Others

‘ఎన్నికల బహిష్కరణ’ కాలం చెల్లిన నినాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించండి’ అని మావోయిస్టు పార్టీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ప్రచారం చేస్తోంది. కరపత్రాలు పంచుతూ, బ్యానర్లు కడుతూ మావోయిస్టులు తమదైన శైలిలో ముందుకు పోతున్నారు. ప్రజలను, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తద్వారా తమ బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారు. ఈ రకమైన ప్రచారం, ఎత్తుగడ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయినప్పటికీ ఆ పార్టీ ఎదుగుదల గొర్రె తోకలానే ఉంది. తమ పార్టీ బలంగా లేకున్నా, బలంగా ఉందన్న భ్రమలు కల్పించేందుకు ఇలా ఎన్నికలు వచ్చినప్పుడల్లా మావోయిస్టులు లేనిపోని హడావుడి సృష్టిస్తున్నారు. తాజాగా చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఎన్నికల బహిష్కరణ విషయమై పోస్టర్లు, కరపత్రాలతో కలకలం సృష్టిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సరిహద్దులో ఉన్న ప్రాంతాలలో ఇలా కొంత హల్‌చల్ సృష్టిస్తున్నారు తప్ప మిగతా ప్రాంతాలలో వారి ఉనికి లేశమాత్రం కూడా కనిపించదు.
ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇంతకన్నా ఎక్కువ హడావుడి, హంగామా సృష్టించినా, మందుపాతరలు పేల్చినా, శక్తిమంతమైన బాంబులు అమర్చినా, దాడులు చేసినా, ఓటువేస్తే వేళ్లు నరికేస్తామని తీవ్ర హెచ్చరికలు చేసినా, పెద్దఎత్తున ఎన్నికల బహిష్కరణ ప్రచారం చేసినా, తమకు పట్టున్న ప్రాంతాలలో ఆయుధాలతో తిరుగుతూ బెదిరింపులకు పాల్పడ్డా- అక్కడ 76 శాతం మంది ఎన్నికల్లో పాల్గొన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఛత్తీస్‌గఢ్ తమ కంచుకోటగా భావించే మావోయిస్టులు అక్కడే ఎన్నికల బహిష్కరణ నినాదాన్ని విజయవంతం చేయలేకపోతే పొరుగున ఉన్న తెలంగాణలో ఎలా విజయవంతం చేస్తారు? ఏవో కొన్ని మండలాల్లో కొంత పలుకుబడి ఉన్నంత మాత్రాన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలను బహిష్కరింపజేసి తమ ప్రాభవాన్ని చాటుకునే వీలు కనిపిస్తోందా? లేనే లేదు! ఓ రకంగా ఇదంతా చిన్నపిల్లల చేష్టలా, పరిణతి చెందని వ్యక్తుల కార్యక్రమంగా కనిపిస్తోంది.
ప్రపంచం అంతా ప్రజాస్వామ్యం వైపు కదులుతోంది. ఈ రాజకీయ ప్రక్రియను శతాబ్దాలుగా ‘ప్రాక్టీసు’ చేస్తున్న దేశాలు కోకొల్లలు. ఈ విధానానికి మెజార్టీ ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఆ వెలుగులో తమ జీవనాన్ని గడుపుతున్నారు. తమ ఆకాంక్షల్ని నెరవేర్చుకుంటున్నారు. చైతన్యవంతమైన సమాజాలు సైతం ఈ పోకడనే అనుసరిస్తున్నాయి. దాంతో ఈ ప్రక్రియ కాలపరీక్షకు నిలిచింది. రోజురోజుకు ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూరగొంటోంది. అందులో ప్రజలు మమేకమవుతున్నారు. ఈ ‘దృశ్యం’ ప్రపంచమంతా స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని తిలకించడానికి తిరస్కరిస్తే నష్టం ఎవరికి? తిరస్కరించేవారికే కదా?
