Others

ఆదర్శం.. ఆంధ్రకేసరి సాహసం, త్యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు టంగుటూరి వర్థంతి
*
పుట్టు పేద పట్టుదలతో
గుండె దిటువే పెట్టుబడిగా
పెరిగి పెరిగి పెద్దల పెద్దయై
మహేంద్ర భోగాలనుభవించి
మహాగ్ర నాయక మణియై
దేశ దాస్య విమోచనా యజ్ఞంలో
తన సర్వస్వం ఆహుతిగావించి
భారత స్వాతంత్య్ర మహాసమరంలో
ఆంధ్రుల నొక్క తాటిపై నడిపించిన
ఆంధ్ర కేసరి ప్రకాశం
* * *
దైవగుణాన్ని కలిగి ఉండడం, ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయడం అలవాటు చేసుకుంటే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని ఛేదించవచ్చు. ఇది జీవిత సత్యం. జీవనవేదం కూడా ఈ విషయాల్ని బోధిస్తూ స్పష్టం చేస్తూ ఉన్న జీవితాలు ఎవరివైనా ఉన్నాయా అని ప్రశ్న ఎప్పుడైనా తలెత్తితే దానికి సమాధానం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారిదే. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోనూ ప్రజాహితమూ, జన సంరక్షణనూ విడిచిపెట్టని ప్రజల మనిషి మన ఆంధ్రకేసరి అనటంలో అతిశయోక్తి లేదేమో.
నిజానికి పంతులుగారి జీవితం రెండు భాగాలుగా కనిపిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడు కాకముందు తొలి భాగమైతే, సమరానికి తరువాత జీవితం మలిభాగం... పంతులుగారు సంపాదించిన ఆస్తి, పలుకుబడి, విషయ, లోకజ్ఞానం, శక్తిసామర్థ్యాల వికాసం తొలిభాగమైతే, అట్లా సంపాదించిన ఆస్తిపాస్తులు, శక్తి సామర్థ్యాలు, భారతమాత దాస్య విమోచనానికి ప్రజాసేవకూ, సంరక్షణకూ ఎట్లా త్యజించాడో తెలియజేస్తుంది మలిజీవితం.
1872లో నేటి ప్రకాశం జిల్లా కనపర్తిలోని గోపాలకృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు వినోదరాయడుపాలెం గ్రామంలో 23 ఆగస్టున జన్మించాడు. తన 11వ ఏటనే తండ్రి మరణించడంతో బాల్యం నుంచి దుర్భర పేదరికాన్ని అనుభవించాల్సి వచ్చింది. ప్రకాశాన్ని చదివించడానికి ధీరవనిత తల్లిగారు సుబ్బమ్మగారు ఒంగోలులో ‘పూటకూళ్ళు’ నిర్వహించారు. ప్రకాశంగారికి పరీక్ష ఫీజు మూడు రూపాయలకోసం, తనకున్న ఒకే ఒక పెళ్లి పట్టుచీర తాకట్టుపెట్టాల్సిన దారిద్య్రాన్ని అనుభవిస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేసి మట్టిలోని రాయిని మాణిక్యంగా తీర్చిదిద్ది తెలుగుజాతి గర్వించేలా ప్రకాశాన్ని దేశానికి అందింది ఆ మహాతల్లి.
న్యాయవాదిగా..
1894 రాజమండ్రి పట్టణంలో న్యాయవాది ప్రాక్టీసు ప్రారంభించారు. అనతికాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. తరువాత ఇంగ్లండు వెళ్లి బారిస్టర్ చదివి మద్రాసులో 1907 నుంచి 1921 దాకా ప్లీడర్‌గా రెండు చేతులా అపరిమితమైన ఆస్తులను సంపాదించాడు. ఆ రోజుల్లోనే రోజుకు 1000 రూపాయలు ఫీజు తీసుకునేవారు. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. మద్రాసు నుండి కలకత్తాదాకా పెద్ద పెద్ద బంగళాలు, స్థలాలు కొన్నారు ప్రకాశంగారు. పంతులుగారిని మద్రాసులో ఆ రోజుల్లో ‘ప్రిన్స్ ఆఫ్ మద్రాస్’గా స్నేహితులు పిలుచుకునేవారు. ఎంతటి బోగియో అర్థమవుతుంది.
మహాత్మాగాంధీ పరిచయం..
