Others

కోదండరామ్ పార్టీ కొత్త చిగురేమీ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్క్సిస్టు, మావోయిస్టు భావజాలంతో ప్రభావితమైన ప్రొఫెసర్ కోదండరామ్ ‘తెలంగాణ జన సమితి’ (తెజస) పేరిట రాజకీయ పార్టీని ప్రజల కోసం ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఇంతవరకు జేఏసీ పేరిట చేపట్టిన కార్యక్రమాలు పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదన్న సహచరుల మాటను శిరోధార్యంగా భావించి ఆయన కొత్త అవతారం ఎత్తారు. వర్తమాన సమాజాన్ని రాజకీయాలు కాదు సాంకేతికత మారుస్తోందని ఎందరో ప్రొఫెసర్లు చెబుతున్నారు. మారిన ప్రపంచాన్ని, రాజకీయాల్ని, యువతరం ఆకాంక్షల్ని, సాంకేతిక విప్లవాన్ని అందరి మాదిరి పాత తూకం రాళ్ళతో తూచడం తప్ప- మెరుగైన ఆలోచనలు ‘తెజస’ పార్టీ విధానాల్లో కనిపించక పోవడం విషాదం. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ, తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలు అందరికీ దక్కాలని ప్రతి ఇంటి తలుపు తడతామనడంలో మెరుపుతీగ లేవీ కనిపించడం లేదు. తెరాస పాలకుల విధానాలను తూర్పారపట్టడమే పనిగా తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ ఆవిర్భవించాయి. తాజాగా ‘తెజస’ ఆ జాబితాలో చేరింది.
కొంత రాడికల్‌గా ఆలోచించే వామపక్ష పార్టీలు, వామపక్ష తీవ్రవాద పార్టీల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో కోదండరామ్ సహా అందరికీ తెలుసు. ఎంతోకొంత నిర్మాణం, పోరాట చరిత్ర, జాతీయ-అంతర్జాతీయ మద్దతుగల వామపక్షాలకు ‘ప్రజాదరణ’ ఏపాటిదో తెలిసినా కోదండరామ్ అటువైపే మొగ్గడం ఆయన విజ్ఞతపై ప్రశ్నార్థకం నిలుపుతోంది. సామాజిక విప్లవం తీసుకొస్తామన్న వామపక్షాలు, ఆయుధాలతో సమూల ప్రక్షాళన చేస్తామన్న వామపక్ష తీవ్రవాద పార్టీల పరిస్థితిని అతిదగ్గరగా చూసికూడా కోదండరామ్ పార్టీ ఏర్పాటు-నిర్మాణం వైపు కదలడం గొప్ప పరిణామంగా కనిపించదు.
ఇప్పటికే కోదండరామ్ వైఖరిపై తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపకుడు చెరుకు సుధాకర్ గౌడ్ కారాలు-మిరియాలు నూరుతున్నారు. బి.సిలకు బదులు అగ్రవర్ణాల నాయకత్వానికి ఊతం ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. బీసి, దళిత, అణగారిన వర్గాల గళాలు వేర్వేరుగా వినిపిస్తున్నాయి. కొత్తగా పుట్టుకొచ్చిన వేదికలు, ఫ్రంట్‌లు, పార్టీల్లో అనైక్యత, వైరుధ్యం స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఎవరికివారే తమ వల్లే మార్పు సాధ్యమని ప్రకటిస్తున్నారు. అయితే తమ బలహీనత బహిర్గతమవుతోందన్న అంశం వారు విస్మరిస్తున్నారు. దశాబ్దాలుగా వామపక్ష పార్టీలు, గ్రూపులు, ముఠాలు ఇదే ధోరణిలో కొనసాగాయి, కొనసాగుతున్నాయి. ఫలితం ఏమిటి? హళ్ళికి హళ్ళి సున్నకు సున్నానే కదా? మరి కొత్తగా వచ్చిన పార్టీల,వేదికల,ఫ్రంట్‌ల పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని నేతలెవరైనా చెప్పగలరా?