మావోయిస్టుల సిద్ధాంతాలు పూర్తిగా కాలం చెల్లినవి. ఈ విషయం కూడా అనునిత్యం కళ్ళముందు సాక్షాత్కారమవుతోంది. మార్కెట్ అనుకూల వ్యవస్థ దూసుకుపోతోంది. ప్రపంచం ఇప్పుడు ఒకే సూత్రాన్ని అనుసరిస్తోంది. అదే ‘మార్కెట్’. మార్కెట్ రహిత వ్యవస్థను ఏర్పాటు చేస్తామంటే అదెలా ఆశాజనకమైన ఆలోచన అవుతుంది? అగ్రరాజ్యమైన అమెరికాతో పోటీపడగలమని చైనా ఒకప్పుడు ఊహించలేదు. కాని మార్కెట్ అనుకూల వైఖరిని అనుసరించడం ప్రారంభించాక అదే చైనా ఇప్పుడు అగ్రదేశంగా ఆవిర్భవిస్తోంది. అమెరికాకే అప్పులు ఇచ్చే దేశంగా ఉబికి వచ్చింది. ఆసియాలోనే కాదు మొత్తం ప్రపంచంలో ఇప్పుడు చైనా పలుకుబడి అనూహ్యంగా పెరిగిపోయింది. కారణం మార్కెట్ ఎకానమీని నమ్ముకుని ముందుకు కదలడమే! ఒకప్పుడు చైనా మార్గమే తమ మార్గమన్న మావోయిస్టులు ఇప్పుడు ఆ నినాదం ఇవ్వకుండా ‘ఎన్నికల బహిష్కరణ’ నినాదం ఇవ్వడం వల్ల ఉపయోగమేమిటో వారికైనా అర్థమయిందనిపించడం లేదు.
మావోయిస్టులు ప్రబోధించే ‘నమూనా’ ఎక్కడా కొనసాగనప్పుడు, కొన్నిచోట్ల (రష్యా, చైనా) అమలు జరిపి విరమించుకున్నాక, దానివల్ల ఎదుగుదల లేదని విశ్వసించి, మారిన సాంకేతిక, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఆ నమూనా ప్రజలకు ఉపయుక్తం కాదని ముక్తకంఠంతో తూర్పు యూరప్ దేశాలు ప్రకటించినా పట్టించుకోకపోతే ఎలా? ఎదురైన అనుభవాలు, గుణపాఠాలను పరిగణనలోకి తీసుకుని ముందడుగు వేసినప్పుడే మంచి ఫలితాలొస్తాయి. అలాగాక మూర్ఖంగా, మొండిగా, తాము పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు అన్న చందంగా వ్యవహరిస్తే ప్రజలకు ఒరిగేది ఏమిటి? కష్టం-నష్టం- కన్నీళ్లు తప్ప మరొకటి కాదు!
ప్రధానంగా నాల్గవ పారిశ్రామిక విప్లవం వెల్లువెత్తుతున్న తరుణంలో శారీరక శ్రమకన్నా కృత్రిమ మేధకు, ప్రతిభకు, ప్రజ్ఞకు, సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఈ విషయం అతి స్పష్టంగా సామాన్య మానవుడికి సైతం అర్థమవుతోంది. ఈ ప్రధానమైన మార్పును పసిగట్టడంలో మార్క్సిస్టులు ముఖ్యంగా మావోయిస్టులు విఫలమయ్యారు. దాంతో వారి సిద్ధాంతం- ఆచరణ మధ్య ‘పేచీ’ వస్తోంది. దాన్ని గమనించకుండా, మారిన పరిస్థితులను పట్టించుకోకుండా అర్ధ శతాబ్దం క్రితం నక్సల్‌బరీలో ఉన్న వైరుధ్యాలే దేశంలో, ప్రపంచంలో కొనసాగుతున్నాయని విశే్లషించుకుని, వింగడించుకుని సంప్రదాయ ఆయుధాలతో తిరుగుబాటు చేస్తామని, విజయం సాధిస్తామని, ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేస్తామని ఆశపడటం అది పూర్తిగా పగటి కలగానే భావించాల్సి వస్తుంది.
ఎర్రకోటపై ఏ జెండా ఎగురుతున్నదన్నది ప్రాధాన్యం లేని అంశమైంది. యుపీఏ, ఎన్‌డీఏ జెండాలు ఎగిరినా... వర్తమాన కాలానుగుణమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత ఒడిసి పట్టుకుని సాధికారతతో జీవిస్తున్నామన్నదే ముఖ్యంగా మారింది. దీన్ని విస్మరిస్తే ఎలా? ఆయా దేశాల్లో ఆయా దేశాల జెండాలు ఎగురుతున్నాయి. అంతిమంగా ‘మార్కెట్’ విషయానికొచ్చేసరికి డిమాండ్-ఉత్పత్తి- సప్లయ్- సూత్రం ఒక్కటే పనిచేస్తోంది. ఏ మేరకు నూతన ఆవిష్కరణలతో ఆ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నామో, నూతన మార్కెట్లను సృష్టించుకుంటున్నామో అన్నది అతి కీలకమైంది. ఈ చిన్న ‘వృత్తం’లోని పెద్ద భూగోళం తిరుగుతోంది. దీన్ని గ్రహించనంత కాలం, కలలుకంటూ అరణ్యాలలో తిరిగినంత కాలం, ఆయుధాలపై అధిక విశ్వాసం కనబరిచినంత కాలం, కాలం చెల్లిన సూత్రీకరణలు, సిద్ధాంతాలపై మనసు పారేసుకున్నంత కాలం అదంతా వృథా యాసగానే మిగులుతుంది తప్ప వీసమెత్తు ప్రయోజనం చేకూరదు.
