Others

కళతప్పిన ‘కళలవాణి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళలబోషించు...వార్తలందించు..
జనవాణి భద్రపరచు...జగతినాకాశవాణి..
.. అన్నాడో కవి. ఆకాశవాణి... ఈ పేరు వింటేనే జ్ఞాపకాలు రీలులా గిర్రున తిరుగుతాయి. ఎప్పటి రేడియో? బ్రిటిష్ రాజ్ కాలంలో 1927లో జూలై నెలలో ఒక చిన్న రేడియోక్లబ్‌గా పురుడుపోసుకుని అంచెలంచెలుగా ఇంతింతై వటుడింతింతై అన్నట్టు ఈనాడు భారతదేశ నలుదిశలా కొండాకోనల్లో భరతజాతి ప్రతిష్ఠయై అల్లుకున్న భవ్యవాణి. రాజస్థాన్ ఎడారుల్లోనూ, మంచుకొండల లడఖ్‌లోనూ, ఈశాన్య భారతంలోని చివరి అంచునా, దక్షిణాన అండమాన్ దీవుల్లోనూ దేశసమగ్రతనూ కాపాడుతూ జనజీవితాల్లో పెనవేసుకున్న ప్రేమలత. దాదాపు 425 రేడియో కేంద్రాలతో విలసిల్లుతున్న తల్లి ఆకాశవాణి ఈరోజున దుఃఖిత వదనయై దిగాలుగా ఉంది.
కళాకారుల నిలయం..
మన తెలుగునాట ఎందరో కవులు కళాకారులు తమ గళాలతో కలాలతో ఆ తల్లికి ఊపిరిలూదారు... హైదరాబాద్ కేంద్రమంటే గుర్తుకొచ్చే దేవులపల్లి, స్థానం నరసింహారావు, బుచ్చిబాబు, గోపిచంద్, రావూరి భరద్వాజ, సీత-అనసూయ, పాలగుమ్మి విశ్వనాథం, మునిమాణిక్యం, కె.చిరంజీవి... ఇలా ఎంతోమంది ఆకాశవాణికి కైమోడ్పులతో తమ సేవ లందించారు. ఎనభయ్యవ పడిలో పడుతున్నా శారదా శ్రీనివాసన్, చిత్తరంజన్, కోకా సంజీవరావు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ వంటి వనె్నతగ్గనివారు ఇంకా కార్యక్రమాలలో పాల్గొంటూనే ఉన్నారు.. ఇక అలనాటి మద్రాసు కేంద్రం ఆచంట జానకిరామ్, ఆమంచర్ల గోపాలరావు, బాలాంత్రపు రజనీకాంతరావు, గొల్లపూడి మారుతీరావు, జనమంచి రామకృష్ణ వంటివారితో కళకళలాడిన ప్రాంగణం... బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం, బందా కనకలింగేశ్వరరావు, వోలేటి వెంకటేశ్వర్లు, నండూరి సుబ్బారావు, వి.బి.కనకదుర్గ వంటి ప్రతిభా మూర్తులతో పునీతమయింది విజయవాడ కేంద్రం.... ఏవితల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు అన్నట్టు కార్యక్రమాల రూపశిల్పులయిన ఈ ప్రోగ్రాం సిబ్బంది ఆనాడు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆకాశవాణి పతాకనెగరేశారు. ఇది గతం పరచిన స్వగతం.. మరి నేడు.. ఆకాశవాణి కేంద్రాలకు మార్గదర్శకత్వం నెరపిన ప్రోగ్రాం సిబ్బంది గత రెండు దశాబ్దాలుగా సరైన ప్రమోషన్ అవకాశాలు లేక రిక్రూట్మెంట్ కుంటుపడి మసక చీకట్లలో ధైర్యం వెక్కిరించినా స్థైర్యాన్ని కోల్పోకుండా కార్యక్రమ రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు.. ప్రసారభారతి వెలుగు హారతి పడుతుందను కుంటే చీకటిలో చిరుదివ్వెకూడా కాలేకపోయింది.
జాతి నిర్మాణంలో..
