నమ్మండి! ఇది నిజం!!

రెండు దేశాల లైబ్రరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా దేశ సరిహద్దుల మధ్య ఊరు ఉండదు. బయలు ప్రదేశమే ఉంటుంది. లేదా కొండలు, నదులు, సముద్రాలు లాంటివి సరిహద్దులుగా ఉంటాయి. కాని అమెరికా, కెనడా దేశాల మధ్య సరిహద్దు రేఖ ఓ చోట డెర్బీ లైన్ అనే ఊళ్లోని ఓ లైబ్రరీ భవంతిలో ఉండటం ఆశ్చర్యం. సరిహద్దు రేఖ విభజిస్తూండటంతో ఈ ఊరి ప్రజల్లో కొందరు కెనడా దేశ పౌరులు. మరి కొందరు అమెరికన్ పౌరులు అవుతారు. గత రెండు వందల ఏళ్లుగా డెర్బీ లైన్‌లో ఈ విభజన కొనసాగుతోంది. డెర్బీ లైన్ అమెరికాలోని వెర్మాంట్ రాష్ట్రంలో ఓ భాగం. అలాగే కెనడాలోని క్యూబెక్ ప్రాంతానికి చెందిన స్టేండ్‌స్టెడ్ అనే ఊళ్లో ఓ భాగం. ఈ రెండు దేశ భాగాలు కలిసి ఒకే ఊరుగా కొనసాగుతున్నాయి.
ఈ గ్రామ పౌరులంతా ఒకే రిజర్వాయర్‌లోని నీటిని తాగుతారు. ఒకే టూల్ ఫ్యాక్టరీలో పని చేస్తారు. ఒకే రకం ఆటని కలిసి ఆడతారు. ఆ ఊరి ప్రజలంతా వెర్మాంట్‌లోని న్యూపోర్ట్ హాస్పిటల్‌లోనే జన్మించారు. వారి మధ్య తాము ఫలానా దేశానికి చెందిన వారమనే భావన పెద్దగా ఉండక, సోదర భావంతో కలిసి జీవిస్తున్నారు. ఐతే గత పదిహేనేళ్లుగా వీరి మధ్య సామరస్యం కొంత తగ్గిందనే చెప్పాలి. న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్ మీద అల్‌ఖైదా దాడి జరిగాక అమెరికా తన సరిహద్దు రక్షణ విషయంలో అనేక భద్రతా చర్యలని చేపట్టింది. దాని ప్రభావం ఇక్కడ కూడా ఉంది. స్థానిక పౌరులు రెండు దేశాల మధ్య గల సరిహద్దు రేఖని దాటి గతంలోలా ఒకరింటికి మరొకరు వెళ్లడం ఇప్పుడు కుదరదు. కారణం అమెరికన్ సరిహద్దు భద్రతా బలగం. ఐతే హాస్కెల్ ఫ్రీ లైబ్రరీ, ఒపేరా హౌస్‌లలో సరిహద్దు గోడ లేదు. అమెరికా, కెనడా పౌరులు పాస్‌పోర్ట్ లేకుండా దీంట్లోకి వెళ్లచ్చు. ఈ రోజు ప్రపంచంలో రెండు దేశాల్లో ఉండి, ఆ రెండు దేశాలు కలిసి నిర్వహించే లైబ్రరీ ఇదొక్కటే.
హాస్కెల్ ఫ్రీ లైబ్రరీ, ఒపేరా హౌస్ భవంతి ఆ ఊరి సాంస్కృతిక కేంద్రంగా ఉంది. ధనవంతుడైన ఓ అమెరికన్ వ్యాపారి కెనడియన్ భార్య మార్తా హాస్కెల్ 1901లో వీటిని నిర్మించింది.
వినోదానికి అవకాశం లేని పాత రోజుల్లో కెనడా పౌరులు అన్ని రకాల వాతావరణాల్లో వినోదం కోసం మైళ్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇది గమనించిన మార్తా హాస్కెల్ ఈ లైబ్రరీని గ్రానైట్, ఇటుకలతో నియో-క్లాసికల్ స్టైల్‌లో నిర్మించింది. రెండో అంతస్థులో ఒపేరా హౌస్‌ని నిర్మించి, దాని మీద వచ్చే ఆదాయంతో మొదటి అంతస్థులోని లైబ్రరీని నిర్వహించాలి అనుకుంది.
ఐతే ఎవరూ సినిమాలని ఊహించలేదు. త్వరలోనే సినిమాల వల్ల ఒపేరా హౌస్ లాభాలు తగ్గి కింది అంతస్థులోని లైబ్రరీనే వందేళ్లుగా ఒపేరా నిర్వహణ ఖర్చులని కూడా సమకూరుస్తోంది. వేసవిలో ఒపేరాలో జరిగే సంగీత కచేరీలు, నాటకాల ప్రదర్శనకి ఆదరణ లభిస్తోంది. ఒపేరాలోని అధిక భాగం సీట్లు కెనడా దేశంలో ఉన్నాయి. ఐనా అమెరికాకి చెందిన కళాకారులే అధికంగా పాల్గొంటూంటారు. ఒపేరా హౌస్‌ని, షాండ్లెయిర్స్, స్టెయిన్డ్ గ్లాస్ లాంటి చక్కటి అలంకరణలతో నిర్మించారు. లైబ్రరీ మాత్రం సాధారణంగా ఉంటుంది.
