Others

వెనుకబడిన జిల్లాలకైనా ‘హోదా’ ఇవ్వరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ఇన్నాళ్లూ ఊరించిన భాజపా చివరికి చేతులెత్తేసింది. ఎన్నికల వేళ హామీలు ఇవ్వడం, తీరా అధికారంలోకి వచ్చాక ఎలా బయటపడదామా? అని చూస్తాయి మన రాజకీయ పార్టీలు. ‘కంట్లో పొడిచి కన్నీటికి కారణం అడిగిన’ట్లు ఇపుడు హడావుడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సమయంలోనే- నీళ్ళు, నిధులు, ఉమ్మడి ఆస్తులు, అప్పులు వంటి విభజన సమస్యలను సహేతుకంగా పరిష్కరించి వుంటే ఏపీకి నేడు ఈ దుస్థితి తప్పేది. బిజెపి ప్రభుత్వమైనా విభజన సమస్యలను సకాలంలో పరిష్కరిస్తే ప్రజలు అర్థం చేసుకునేవారు. కాని బిజెపికి మిత్రులతో లౌక్యంగా వ్యవహరించటం తెలియదు.
ప్రత్యేక హోదాకు కేంద్రం వెనకడుగు వేయటానికి ముఖ్య కారణం- గత ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు పట్టిన గతి తమకు ఇతర రాష్ట్రాల్లో పడుతుందనే భయం. నేడు తెలంగాణ, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాలు ఏపీకి హోదా ఇవ్వాలన్న డిమాండ్‌కు మద్దతు ఇచ్చినా, కేంద్రం అంగీకరిస్తే ఆ పిమ్మట తమకూ హోదా కావాలని ఒత్తిడి చేస్తాయి. హోదా సాధించిన పార్టీలుగా వారికి లాభం కలుగుతుంది. కేంద్రం ఆదాయం తగ్గుతుంది. హోదా ఇవ్వకపోతే కేంద్రానికి వ్యతిరేకంగా ప్రాంతీయ భావాలు రెచ్చగొట్టి లబ్ది పొందవచ్చు. నీళ్ళనుండి నిప్పులు పుట్టించగల ఘనులు మన నేతలు. ఒక రాష్ట్రం కోసం పది రాష్ట్రాలను దూరం చేసుకోరు. ఇప్పటికే ప్రాంతీయ భావాలు పెరిగి జాతీయ భావం సన్నగిల్లుతోంది. కేంద్రానికి కొత్త సమస్యలు, ప్రత్యేక జెండా వంటి అజెండాలతో కర్నాటక సీఎం సిద్ధరామయ్య వంటివారు సిద్ధమైనారు.
ప్రత్యేక హోదా ఇస్తే అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి సాధ్యమని ఏపీ ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఆచరణలో మాత్రం ప్రభుత్వ కార్యాలయాలు, విద్య, వైద్యం, పరిశ్రమలు, రాజధాని తదితర అంశాల్లో మేలు జరుగుతుంది. ఇప్పటికే గుంటూరు, విజయవాడల్లో జన సాంద్రత, ట్రాఫిక్ విపరీతంగా పెరిగి హైదరాబాద్ స్థాయికి చేరుతోంది. కనుక కేంద్రం తక్షణమే శ్రీకాకుళం, విజయనగరం, కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లో పరిశ్రమలకు రాయితీలు, ప్యాకేజీలు ప్రకటిస్తే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. మరోవైపు అధికార సుస్థిరత కోసం వివిధ జనాకర్షక పథకాలు పెట్టి లోటు బడ్జెట్ వైపు పయనిస్తున్న మిగులు బడ్జెట్ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని వత్తిడి చేయలేవు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇంతకంటే ఇచ్చేది కాదు.
ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు జీవన్మరణ సమస్యగా భావించదగిన బిహార్ వంటి రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్. ప్రపంచ స్థాయి రాజధాని లేకపోయినా, ముందు అవినీతి, నిత్యావసర వస్తు ధరలు తగ్గించి ప్రజల జీవన స్థాయి పెంచాలి. రాజధాని మాత్రమే సర్వస్వం కారాదు. ఒకేసారి పెరిగిన అభివృద్ధి పనులు, పథకాలతో పనిభారం పెరిగి, పాలన కుంటుబడుతుంది. స్వశక్తితో అగ్రస్థానానికి ఎదిగిన సింగపూర్, జపాన్, జర్మనీ వంటి దేశాలు మనకు ఆదర్శం కావాలి. స్వాతంత్య్రం రాక పూర్వమే కాటన్ దొర పుణ్యమాని దక్షిణ దేశపు ధాన్యాగారంగా పేరు పడ్డ ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు, కోస్తాలో ఖనిజ సంపద విస్తారంగా వున్నాయి. కొద్దికాలం ఇబ్బందులెదురైనా కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే అభివృద్ధి చెందిన అగ్ర రాష్ట్రాల సరసన ఏపీ చేరుతుంది. కేంద్రం ఎంత ఎక్కువ నిధులిచ్చినా అది కూడా ప్రజాధనమేనని గుర్తించి, రాజధాని నిర్మాణానికి ఇచ్చిన నిధులు దుబారా కాకుండా చూడాలి. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటుచేసి రాష్ట్రం పేరుకూడా సీమాంధ్రప్రదేశ్‌గా మారిస్తే సీమ ప్రజానీకం సంతసిస్తుంది. ఇందుకు ఎలాంటి ఖర్చులు, సమస్యలు వుండవు.
ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వస్తువులకు తరచూ మాంద్యం ఏర్పడుతున్న వేళ ఎన్ని ప్రోత్సాహకాలు ప్రకటించినా ఆశించినంత పరిశ్రమలు రాకపోవచ్చు. గనుక ఎల్లప్పుడూ డిమాండ్ వున్న వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తే నిత్యావసర సరుకు ధరలు నియంత్రణలోకి వచ్చి ప్రజానీకానికి మేలు జరుగుతుంది. గతంలో సమైక్యాంధ్ర పేరుతో ఏ త్యాగానికైనా సిద్ధమని ఆర్టీసీ, ప్రభుత్వోద్యోగులు సమ్మె చేస్తే వారు నష్టపోయిందేమీ లేదు. కానీ సామాన్య ప్రజానీకం తీవ్రంగా నష్టపోయింది. మళ్లీ అటువంటి ఆందోళనలతో కొత్త పరిశ్రమలు చేజారిపోయే ప్రమాదముంది.

-తిరుమలశెట్టి సాంబశివరావు సెల్: 92478 70141