స్వాతంత్య్రం వచ్చిన అనంతరం దశాబ్దాలుగా రేడియోతో పెరిగిన తరం కవులు, కళాకారులయ్యారు.. అడ్మినిస్ట్రేటర్‌లయ్యారు... భాషా సంగీత సాహిత్యాలను కాచివడపోశారు.. జాతి నిర్మాణంలో రేడియోదో గణనీయపాత్ర... కెరీర్ నిచ్చెనలో ఆకాశవాణి తొలి మెట్టుగా ఉండేది. కానీ ఉప్పుపాతరేసినట్టు ఈరోజు ఆకాశవాణి అలోలక్ష్మణా అంటోంది.. కాస్త వీళ్ళని పట్టించుకోండయా అంటూ వాపోతోంది. ఆకాశవాణిని నడిపించే కార్యక్రమ సిబ్బంది కాళ్ళూ చేతులు కట్టేసి పనిచేయమంటున్నారు. ఒకప్పుడు స్టేషన్ డైరెక్టర్ అంటే ఒక గౌరవహోదాయే కాదు షిప్ కెప్టెన్‌లా ఉండి మార్గదర్శకం చేసేవాడు...ప్రోగ్రాం సిబ్బందిని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ఇప్పుడు స్టేషన్ డైరెక్టర్లని లేకుండా చేశారు.. దాని ఫలితం స్టేషన్ల మీద పడింది... ఈరోజున రేడియో స్టేషన్లన్నీ నాయకత్వలేమితో కునారిల్లుతున్నాయి.. యూపీఎస్‌సీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ ఎంపిక చేసిన ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ లు ఇంకా ముప్ఫై ఏళ్ళుదాటినా అదే స్థాయిలో లేదా ఒకేఒక్క తాత్కాలిక పదోన్నతితో అడహాక్ అసిస్టెంట్ డైరక్టర్లుగా కొనసాగటం దేనిని సూచిస్తుంది.. ఏ ప్రసారమాధ్యమానికైనా ష్యశఆళశఆ జఒ ఆ్దళ రీజశ అన్నధి తారకమంత్రం.. అది తప్పించి మిగిలిన వాటిపై దృష్టి పెడుతున్న ప్రసారభారతి దేనికి సంకేతం.. ప్రజా సేవా ప్రసారాల అతి పెద్ద వ్యవస్థను నడిపేందుకు ప్రోగ్రాం సిబ్బందికి అవకాశాలివ్వకుండా డిప్యుటేషన్‌పై సిబ్బందిని రప్పించటం కార్యక్రమాలను అధోగతికి నెట్టేయడమే కదా.
ఐబిపిఎస్ సర్వీస్..
1990లో ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ అనే వ్యవస్థీకృత సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చారు. వెయ్యికిపైగా పోస్టులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. వేళ్ళపై లెక్కించేంతమంది మాత్రమే ఉన్నారు. పోస్టులు ఖాళీగా ఉన్నాయికదా అని ప్రసార రంగం గురించి కనీస పరిజ్ఞానం లేకపోయినా గ్రేడ్ పే ఉంటే చాలని వారిని డెప్యుటేషన్‌పై నియమిస్తోంది ప్రసారభారతి. ఇది ఒక్క ప్రోగ్రాం సిబ్బందిలోనే జరుగుతోంది. మరోపక్క అత్యవసర అవసరమన్న ముసుగేసి రిటైర్డ్ ఉద్యోగులను కన్సల్టెంట్ రూపంలో వారిని నియమిస్తోంది, ఉన్న సిబ్బందికి ప్రమోషన్లు ఇవ్వకుండా. ఇవ్వకపోవటానికి కోర్టు కేసులని, అర్హులు లేరన్న సాకులు సిద్ధం చేసుకుంది.
విషాదాల పరంపర..
