Others

భారతీయ మహిళల స్వేచ్ఛాగానమిది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన న్యాయవ్యవస్థపై ఒక్కసారిగా సామాన్య ప్ర జానీకానికి గౌరవం పెరిగింది. ‘ట్రిపుల్ త లాక్’తో ముస్లిం పురుషులు వివాహబంధానికి అత్యంత సులువుగా చెల్లుచీటీ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, పవిత్ర ఖురాన్‌కు పూర్తి వ్యతిరేకమని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. ఈ తీర్పు యావత్ మహిళా లోకానికి ఆత్మవిశ్వాసాన్ని, స్వేచ్ఛను ప్రసాదించింది. ‘తలాక్’ అనేది ముస్లిం మహిళలను శతాబ్దాల తరబడి వేధిస్తున్న సమస్య. ఇది ముస్లిం స్ర్తిలను స్వేచ్ఛకు, సాధికారతకు దూరం చేసింది. ‘ట్రిపుల్ తలాక్’పై సుప్రీం కోర్టులోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసం వెలువరించిన సంచలనాత్మక తీర్పును దేశ వ్యాప్తంగా అభ్యుదయవాదులే కాదు, అన్ని రాజకీయ పక్షాలు స్వాగతించాయి.
ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు- ‘సంఘంలో సంస్కార స్థాయి పెరగాలి. అప్పుడు చట్టం చేయాల్సిన పని సంస్కారమే చేస్తుంది. ఈ రోజు సతీ సహగమనం చేయకూడదని చట్టం చేయాల్సిన అవసరం లేదు’ అని ఏనాడో అన్నారు. సతీ సహగమనం అనే సాంఘిక దురాచారాన్ని రూపుమాపేందుకు రాజారామమోహన రాయ్ లాంటి సంఘ సంస్కర్తలు చేసిన పోరాటాలు మనకు ఎప్పటికీ స్ఫూర్తిని కలిగిస్తాయి. ఇక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు చట్టం చేసేవరకు ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లలకు పురుషులతో సమానంగా ఆస్తిహక్కు లేదు. స్ర్తి హక్కుల సాధనలో మనం గడిచిన 32 ఏళ్ళ కాలంలో చూస్తే రెండు ముఖ్యమైన తీర్పులున్నాయి. సిరియన్ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన స్ర్తిలకు కుటుంబ ఆస్తిలో వాటాలేదు. ట్రావెన్కూరు సంస్థాన వారసత్వ చట్టం-1915 ప్రకారం కేరళలో మహిళలకు కుటుంబ ఆస్తిలో వాటా లేదు. భారత వారసత్వ చట్టం- 1925 ప్రకారం కేరళ మినహా దేశ వ్యాప్తంగా ఈ మతానికి చెందిన మహిళలకు ఆస్తిహక్కు ఉంది. తన సోదరులు కుటుంబ ఆస్తిలో వాటా ఇవ్వకపోవటంతో మేరీ రాయ్ కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేసి ఆస్తిహక్కు సాధించుకుంది. అప్పటి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పి.ఎన్.్భగవతి ఫిబ్రవరి 24, 1986న కుటుంబ ఆస్తిలో మేరీరాయ్‌కు వాటా ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. సాహిత్యంలో బుకర్ ప్రైజ్ పొందిన అరుంధతీ రాయ్‌కు మేరీ రాయ్ తల్లి.
