Others

శకుంతలోపాఖ్యానము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ అంతరాత్మను వంచించకు. నీవు ఒక్కడవే ఉన్నావని అనుకుంటున్నావు. హృదయంలో ఉన్న పరమాత్మను మరిచి పోతున్నావు. పాపం చేస్తూ నన్ను ఎవరూ చూడలేదని భావించేవాడిని దేవతలు చూస్తారు. ధర్మం చూస్తుంది. పంచభూతాలు, అహోరాత్రాలు, ధర్మం అన్నీ చూస్తాయి. నా అంతట నేను వచ్చానని నన్ను అవమానించకు. నీ భార్య అయిన నన్ను గౌరవించడం లేదు. నేను ఈ మాటలు అరణ్యంలో చెప్పడం లేదు. నిండు సభలో చెప్తున్నాను. నేను అంతలా ప్రార్థిస్తున్నప్పటికీ నీవు లక్ష్యపెట్టకపోతే నీ శిరస్సు వంద ముక్కలౌతుంది. భర్త భార్యలో ప్రవేశించి సంతానంగా జన్మిస్తాడు. అందుకే భార్యను జాయ అంటారు. పుత్రుని వలన పితరులు తరిస్తారు. తండ్రిని పున్నామ నరకం నుండి తరింపజేస్తాడు. కనుక పుత్రుడు అన్నారు.
మానవునికి భార్య సగభాగం. సంతానాన్నిచ్చి పతికి ప్రాణంలా మసలుకొనేదే భార్య. భార్య ఉంటేనే యజ్ఞయాగాలకు పురుషుడు అర్హుడు. పురుషునికి భార్యే ఉత్తమగతి. అద్దంలో ముఖం చూసుకొన్నట్లు భార్యయందు పుట్టిన పుత్రుని చూసి భర్త స్వర్గం పొందినట్లు ఆనందిస్తాడు. పురుషుడు తాను పుట్టడానికి, స్ర్తీలు సనాతనమైన క్షేత్రాలు అని తెలుసుకోవాలి. ఆమె ధనం, సంతానం, శరీరం, ధర్మం, స్వర్గం, ఋషులు, పితరులు అన్నింటినీ రక్షిస్తుంది. కొడుకుని కౌగలించుకుంటే వచ్చే ఆనందాన్ని ఎందుకు పొందవు? నినే్న కోరి వచ్చిన భార్యాపుత్రులను ఎందుకు తిరస్కరిస్తున్నావు? చీమలు కూడా తమ అండాలను రక్షించుకుంటాయి. మరి నీవు ఎందుకు నీ కుమారుని భరించడం లేదు. మనుష్యులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. పశువులలో గోవు శ్రేష్ఠమైనది. పెద్దవారిలో గురువు శ్రేష్ఠుడు. స్పృశింపదగినవారిలో పుత్రుడు శ్రేష్ఠుడు. పుత్రగాత్రపరిష్వంగం మించిన సుఖమేదీ లేదు. ఇతను పుట్టినపుడు నూరు అశ్వమేధాలు చేస్తాడని అశరీరవాణి చెప్పింది. ఈ బాలుడు నీ నుంచే జన్మించాడు. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు నా తండ్రి. అప్సరస మేనక నా తల్లి. కణ్వమహర్షి నన్ను పెంచాడు. నేను ఆశ్రమంలో ఉండగా వచ్చి నన్ను గాంధర్వ వివాహం చేసుకొన్నావు. నేను నీ వంశాన్ని గౌరవించి, వృద్ధి చేసి నిన్ను శరణువేడాను. నాకు అప్పుడు మాట ఇచ్చి ఇలా ఇప్పుడు దాన్ని అసత్యం చేయడం నీ వంటి ప్రభువుకు తగదు. నీవు నన్ను విడిచిపెడితే నేను తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోతాను. కాని ఈ పుత్రుని విడవడం నీకు ధర్మం కాదు’’.
శకుంతల మాటలు విన్న దుష్యంతుడు ఆమెతో ఇలా పలికాడు. ‘‘శకుంతలా! నేను నీ పుత్రుని గుర్తించలేకున్నాను. స్ర్తిలు సాధారణంగా అసత్యమాడతారు. నీ మాటలు ఎవరు నమ్ముతారు? నిన్ను వేశ్య అయిన మేనక కన్నది. తండ్రికూడా జాతి లేనివాడు. కామానికి లోబడి నిన్ను కన్నాడు. వారిద్దరూ శ్రేష్ఠులే. కాని నీవు వేశ్యలాగా నా దగ్గర మాట్లాడుతున్నావు. నేను నీ మాటలు నమ్మను. నీవు వెళ్లవచ్చు.’’
