అంతర్జాతీయం

తారస్థాయికి ఎన్నికల వేడి ( రేపే అమెరికా అధ్యక్ష పోరు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 6: మంగళవారం హోరాహోరీగా జరుగుతాయని భావిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమవడంతో కీలక రాష్ట్రాల్లో ఇంకా ఎవరికి ఓటు వేయాలో నిశ్చయించుకోని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇటు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, అటు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అమెరికాలో ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుకుంది. ప్రచార పర్వంలో ట్రంప్ కంటే హిల్లరీ స్వల్పంగా ముందంజలో ఉన్నట్లు సర్వేలు స్పష్టం చేస్తుండటంతో ఆ ఆధిక్యతను నిలబెట్టుకునేందుకు ప్రధానంగా తారల తళుకుబెళుకులపైనే ఆధారపడిన ఆమె ఈ వారాంతంలో బియాన్స్, కాటీ పెర్రీ వంటి పాప్ స్టార్లతో సంగీత విభావరులను ఏర్పాటు చేస్తుండగా, మరోవైపు లోవా, మినె్నసోటా, మిచిగాన్, పెన్సిల్వేనియా, వర్జీనియా, ఫ్లోరిడా, నార్త్ కరోలినా, న్యూ హాంప్‌షైర్ తదితర రాష్ట్రాల్లో ట్రంప్ సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు చేస్తున్న చివరి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే తమ తమ పార్టీ నాయకులు, అనుచరులతో కలసి కీలక రాష్ట్రాలను చుట్టివచ్చిన వీరిద్దరూ సోమవారం అర్ధరాత్రి వరకు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నార్త్ కరోలినాలోని రాలెయిగ్‌లో సోమవారం అర్ధరాత్రి ఓటర్లను ఉద్దేశించి చివరిసారిగా ప్రసంగించిన తర్వాత హిల్లరీ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. అమెరికాను బలోపేతం చేసి దేశ ఆర్థిక వ్యవస్థను కేవలం సంపన్నులకు మాత్రమే కాకుండా ప్రజలంఅందరి సంక్షేమానికి అనువైనదిగా తీర్చిదిద్దేందుకు తన మదిలో ఉన్న ఆలోచనలను, ప్రణాళికలను హిల్లరీ ఈ ప్రసంగంలో వివరిస్తారని ఆమె ఎన్నికల ప్రచారకర్తలు తెలిపారు.
అయితే ఈ సభ కంటే ముందు ఆమె తన భర్త బిల్ క్లింటన్, కుమార్తె చెల్సియాతో పాటు అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్లీ తదితరులతో కలసి సోమవారం రాత్రి ఫిలడెల్ఫియాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ప్రముఖ పాప్ గాయకుడు జాన్ బాన్ జోవీ సంగీత విభావరి ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ఎన్నికల ప్రచారంలో ప్రమాదకరమైన అభిప్రాయాలను వ్యక్తం చేసి ప్రజల మధ్య చీలికలు తెచ్చిన ట్రంప్‌కు అమెరికా లాంటి గొప్ప దేశానికి నాయకత్వం వహించే అర్హత ఏమాత్రం లేదని హిల్లరీ ఈ ర్యాలీలో ఒబామాతో కలసి ప్రజలకు వివరించనున్నారు.
కాగా, ఇటీవల వెల్లడైన సర్వేల ఫలితాలతో మరింత ఉత్సాహాన్ని కూడగట్టుకున్న ట్రంప్ (70) డెమోక్రటిక్ పార్టీకి కంచుకోట అయిన మినె్నసోటాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో చివరి నిమిషం వరకు ప్రచారాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ‘ఒకటి, రెండు రాష్ట్రాల్లో మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నప్పటికీ మినె్నసోటా రాష్ట్రం చాలా కాలం నుంచి డెమోక్రటిక్ పార్టీకి కంచుకోటగా కొనసాగుతోంది. దీంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా పర్యటించి దేశ అభివృద్ధిపై నా అభిప్రాయాలను ప్రజలకు వివరించాలని నిశ్చయించుకున్నా’ అని ఆయన చెప్పారు.
ట్రంప్ ర్యాలీలో గందరగోళం
నెవెడాలో శనివారం ట్రంప్ ఎన్నికల ర్యాలీని నిర్వహిస్తున్నప్పుడు స్వల్ప గందరగోళం తలెత్తడంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు రంగంలోకి దిగి అకస్మాత్తుగా ఆయనను వేదిక మీది నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఈ ర్యాలీలో ఆస్టిన్ క్రైటెస్ అనే విలేఖరి ‘తుపాకీ’ అని గట్టిగా అరవడంతో ఈ గందరగోళం తలెత్తింది. దీంతో రంగంలోకి దిగిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, పోలీసు అధికారులు తక్షణమే అతడిని నిర్బంధించి విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అయితే ఎటువంటి ఆయుధం లేదని వారు గుర్తించడంతో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో కొద్ది నిమిషాల తర్వాత ట్రంప్ మళ్లీ వేదిక మీదికి వచ్చి తన ప్రసంగాన్ని ముగించారు.

