Others

చైనా ప్రగతిని మావోలు చూడరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత నాలుగు దశాబ్దాలలో చైనా నూతన ఎత్తులకు ఎదిగింది. 1978లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. డెంగ్ జియావో పింగ్ దార్శనికత, సాహసోపేత నిర్ణయాల కారణంగా చైనా ఇపుడు ప్రపంచంలోనే రెండవ పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది. ఈ నలభై ఏళ్ళలో 74 కోట్లమంది ప్రజలు దారిద్య్రం నుంచి బయటపడటం గొప్ప ముందడుగు. 1978 నాటికి ఆ దేశంలో దారిద్య్రం రేటు 94 శాతం వుండగా 2018 సంవత్సరం నాటికది కేవలం 5 శాతం ఉండటం గొప్ప ఊరట. అలాగే 40 ఏళ్ళ క్రితం తలసరి ఆదాయం 165 డాలర్లుగా ఉంటే ప్రస్తుతం 8,830 డాలర్లుగా ఉండటం అపురూపం. నాలుగు దశాబ్దాల క్రితం అక్షరాస్యత 64 శాతం ఉండగా ప్రస్తుతం అది 95 శాతానికి చేరింది. ఇలాంటి ప్రగతే కదా ప్రజలకు కావలసింది!
నాలుగు దశాబ్దాల ఈ విజయ యాత్రను పురస్కరించుకుని ఇటీవల బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్’లో ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ సుదీర్ఘంగా ప్రసంగించారు. డెంగ్ జియావో పింగ్ హయాం నుంచి నేటివరకు జరిగిన సంస్కరణలను, వృద్ధి విధానాన్ని ఆయన దేశ ప్రజల ముందు నిలిపారు. ధైర్యసాహసాలతో తీసుకున్న నిర్ణయాలను, వేసిన అడుగులను ఆయన గుర్తుచేశారు. నలభై ఏళ్ళ క్రితం అప్పటి 96 కోట్లమంది ప్రజలకు సరిగా తిండి అందించలేని దీనస్థితి నుంచి ప్రస్తుతం 142 కోట్లమంది ప్రజలకు సంతృప్తికరమైన తిండి పెట్టడమే గాక, సౌకర్యవంతమైన జీవనం గడిపేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తోంది. స్థూల జాతీయోత్పత్తి 12.24 లక్షల కోట్ల డాలర్లకు చేరడంతో అక్కడ తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. దాంతో ఆర్థికంగా అనేక అద్భుతాలు ఆ దేశంలో చోటుచేసుకున్నాయి. చైనా మెరిసిపోతోందని ప్రపంచమిప్పుడు చెప్పుకుంటోంది. గర్వకారణమైన ఈ మార్పును ప్రతి దేశం ఆశిస్తుంది. ఇంతటి ఘనతను చైనా నాలుగు దశాబ్దాల్లో సాధించగలగడం అద్భుతం గాక ఏమవుతుంది?
1978లో నూతన సంస్కరణలు తీసుకురాకుండా సంప్రదాయ, పిడివాద విధానాలనే అనుసరిస్తూ పోతే ఆ దేశం ఎంతో వెనుకబడిపోయేదనడంలో సందేహం లేదు. మావో జరిపిన అనేక ప్రయోగాలతో కుదేలయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టకపోతే తలసరి ఆదాయం పెరిగేది కాదు, అక్షరాస్యత పెరగేది కాదు, దారిద్య్రం తీరేది కాదు. మావో అత్యుత్యాహంతో తీసుకొచ్చిన గ్రేట్ లీఫ్ ఫార్వడ్, సాంస్కృతిక విప్లవం ఆ దేశం వెన్నువిరిచాయి. ఆర్థికంగా అల్లకల్లోలం చేశాయి. సంప్రదాయ, పిడివాద కమ్యూనిస్టు విధానాలు కమ్యూనిస్టు వ్యవస్థను బలంగా ఏర్పాటు చేసేందుకు ఉపకరిస్తాయని ఆనాడు ఆశించారు. కాని ఆర్థికంగా ఆ విధానాలు తిరోగమన దిశను చూపాయి. దాంతో డెంగ్ జియావో పింగ్ మేల్కొని నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రపంచంతో కలిసి నడిచేందుకు నిర్ణయించాయి. దాంతో అనూహ్యమైన పురోగతి సాధ్యమైంది.