ప్లీడరుగా కేసుల విషయమై లండన్‌కు వెళ్లిన సందర్భంలో మహాత్ముని కలుసుకున్నాడు. ఈ కలయికే ‘ఆంధ్రకేసరి -జాతిపిత కలయిక’ ప్రకాశంగారి జీవితాన్ని తద్వారా దక్షిణ భారత స్థితిగతులనూ మార్చేసింది. లక్షలు తెచ్చిపెడుతున్న న్యాయవాది వృత్తిని వదిలేసి స్వాతంత్య్ర సమరంలో దూకాడు. తన సర్వస్వాన్ని భారతమాత విమోచనకై, స్వరాష్ట్ర సాధనకై, తెలుగువారి ఐక్యతకోసం తన జీవితాన్ని అంకితం చేశాడు.
భోగి యోగి అయినాడు
దేశ స్వాతంత్య్ర ఉద్యమం వైపునకు ప్రజలను చైతన్యం చేసేందుకు ‘స్వరాజ్య’ పత్రికను జాతీయ స్థాయిలో ఆంగ్లం, తమిళం, తెలుగు భాషల్లో స్థాపించి ఆయుధంగా ఉపయోగించాడు. దీనికిగాను తను సంపాదించింది అంతా ధారపోశాడు ఆ నిస్వార్థ త్యాగి.
ఉద్యమాల్లో అన్నీ తానై.. అంతటా తానై..
హోమ్‌రూల్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, వ్యక్తి సత్యాగ్రహం, క్విట్ ఇండియా మూమెంట్, సైమన్ గోబ్యాక్ ఆందోళనలలో ఎప్పుడూ ముందుండేవాడు. అనేక సందర్భాలలో పోలీసులను ఎదురించి అనేక జైళ్ళలో కారాగారశిక్షలను అనుభవించారు. మద్రాస్‌లో సైమన్ గోబ్యాక్ ఆందోళన తను ఒక్కడే నడిపించి, బ్రిటీష్ తుపాకులను ఎదురించి గుండె చూపించి కాల్చుకోండి అని సవాలు విసిరారు. అప్పటినుంచి ‘ఆంధ్రకేసరి’గా ఆయన ఖ్యాతి దశదిశలా వ్యాపించింది.
ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను రచించి, ఆచరణలో పెట్టి అధికార వికేంద్రీకరణకు ఆద్యుడైనాడు. ఒకానొక సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, ఓ అధికారి ‘అయ్యా, మీరు చెప్పిన పథకాన్ని నేను అవలంభించాలి అంటే అలాంటి జీవో లేదు’ అన్నాడు. వెంటనే పంతులుగారు ‘నా మాటే ఒక జీవో, వెంటనే ఆ పథకాన్ని అమలు చేయమన్నాడు’.
ఉదారం త్యాగం
పంతులుగారికి ఈ రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసలకు తార్కాణం, ఉదాహరణలు చాలా ఉన్నాయి. కొన్నింటిని పరిశీలిస్తే నిజమని తెలుస్తుంది. ‘‘ప్రజల మనిషి ప్రకాశం’’, ‘‘నేనే ప్రజ - ప్రజే నేను’’ అని బహిరంగంగా ప్రకటించిన మరో జాతీయ నాయకుడు లేడు. ఎక్కడ ప్రమాదమో అక్కడ ప్రకాశం, ఎక్కడ సమస్య ఎదురైతే అక్కడ ప్రకాశం. 1921లో కేరళలోని మలబార్‌లో మప్లాలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం రెచ్చిపోయి వందకుపైగా ప్రజలను గూడ్సు వ్యాగన్‌లో కుక్కి జైళ్ళకు తరలిస్తుంగా 70 మందికిపైగా ఊపిరాడక చనిపోయారు. దీనికి పంతులుగారి హృదయం చలించింది. రహస్యంగా ప్రమాద పరిస్థితులను లెక్క చేయకుండా కొన్ని మైళ్ళు కాలినడక సాగించి అక్కడి ప్రజలను కలిసి వాస్తవ నివేదికను తనే తయారుచేసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి పంపారు. అట్లాగే తెలంగాణలో రజాకార్ల అరాచక, హింసాకాండల నడుమే ఆ మునగాల పరగణాలలో తెలుగువారిని కలిసి వారిని ఆప్యాయతగా పలకరించాడు. మీకు నేనున్నాను, త్వరలో తెలుగువారికి కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది. అప్పుడు ఈ హింసాకాండ ముగుస్తుందని భరోసా ఇవ్వడం. అసలు ఆ ప్రాంతానికి వెళ్ళడమే ఆత్మహత్యతో సమానమని అధికారులు హెచ్చరించినా ప్రాణాలకు తెగించి వెళ్ళే గుండె ధైర్యం, నిబ్బరం ఆంధ్రకేసరికే చెల్లింది, సాధ్యమైంది.
