Others

పాపం.. ‘కోదండ’ పార్టీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ప్రత్యామ్నాయంగా ‘తెలంగాణ జన సమితి’ (తెజస)ని నిలబెట్టాలని ప్రొఫెసర్ కోదండరామ్ కలలుగన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. పోటీ చేసిన చోటల్లా డిపాజిట్లు గల్లంతయ్యాయి. తెజస పార్టీ బొక్క బోర్లాపడింది. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద పార్టీలతో సన్నిహిత సంబంధాలు కలిగి పౌర హక్కుల ఉద్యమంలో పనిచేసిన కోదండరామ్ ‘గ్రాఫ్’ ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. ఆయనపై అనేకమంది యువకులు, విద్యావేత్తలు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ఎంతో స్పష్టత, నిజాయితీ, ముందుచూపుతో వ్యవహరించాల్సిన ఆయన అవేమీ లేకుండా ఓ ‘కీలుబొమ్మ’గా మారడంతో ఈ పరాభవం ఎదురైందని పరిశీలకుల, ఆయన సన్నిహితుల భావన.
తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను సాకారం చేసేందుకు విలువలతో కూడిన రాజకీయాల్ని తెరాసకు ప్రత్యామ్నాయం చూపాలని నడుం బిగించిన ఆయన ప్రతి మలుపులో తడబడ్డారు. ఇంత అభాసుపాలుకావడం చూస్తే ఆయన పట్ల ఎవరికైనా జాలి కలుగుతుంది. రాటుదేలిన ఉద్యమకారుడిగా, వామపక్ష భావజాలానికి ప్రతిరూపంగా, మేధావిగా గుర్తింపుపొందిన ఆయనను ప్రజలు ఆదరించలేకపోయారు. ప్రజాస్వామ్యంలో జనం మద్దతు, ఆదరణ కీలకం. కేవలం ఆదర్శాలు, అభిప్రాయాలు, ఆవేశం, దుందుడుకుతనం పనికిరావన్న విషయాన్ని ఆయన గుర్తించలేకపోయారు.
ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు ‘గడీ గోడలు బద్దలు కొడతాం’ లాంటి తీవ్రస్థాయి నినాదాలు ఇచ్చి, సర్కారుపై ఆధారాల్లేని ఆరోపణలు చేసి మీడియాను ఆకర్షించడంతోనే- ఓట్లు రాలుతాయని ఆశపడ్డారు. అది పగటికల మాత్రమేనని తాజా ఎన్నికలు రుజువుచేశాయి. కేవలం ఏడెనిమిది స్థానాల్లో పోటీచేసిన తెజస- సర్కారును నడిపే తెరాసకు ప్రత్యామ్నాయం ఎలా అవుతుందన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం విడ్డూరం. పొత్తులో భాగస్వామియై పదిలోపు సీట్లను అంగీకరించడమంటే రాజకీయాలపై ఆయనకు సరైన అవగాహన, పార్టీపై స్పష్టత, రాజకీయ చతురత-నైపుణ్యం లేదని తేటతెల్లమైంది. భావ పరిపక్వత లేని వ్యక్తిగా ఆయన అడుగులు వేశారని సాధారణ వ్యక్తి సైతం గుర్తించాడు. మరి ఇలాంటి మానసిక స్థితిగలవారు ఒక రాష్ట్రాన్ని పాలించే పార్టీకి సారథ్యం వహించగలరా? అంతా గందరగోళం.. అగమ్య గోచరంగా రోజులు దొర్లించారు. ఈ వైఖరి దేన్ని సూచిస్తున్నది? చారులో కరివేపాకులా కోదండరామ్ పార్టీ ఉపయోగపడిందే తప్ప దానికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండాపోయింది. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోరాదన్న ఒక ఊహాత్మక అంశం చుట్టూతిరిగి శలభాల్లా తెజస అభ్యర్థులు రాలిపోయారు. ప్రదర్శించాల్సిన కసి, గమ్యంపై సరైన, నిశితమైన చూపులేకుండా కాంగ్రెసు పార్టీ ‘నీడలా’కొనసాగడంతో అంతిమంగా మిగిలిందేమిటి? అవమానం... పరాభవం, అప్రతిష్ట. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ఆ ఉద్యమ భాస్వరం ఆరిపోనీయకుండా కాపాడుకోవాలన్న ప్రయత్నం కృష్ణార్పణమైంది.
రాజకీయ పార్టీ నిర్మాణం-దాన్ని నడపడం, ప్రజల్లో నిలపడం- ఉద్యమంలో భావోద్వేగాలతో ఆడుకున్నంత తేలికకాదన్న విషయం గమనించక రంగంలోకి దిగి ‘రంగు’కోల్పోయారు. తెజస ఆవిర్భావానికి ముందునుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ప్రొఫెసర్ జ్యోత్స్న తన చేదు అనుభవాల్ని మీడియాతో పంచుకున్నారు. ‘తెజస’ దుకాణం తెరిచి డబ్బులు దండుకున్నారని, దందాల కోసమే ఆ పార్టీ పుట్టిందని తీవ్రంగా విమర్శించారు. ఒక మహిళా ప్రొఫెసర్ ఈ రకమైన ఆరోపణలు చేస్తే ఆ పార్టీ భవిష్యత్ ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతుంది కదా?