1993లో కామన్‌వెల్త్ ప్రైజ్‌ను తన తొలి సాహిత్య రచనకు పొందిన గీతా హరిహరన్ ఆమె భర్త కలిసి వేసిన కేసులో- బిడ్డకు తల్లే సహజ సిద్ధమైన సంరక్షకురాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ‘హిందూ వారసత్వ చట్టం-1956’లో మహిళలకు వ్యతిరేకంగా వున్న సెక్షన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. సమానత్వం కోసం మహిళలు చేసిన ఈ పోరాటాలు పురుషులకు వ్యతిరేకమైనవి కావు. ‘తలాక్’ బారిన పడి దాంపత్య మాధుర్యానికి దూరమైన సైరాబానో, గుల్షన్ పర్వీన్, ఇష్రాత్ జహాన్, ఆఫ్రీన్ రహమాన్, అతియా సబ్రీలతో పాటు భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ కూడా ‘ట్రిపుల్ తలాక్’కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ చారిత్రాత్మక తీర్పు పొందారు. మన దేశ జనాభాలో 8 శాతానికిపైగా వున్న ముస్లిం మహిళలకు ఈ తీర్పు ఎంతో ఊరట కలిగించింది. మతపరమైన, భావోద్వేగాలతో కూడిన అంశం కావడంతో సుప్రీం కోర్టు తీర్పుపై అన్ని వర్గాల్లో ఎంతో ఉత్కంఠ కలిగింది. ఐదుగురు సభ్యుల ధర్మసనంలో ముగ్గురు న్యాయమూర్తులు తలాక్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేయగా, ఇద్దరు మాత్రం రాజ్యాంగంలో మత స్వేచ్ఛను పేర్కొన్న ఆర్టికల్ 25, న్యాయవ్యవస్థ నిగ్రహ అవసరాన్ని వివరించిన ఆర్టికల్ 142ను ప్రస్తావించి ఆరు నెలల్లో చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశించారు. అయితే, మెజారిటీ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులు దీనిని తోసిపుచ్చటంతో తలాక్ విధానం రద్దుచేస్తూ ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు.
మతం పేరుతో సాగే ఛాందస, సంప్రదాయ పద్ధతులను రూపుమాపడంలో కోర్టు తీర్పులను, ప్రభుత్వ చట్టాలను పరిమిత పాత్రగా ప్రజలు మార్చరాదు. వరకట్నం నిర్మూలనకు చట్టం చేసి ఎన్నో ఏళ్ళయినా ఇంకా ఆ దురాచారం వేళ్ళూనుకుని వున్నట్లుగా కాకుండా ప్రజలు, ముఖ్యంగా మహిళాలోకం చైతన్యవంతంగా వుండాలి. 1985లో షాబానో మనోవర్తి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పును నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ముస్లింలను బుజ్జగించేందుకు నీరుగారుస్తూ 1986లో రూపొందించిన ‘ప్రొటెక్షన్ ఆన్ డైవర్స్ యాక్ట్-1986’ను ఈ సందర్భంగా గుర్తుతెచ్చుకోవాలి. ఇస్లాం మత ఛాందసానికి మరోపేరైన పాకిస్తాన్ 1961లోనే ‘ట్రిపుల్ తలాక్’ విధానాన్ని నిషేధించిందంటే లౌకిక విధానం పేరుతో ఈ అంశంపై మన పాలకులు ఎంత సాచివేత ధోరణి అవలంబించారో అర్థం అవుతుంది. ‘తలాక్’ను నిషేధించిన దేశాలు 19 వుండగా, ఇందులో ముస్లింలు అధికంగా వున్న ఈజిప్టు, బంగ్లాదేశ్, ఇండోనేషియా, టర్కీ, ఇరాన్ వున్నాయి. మూర్ఖపు ఆచారాలు, అంధ విశ్వాసాలపై భారతీయ ముస్లిం మహిళలు సాధించిన ఘన విజయం ఇది. ‘తలాక్’ రద్దు కోసం చొరవ చూపిన ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించేలా ప్రయత్నించాలి. ఆర్థిక సమస్యలు, మనస్పర్థలు వంటి కారణాలతో విడాకులు తీసుకుంటున్న దంపతుల సంఖ్య ఇతర వర్గాల్లో కూడా పెరిగిపోయింది. మత దురాచారాలను తిరస్కరించడంతోపాటు, మానవ సంబంధాలను మంటకలుపుతున్న విధానాలపై పోరాటం అవసరం. అప్పుడు మాత్రమే స్ర్తి స్వేచ్ఛకు, పురోగమనానికి అడ్డుకట్టగా వున్న సంకెళ్ళు తెగటంతోపాటు మహాకవి గురజాడ చెప్పినట్లుగా ‘స్ర్తి ఆధునిక మహిళగా మారి చరిత్ర తిరగరాయగలదు’.

-పోతుల సునీత, ఎమ్మెల్సీ