Others

బాలలందరికీ విద్య ఉత్తమాటేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరక్షరాస్యత నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా- దేశంలో బాలలందరికీ విద్య గగన కుసుమమే అవుతోంది. సార్వత్రిక విద్యా వ్యాప్తికి ప్రభుత్వాలు పలు పథకాలు చేపట్టినా ఇంకా అధిక శాతం పిల్లలు విద్యాగంధం లేక బాలకార్మికులుగానే ఉండి పోతున్నారు. బాలల శ్రేయస్సుకు కృషి జరుగుతున్నా ఆచరణలో ఫలితాలు కానరావడం లేదు. పాఠశాల సౌకర్యాలు లేక కొందరు, అవి ఉన్నా వివిధ కారణాల రీత్యా బడికి వెళ్లలేక మరికొందరు బాలలు తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారమయం చేసుకుంటున్నారు.
ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలతో ముడివడి సంక్షేమ పథకాలకు నోచుకోక, చదువు చెప్పించే స్థోమత లేక ఎందరో పేద తల్లిదండ్రులు గత్యంతరం లేనిస్ధితిలో చిన్నారులపై భారాన్ని మోపుతున్నారు. హోటళ్లు, కిరాణా దుకాణాలు, ఫ్యాక్టరీలు, మిల్లులు, క్వారీలు, గనులకు తమ పిల్లలను పనికి పంపుతున్నారు. వ్యవసాయ పనులకు కొందరు బాలలు వెళుతున్నారు. చివరికి కొందరు పిల్లలను భిక్షాటన వృత్తిలోకి బలవంతంగా నెడుతున్నారు. వివిధ రంగాలలో బాలకార్మికులు అవస్థలు పడుతూ అనుక్షణం శ్రమిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పెద్దలు చేయాల్సిన పనులను సైతం వీరే చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు వదిలి బాలల చేత వెట్టిచాకిరీ చేయించుకుంటున్నా, వారికి విముక్తి కలిగించాలన్న ధ్యాస సంబంధిత అధికారుల్లో లేకపోవడం బాధాకరం.
యజమానులు చెప్పిందే చట్టంగా, వారు చేసేదే సంక్షేమంగా పరిస్థితులున్నా కార్మికశాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పుడప్పుడు తూతూ మంత్రంగా దాడులు చేస్తున్నా దోషులకు ఎలాంటి శిక్షలు పడడం లేదు. 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని భారత రాజ్యాంగంలోని 24వ నిబంధన స్పష్టం చేస్తున్నా అది కాగితాలకే పరిమితమవడం శోచనీయం. పేదరికం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పసిపిల్లల బంగారు కలలు చెదిరిపోతున్నాయి. పాలబుగ్గల లేత వయసులో వారు కార్మికులుగా మారడం బాధాకరం. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పిల్లల చేత పనిచేయించుకునే యాజమాన్యాలు తగిన వేతనాలు ఇవ్వడం లేదు. పిల్లలు పనిచేసే చోట తగిన రీతిలో భద్రతా సౌకర్యాలను కల్పించక పోవ డం ఆక్షేపణీయం.
ప్రాథమిక హక్కులను పేర్కొన్న రాజాంగంలోని 3వ ప్రకరణంలోని 15(3)వ అంశం బాలల కోసం ప్రత్యేక శాసనాలు చేసే అధికారం ప్రభుత్వానికి కలుగజేస్తున్నది. 23వ అధికరణం ప్రకారం బాలలను వ్యాపార వస్తువుగా మార్చడం, నిర్బంధ సేవలను చేయించుకోవడం అపరాధంగానే పరిగణించాలి. 14 సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాలలో, గనులలో, ఇతర ప్రమాదకరమైన పనులలో నియమించడాన్ని 24వ ఆర్టికల్ నిషేధించింది. 39(ఇ) ప్రకారం బాలలను వారి వయసుకు తగని, శక్తికి మించిన పనులలో నియమించరాదు. పేదరికాన్ని సాకుగా చేసుకుని బాలలను పనుల్లో నియమించడం నిషేధించాలని రాజ్యాంగం ఆదేశించింది. కఠిన చట్టాలు ఎన్ని ఉన్నా చాలామంది పిల్లలు బాలకార్మికులుగానే మిగిలిపోతున్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న నిర్బంధ ప్రాథమిక విద్య ఈనాటికీ ఫలించని కలగానే మిగిలిపోతున్నది. ప్రపంచ బాలకార్మికుల్లో మూడవ వంతు మంది మన దేశంలోనే ఉన్నారని ఒక అంచనా. దీంతో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యే క కార్యక్రమాలు చేపడుతున్నాయి.
5 నుండి 15 సంవత్సరాల లోపువయసుగల పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు ప లు కార్యక్రమాలను చేపట్టారు. పాఠశాలలో న మోదు కాని, మధ్యలో మానివేసిన, అర్హతగల పిల్లల సమగ్ర వివరాలను సేకరించి, వారిని తిరిగి తరగతులకు పంపేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ఆచరణాత్మక చర్యలను చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుల పండగ పేరుతో 2002 ఆగస్టు1 నుండి 10వరకూ, 2003 సంవత్సరం నవంబర్ 24 నుండి 29వరకూ బడి బయట ఉన్న పిల్లలనందరినీ పాఠశాలలలో చేర్పించే బృహత్ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఆ తర్వాత ఏటా ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తునే ఉన్నారు. అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదన్నది వాస్తవం. అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు చెబుతున్నా- బాల కార్మికులు వివిధ పనుల్లో కొనసాగుతూనే ఉన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి, నిర్బంధ ప్రాథమిక విద్య అమలుకు మరింతగా చర్యలు చేపట్టవలసి ఉంది. ముందుగా వారి తల్లిదండ్రులకు చదువు పట్ల అవగాహన కలిగించాలి. బాలకార్మికులకు వసతి సైతం కల్పించేలా ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయాలి. నిరుపేద కుటుంబాల్లో ఆర్థిక సమస్యలను తొలగించేలా వారికి సంక్షేమ పథకాలను అమలు చేయాలి. పిల్లల సంపాదనపై ఆధార పడకుండా తల్లిదండ్రులకు సాధికారత కల్పించాలి.

(నేడు బాలల దినోత్సవం....)

-సంగనభట్ల రామకిష్టయ్య 94405 05494