వర్తమానంలో నూతన ఆవిష్కరణల కోసం యువకులు తమ శక్తినంతా ధారపోస్తూ అన్నిరంగాలలో సరళతరమైన విధానాలను, ప్రజలకు ఉపయుక్తమైన వాటిని కనుగొనేందుకు పాటుపడుతున్న వైనం సిలికాన్ వ్యాలీతో మొదలుకుని, బెంగళూరు, హైదరాబాద్‌లలోని ప్రయోగశాలల్లో తీవ్ర ‘మథనం’ కొనసాగుతోంది. ప్రపంచాన్ని ముందుకు వేగంగా, నూతన ధోరణిలో పరుగెత్తించడానికి ‘శ్రమ’ చేస్తున్నారు. ఈ శ్రమ మార్క్సిస్టుల-మావోయిస్టుల ఊహల్లోని ‘శ్రమ’కన్నా భిన్నమైంది. ఈ ప్రాథమిక వ్యత్యాసాన్ని విస్మరించడం మూలంగానే మావోయిస్టులు పూర్తిగా వెనకబడిపోయారు. వారెన్ని ఆదివాసీ తెగలతో సైన్యం నిర్మించినా, రోబోల యుగంలో అదంతా బూడిదలో పోసిన పన్నీరు తప్ప మరొకటి అవదు. డ్రోన్లు, రోబోలు, అత్యాధునిక యుద్ధపరికరాలు, తుపాకుల ముందు ‘ఆదివాసీల సైన్యం’ నిలుస్తుందనుకోవడం భ్రమ మాత్రమే!
వాస్తవానికి ఆదివాసీలను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి సమాజంలోని ఫలితాలు వారు అందుకుని అందరిలా జీవించే ప్రయత్నించడంలో అర్థం- పరమార్థం- దాగుంది తప్ప వారిని మరింత వెనుకబడి ఉండేలా, అంకెలు- అక్షరాలకు దూరంగా ఆయుధ భాష, సంప్రదాయ ఆయుధ భాషను మాట్లాడేందుకు పురికొల్పితే దానె్నలా ఆహ్వానిస్తాం? దేశాన్ని, జాతిని కాలానుగుణంగా కదం తొక్కించడానికి అన్ని పార్టీలు, వ్యక్తులు- శక్తులు కృషిచేయవలసిన సందర్భంలో ఇలా పెడ ధోరణులకు బానిసలై, ఆయుధాలకు వశులై, నూతన ఆలోచనలకు దూరమై, వర్తమాన ఆధునిక సమాజాన్ని చూసేందుకు, పరిశీలించేందుకు విముఖులైనంత కాలం మిగిలేది హళ్ళికి హళ్ళి, సున్నకు సున్నా మాత్రమే. ఈ రకమైన వైఖరి మానవ జాతికి ఎప్పుడూ ఉపయుక్తం కాదు.
అత్యంత వేగంగా రూపాంతరం చెందుతున్న సమాజంలో, నాల్గవ పారిశ్రామిక విప్లవ ఫలితాలు దేశాల్ని కమ్మేస్తున్న తరుణంలో దానికి దూరంగా ఉండటమంటే మరింత పేదరికం మూటగట్టుకోవడమే తప్ప సంపదను పంచుకోవడం అవదు. సంపదను పంచుకోవడంపై దృష్టి సారించాల్సిన సమయంలో సాయుధ పోరాటమంటూ గెరిల్లాలు, విముక్తి ప్రాంతాలు, జనతన సర్కారు, ప్రజాకోర్టులు, తుపాకీ రాజ్యం, నియంతృత్వ పాలన లాంటి కాలం చెల్లిన పదాలతో కదం తొక్కితే కార్మిక-కర్షకులు మరింత బానిసలుగామారే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితి ఎవరు.. ఎందుకు ఆహ్వానిస్తారు?

-- వుప్పల నరసింహం 99857 81799