ఊచకోత కోస్తాం: ఐసిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లను ‘ఊచకోత’ కోస్తామని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ‘ఐసిస్’ హెచ్చరించింది. ఈ ఎన్నికల్లో ముస్లింలు ఎవరూ పాల్గొనవద్దని ఐసిస్ విజ్ఞప్తి చేసిందని అమెరికాలో ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఒక గ్రూపు వెల్లడించింది. ‘మిమ్మల్ని ఊచకోత కోసి మీ బ్యాలెట్ బాక్సులన్నింటినీ నాశనం చేసేందుకు మిలిటెంట్లు రంగంలోకి దిగారు’ అని ప్రకటిస్తూ ఐసిస్‌కు చెందిన అల్ హయత్ మీడియా సెంటర్ ‘ట్విట్టర్’లో హెచ్చరికలు చేసిందని ‘సైట్’ ఇంటెలిజెన్స్ గ్రూపు డైరెక్టర్ రిట్జ్ కట్జ్ తెలిపారు. ‘ది మర్టడ్ ఓట్’ అనే శీర్షికతో రూపొందించిన ఏడు పేజీల మ్యానిఫెస్టోలో ఐసిస్ ఈ హెచ్చరికలు చేసినట్లు ‘యుఎస్‌ఎ టుడే’ పత్రిక పేర్కొంది. ఎన్నికల్లో పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ ఇస్లామ్ మతంతోపాటు ముస్లింల పట్ల ఒకే విధమైన వైఖరిని అవలంబిస్తున్నారని, వీరిద్దరి విధానాల్లో ఎటువంటి తేడా లేదని ఐసిస్ ఆ వ్యాసంలో పేర్కొంది.

సర్వేల్లో హిల్లరీకే ఆధిక్యం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీకి, ట్రంప్‌కు మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లు హోరాహోరీగా సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 44 శాతం మంది ఓటర్లు హిల్లరీకి మద్దతు తెలుపుతుండగా, ట్రంప్‌కు 43 శాతం మంది మద్దతు తెలుపుతున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని ‘మెక్‌క్లాచీ-మారిస్ట్’ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ట్రంప్ కంటే హిల్లరీ 5 పాయింట్ల ఆధిక్యతలో ఉన్నట్లు తాజా సర్వేలో తేలిందని ఎబిసి ట్రాకింగ్ పోల్ వెల్లడించగా, హిల్లరీకి 45 శాతం మంది, ట్రంప్‌కు 43 శాతం మంది మద్దతు తెలుపుతున్నట్లు ఫాక్స్ న్యూస్ పేర్కొంది. అయితే సర్వేల విషయంలో మీడియా హిల్లరీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ట్రంప్ చేస్తున్న ఆరోపణలు నిజమేనని 52 శాతం మంది ఓటర్లు భావిస్తుండగా, మీడియా పక్షపాతంతో వ్యవహరించడం లేదని 38 శాతం మంది భావిస్తున్నట్లు మరో సర్వే స్పష్టం చేసింది.

ఎన్నికల ర్యాలీలో ఆరు నెలల బాలుడిని ముద్దాడుతున్న ట్రంప్

పెన్సిల్వేనియాలో రికార్డింగ్ ఆర్టిస్టు క్యాటీ పెర్రీతో కలిసి ప్రచారం చేస్తున్న హిల్లరీ