Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనుక మానవ లోక సంఘటనలు గ్రహలోకానికి ప్రతిబింబాలు. ఇది ఒక చక్రం! ఈ చక్రంలో కేవలం పూర్వ కర్మల ప్రతిబింబాలు మాత్రమేకాక, మానవుల సంకల్పబలం అనే కొత్త అంశం కూడా వచ్చి చేరింది. అందువల్ల ఈ ప్రతిబింబ చక్రం నిత్య చలనశీలంగా మారిపోయింది. ఈ సత్యాన్ని గ్రహించక, ఈనాటి వైజ్ఞానికులు భూలోక సంఘటనలకు కారణాలను భూలోకంలో మాత్రమే వెతుక్కుంటున్నారు.
అందువల్ల, అనేకచోట్ల మూలకారణాలు తెలియక ఇబ్బందిపడుతున్నారు. అయితే, ఇరవైయో శతాబ్ది ఉత్తర భాగంలోకి వచ్చేసరికి అనేకమంది నోబుల్ పురస్కార గ్రహీతలు తమ దృష్టిని మార్చుకున్నారు.
ఉదాహరణకు ఆర్థర్ ఎడింగ్‌టన్ ఒకచోట మాట్లాడుతూ,- ‘‘హైసన్‌బర్గు’’ యొక్క ‘‘ప్రిన్సిపల్ ఆఫ్ అన్‌సర్టినిటీ’’- అనిశ్చితావాద ఆవిష్కరణతో విజ్ఞానశాస్త్రం తన పరిధులనుదాటి వేదాంత మత శాస్త్రాల పరిధిలోకి ప్రవేశించింది’’- అన్నాడు.
మన సనాతన మహర్షులు ఈ ప్రతిబింబ చక్రగమనాన్ని మొదట్నించీ చాలా శ్రద్ధగా గమనించారు. అందువల్ల వారు మానవ జీవితాలలో, యుగ సంధులలోని విశిష్ట జీవుల జీవిత చరిత్రలను చెప్పేటప్పుడు, ఈ ప్రతిబింబ చక్రాన్ని దృష్టిలో వుంచుకుని మాత్రమే మాట్లాడారు. అందువల్ల వారి కథాకథన రీతి ఇటు మానవ లోకానికీ, ఆపైన గ్రహలోకానికీ, ఇంకా పైన దేవలోకానికీ- కొద్దిపాటి తేడాలతో సమన్వయిస్తూ సాగిపోతూ వుంటుంది.
అందువల్ల, ఒక రాముడి కథో, ఒక కృష్ణుడి కథో చెప్పేటప్పుడు, వాల్మీకి గానీ, వ్యాసుడు గానీ, జరగని కథ చెప్పరు.... జరిగిన దానిని మాత్రమే చెప్పి ఊరుకోరు. జరిగినది దేనికి ప్రతిబింబమో, దాన్ని కూడా దాంతో కలిపే చెబుతారు! అలా చెప్పటంలో కథ కొన్నిచోట్ల రెండంచలుగాను, కొన్నిచోట్ల మూడంచలుగానూ పెరుగుతూ వుంటుంది. ఏదైనా విశేషం వున్నచోటే ఇలాటి సూచనలు చేస్తూ వుంటారు- అన్నిచోట్లా చెయ్యరు!
ఈ గ్రహ గోళాల స్థాయి సంకేతాలు గానీ, దేవతాలోక స్థాయి సంకేతాలు గానీ, ఈనాడు మన పండితుల సంప్రదాయంలో పరిపూర్ణంగా లేవు. అనేక కారణాలవల్ల ఈ సంప్రదాయాలు తెగిపోయాయి. కొందరు మేధావులు కొన్నిచోట్ల ఆ సంకేతాలను పట్టుకుని వివరిస్తూ వుంటారు. అవే అంతరార్థాలుగా చెలామణీ అవుతూ వుంటాయి. వీటిని పూర్తిగా చెప్పలేక పోవటంవల్ల, కొంతమంది తొందరపాటుతో అంతరార్థాలే సత్యమనీ- అసలు కథ జరగనే లేదనీ, వాదన లేవదీస్తూ వుంటారు. మరి కొందరు అంతరార్థమే కల్పన అనీ, అసలు కథ సత్యమనీ వాదిస్తూ వుంటారు.
