Others

భావోద్వేగాలతో బ్రతుకే ఆనందమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదో మంచి సినిమా వచ్చిందంటే కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్‌కి వెళ్లాం. హాల్లో ఇలా అడుగు పెట్టామో లేదో వెండితెరపై మన జాతీయ జెండా మూడు రంగులతో ముచ్చట గొల్పుతూ రెపరెప లాడటం.. వెంటనే ‘జనగణమన’ అంటూ జాతీయ గీతం వినిపించటం మొదలైంది. ఠక్కున ఆగిపోయాను నేను.. నాతో పాటే మా వాళ్ళూ ఆగిపోయారు. కుర్చీలో కూర్చున్న ప్రేక్షకులంతా లేచి నిల్చున్నారు వినమ్రంగా. నిజంగా ఎంత అందమైన దృశ్యం అది. మనసు ఉద్వేగ భరితమైంది. శరీరం అణువణువునా ‘ఇది’ అని చెప్పలేని ఆనందం, గర్వం, భక్త్భివం ప్రవహించి విచిత్రానుభూతికి గురి చేసింది. నాలాగే థియేటర్‌లో ఉన్న వాళ్లంతా ఫీల్ అయి ఉంటారు. అలా ఎందుకవుతుంది? అది ఎవరో చెబితే, నేర్పిస్తే వచ్చిన స్పందన కాదు! ‘దేశమును ప్రేమించుమన్నా..’ అని, ‘ఐ లవ్ ఇండియా..’ అని ఎవరో చెప్పనవసరం లేదు. అది సహజసిద్ధంగా పుట్టుకతో, రక్తంలో రంగరించుకుని పోయి.. వయసుతోపాటు పెరుగుతూ సహజసిద్ధంగా మనసులో ఏర్పడిపోయిన ఓ అనుభూతి. అమ్మను ప్రేమించమని బిడ్డకు ఎవరు చెబుతున్నారు? జన్మబంధంతో ఏర్పడిన ఆ ప్రేమభావం ప్రకృతిసిద్ధంగా ఏర్పడినది. ‘నా ఊరు, నా ఇల్లు, నా దేశం, నా వాళ్లు’ అన్న బంధాలు కూడా అంతే! ఏదైనా ‘నేను, నాది’ అన్న భావంలోనే అనుబంధం దాగుంటుంది మరి! అదే ఉద్వేగానికి గురి చేస్తుంది. మనిషిని నిలువెల్లా ప్రకంపనలకు గురి చేస్తుంది.
ఎప్పుడైనా మీరు భారత్-చైనా లేక భారత్-పాకిస్తాన్ సరిహద్దు దగ్గరికి వెళ్లారా. సరిహద్దులో రెండు దేశాలకు మధ్య ఫెన్సింగే అడ్డం. ఇటు మన సైనికులు, అటు అవతలి దేశం సైనికులు గస్తీ తిరుగుతూ, గన్‌లు పట్టుకుని కాపలా కాస్తూ ఉంటారు. అది చూడగానే ఎవరిలోనైనా దేశభక్తి పొంగి పొర్లాల్సిందే. ‘ఇది నా దేశం.. నా జన్మభూమి’ అని మనసంతా ఎంత గర్వపడిపోతుందో.. ఆనందపడిపోతుందో మాటల్లో చెప్పలేం. ‘ఈ నేలలో, ఈ మట్టిలో ఏముంది?’ అనే వాళ్లకు ‘అదెంత వర్ణనాతీతమో’ అక్కడికి వెళితే అనుభవానికి వస్తుంది. వీరజవాన్ల పోరాటాన్ని దేశ సరిహద్దుల్లో, యుద్ధ్భూమిలో ప్రత్యక్షంగా మనం చూడలేకపోయినా ఆ వార్తలు వాళ్లపట్ల మనకు ఎనలేని గౌరవాన్ని కలిగిస్తాయి. అందుకే- యూనిఫాంలో వున్న మన భారత సైనికులెవరైనా కనిపిస్తే చాలు- ఒక్కక్షణం ఆగి వాళ్లకు సలామ్ చేయాలని అనిపిస్తుంది. ‘కళ్లల్లో వత్తులు వేసుకుని నిద్రాహారాలు మాని మాతృభూమిని రక్షిస్తున్న వీర జవానూ ఎంతటి త్యాగమూర్తివయ్యా నువ్వు!’ అని కొనియాడాలని అనిపిస్తుంది. ‘శత్రుభయం లేకుండా నేను హాయిగా గుండెలమీద చెయ్యేసుకుని నిద్రపోతున్నానంటే అందుకు కారణం- నువ్వు శత్రువుకు గుండె ఎదురొడ్టి కంటిమీద కునుకు లేకుండా సరిహద్దు రేఖ వద్ద రక్తం గడ్డకట్టే చలిలో సైతం కాపలా కాస్తుండటం వల్లనే కదా..!’ అని ప్రశంసించి వారికి మరింత ఆత్మస్థైర్యాన్ని అందించాలని అనిపిస్తుంది. మనసారా కృతజ్ఞతలు చెప్పాలని అనిపిస్తుంది.
ఈ అభిమానాలు, ప్రేమలు, భక్తి భావాలు ఎంత విచిత్రంగా ఉంటాయో కదా అనిపిస్తుంది ఒక్కోసారి. దగ్గరగా ఉన్నప్పుడు అది ఎంత ప్రేమో అంచనాలకు అందక పోయినా.. దూరమైనప్పుడు మాత్రం లెక్క దొరికిపోతుంది. విదేశాల్లో ఎదురైన ఓ వ్యక్తి అంతవరకూ ముక్కూముఖం తెలియన వాడైనా ఏ మాల్‌లోనే కలిసి ‘నేనూ ఇండియన్‌నే’ అని చెప్పగానే అతని మీద మనకు ఎక్కడలేని ప్రేమా పుట్టుకొచ్చేస్తుంది. మన దేశస్థుడిని కలుసుకున్నామని మురిసిపోతాం. టీవీ ముందు కూర్చుని తెలుగు ఛానల్ ఆన్ చేసి- అందులో మనవాళ్ల ముఖాలు కనిపిస్తుంటే.. వాళ్లు మన మాతృభాషలో మాట్లాడుతుంటే.. వెనక బ్యాక్‌డ్రాప్‌లో మనకు పరిచయమైన, మనం పేరు విన్న ప్రాంతాలు, వీధులు కనబడుతుంటే సంతలో తప్పిపోయిన పిల్లాడికి అప్పుడే అమ్మ కనిపించినట్లు మన మొహాలు, కళ్లు ఎంతగా వెలిగిపోతాయో..! ఇక ‘మట్టివాసన, మన ఊరి గాలి, మాతృభూమి పరిమళం’ అన్న మాటలు కల్పితాలు కాదనీ ప్రత్యక్షర సత్యాలని భారతదేశ విమానాశ్రయంలో దిగి కాలు నేలమీద పెట్టగానే ఒప్పుకుంటాం.
మనిషి జీవితంలో ఎన్నో భావోద్వేగాలు.. మరెన్నో మధురానుభూతులు.. ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు ఆ క్షణాలు ఆనంద భరితం. ఇవే మనిషిని మంచిగా తీర్చిదిద్దేవి.. ప్రేమైక జీవిగా బ్రతుకును పరిమళ భరితం చేసేవి.. బాధ్యతగల పౌరుడిగా ఉన్నత వ్యక్తిత్వానికి తావిచ్చేవి ఈ అద్భుత దృశ్యాలే.. ఇలాంటి అందమైన సన్నివేశాలే.. ఇంతటి సున్నిత భావోద్వేగాలే..! పిల్లలు, యువత, పెద్దలు, వృద్ధులు అన్న తారతమ్యాలు వీటికి ఉండవు.. దొరికిన వాడికి దొరికినంత.. పొందగలిగిన వాడికి పొందగలిగినంత..!

- డా. కొఠారి వాణీచలపతిరావు సెల్: 98492 12448