నమ్మండి! ఇది నిజం!!

బేబీ లిఫ్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1970లలో అమెరికా, వియత్నాం యుద్ధం ముగిసాక చాలామంది వియత్నమీస్ శిశువులు అనాథలు అయ్యారు. దాంతో అమెరికా మానవతా దృక్పథంతో చాలామంది అనాథ పిల్లల్ని వియత్నాం నించి అమెరికాకి తీసుకువచ్చింది. అలా మొత్తం 2500 మందికి పైగా పిల్లలు అమెరికాలోని శాన్‌ఫ్రేన్సిస్కో సియాటిల్‌లకి చేరారు. ఈ తరలింపుకి ఆపరేషన్ బేబీ లిఫ్ట్ అనే పేరు పెట్టారు. చరిత్రలో ఇంత పెద్దఎత్తున అనాథ పిల్లల తరలింపు అంతకు మునుపు కాని, ఆ తర్వాత కాని జరగలేదు. ఆ గందరగోళంలో వేల మంది పిల్లలని రవాణా చేయడానికి పెద్దఎత్తున కసరత్తు చేశారు. ఇందుకోసం అనేక ప్రత్యేక విమానాలని నడిపారు. అనేక బోయింగ్ 747 విమానాలని ప్రత్యేకంగా అద్దెకి తీసుకున్నారు. యుద్ధ గందరగోళంలో ఉన్న ఆ దేశంలో తమ సైనికుల వల్ల అనాథలైన పిల్లల విషయంలో అమెరికా తీసుకున్న నైతిక నిర్ణయం ఇది.
వియత్నమీస్ రాజధాని సైగాన్ పడిపోవడానికి కొన్ని వారాల ముందు ఏప్రిల్ 1975లో ఈ తరలింపు జరిగింది. ఓ అట్టపెట్టె మీద బిడ్డ ఐడెంటిటీ నంబర్ని రాసి, బిడ్డలని వాటిలో ఉంచి తరలించారు. విమాన సీట్లలో కూర్చోలేని నెలల పసికందులని రెక్సిన్/ నైలాన్ ఉయ్యాలల్లో తెచ్చి వాటిని సీట్లకి బిగించారు. దారిలో పిల్లల ఆలనాపాలనలని చూసేందుకు అనేకమంది స్వచ్ఛంద సేవకులు ముందుకు వచ్చారు. చాలా సందర్భాల్లో విమానంలో పిల్లల కంటే స్వచ్ఛంద సేవకులే అధికంగా ఉన్నారు. వివిధ అమెరికన్ విమాన కంపెనీల కమర్షియల్ ఎయిర్‌హోస్టెస్‌లు కూడా ఈ స్వచ్ఛంద సేవకుల్లో ఉన్నారు. ప్రథమ చికిత్స తెలిసిన వారు ఉండాలి కాబట్టి నర్స్‌లు కూడా ముందుకు వచ్చారు. వారంతా దారిలో తరచు ఉయ్యాలల్లోని పిల్లలు ఊపిరి తీస్తున్నారా? లేదా? అని తనిఖీ చేసేవారు.
‘నేను టార్చ్‌లైట్ కాంతిని ఉయ్యాల్లోకి ప్రసరించబోయే ముందు ప్రతీసారి భయం వేసేది. బిడ్డ పొట్ట పైకి, కిందకి కదులుతోందా, లేదా అని చూసి బిడ్డ కులాసా అని తృప్తి చెందేదాన్ని’ జేన్ వాలెట్ అనే స్వచ్ఛంద సేవకురాలు సిఎన్‌ఎన్‌కి చెప్పింది.
సియాటిల్‌లో విమానం దిగాక ఓ నర్స్ ఇలా చెప్పింది.
‘అంతమంది అనాథ శిశువులని చూసి నా గుండె కరిగిపోయింది. ముప్పై గంటల విమాన ప్రయాణంలో వారంతా అలసిపోయి ఉన్నారు’
‘పిల్లల డైపర్స్‌ని తనిఖీ చేసి మార్చడమే ఆ ముప్పై గంటలూ నా పని. ఎంతమంది పిల్లలంటే, నాకు కూర్చోడానికి సీట్ కూడా లేకపోయింది. డ్యూటీ దిగాక వరసగా ఇరవై ఆరు గంటలు నిద్రపోయాను’ ఓ స్వచ్ఛంద సేవకురాలు చెప్పింది.
4 ఏప్రిల్ 1975న పిల్లలతో బయలుదేరిన మొదటి విమానం కూలిపోయి అందులోని 78 మంది పిల్లలు, విమాన సిబ్బంది మరణించారు. ఆ తర్వాత ఈ స్వచ్ఛంద సేవకులకి విమానం క్రేష్ లేండ్ ఐతే పిల్లల్ని విమానం లోంచి క్షేమంగా బయటకి ఎలా తీసుకురావాలో శిక్షణ ఇచ్చారు.