బడుగు-బలహీన వర్గాలు, మహిళలు- యువతకు పెద్దపీట వేస్తామని, ప్రత్యామ్నాయ రాజకీయాలను తెలంగాణలో నడుపుతామని, ‘కొత్తగాలి’ వీచేలా చేస్తామని కోదండరామ్ చేసిన వాగ్దానాలు గాలికి కొట్టుకపోవడంతో వేలాది మంది యువకులు, విద్యాధికులు నివ్వెరపోయారు. నిజాయితీ పూర్తిగా మూసీలో కలిసిపోవడంతో ఎంతోమంది ఛీత్కరించుకున్నారు. కంపుకొట్టే పార్టీలకన్నా ‘తెజస’ ఏమాత్రం భిన్నం కాదని తేలిపోవడం విషాదం. సమాజంలో కొత్తతరాల ఆశలు- ఆకాంక్షలు పెరుగుతున్న తరుణంలో వారి స్వప్నాన్ని కాలరాస్తూ తెజస అభాసుపాలు కావడంతో ఇలాంటి రాజకీయ నాయకులను విశ్వసించడానికి ఎవరూ సిద్ధంగా లేరు.
పార్టీలోని లొసుగులను, అవినీతి వ్యవహారాలను, లోపాలను జ్యోత్స్న తిరునగరి వెలుగులోకి తేగా ఆ పార్టీ ఉపాధ్యక్షురాలిగా కొన్ని నెలలపాటు కొనసాగిన అడ్వకేట్ రచనారెడ్డి, కూటమి ఏర్పాటు సందర్భంగా, టికెట్ల కేటాయింపు తరుణంలో ‘డబ్బు మూటలు’మార్పిడి జరిగిందని, శాస్ర్తియత లేని చర్చలు, ఒకరిపై ఒకరు పెత్తనం చలాయించడానికి అధిక ‘శ్రద్ధ’కనబరచారని ఆరోపిస్తూ పలు విషయాలను ఎన్నికలకుముందే మీడియాకు వెల్లడించడంతో ఆ పార్టీ పరువు గంగలో కలిసింది. ఇద్దరు మహిళలు- చదువుకున్నవారు ఈ విధంగా ఆ పార్టీలో నిజాయితీ లేని, విలువలు లేని, మర్యాదలేని వ్యవహారాలను బజారుకీడ్చడం వల్ల ఎవరికి శోభనిచ్చింది? కోదండరామ్ నిజాయితీపై ప్రశ్నార్థకం నిలిచింది. ఆ పార్టీలో జరిగిన అక్రమ ఆర్థిక లావాదేవీలు, టికెట్లు అమ్ముకోవడం, అవినీతి అన్నింటికీ ఆయనే బాధ్యుడని భావిస్తున్నారు. మరి ఇది ఏవిధంగా సంస్కారవంతమైన పని?
కోదండరామ్‌పై పిట్టల రవీందర్ కొన్ని విమర్శలు చేసి పార్టీ నుంచి తప్పుకున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు, ఉద్యమ ప్రభావశీలతను సజీవంగా నిలపాలనుకున్న కోదండరామ్ లాంటి వారికి ఈ రకమైన వ్యవహారాలు ఏ విధంగా మేలుచేస్తాయి? యువతను ఆకర్షించి, కొత్తతరానికి కొత్త రాజకీయం అన్న పద్ధతిలో అడుగులు వేసిన ‘తెజస’ అధినేత ఇప్పుడు జరిగిన నష్టానికి, పొరపాట్లకు ఏ విధంగా ‘సమాధానం’ చెప్పుకుంటారు. అపరిపక్వ రాజకీయ నేతగా కోదండరామ్ తననుతాను నిరూపించుకున్నారు. తెరాస ప్రభుత్వంపై, నాయకులపై తీవ్ర విమర్శలు చేసినప్పుడు తదనుగుణమైన ఆచరణను ఎదురుచూసిన ప్రజలకు తీవ్ర నిరాశను మిగిల్చాయి.
తాజా శాసనసభ ఎన్నికల్లో ‘తెరాస’ 88 స్థానాలను గెలిచి మొత్తం తెలంగాణ ప్రజల మన్ననలు అందుకుంది. మేధావులు సైతం ఈ విజయాన్ని చూసి విస్తుపోయారు. ప్రజా ఆశీర్వాద సభలతో తనకు తిరుగులేదని, తాము చేపట్టిన ప్రజాసంక్షేమ- అభివృద్ధి కార్యక్రమాలకు తిరుగులేదని కేసీఆర్ నిరూపించుకున్నారు. తెరాసను దేశస్థాయిలోనేగాక ప్రపంచస్థాయి పార్టీగా నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేటిఆర్‌ను నియమించారు. ఈ నియామకం పట్ల చాలామందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలోకి కొత్త రక్తం చేరుతోంది.
ఒకప్పుడు కుటుంబ పార్టీ అని, నిరంకుశ పాలన అని దుమ్మెత్తిపోసిన కోదండరామ్ లాంటి వారిప్పుడు కిమ్మనకుండా ఉండిపోయారు. రాజకీయ వ్యవహారాలను పకడ్బందీగా నడిపే ‘సత్తా’ ఎవరికుంటే వారికే అందలం దక్కుతుంది. ఈ సూత్రాన్ని విస్మరించినందువల్లనే ‘కూటమి’ ఓటమి పాలైంది. దార్శనికత లేకుండా, ఆగామి పరిస్థితులపై అంచనాలు లేకుండా, అభివృద్ధి సంక్షేమ అంశాలపై స్పష్టత లేకుండా, నాయకత్వం లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా, క్రమశిక్షణ కలికానికైనా కానరాని కూటమితో జతకట్టి కోదండరామ్ తన గోతిని తానే తవ్వుకున్నారని అవగతమవుతోంది. ఇందుకోసమా ఆయనను అనేకమంది యువకులు, విద్యార్థులు ఆరాధించింది?

-వుప్పల నరసింహం 99857 81799