోరాడు.
తన మరణానంతరం తనని కూడా అందులోని తాజ్‌ముల్లీ సమాధి పక్కనే సమాధి చేయమని ఖాద్రీ తన సోదరుడ్ని కోరాడు.
ఈ జిల్లాలోని చాలా మంది వచ్చి, ఈ నూతన తాజ్‌మహల్‌ని సందర్శిస్తున్నారు. కొందరు విదేశస్థులు కూడా దీని గురించి ఇంటర్నెట్‌లో చదివి ఇక్కడికి వస్తున్నారు.
‘తాజ్‌మహల్ చక్రవర్తి కట్టింది కాబట్టి చూడడానికి అందంగా కనిపిస్తుంది. నేను కట్టింది అంత అందంగా ఉండదని నేను సందర్శకులకి చెప్పినప్పుడల్లా, మీ భార్య మీద మీకు గల ప్రేమే దీనికి అందాన్ని తెస్తోందని చెప్తూంటారు’ ఖాద్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
‘మా ఇద్దరి మరణానంతరం కూడా, మా ఇద్దరి పేర్లు గుర్తుండాలన్నది నా కోరిక’ అతని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఆయన పెన్షన్ మీదే జీవిస్తూ, సమీపంలో కట్టుకున్న చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు.

పద్మజ