వీరి కోసం కేలిఫోర్నియా రాష్ట్రంలో రెండు, వాషింగ్టన్ రాష్ట్రంలో ఒకటి చొప్పున మిలిటరీ అవుట్‌పోస్ట్‌లని ఏర్పాటు చేశారు. సంతానం లేక దత్తత తీసుకోదలచుకున్న జాబితాలోని వారికి దత్తత ఇచ్చేదాకా మిలటరీ అవుట్ పోస్ట్‌లలోనే ఆరోగ్యవంతులైన పిల్లలని ఉంచారు.
అమెరికా చేరాక విమానంలోంచి పిల్లల్ని సరాసరి హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ వారిని పరిశీలించిన డాక్టర్లు ఎక్కువ మంది పిల్లలు తీవ్ర డీహైడ్రేషన్, నిమోనియా, చర్మవ్యాధులు, తడపర, ఉదర వ్యాధులతో బాధపడుతున్నారని కనుక్కున్నారు. వెంటనే వారికి చికిత్సని ఆరంభించారు.
శాన్‌ఫ్రేన్సిస్కోలోని ప్రెసీడియో అనే ఆర్మీ బేస్‌లో సైనికుల వినోదం కోసం ఉన్న ఫుట్‌బాల్ ఫీల్డ్ అంత విశాలమైన హార్మన్ హాల్ అనే భవంతిని హాస్పిటల్‌గా మార్చి పిల్లల్ని విమానాశ్రయం నించి అక్కడికి తరలించారు. బే ఏరియా హెల్త్ ప్లానింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు మైఖేల్ ఆధ్వర్యంలో వారికి తక్షణ చికిత్సని అందించారు. చాలా హాస్పిటల్స్‌లోని నర్స్‌లు, డాక్టర్లు, నర్సింగ్ విద్యార్థులు, రిటైరైన సైనికులు స్వచ్ఛందంగా వీరికి సేవ చేయడానికి వచ్చారు. అక్కడ ఎవరూ నేత కాదు. అంతా సేవ మీదే దృష్టిని కేంద్రీకరించారు. మంచాలు సరిపోక పిల్లల్ని నేల మీద పరిచిన దుప్పట్ల మీద కూడా పడుకోబెట్టారు.
పిల్లలకి పాలు పట్టే లేదా తినిపించే స్వచ్ఛంద సేవకులు 12 గంటల షిఫ్ట్‌లలో పని చేస్తూ అక్కడే నిద్రించారు. కొందరికి పిల్లల నించి అంటువ్యాధులు కూడా అంటుకున్నాయి. పిల్లల్ని దత్తత తీసుకోడానికి ఉత్సాహం చూపించిన చాలామంది ప్రెసీడియోలోని ఈ హాల్‌కి వచ్చి నచ్చిన పిల్లల్ని తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేశారు. వారానికి 7,886 ఫార్ములా పాల సీసాలు; 10,000 డిస్‌పోజబుల్ డైపర్స్; 2,400 కాటన్ స్వాబ్స్; 750 కాటన్ బేల్స్; గేలన్ల కొద్దీ బేబీ పౌడర్; 1,440 ఏస్ప్రిన్ బిళ్లలు ఖర్చయ్యాయని శాన్‌ఫ్రేన్సిస్కో క్రానికల్ రాసింది. అదే విమానాశ్రయానికి అమెరికాలోని వివిధ ప్రాంతాల నించి ఇవన్నీ అనేక విమానాల్లో చేరాయి.
కొందరు పిల్లలు అనాథలే ఐనా కొందరు కాదని వాళ్లతో మాట్లాడితే తెలిసిందని కూడా ఆ దినపత్రికలో 13 ఏప్రిల్ 1975న ఓ వార్త వెలువడింది. అమెరికా ఆ పిల్లల్ని రక్షించిందా లేక దొంగిలించిందా అనే చర్చ మొదలైంది. జీవించి ఉన్న బంధువులకి ఆ పిల్లలని అప్పగించాలని సెంటర్ ఫర్ కాన్‌స్టిట్యూషనల్ రైట్స్ సంస్థతోపాటు కొందరు వ్యక్తులు కూడా అమెరికన్ ప్రభుత్వం మీద వ్యాజ్యాలు వేశారు.
ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాక కొందరు వియత్నాం వెళ్లి తమ కుటుంబ సభ్యులని కలుసుకోగలిగారు కూడా. 40 ఏళ్ల తర్వాత ఇటీవల 2015లో తాము చిన్న పిల్లలుగా వచ్చిన మార్గంలోనే వారంతా విమానంలో తిరుగు ప్రయాణం చేశారు. తేడా అల్లా వారు అప్పుడు వియత్నమీస్ పౌరులు. ఇప్పుడు అమెరికన్ పౌరులు. ఐతే ఈ ప్రయాణంలో పిల్లల ఏడుపులు లేవు. ఉత్సాహంగా తమ స్వదేశం చూడాలనే ఉత్సాహంగల పెద్దల సంభాషణలే ఉన్నాయి.

-పద్మజ