Others

నేతన్నకు ఆసరా ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేత కార్మికులకు గత నాలుగేళ్ల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి చెయ్యి చూపించాయి. మూడేళ్లక్రితం- చేనేతకారుల కష్టాలను చూసి ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కసారిగా చలించిపోయారు. చేనేతకార్మికులను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఫలితంగా 2015 నుండి చేనేత రంగం ప్రాధాన్యతను తెలిపేందుకు ఏటా ఆగస్టు 7న ‘జాతీయ చేనేత దినోత్సవం’గా జరుపుతున్నారు. ఇప్పటికి మూడుసార్లు జరిగిన చేనేత దినోత్సవాలలో మోదీ అనేక వాగ్దానాలు చేశారు. కనీసం ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. నేటికీ చేనేత కార్మికుల సర్వే పూర్తిచేయలేదు. వారికి గుర్తింపుకార్డులను మంజూరు చేయలేదు. నేతన్నలపై కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో ఇదే తార్కాణం. ఎన్డీఏ పాలనలో నేతన్నల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడుతుందని నాయకులూ నమ్మబలికారు. వాస్తవంలో చేనేతకారులకు ఒరిగింది ఏమీ లేదు.
ఇతర ప్రాంతాలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ నేతన్నల ఆత్మహత్యలు, ఆకలి చావులు ఆగలేదు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా ఉచిత వాగ్దానాలిచ్చే బదులు చిత్తశుద్ధితో వారి సంక్షేమానికి కృషిచేయవలసిన అవసరం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో చేనేతకారుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పటికీ వేలాది కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువగానే ఉన్నాయి. వారి జీవనం రోజురోజుకు కష్టతరమవుతోంది. పాలకులు మారుతున్నారు, కానీ నేతన్నల తలరాతలు మారడం లేదు. ప్రభుత్వాల నుంచి లభించే ఆదరణ, ప్రోత్సాహం అంతంత మాత్రమే. మగ్గం తప్ప మరో మార్గం తెలియని చేనేత కార్మికుల బతుకుల్లో చీకట్లు అలముకొన్నాయి. పెరుగుతున్న జీవన వ్యయం తట్టుకోలేక రానురాను నేతన్నలు నిరుపేదలుగా మారుతున్నారు. వైద్యఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో వారి కష్టాలు దారుణంగా ఉన్నాయి. అనారోగ్యం పాలైతే కాటికెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. కుటుంబమంతా కలసి రోజంతా కష్టపడినా కనీస కూలి గిట్టుబాటు కాకపోవడంతో క్రమంగా ఇతర వ్యాపకాల వైపు నేతన్నలు దృష్టిసారిస్తున్నారు. కొందరు మాత్రం వారసత్వంగా నమ్ముకున్న చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. నేతన్నల బాగుకోసం పాలకులు హామీలు ఇస్తున్నారే తప్ప వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్నారు. ఏపీ ప్రభుత్వం కల్పించిన చేనేత రుణమాఫీ నేటికీ అర్హులందరికీ దక్కలేదు. దీంతో బ్యాంకర్ల నుండి వారిపై తీవ్ర ఒత్తిడి కలుగుతోంది. ఫలితంగా నేతన్నలు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.
అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన ఘనత తెలుగు నేతన్నలది. విదేశాలలో మన చేనేత వస్త్రాలకు నేటికీ గిరాకీ ఉంది. ప్రపంచీకరణ ప్రభావాలు, పాలకుల విధానాల కారణంగా చేనేత పరిశ్రమ చితికిపోతోంది. చేనేత వృత్తి కళ్లముందే కుప్పకూలుతున్నా దానిని కాపాడే గట్టి ప్రయత్నాలు మృగ్యమైనాయి. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు నేతన్నలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప, వారి అభ్యున్నతికి పాటుపడటం లేదు. దీంతో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయి నిస్తేజమైపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకోవడానికి అమలు చేస్తున్న కొన్ని సంక్షేమ పథకాలు వారి జీవన గతిని మార్చలేకపోతున్నాయి. యాభై ఏండ్లు పైబడిన నేత కార్మికులకు ప్రతి నెలా అందుతున్న వెయ్యి రూపాయల పింఛను మాత్రం వారికి కాస్త ఆసరాగా నిలిచింది. ఇలాంటి అరకొర చర్యలతో చేనేతకారుల కష్టాలు ఆసాంతం తొలగిపోతాయనుకుంటే అది భ్రమే! నేతన్నలను కాపాడటానికి ఇప్పటికైనా మన పాలకులు నడుం బిగించాలి. బ్యాంకుల నుండి ఎలాంటి కొర్రీలు లేకుండా ప్రతి నేత కార్మికుడికీ రూ.లక్ష వరకూ వడ్డీలేని రుణాలు ఇప్పించాలి. చేనేత ఉత్పత్తుల అమ్మకాలకు నేతబజార్లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థుల ఏక దుస్తులకు అవసరమైన వస్త్రాలను పూర్తిగా చేనేత రంగం నుంచే కొనుగోలు చేయించి జనతా వస్త్ర పథకాన్ని పునరుద్ధరించాలి. చేనేత కుటుంబాలవారు అనారోగ్యానికి గురైతే ఏ ప్రైవేటు ఆస్పత్రులలోనైనా ఉచితంగా చికిత్స చేయించుకొనే పథకాన్ని ప్రవేశపెట్టాలి. చేనేతకారుల కష్టాలను కడతేర్చడానికి ‘చేనేత కార్పొరేషన్’ ఏర్పాటు చేయాలి.
*
(నేడు జాతీయ చేనేత దినోత్సవం)
*
చేనేత కార్మికుడా..
*
ఎక్కడ నీ చిరునామా?
పడుగు పేకల కలబోత చేనేత
ఏళ్ల తరబడి నమ్ముకున్న నీ వృత్తి
చేరింది పతనావస్థకు
అగ్గిపెట్టెలో పట్టే
చీర నేసిన ఘనత నీది
పగలనకా రేయనకా
రెక్కలు ముక్కలయినా
పూటగడవని దుస్థితి
తిండి లేక బక్కచిక్కిన
డొక్కలు చేరుతున్నాయి కాటికి
కానరావే ప్రభుతకు
నేత కార్మికుల కష్టాలు
చితికిపోతున్న
చేనేత కార్మికుడా...
ఎక్కడ నీ చిరునామా?

-బట్టా రామకృష్ణ దేవాంగ