నాల్గవ పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చిన మార్పులను, రాబోయే రోజుల్లో వచ్చే పరిణామాలను ఈ పార్టీలేవీ పసిగట్టి ప్రజల్ని అందుకు సమాయత్తం చేసేలా ఆలోచించడం లేదు. ఎంతసేపూ లక్షల కోట్ల బడ్జెట్ తమ చేతుల మీదుగా ఖర్చుకావాలన్న ఆలోచన, అధికార దర్పాన్ని దక్కించుకోవాలన్న కాంక్ష తప్ప- డిజిటల్ ఎకానమీ, డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కదం తొక్కించే ప్రయత్నం కనిపించదు. ప్రజలు అధికారానికి బదులు ప్రథమ శ్రేణి జీవనం కావాలని ఆశిస్తున్నారు. ఆ ఆశ నెరవేరాలంటే ఆధునిక ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం ముఖ్యం. కొత్త పార్టీల ప్రణాళికలు అందుకు అనుగుణంగా ఉన్నాయా? లేవనే చెప్పాలి.
దేశంలో వంద మందికి పైగా దళిత కోటీశ్వరులున్నారు. ఆ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వారు ప్రత్యేకంగా వాణిజ్య మండలిని ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ఈ మార్గమే కదా ప్రథమశ్రేణి పౌరులుగా మార్చేది! పార్టీల జెండాలు మోస్తే బడుగు వర్గాలు ప్రథమశ్రేణి పౌరులుగా ఎదుగుతాయని ఎవరైనా చెబితే అది దగా మాత్రమే! ఈ విషయం పొలిటికల్ సైన్స్ పాఠాలు చెప్పిన కోదండరామ్‌కు తెలియనిది కాదు. సృజనాత్మకతను ప్రోత్సహించాల్సిందిపోయి అన్ని అవలక్షణాలకు ‘అడ్డా’గా ఉండే పార్టీలకు ప్రాధాన్యతనివ్వడం కాలాన్ని ‘గేలి’చేయడం తప్ప మరొకటి కాదు.
‘రాజకీయం సమాజానికి గుండెకాయ లాంటిది, కాబట్టి దానిపై మాకు ద్వేషం లేదు.. ప్రత్యామ్నాయ పద్ధతులకే పెద్దపీట వేస్తామ’ని ఎంత చెప్పినా రాజకీయ ఊబి వెలుపల నిలిచి చెప్పిన మాటలే అవి. అందులో దిగాక రాజకీయమే జీవితమవుతుంది తప్ప ఆగామి గూర్చిన ఆలోచనలు తేజోవంతంగా వెలగవు. అప్పుడే ‘ప్రగతిభవన్ గడీని బద్దలుకొడతామ’ని కోదండరామ్ అంటున్నారు. ఈ భాష ప్రజల జ్ఞానాన్ని పెంచదు. అధికార పార్టీ రాజకీయంలో విపరీతమైన అవినీతి నెలకొందని కొత్త పార్టీలు ‘ప్రత్యేకం’గా చెబుతూ వున్నాయి. ఎక్కడెక్కడ అవినీతి విపరీతంగా జరిగిందో వెలికితీసి ప్రజాకోర్టులో నిలబెట్టే అవకాశాలు ఇప్పుడు బోలెడున్నాయి. ‘ఆర్టీఐ’ ద్వారా ఈపాటికే వాటిని వెలికితీసి అధికార పక్షాన్ని దోషిగా నిలపాల్సింది. రాజకీయ వేదికలు, పార్టీలు ఏర్పాటు చేస్తే అవినీతి అంతరించిపోతుందా? అవినీతికి వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తిచేయకుండా, నైతిక విలువలను కాపాడే కార్యక్రమాల్ని చేపట్టకుండా పార్టీలు ఏర్పాటు చేయడం వల్ల ఒరిగే ప్రయోజనమేమిటో విజ్ఞులు వివరించాలి.
ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో వి-హబ్ ప్రారంభమైంది. అందులో ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలున్నారు. ఆకాశంలో సగం కాదు ముప్పావు మేమే.. అన్న రీతిలో కార్యాచరణను రూపొందించారు. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక హైదరాబాద్ వచ్చినప్పుడు సైతం పెద్దఎత్తున ఆలోచనల వికసనకు వాతావరణం ఏర్పడింది. సృజనకు ఆకారం ఇచ్చేందుకు, వాటిని ఫలవంతం చేసేందుకు నిర్దిష్ట కార్యాచరణ కనిపిస్తోంది. ప్రపంచమంతటా ఇదే వాతావరణం పరిఢవిల్లుతోంది. ఇవేవీ కొత్తపార్టీల్లో ప్రతిఫలించడం లేదు. పాత ఐడియాలకే పరిమితం కావడం విషాదం గాక ఏమవుతుంది?
జ్ఞానం పెరిగితే సంపద పెరుగుతుంది. కృత్రిమ మేధ, రోబోటిక్స్, డిజిటల్ రంగం విస్తృతమవుతున్న తరుణంలో ఆ జ్ఞానం ఆనుపానులపై అత్యధిక శ్రమచేయాల్సింది మరచి రాజకీయ నినాదాలు ఇస్తే సంపద వృద్ధిచెందుతుందా? ప్రొఫెసర్లు, వక్తలు ఈ విషయమై మరింత లోతుగా విశే్లషించి ప్రజాసమూహాలకు వివరించాలి. కాని అలాంటి చర్యలేవీ కనిపించడం లేదు. పిండికొద్దీ రొట్టె. ఇది అతి సాధారణమైన సూత్రీకరణ అయినా అత్యంత కీలకమైనది. దీన్ని విస్మరించి మాటలు చెప్పడం ఆరోగ్యకరమైన అంశం కాదు. పిండి యొక్క రాశిని పెంచుకునే వైనం తెలిసుండాలి. అటువైపుప్రజల అడుగులు పడేందుకు పార్టీలు ప్రోత్సహించాలి. మరో రాజకీయ పార్టీనో, ఫ్రంట్‌నో, వేదికనో ఏర్పాటుచేయడంతో ప్రత్యామ్నాయం పొద్దుపొడవదు. దీన్ని కోదండరామ్ లాంటివారు సైతం విస్మరించడం విడ్డూరమే! పిండికొద్దీ రొట్టె అన్న మాటను విస్మరించడం వల్లే అనేక పార్టీలు గాలిలో మేడలు నిర్మిస్తూ ప్రజల్ని భ్రమల్లోకి లాగుతున్నాయి. అదే పనిని కొత్తపార్టీలు కూడా చేస్తే ఏమిటి ప్రయోజనం?
తెలంగాణ ఉద్యమ ఫలాలు ప్రజలందరికీ అందాలంటే వారి ఆలోచనల్లో మార్పువచ్చినప్పుడే అది సాధ్యపడుతుంది. నైపుణ్యాలు పెంచుకున్నప్పుడు, ప్రపంచంతో కలిసి నడిచేందుకు సిద్ధమైనప్పుడే అది వీలవుతుంది. జ్ఞానానికి, మంచి ప్రవర్తనకు, సృజనకు పెద్దపీట వేసినప్పుడు సాధ్యమవుతుంది. పోటీతత్వం, స్పర్థ గూర్చిన ప్రాథమిక పాఠాలు వివరించకుండా, ఇంకా సోషలిస్టు ఆలోచనల భావజాలంతో నినాదాలిస్తే జనం కడుపు నిండదు. ప్రజల్ని చైతన్యపరచకుండా, వారిని సమకాలీన పరిస్థితులకనుగుణంగా తీర్చిదిద్దకుండా, అన్ని ప్రభుత్వమే అందిస్తుందన్న ప్రచారం, ప్రభుత్వమే అందించాలన్న డిమాండ్ లోపభూయిష్టమైనది. అది కాలం చెల్లిన విధానం. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ‘టూల్స్’ముంచెత్తుతున్న తరుణంలో అందుకు భిన్నమైన రీతిలో ప్రజల్ని మభ్యపుచ్చడం తెలివైన పనికాదు. కోదండరామ్ లాంటి లోకం తెలిసినవారు అటువైపు మొగ్గడం దురదృష్టకరం.

- వుప్పల నరసింహం 99857 81799