తొలి ముఖ్యమంత్రిగా
ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన చూపిన కార్యదీక్షతా దీక్ష, ప్రతిభ ధైర్యం, స్థిరత్వం, దూరదృష్టి, జనహితం వెలకట్టలేనివి. రాష్ట్ర అవతరణ రోజున రెండు వేలమంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి విముక్తి కలిగించారు. పర్యవసానంగా దేశం మొత్తంలోనే అది కేసరులకే సాధ్యం అని అనేక ప్రముఖ జాతీయ నాయకుల నోట కీర్తిప్రశంసలను గడించారు. కాంగ్రెస్ విధానాలను, గాంధీయిజమ్‌లను ఆచరించి అమలుపరిచే మార్గంలో ఆంధ్రకేసరి చూపిన అంకిత ధర్మపాలనకు మహాత్ముడే (తనను ఎదిరించిన సందర్భాలున్నప్పటికీ) ఆశ్చర్యచకితుడైనాడు. ప్రకాశం పథకాలను యావత్ భారతదేశంలో అమలుపరచమని గాంధీగారికి, నెహ్రూగారికి సలహా ఇవ్వమని ఓ మంత్రి అడిగితే గాంధీగారు అన్న మాటలు ఇవి. అవి అక్షర సత్యాలు కావా? అలాంటి సాహస నిర్ణయాలు, అమలుచేసే తెగింపు కేవలం కేసరులకే సాధ్యం. పండిత్‌లకు సాధ్యం కాదు. ఆ అమాయక మంత్రి మరో మాట మాట్లాడలేదు.
ప్రముఖుల మాటల్లో ప్రకాశం
‘‘నాకు జ్ఞాపకం ఉన్నంతవరకూ 1920 నుంచి 35 దాకా ప్రకాశంగారితో నాకు పరిచయం వుంది.. ఆయన గుణసంపత్తిని నేను ఎల్లప్పుడూ ప్రశంసాభావంతోనే గ్రహించేవాడిని.. వృద్ధులైనప్పటికీ ప్రకాశంగారు కార్యాచరణలో చూపించే జాగృతి, శక్తి, త్యాగదీక్ష, కార్యదక్షత మన స్మృతిపథంలో స్ఫుటంగానే ఉన్నాయి... ఆయన మహత్మ్యం ఆంధ్ర దేశ నిర్మాతగా మాత్రమే కాదు భారత రాజకీయ రంగమంతటా ఆయన ప్రభావమున్నది... బ్రిటీష్ తుపాకులకు గుండె చూపించిన సాహసి... ఆయన లేని ఆంధ్ర రాష్ట్రం తలలేని మొండెము వంటిది అన్నారు పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ అప్పటి భారత ప్రధాని స్థాయిలో ఉండి. అంతేకాకుండా, పంతులుగారు కాంగ్రెస్‌లో లేనప్పటికీ ‘ఆంధ్రకేసరే’ ఆంధ్రకు సరి అన్నట్లుగా ముఖ్యమంత్రి పదవికి ఒప్పించారు.
అప్పటి లోక్‌సభ స్పీకర్ శ్రీ అనంత శయనం అయ్యంగారు ‘‘మనం సైమన్‌ను బాయ్‌కాట్ (1928) చేసిన సమయంలో... ఇతర జాతీయ నాయకులం అని చెప్పుకునే అందరు నాయకులూ ఎదురించలేక నిలబడలేక మద్రాస్ నగరం వదిలి వెళ్లిపోయారు. ప్రకాశంగారు ఒక్కరే ముందుకు వచ్చారు.. ఆయన తన సర్వస్వం దేశ స్వాతంత్య్ర సమరంలో త్యాగం చేసిన మహావ్యక్తి. మరణించిననాటికి ఒక రాగి పాత్రయినా మిగుల్చుకోలేదు. సకలాంధ్రదేశం ఈ రోజు (మే 20, 1957) దుఃఖసాగరంలో నిమగ్నమయింది అని రుద్ధకంఠంతో చెప్పారు.
ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీగారు ‘‘స్వాతంత్య్ర జ్యోతిని సాహసంతో వెలిగించిన దేశభక్తాగ్రశ్రేణికి చెందినవారు ప్రకాశంగారు... నవ్యాంధ్రప్రదేశ్ జనకుడు ఆయన. భారత జాతీయోద్యమ నాయకశ్రేణిలో అగ్రశ్రేణికి చెందిన నాయకుడు’’ అని ప్రశంసించారు.
డా.్భగరాజు పట్ట్భా సీతారామయ్యగారు అంటారూ- ‘‘ప్రకాశంగారికి రేపటి చింత లేదు. నేను ఎల్లుండి విషయం కూడా ఆలోచింతును... ఎచట ప్రమాదమున్న అచట ప్రకాశం ప్రత్యక్షమగును.. నేనొక వేదాంతిని. ప్రకాశంగారొక సైనికుడు, వీరుడు. ప్రకాశంగారిని ఆపదలాకర్షించును. క్షేమ పద్ధతి ఆకర్షింపదు. తెగింపు ఆయన నైజము, సలహాలను స్వీకరించడు. లేమిడికాశపడును.. ఇంత పట్టుదలతో, ఉత్సాహంతో, ఇన్నియేళ్ళుగా సేవ చేసిన వ్యక్తి చరిత్రలో లేడు. ఆయనకు చేయెత్తి నమస్కరించుట మన విధి’’.
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, గుంటూరులో హైకోర్టు స్థాపన, కృష్ణా బ్యారేజ్, రైతుల రుణాల మాఫీ, చేనేత కార్మికులపై పన్నుల ఎత్తివేత, 17 నీటి పారుదల ప్రాజెక్టులు మంజూరు చేసిన కర్మయోగి. ముఖ్యమంత్రి పదవి నుంచి అవిశ్వాస తీర్మానంతో తొలగించినా కృంగిపోలేదు. పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవే తన జీవిత లక్ష్యంగా భావించి అహర్నిశలు తెలుగువారి సంక్షేమం కోసం స్వరాష్ట్ర సాధన కోసం తపించారు ప్రకాశంగారు. ప్రజాసేవలో అలుపెరుగని సేవకుడు, నిస్వార్థ సైనికుడు మే 20, 1957న హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో తుదిశ్వాస వదిలారు.
ప్రకాశంగారి ఆశయసిద్ధికోసం ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా ఆయన పేరుమీద ‘ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ’ అనే స్వచ్ఛంద సంస్థను స్వర్గీయ టంగుటూరి సూర్యనారాయణరావుగారు 1972లో హైదరాబాద్‌లో స్థాపించారు. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ పి.వి.నరసింహారావుగారు సంస్థకు అండగా నిలిచి ఆవిష్కరించారు. ఈనాటివరకూ పంతులుగారి కలలను నిజం చేయడానికిగాను వారి ఆశయసిద్ధికోసమై వారు చూపిన మార్గదర్శకాలను ప్రజలలోకి ప్రచారం చేస్తూ కృషి చేస్తున్నది.
ప్రకాశంగారు నటుడిగా, న్యాయవాదిగా, పోరాటయోధుడిగా, పరిపాలనాదక్షుడుగా లోకానికి సుపరిచితులు. కానీ ఆయనలో ఆధ్యాత్మిక చింతన అంతర్లీనంగా ఉండేదని తెలిసినవారు చాలాకొద్దిమందే ఉన్నారు. తిరుచునాపల్లి జైలులో తోటి ఖైదీలతో కలిసి రామాయణ, మహాభారత పురాం పఠనం సాగించేవారని తెనే్నటి విశ్వనాధంగారు వివరించారు. విద్వత్కవి, కలచవీడు వెంకట రమణచార్యులు పురాణం చెప్తుండగా ప్రకాశం వ్యాఖ్యానం చేస్తూ ఉండేవారు. బహుశా అదే జైలులో ఉండగానే భారతదేశ ఆర్థిక అంశాలపై రచనలతోపాటు ‘యోగసూత్రాలు’ అనే గ్రంథం రాశారని తెనే్నటి విశ్వనాధంగారు, పిలకా గణపతి శాస్ర్తీగారు వ్రాశారు. శ్రీకృష్ణుడు ఒక గొప్ప రాజనీతిజ్ఞుడని ప్రకాశంగారి భావన.
డా మల్లెల గురవయ్యగారి మాటల్లో ఆంధ్రకేసరి! నీసరి అన్యులెవరు?

చిత్రాలు..యువకుడిగా..
*బారిస్టర్‌గా..
*ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం

-టంగుటూరి శ్రీరాం 9951417344