1970లలో ఆ భవంతి అంటుకుని కొంత కాలిపోయింది. నష్టపరిహార చెల్లింపు విషయంలో కెనడియన్, అమెరికన్ ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య కొంత వివాదం చెలరేగింది. సరిహద్దు రేఖని సర్వేయర్లు నిర్మించాలని, అందువల్ల ఏ కంపెనీ ఎంత నష్టాన్ని భరించాలో తెలుస్తుందని అమెరికన్ కంపెనీలు పట్టుపట్టాయి. ఆ ప్రకారం సర్వే జరిగాక, నేల మీద టేప్‌ని అతికించి సరిహద్దుని నిర్ణయించారు. ఈ లైబ్రరీలోని నేల మీద ఆ అంతర్జాతీయ సరిహద్దు టేప్ అలాగే ఉంది.
గత పదిహేనేళ్లుగా అమెరికా చేపట్టిన దేశ భద్రత చర్యల వల్ల ఆ ఊళ్లోని రోడ్ల మధ్య అమెరికా, కెనడాల చెక్ పాయింట్స్, కొత్త నియమాలు వెలిసాయి. లైబ్రరీ చుట్టుపక్కల ప్రాంతాన్ని అమెరికన్ హోంలేండ్ సెక్యూరిటీ, రాయల్ కెనడియన్ వౌంటెడ్ పోలీసులు సదా పహారా కాస్తూంటారు. చుట్టుపక్కల వీధుల్లో సిసి కెమెరాలని అమర్చారు.
అమెరికన్ పౌరులు హాస్కెల్ లైబ్రరీలోకి తేలిగ్గా వెళ్లగలరు. ఎందుకంటే దాని ప్రవేశ ద్వారం అమెరికా వైపుంది. కెనడియన్స్‌కి మాత్రం ఇది కష్టం. వారు సాంకేతికంగా అంతర్జాతీయ సరిహద్దుని దాటి ఆ ద్వారం దగ్గరికి చేరుకోవాలి. సరిహద్దుగా రోడ్ల మీద పూలకుండీలని అమర్చారు. ఐనప్పటికీ మిలటరీ జోన్‌లోంచి వెళ్తున్న భావన కలుగుతుందని లైబ్రరీ డైరెక్టర్ నేన్సీ రుమరే చెప్తుంది.
కెనడియన్ పౌరులకి లైబ్రరీలోకి అనుమతిని ఎప్పటికీ నిరాకరించరు. కారణం దాన్ని నిర్మించింది కెనడియనే. ఐతే వారు చర్చ్ స్ట్రీట్‌లోని అనేక సిసిటివి భద్రతా కెమెరాల ముందు నించి నడిచి, యుఎస్ బార్డర్ గార్డ్ స్టేషన్‌ని దాటి వెళ్లాలి. లైబ్రరీ నించి పుస్తకాలు తీసుకుని వెనక్కి వస్తే ఫర్వాలేదు. కాని వారు ప్రవేశ ద్వారం నించి అమెరికా భూభాగంలోకి బయటకి వెళ్తే మాత్రం చట్టవిరుద్ధంగా ప్రవేశించారని పట్టుకుంటారు.
ఈ బిల్డింగ్‌కి గల ప్రాముఖ్యత వల్ల ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వస్తూంటారు. ఇటీవల ప్రెసిడెంట్ ఒబానా కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిస్ ట్రూడేవ్ అమెరికా వచ్చినప్పుడు ఈ లైబ్రరీ గురించి ప్రస్తావించాడు. వలస నిబంధనల వల్ల సరిహద్దుని దాటలేని కుటుంబ సభ్యులు ఈ లైబ్రరీలో కలుసుకుంటూంటారు. లైబ్రరీ లాన్‌లో వారు పిక్‌నిక్ చేసుకుంటూంటారు. లైబ్రరీలో కూడా అమెరికన్ బార్డర్ గార్డ్ స్టేషన్‌ని నియమించాలనే ప్రతిపాదనని డైరెక్టర్ తోసిపుచ్చుతూ ఇలా చెప్పింది.
‘ఇది స్నేహపూర్వకమైన సంస్థ. ఇక్కడ మేము పోలీసింగ్‌ని అనుమతించం’
ఆ ఊరి పౌరుల భావన కూడా ఇదే.
ఇలా రెండు దేశాల సరిహద్దులు ఒకే ఊళ్లో గల ఊళ్లు మరి కొన్ని ప్రపంచంలో ఉన్నాయి. సాదారణంగా అలాంటి ఊళ్లల్లో ఓ రోడ్ లేదా కాలువ సరిహద్దుగా ఉంటుంది తప్ప ఇలా భవంతి లోపలి భాగం ఉండదు.

పద్మజ