తెలంగాణ

ఉదయ్‌లోకి తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: విద్యుత్ రంగంలో ప్రగతి సాధన, డిస్కమ్‌ల బలోపేతానికి కేంద్ర విద్యుత్ పథకం ‘ఉదయ్’లో చేరినట్టు సిఎం కె చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఈమేరకు కేంద్రంతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్టు అసెంబ్లీలో బుధవారం ప్రకటించారు. ఈ ఒప్పందం వల్ల విద్యుత్ రంగంలో గత పాలకుల లోపభూయిష్ట విధానాల ఫలితంగా డిస్కమ్‌లపైవున్న రూ.11,897 కోట్ల రుణ భారంలో 75శాతం అంటే రూ.8923 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించనుందని ప్రకటించారు. మిగిలిన రూ.2974 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీతో బాండ్స్ విడుదల చేసి సేకరిస్తుందని సిఎం ప్రకటించారు. దీంతో రెండు డిస్కమ్‌లు రుణభారం నుంచి విముక్తి కలుగుతుందన్నారు. ఉదయ్ పథకంతో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఒప్పందం కుదుర్చుకోవడంపై శాసనసభలో సిఎం ప్రకటన చేశారు. డిస్కమ్‌ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుండటంతో ఏటా రూ.890 కోట్ల వడ్డీ భారం కూడా తప్పుతుందన్నారు. దీనివల్ల డిస్కమ్‌లు తిరిగి అప్పు పొందడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ ఏడాది సబ్సిడీ రూపంలో డిస్కమ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4584 కోట్లు చెల్లించబోతుందని సిఎం వివరించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించి, తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కొత్తగా స్థాపించబోతున్న భద్రాద్రి, యాదాద్రి, కొత్తగూడెం విద్యుత్కేంద్రాల ద్వారా 5880 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. దీంతోపాటు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రామగుండంలో 4వేల మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యంతో విద్యుత్కేంద్రాలను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి) నెలకొల్పబోతుందన్నారు. దీంట్లో భాగంగా ఇప్పటికే 1600 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన మొదటి దశ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారని సిఎం గుర్తు చేశారు. రాబోయే మూడేళ్లలో సిజిఎస్ ద్వారా 595 మెగావాట్ల విద్యుత్ సమకూరుతుందని వివరించారు. సింగరేణి ద్వారా మరో 800 మెగావాట్లు, చత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేసే వెయ్యి మెగావాట్లు, 2017-18 నాటికి సౌర విద్యుత్ ద్వారా 3920 మెగావాట్లు, పులిచింతల ద్వారా 90 మెగావాట్లు కలిపి 2019 నాటికి తెలంగాణ రాష్ట్రం 27,187 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుందని సిఎం వివరించారు. అప్పుడు విద్యుత్ రంగంలో రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించి విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి 5863 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగి ఉండగా, ఈ రెండున్నరేళ్లలోనే అదనంగా 5039 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం రాష్ట్రం 10,902 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగివుండగా, స్థిరంగా 7371 మెగావాట్ల ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. గరిష్టంగా విద్యుత్ డిమాండ్ 8284 మెగావాట్లు కాగా డిమాండ్‌కు, ఉత్పత్తికి మధ్య వ్యత్యాసం 1000 మెగావాట్లు ఉందన్నారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్, గృహ అవసరాలకు కోతలులేని విద్యుత్‌ను నవంబర్ 2014 నుంచి అందిస్తున్నట్టు చెప్పారు. విద్యుత్ రంగంలో రాష్ట్రం ఇంతటి ప్రగతి సాధించడం వెనుక ఉద్యోగుల కృషి ఎనలేనిదన్నారు. వీరిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 20 వేలమంది ఉండటంతో వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించినట్టు సిఎం కెసిఆర్ వివరించారు.
ఉదయ్‌లో చేరిన తెలంగాణ
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్) కేంద్ర ఉజ్వల్ డిస్కాం హామీ యోజన (ఉదయ్) పథకంలో చేరాయి. ఈమేరకు బుధవారం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై తెలంగాణ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా సంతకాలు చేశారు. పథకంలో చేరడంవల్ల తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థలకు రాయితీతో బొగ్గు సరఫరా కానుంది. ఇలాఉండగా ఉదయ్ పథకంలో ఇప్పటికే 20 రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు క్షేత్రస్ధాయి, రాష్ట్రాస్థాయి నుంచి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం సహా పంపిణీ సంస్థల పనితీరును మెరుగుపర్చుకునేందుకు ఈ పథకం ఉపకరిస్తుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు గోపాల రావు, రఘుమారెడ్డి, తెలంగాణ పత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.