Others

ఓయూ మనుగడ ప్రశ్నార్థకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో భారతీయ భాషలో ప్రారంభమైన తొలి వర్సిటీగా ఘనత వహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘వందేళ్ల పండుగ’ ముగిసింది. గత ఏడాది ఏప్రిల్ 27న అప్పటి రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ ఈ వేడుకలను ప్రారంభించారు. ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించాలని వర్సిటీ అధికారులు నిర్ణయించగా, రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీ అభివృద్ధికి 200 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఇక వర్సిటీ దశ తిరుగుతుందని విద్యార్థులు ఆశించారు. అధికారుల ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. అటు ప్రభుత్వ నిర్లక్ష్యంతో, ఇటు అధికారుల అలసత్వంతో వర్సిటీలో ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టలేదు. ప్రభుత్వం 50 కోట్లు మాత్రమే విదిల్చి చేతులు దులుపుకొంది.
ఒకప్పుడు అధ్యాపకుల లోటులేకుండా ఉన్న యూనివర్సిటీ నేడు అన్ని రకాల అసౌకర్యాలకు ఆలవాలంగా మారింది. వర్సిటీని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. ముగింపు వేడుకలపై ప్రభుత్వం ఎలాంటి ఆసక్తి చూపలేదు. తెలంగాణ ఉద్యమంలో వర్సిటీ విద్యార్థులను ధీరులు, శూరులుగా పొగిడిన నేతలకు నేడు ఉస్మానియా అంటరానిది అయిపోయింది. గత ఏడాది కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ విడుదల చేసిన ర్యాంకులలో ఓయూకు 23వ స్థానం వచ్చింది. ఈ విద్యా సంవత్సరంలో ఆ ర్యాంకు 38వ స్థానానికి దిగజారింది. ఒకప్పుడు మిగతా యూనివర్సిటీలకు మార్గనిర్దేశనం చేసిన ఓయూ నేడు ప్రభుత్వ సహకారం కొరవడింది.
ఎన్నో ఆశలతో ఓయులో సీటు సాధించిన విద్యార్థులు- అధ్యాపకులు లేక వెలవెలపోయిన తరగతి గదులను చూసి బాధపడుతున్న సందర్భాలు నేటికీ ఉన్నాయి. అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తారని ఇటు నిరుద్యోగులు, అటు యూనివర్సిటీ అధికారులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తూనే ఉన్నారు. రెండేళ్లపాటు రెగ్యులర్ వీసీ లేరని, ముందు ఆ స్థానాన్ని భర్తీచేయాలని సాకుగా చూపుతూ కాలం గడిపిన ప్రభుత్వం ఇపుడు త్వరలో వెయ్యికి పైగా పోస్టులను భర్తీచేస్తామని చెబుతోంది. ఇక్కడ చదివిన విద్యార్థులు కేవలం డిగ్రీలను చేత పట్టుకుని బయటకు పోతున్నారే తప్ప, నైపుణ్యాలు నేర్చుకునే పరిస్థితి లేదు. యూజీసీ నిబంధనల ప్రకారం ఒక్కో కోర్సుకు కనీసం ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధిగా ఉండాలి. అలా ఉన్నపుడే ఆ కోర్సు గుర్తింపు వస్తుంది. లేదంటే దాన్ని రద్దు చేయాల్సి వస్తుంది. ఆ నిబంధన సరిగా అమలుచేస్తే 35కోర్సులు రద్దుఅవుతాయి. ఇంజనీరింగ్ ఈసీఈ అంటే ప్రతిష్టాత్మకమైన కోర్సు. అయినా ఒక్క ప్రొఫెసరూ లేరంటే నమ్మలేని పరిస్థితి. ప్రస్తుతం ఒకే ఒక అసోసియేట్ ప్రొఫెసర్‌తో ఆ డిపార్ట్‌మెంట్ నడుస్తోంది. ఉర్దూ కోర్సులో 19మంది అధ్యాపకులకుగాను నలుగురే ఉన్నారు. సైకాలజీ కోర్స్‌లో 11మందికి గాను కేవలం ఇద్దరు ఉన్నారు. కీలకమైన చాలా కోర్సులకు అధ్యాపకుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.
కొన్ని కోర్సులకు కాంట్రాక్ట్ అధ్యాపకుల చేత బోధన చేయిస్తున్నారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా 1603 మంది అధ్యాపకులు అవసరమని యూజీసీ తేల్చి చెప్పింది. చాలా కాలంగా సుమారు వెయ్యి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెలలో కనీసం ఇద్దరు, ముగ్గురు అధ్యాపకులు పదవీ విరమణ చేస్తున్నారు. తెలంగాణలో మిగతా వర్సిటీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నిధులను సరిగ్గా విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి కొనసాగుతోంది. గత ఏడాది తెలంగాణలో అన్ని యూనివర్సిటీలకు 420 కోట్లు కేటాయిస్తే- 210కోట్లు మాత్రమే విడుదల చేసారు. నిధుల విడుదల ఇలాగే ఉంటే యూనివర్సిటీలు ఎలా అభివృద్ధి చెందుతాయో పాలకులకే తెలియాలి. నియామక ప్రకటనలు వెలువడతాయని చెబుతున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. తెలంగాణలో ఏ యూనివర్సిటీకి కూడా పాలక మండళ్లు లేవు. శాతవాహన యూనివర్సిటీకి చాలాకాలంగా వైస్ చాన్సలర్‌ను నియమించలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును ఆమోదించడంతో ప్రభుత్వ రంగంలో ఉన్నత విద్య ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.
వందేళ్ల ఓయూను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇందుకు నిధులు, నియామకాలపై చిత్తశుద్ధితో దృష్టి సారించాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యకు, పరిశోధనలకు ఆసక్తి చూపుతున్నారు. అధ్యపకుల కొరతతో వారికి ఆ అవకాశం రావటం లేదు. ‘వందేళ్ల పండుగ’ను మొక్కుబడిగా జరిపితే ఫలితం ఉండదు. రాజకీయ సంకల్పం లేకుండా ప్రజాస్వామ్యంలో విశ్వవిద్యాలయాలు మనుగడ సాగించలేవు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా యూనివర్సిటీ అధికారులు, ప్రభుత్వం ముందడుగు వేయాలి.

- చింత ఎల్లస్వామి సెల్: 99081 86025