ప్రోగ్రాం రూపొందించటంకన్నా మీరెంత ఆదాయం సంపాదిస్తున్నారు అంటున్నారు డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు. బి.బి.సి, నేషనల్ పబ్లిక్ రేడియోలాంటి అంతర్జాతీయ ప్రసార సంస్థలు కూడా ఆదాయాన్ని సమకూర్చుకునే బాధ్యతను కంటెంట్ క్రియేటర్స్ నెత్తిన పడేయలేదు. దానికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి.. అంతదాకా ఎందుకు మనదేశంలోనే ప్రైవేట్ బ్రాడ్‌కాస్టర్స్ కూడా కమర్షియల్ రెవెన్యూ కోసం వారి వారి అవసరాలకోసం మార్కెటింగ్ వింగ్‌ని నియమించుకున్నాయి. వారు ప్రోగ్రాంలను మార్కెట్‌కు అనుగుణంగా రూపొందించమంటారు. మీరేం చేస్తారో తెలియదు... కమర్షియల్ రెవెన్యూ సంపాదించటం మీ బాధ్యతే అని ప్రసారభారతి అధికారులు ప్రోగ్రాం సిబ్బందిపై ఒత్తిడి తేవటం మరో విషాదం.
వార్తల ప్రసారంలో పూర్తి స్వేచ్ఛ, స్వీయనియంత్రణ ఉండాలన్న ప్రాతిపదికన ప్రసారభారతి పురుడు పోసుకుంది. కానీ వాస్తవమేమిటంటే వార్తలను సేకరించేది వడపోసేది సమాచార మంత్రిత్వశాఖ అధికారులు.. వార్తా ప్రసారమంతా మినిస్ట్రీ కనుసన్నలలోనే ఈనాటికీ జరుగుతోంది.. ప్రసారభారతి రాకముందు ఏ పరిస్థితి ఉందో అదే స్థితి నేటికీ కొనసాగుతోంది. ఇక ప్రసారభారతి నిర్వహణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. 430 ఆకాశవాణి కేంద్రాలలో ఏం జరుగుతోంది? అక్కడి సమస్యలేమిటి, అవసరాలేమిటి? అన్నదానితో సంబంధంలేకుండా ప్రసారభారతి బోర్డు సభ్యులు ఐదు నక్షత్రాల హోటళ్ళలో సమావేశాలు పెట్టుకుని ఖర్చు తగ్గించే మార్గాలను అనే్వషిస్తారు.
కోర్టు కేసుల విషాదం...
మరో మార్గంలేక తమ సమస్యలకు పరిష్కారాలు లభించక ప్రోగ్రాం సిబ్బంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తే దాన్ని సాకుగా చూపించి చేతులు దులుపేసుకోవటం ఆనవాయితీగా పెట్టుకుంది ప్రసారభారతి.
పరిష్కారమార్గం..
ఆకాశవాణికి పూర్వ వైభవం వస్తేనే కానీ పెడదారి పడుతున్న యువతరానికి ప్రబోధంచేసే ప్రసారమాధ్యమం అందుబాటులోకి రాదు.. ఒకప్పుడు యువతకు కెరీర్ లాంచింగ్ ప్యాడ్ ఆకాశవాణి. సినిమా పాటలతో హోరెత్తిస్తూ వారి భజనే లక్ష్యంగా సాగుతున్న ప్రైవేటు రేడియోలతో పోలిస్తే పిల్లలు, పెద్దలు, రైతులు, మహిళలు, యువత, జానపద కళాకారులు, శాస్ర్తీయ సంగీత కళాకారులు, రచయితలు.. ఇలా ఎందరెందరినో అక్కున చేర్చుకుని అవకాశాలిచ్చి వారి ప్రతిభకు సానబెట్టే ఆకాశవాణిని తిరిగి కళలు పోషించే జనవాణిగా నిలిచే ఈ ప్రసారమాధ్యమాన్ని బతికించుకోవాలంటే ప్రోగ్రాం సిబ్బందిని పటిష్టం చేసి వారినో బలమైన వ్యవస్థగా తిరిగి రూపొందిస్తేకానీ సాధ్యంకాదు. అందుకు వారి గోడును వినే దయార్ద్ర హృదయం కలిగిన మానవీయ వ్యవస్థ కావాలి. పాలకులు ప్రసారభారతిని అలా తీర్చిదిద్దినప్పుడే అది సాధ్యం. ప్రసారభారతి స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. దాని అవసరాలు అదే తీర్చుకోవాలి అని వదిలేస్తే అది జాతికి తీరని నష్టం అవుతుంది. భవిష్యత్ తరాలు క్షమించవు.

--రాహుల్ (మీడియా విశే్లషకుడు)