శకుంతల క్రోధంతో ఇలా అంది. ‘‘ఓ రాజా! ఆవగింజంత ఇతరుల దోషాన్ని చూస్తున్నావు. మారేడు కాయంత స్వదోషాన్ని చూడడం లేదు. నీ జన్మకంటే నా జనే్మ గొప్పది. నీవు భూమి మీద సంచరించగలవు. కాని నేను అంతరిక్షంలో సంచరిస్తాను. ప్రాజ్ఞుడు ఇతరుల మాటలలో చెడును విడిచి మంచిని గ్రహిస్తాడు. మూర్ఖుడు చెడునే గ్రహిస్తాడు. సత్పురుషులు ఇతరుల దోషాలను చూడరు. మూర్ఖులు ఇతరులలో దోషాలనే చూసి వారిని నిందిస్తారు.
ఇంకా మానవులకు పుత్రులు ధర్మాన్ని, కీర్తిని తెచ్చిపెట్టేవారు. కనుక పుత్రుని విడుచుట నీకు తగదు. వంద నూతుల కంటే ఒక బావి గొప్పది.
వంద బావులకంటే ఒక క్రతువు శ్రేష్ఠం.
వంద క్రతువుల కంటే ఒక పుత్రుడు శ్రేష్ఠం.
వందమంది పుత్రుల కంటే సత్యం శ్రేష్ఠం.
సత్యంతో సమానమైన ధర్మం లేదు.
సత్యం కంటే గొప్పది లేదు.
సత్యమే పరబ్రహ్మము. సత్యము అన్నింటికంటే గొప్ప వ్రతము. నీవు ఆ సత్యవ్రతాన్ని విడిచి పెట్టకు. అసత్యం మీద నీకు శ్రద్ధ ఉంటే నేనే వెళ్లిపోతాను. నీలాంటి వాడితో ఉండడము నాకు యుక్తం కాదు. నీవు ఆదరించకపోయినా నా కొడుకు ఈ భూమినంతా పాలిస్తాడు.’’
ఇలా రాజుతో చెప్పి శకుంతల వెనక్కి మరలింది.
అప్పుడు అంతరిక్షం నుండి అశరీరవాణి సభలో ఉన్న రాజుకు ఇలా చెప్పింది. ‘‘దుష్యంతా! పుత్రుని తల్లి గర్భంలో మోసేది మాత్రమే. అతను తండ్రికే చెందుతాడు. కనుక ఆ పుత్రుని నీవు భరించు. శకుంతలను అవమానించకు. నరేంద్రా! తండ్రి యొక్క రేతస్సు నుండి పుడ్తాడు కనుక అతని స్వరూపమే. అతడు పితృగణాలను రక్షిస్తాడు. కనుక నీ పుత్రుని రక్షించు. పోషించు. ఈ నీ కుమారుడు భరతుడనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు’’.
ఈ మాటలు విన్న దుష్యంతుడు పురోహితులతో, అమాత్యులతో ఇలా అన్నాడు. ‘‘మీరంతా అశరీరవాణి వాక్కు విన్నారు కదా! నేను ఈ బాలుని నా పుత్రునిగా ఎరుగుదును. కాని ఈమె మాటలతో ఇతన్ని పుత్రునిగా గ్రహిస్తే లోకం నన్ను శంకిస్తుంది’’ ఇలా అని అతను కుమారుని స్వీకరించాడు.
కుమారునికి చేయవలసిన సంస్కారాలను జరిపించాడు. అతను భార్య అయిన శకుంతలను గౌరవించాడు. ఆమెతో ప్రేమగా ఇలా అన్నాడు.
‘‘దేవీ! మన వివాహం ప్రజల పరోక్షంలో జరిగింది. వారికి నీ స్వచ్ఛత తెలియదు. ఈ లోకం నన్ను కాముకుడిగా భావిస్తుంది.అందువల్ల నేను ఈ విచారణ చేశాను. నన్ను మన్నించు’’.
తర్వాత దుష్యంతుడు భార్యాపిల్లలను తన తల్లికి చూపి ఇలా పలికాడు. ‘‘అమ్మా! ఇతను నా కొడుకు. ఇతని వల్ల నేను పితృఋణం నుండి విముక్తుడనయ్యాను. ఇతను నీకు పౌత్రుడు. ఈమె విశ్వామిత్రుని కుమార్తె. కణ్వ మహర్షి దగ్గర పెరిగింది.
(ఇంకావుంది)

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి