Others

పగ్గాల్లేని ఇసుక దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలోని ప్రధాన రహదారుల గుండా ప్రయాణించే ఇసుక లారీలు అమాయక ప్రజల పాలిట మృత్యుశకటాలుగా మారుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మహదేవ్‌పూర్ ఇసుక క్వారీల నుండి ప్రతిరోజూ సుమారు ఐదువేలకు పైగా ఇసుక లారీలు పరకాల, గూడెప్పాడ్, హన్మకొండల మీదుగా హైదరాబాద్‌కి వెళ్తుంటాయి. మితిమీరిన వేగంతో లారీలు వెళ్తున్నందున ప్రమాదాలు జరుగుతూ నిత్యం ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. అనుభవం, శిక్షణ లేని వారు లారీలను నడపడం, మద్యం సేవించడం ప్రమాదాలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇసుక లారీల డ్రైవర్లు ఓవర్ టేక్ చేయడం, మిగతా వాహనాలకు దారి ఇవ్వకపోవడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం షరామామూలైంది. దీంతో మిగతా వాహనాలలో వెళ్లే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. అధిక లోడుతో లారీలు వెళ్తున్నందున కోట్లాది రూపాయలతో వేసిన రోడ్లు స్వల్పకాలంలోనే శిథిలమవుతున్నా యి. కాళేశ్వరం నుండి ఇసుక క్వారీ యజమానులు ఒక్కో లారీకి రూ.15వేల నుండి రూ.20 వేల వరకు, అధిక లోడు వాహనాలకు రూ.25 వేల నుండి రూ.35 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో గృహనిర్మాణం
అధికం కావడంతో ఇసుకకు గిరాకీ పెరిగింది.
గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొదురుపాక క్వారీ నుండి వందల సంఖ్యలో ఇసుక లారీలు హైదరాబాద్‌కి రాకపోకలు సాగించడం, తంగల్లపల్లి మండలం నేరెళ్లలో ఇసుక లారీలను గ్రామస్థులు తగలబెట్టడం తెలిసిందే. దీంతో శాంతి భద్రతల సమస్య తలెత్తింది. ఏటూరు నాగారం వద్ద గోదావరి నది పరీవాహక ప్రాంతం నుండి నిత్యం వందల సంఖ్యలో ఇసుక లారీలు ములుగు, గోవిందరావుపేట, ఆత్మకూర్, హన్మకొండ మీదుగా రాజధానికి చేరుకుంటున్నాయి. ఈ ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న గ్రామాలలోని ప్రజలు రోడ్డుమీదికి రావాలంటే జంకుతున్నారు. లారీల భయంతో రోడ్డు పక్క ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోకి పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు బస్సులు, వ్యాన్లలో పిల్లలను పంపతున్నారు. ఇటీవల చెల్పూర్ - భూపాలపల్లి ప్రధాన రహదారిపై గొర్రెల మందపైకి ఇసుక లారీ దూసుకువెళ్లి సుమారు ముప్ఫయి గొర్రెల మరణానికి కారణమైంది. దీంతో ఆగ్రహోదగ్రులైన గొర్రెల కాపర్లు లారీ డ్రైవర్‌పై గొడ్డలితో దాడి చేశారు. అతను చావుబతుకుల మధ్య వరంగల్‌లోని ఎంజిఎం దవాఖానాలో చికిత్స పొందడం అందరినీ కలచివేసింది.
ఒకే మార్గం నుండి వెళ్ళే ఇసుక లారీలను రహదారి వెంబడే నిలిపివేయడం, దీంతో వెనుక నుండి వచ్చే వాహనాలు ఆగివున్న ఇసుక లారీలను ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రివేళలో అయితే ప్రమాదాల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇసుక లారీల రణగొన ధ్వనులతో వాతావరణంలో శబ్ద, వాయు కాలుష్యాలు పెరుగుతున్నాయి. రవాణా, పోలీసు శాఖల అధికారుల పర్యవేక్షణ లోపం, మామూళ్ల వ్యవహారం బహిరంగ రహస్యమే. బాధ్యతలను మరచిన అధికారులు చూసీచూడనట్లుగా ఇసుక లారీలను వదిలివేస్తున్నారు. డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించకపోవడం, అనుమతి పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి పరిశీలించకపోవడంతో లారీ డ్రైవర్లకు అనుకూలంగా ఉంటుంది. ప్రమాదాలకు కారకులైన లారీ డ్రైవర్లకు కఠిన శిక్షలు అమలుచేయాలి. ప్రధాన రహదారుల వెంబడి స్పీడ్ కంట్రోల్ బోర్డులు ఏర్పాటుచేయాలి. మద్యం సేవించి లారీలను నడిపేవారి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దుచేయాలి. రహదారి భద్రత విషయంపై వారికి అవగాహన కల్పించాలి. ఇసుక లారీల ప్రమాదాలపై స్పందించకుంటే ఇంకెన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో? ప్రనుత్వం తీవ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మేధావులు కూడా స్పందించాలి.

-కామిడి సతీష్‌రెడ్డి