మూడు ప్రతిబింబాల చక్ర సిద్ధాంతాన్ని మనం బాగా అర్థంచేసుకుంటే, ఇలాంటి అతివాదాల జోలికి పోవలసిన అవసరం వుండదు. భూమిమీదా ఈ సంఘటన జరిగింది- దానికి కారణం గ్రహలోకంలోనూ వుంది, దేవతాలోకంలోనూ వుంది- అనే సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశీలిస్తే, సత్యం మరింత విస్పష్టంగా మనకు సాక్షాత్కరిస్తుంది. ఇందుకు నిదర్శనాలు మహాభారతంలో చాలా ఎక్కువగా వున్నాయి.
వ్యాసమహర్షి ఆదిపర్వం దగ్గర్నించీ, ఆనుశాసనిక పర్వంవరకూ ప్రతిపర్వంలోనూ ఈ అంశాలను ప్రస్తావిస్తూనే వచ్చారు. ప్రస్ఫుటంగా వచ్చే కొన్ని ఉదాహరణలను మాత్రం మనం యిప్పుడు పరిశీలిద్దాం. ఉదాహరణకు, మహాభారతంలో పాండవులు నివసించిన లక్కయిల్లు తగలబడిపోయిన ఘట్టం! లక్క యిల్లు తగలబడిపోయిన రోజు ఏది, పాండవులు తప్పించుకుని అడవుల్లో ప్రయాణంచేసి ‘‘ఏకచక్ర పురం’’లో బయటపడిన రోజు ఏది?- వీటిని వ్యాస భగవానుడు కొంచెం నిగూఢంగా చెబితే, తెలుగు మహాభారతంలో నన్నయ భట్టారకుడు మరింత విస్పష్టంగా చెప్పాడు.
కృష్ణపక్షే చతుర్దశ్యాం రాత్రివస్యాం పురోచనః
భవనస్య తవ ద్వారి ప్రదాస్యతి హుతాశనమ్‌॥
- అని వ్యాస భగవానుడు చెప్పాడు.
అంటే ఒకానొక మాసంయొక్క బహుళ చతుర్దశినాటి రాత్రి ఆ యింటికి నిప్పుపెట్టాలని దుర్యోధనుడు నిశ్చయం చేశాడు. కానీ అది యేమాసం? ఆ మాట వ్యాసుడు చెప్పలేదు!
పాండవులు ఏకచక్రపురంలో ఆరుమాసాలు ఉన్నాక బయటపడ్డారని నన్నయ భట్టారకుడు లెక్కచెప్పాడు. ఈ లెక్క మూలంలో లేదు. మరి ఆయన ఎలాచెప్పాడు? నన్నయకు వ్యాసుడు ఆది పర్వంలో చెప్పిన ఖగోళ రహస్యాలు తెలుసు.
ధర్మరాజు మఖానక్షత్ర ప్రభావంవల్ల జన్మించినవాడు. అర్జునుడు ఉత్తర ఫల్గుణి, భీముడు స్వాతి, నకుల సహదేవులు అశ్వినీ నక్షత్రం.
ఖగోళ దృష్టితోచూస్తే ఈ నక్షత్రాలన్నీ కూడా భాద్రపద మాసం చివరలో సూర్యుడితోపాటు ప్రయాణం చేస్తుండటంవల్ల కనిపించకుండాపోతాయి. ఆర్నెల్లు గడిచి ఫాల్గుణం చివరకు వచ్చేసరికి ఇవి సూర్యుడికి దూరమై రాత్రిపూట కంటకి కనిపిస్తాయి. ఈ నక్షత్రాలు అంతర్థానమైన రోజుల్లో పాండవులు కూడా జనానికి కనపడకుండా వుండటం- ఒక విచిత్ర విధి లీల!
*
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి