Others

లొంగుబాటుకు విలువ ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానీ, మీకు మీరే సింహంలా మారాలని గుర్తుంచుకోండి. అలా మారాలని మీరు నిర్ణయించుకోకపోతే ఎప్పటికీ మీరు సింహంలా మారలేరు. ఈ ప్రమాదాన్ని ఎవరికివారే స్వయంగా స్వీకరించాలి. పైగా, ఇది చాలా ప్రమాదకమైన జూదం కూడా. ఎందుకంటే, మీరు సింహంలా మారితే, మీచుట్టూ మిమ్మల్ని సతాయించే శాంతిని ప్రేమించే ఒంటెల సమూహాలుంటాయి. అవి ఎప్పుడూ రాజీపడేందుకు సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే, అవి ఎప్పుడూ గందరగోళాన్ని ఇష్టపడవు. అందుకే అవి కొత్త విషయాలు ఈ ప్రపంచంలోకి రావాలనుకోవు. ఎందుకంటే, కొత్త విషయాలన్నీ వాటికి గందరగోళం సృష్టించేవే.
పైగా, అవి అతి చిన్న విషయాలకే ఎక్కువగా భయపడే పిరికిపందలు. అందుకే అవన్నీ సోక్రటీస్, క్రీస్తుల వంటి మహాత్ములైన తిరగబడే విప్లవకారులను పూర్తిగా వ్యతిరేకించాయి. అందుకే సింహాలవంటి వ్యక్తులకు ఎప్పుడూ స్వాగతాలుండవు. సమాజం వారికి అన్నిరకాల కష్టాలను కలిగిస్తుంది. వారంటే ఒంటెలకు ఎప్పుడూ భయమే. ఎందుకంటే, వారు ఒంటెలకు నిద్రాభంగమనే అసౌకర్యమైన బాధను కలిగిస్తూనే, సింహాలుగా మారాలనే కోరికను కూడా వాటిలో రగిలిస్తారు. అదే అసలు సమస్య.
జీసస్‌ను ఎందుకు శిలువవేశారు? బుద్ధుని రాళ్ళతో ఎందుకు కొట్టారు? మహావీరుని ఎందుకు వెలివేశారు? మన్సూర్ తలను ఎందుకు నరికారు? వీరందరూ సింహాలుగా మారాలని కలలుకనే ఒంటెలకు నిద్ర పట్టకుండా చేసినవారే. అందుకే బుద్ధుడు తన ధర్మోపదేశాలను సింహగర్జనగా పేర్కొన్నాడు.
కాబట్టి, తొలి దశ అయిన ఒంటె దశను సమాజం మీకిస్తుంది. రెండవ దశ అయిన సింహం దశను మీరే స్వయంగా సాధించాలి. అలా సాధించే ప్రయత్నంలో పసిగుడ్డు దశనుంచి బయటపడిన మీరు గొంగళిపురుగులా మారి ముందుకు కదలడం ప్రారంభిస్తారు. అలా మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తయారవుతారు. అప్పటినుంచి మీరు దేనికీ అనుగుణంగా ఉండరు, ఏ సంప్రదాయంలోనూ భాగస్థులు కారు.
స్వతంత్రంగా వ్యవహరిస్తారు ‘కాదు’అని చెప్పగలగడం, అవిధేయుడుగా ఉండడం, ఇతరుల అధికారాన్ని, రాజకీయ శక్తులను, వితండవాదాలను, చర్చిలు, దేవాలయాలు, మసీదులను, పవిత్ర గ్రంథాలను- ఇలా అన్నింటినీ ఎదిరిస్తూ తిరగబడడమే సింహం లక్షణాలు.
ఈ లక్షణాలున్న వ్యక్తి తన ఆశలు, ఆశయాలకు అనుగుణమైన నూతన ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అతని మనసులోని ఊహాలోకంలో అనేక అద్భుతమైన కలలుంటాయి. భవిష్యత్తులో జీవిస్తున్న సింహాలకు గతంలో జీవిస్తున్న ఒంటెలు పిచ్చివిగా కనిపిస్తాయి. ఎందుకంటే, వాటిమధ్య దూరం చాలా ఉంది.
సింహం భవిష్యత్తుకు సంకేతం. అయితే గతం పూర్తిగా అంతరించిన తరువాతే భవిష్యత్తు వస్తుంది. పాతది అంతరించినప్పుడే అక్కడ ఖాళీ ఏర్పడుతుంది కాబట్టి, అక్కడ కొత్తది ప్రవేశించగలుగుతుంది. కొత్తది రావాలంటే పాతది పోక తప్పదు. అందుకే సింహాలకు, ఒంటెలకు మధ్య నిరంతర పోరాటమే.
ఒంటెలు అధిక సంఖ్యలో ఉంటాయి. సింహ సంభవం ఎప్పుడో కాని జరగదు. కాబట్టి, అది ఎప్పుడూ అపురూపంగానే ఉంటుంది. అందుకే అది శాసిస్తుంది. అపనమ్మకంతో సందేహించడం దాని లక్షణం. జ్ఞానవృక్ష ఫలాన్ని ఆదాము తిన్నాడు. దాని ఫలితంగా మనసు ఉదయించింది. ఆత్మకు ఒక అర్థం ఏర్పడింది. ఒంటెలు అహం లేనివి. ఎందుకంటే, వాటికి ‘అహం’అంటే ఏమిటో తెలియదు. కానీ, సింహానికి విపరీతమైన అహం. ఎందుకంటే, దానికి తెలిసినది అదొక్కటే. అందుకే మీకు ఎప్పుడూ అవిధేయులు, విప్లవకారులే కనిపిస్తారు. కవులు, చిత్రకారులు, సంగీత విద్వాంసులు- ఇలాంటి వారందరూ బొహీమియన్ల మాదిరి ఎవరినీ ఏమాత్రం లెక్కచేయకుండా, ఏ వ్యవస్థలోనూ ఇరుక్కోకుండా, తమ ఇష్టమొచ్చిన రీతిలో స్వేచ్ఛగా జీవించే అత్యంత అహంకారపరులే. సింహగర్జన చేస్తూ ముందుకు కదిలేవారికి అహం తప్పకుండా ఉంటుంది. అది లేకపోతే వారు ఏమాత్రం ముందుకు కదలలేరు. అందుకే వారికి అహం చాలా అవసరం.
తూర్పు దేశాలలో మీకు ఒంటెలే ఎక్కువ కనిపిస్తాయి. అవి శరణుకోరడం చాలా తేలిక. ఎందుకంటే, వాటికి ‘కాదు’అని చెప్పడం తెలియదు. అందుకే అవి ఎప్పుడూ ‘అవును’అనే అంటాయి.
పైగా, అవి ఎప్పుడో లొంగిపోయాయి. అందుకే లొంగుబాటుకు అంతగా విలువలేదు. కానీ, పాశ్చాత్య దేశాలలో మీకు సింహాలే ఎక్కువ కనిపిస్తాయి. అవి తల వంచి లొంగిపోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. అదే జరిగితే గొప్ప పరిణామం జరుగుతుంది. శరణు కోరుతూ లొంగిపోవడం తూర్పు దేశాలలో చాలా చౌక. అదే పాశ్చాత్య దేశాలలో చాలా ఖరీదైన వ్యవహారం.
తూర్పు దేశాలు లొంగిపోతాయి. ఎందుకంటే, అవి సింహాలుగా మారే అవకాశంలేదు. అందుకే అవి సులభంగా లొంగిపోయి గుంపులో కలిసిపోవడం చాలా సౌకర్యంగా భావిస్తాయి. పాశ్చాత్య దేశాలు అహాన్ని సృష్టించాయి.
అలాగే అవి అహం, అపనమ్మకం, సందేహాల వంటి సింహ లక్షణాల పైనే ఎక్కువగా దృష్టిపెట్టాయి. అందుకే పాశ్చాత్య సింహాల మనస్తత్వం తల వంచి లొంగిపోవడమంటే నిజంగా గొప్ప పరిణామం జరిగినట్లే. అంటే సింహాలు ‘శిశువు’దశకు చేరినట్లే. ఒంటెలు తలవంచి లొంగిపోయినా అవి అలాగే ఉంటాయి తప్ప వాటిలో ఎలాంటి మార్పు జరగదు.
ఇలా చెప్పడంవల్ల నేను మీకు పెద్ద గందరగోళంగా కనిపించవచ్చు. కానీ, నేను చెప్తున్న విషయాలను సరిగ్గా అర్థంచేసుకుంటే మీకు ఆ సమస్య ఉండదు. అందరికీ అహం గురించి సరియైన, స్పష్టమైన, సంపూర్ణమైన అవగాహన కలిగించాలి. అప్పుడే వారు దాని బారినుంచి బయటపడగలరు. అలా బయటపడ్డప్పుడే ఏదైనా ప్రయోజనముంటుంది, లేకపోతే ఉండదు.
తొలిదశ అయిన ఒంటె దశ అచేతనమైనది. రెండవ దశ అయిన సింహం దశ ఉపచేతనమైనది. ఇది అచేతన స్థితికన్న కాస్త ఉన్నతమైనది. ఈ స్థితిలో ఉషోదయ కాంతి కిరణాలు చీకటి గదిలోకి ప్రవేశించినట్లుగా కొన్ని చైతన్య స్థితి లక్షణాలు నిద్రావస్థలో ఉన్న మీలోకి ప్రవేశించడం ప్రారంభిస్తాయి.
దాని ఫలితంగా మీ అచేతనస్థితి ఉపచేతనంగా మారుతుంది. ఒంటె సింహంలా మారడమంటే అదే. కానీ, అది పెద్ద మార్పేమీకాదని గుర్తుంచుకోండి. ఎందుకంటే, సింహంకూడా శిశువులా మారుతుంది. ఇది వారసత్వంగా సంక్రమించే ఒక రకమైన మార్పు. ఒంటె సింహంలామారడం ప్రారంభిస్తుంది.
సింహం ఎప్పుడూ చెప్పినట్లు వినకుండా ‘కాదు’అనే అంటుంది. ఒంటె ఎప్పుడూ చెప్పినట్లు వింటూ ‘అవును’అని అంటుంది కానీ, ‘కాదు’అని ఎప్పుడూ చెప్పదు. కాబట్టి, ‘కాదు’అనేది ఒంటె ఖాతాలో ఎక్కువగా జమఅవుతూ ఉంటుంది. నిరాకరించబడినది ఎప్పుడూ పగ సాధించాలనుకుంటుంది కాబట్టి, ‘కాదు’అనేది ఎప్పుడూ ‘అవును’ అనే దానిపై పగ సాధించాలనుకుంటుంది. అలా చక్రం పైనుంచి కిందకు, కిందనుంచి పైకి తిరిగే క్రమంలో ఒంటె సింహంలా మారుతుంది.
*

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.