విచిత్రమేమిటంటే భారతదేశంలోని మావోయిస్టులు మాత్రం ఇప్పటికీ గ్రేట్ లీఫ్ ఫార్వడ్, సాంస్కృతిక విప్లవం లాంటి ఉద్యమాలను కొనసాగించాలని కోరుకుంటున్నారు. వాటిపై మనసు ఇంకా పారేసుకుంటున్నారు. అలాంటి సంప్రదాయ, పిడివాద ధోరణులతో ప్రయాణించి కమ్యూనిజాన్ని స్థాపించాలని కలలు గంటున్నారు. ఇది ఏ రకమైన ఆలోచనో ఎవరికివారే అంచనా వేసుకోవచ్చు. చైనాలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన సమయంలో భారతదేశంలో నక్సలిజం-మావోయిజాలను విస్తృత పరిచేందుకు ఆయుధాలు మరింత బలంగా పట్టాలని వామపక్ష తీవ్రవాదులు పిలుపునిచ్చారు. ఇటు దక్షిణాదిన పీపుల్స్‌వార్ గ్రూప్ లాంటిది చిన్న పార్టీ, ఉత్తరాదిన కమ్యూనిస్టు మావోయిస్టు సెంటర్ లాంటి వామపక్ష తీవ్రవాద పార్టీ చైనాలో మునిగిన సిద్ధాంతాన్ని, ఆర్థిక విధానాల్ని భారత్‌లో నిలబెట్టేందుకు కృషి చేసేందుకు నడుం బిగించడం ఎంతటి హాస్యాస్పదమో నాలుగు దశాబ్దాల చరిత్ర రుజువు చేస్తోంది. గ్రేట్ లీఫ్ ఫార్వడ్, సాంస్కృతిక విప్లవం ప్రజల ఆర్థిక అభివృద్ధికి దోహదపడవని చైనా విశే్లషించుకుని ‘గుణపాఠం’ నేర్చుకుని సంస్కరణల బాట అనుసరిస్తే ఆ సమయంలో భారత్‌లో ఆ సిద్ధాంతాల్ని విశ్వసించేవారు, వామపక్ష తీవ్రవాద భావజాలం గలవారు మాత్రం తిరస్కరణకు గురైన ఆ విధానాలను సూత్రాలను అక్కున చేర్చుకోవడం చూస్తే వారి దార్శనికత ఏపాటిదో అర్థమవుతోంది. అంతవరకు చైనా మార్గమే తమకు ఆదర్శమని నినదించిన నక్సలైట్లు 1978లో చైనాలో ప్రవేశపెట్టిన సంస్కరణల సమయంలోనూ అదే నినాదం బలంగా ముందుకు తీసుకొచ్చినట్టయితే భారతదేశం కూడా ఈ 40 ఏళ్ళలో అద్భుత ఆర్థిక శక్తిగా ఎదిగేది. ప్రజలు దారిద్య్రం నుంచి బయటపడేవారు, అక్షరాస్యత శాతం పెరిగేది. సౌకర్యవంతమైన జీవనం గడిపేవారు. కాని నూతన మార్గం ఎంచుకోకుండా- కాలం చెల్లిన విధానాన్ని, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని, దీర్ఘకాల సాయుధ పోరాటం ద్వారా ప్రజలు ‘విముక్తి’ పొందుతారన్న ఊహాత్మక ఆలోచనలతో సంప్రదాయ-పిడివాద సిద్ధాంతానికి బానిసలై ప్రజలను పావులుగా చేసుకుని ‘ప్రయోగాల’కు పాల్పడడంతో భారత ప్రజలకు ఒరిగింది శూన్యం. ఇంకా అసంఖ్యాక ప్రజలు దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. దుర్భర స్థితిలో కొనసాగుతున్నారు. ఈ పరిస్థితికి మావోయిస్టులు చూపే కారణం సరికాదని చైనానే రుజువు చేసింది. అయినప్పటికీ దాన్ని చెవిమీద పెట్టకపోవడం విచారకరం.
చైనాలో ఉమ్మడి వ్యవసాయానికి స్వస్తి పలికారు. సాగులో సంస్కరణలు ప్రవేశపెట్టారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్- దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టులు 2018 సంవత్సరంలో ఉమ్మడి వ్యవసాయాన్ని జనతన సర్కారు నేతృత్వంలో ప్రోత్సహిస్తున్నారు. 40 ఏళ్ళ క్రితం చైనా కమ్యూనిస్టులు త్యజించిన విధానాన్ని ఇక్కడ ఇపుడు ప్రవేశపెట్టడమంటే మనం ముందుకెళ్లాలనుకుంటున్నామా?.. వెనక్కి ప్రయాణించాలనుకుంటున్నామా?.. అన్న ఇంగితజ్ఞానం లేకపోతే ఎలా?
చైనాలో ప్రైవేటీకరణను అనుమతించారు. పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. రక్షణాత్మక చర్యలు చేపడుతూనే అనేక నిబంధనలను ఎత్తేశారు. దాంతో 2005 సంవత్సరం నాటికే అక్కడ ప్రైవేట్ పెట్టుబడుల వాటా 70 శాతానికి చేరుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ నవ్య దిశలో పయనించసాగింది.
భారతదేశంలో అదే ప్రయత్నం జరిగితే నక్సలైట్లు, మావోయిస్టులు దుమ్మెత్తిపోశారు. సామ్రాజ్యవాదుల కబంధ హస్తాల్లో దేశం చిక్కుకుంటోందని వాపోయారు. తమ ప్రాబల్యం గల దండకారణ్య ప్రాంతంలో, ఇతర చోట్ల ప్రైవేట్ సంస్థల ఆస్తులను పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు. తమ కసినంతా కూడదీసుకుని విషప్రచారం నిర్వహించారు, భయభ్రాంతులకు గురిచేశారు. పెట్టుబడులు పెట్టేవారు బెదిరిపోయేలా, చెదిరిపోయేలా వ్యవహరించారు. దీంతో చైనా కమ్యూనిస్టులకు- తామే నిజమైన వామపక్షవాదులమని చెప్పుకునే భారత నక్సలైట్లు, మావోయిస్టులకు ఎంత తేడా వుందో ఇట్టే పసిగట్టవచ్చు. ప్రపంచంతో కలిసి నడిచేందుకు, ప్రజలను దారిద్య్రం నుంచి బయటపడేసేందుకు, సౌకర్యవంతమైన జీవనం గడిపేందుకు సర్వశక్తులు చైనా కమ్యూనిస్టులు ధారిపోస్తుంటే భారతదేశ నక్సలైట్లు- మావోయిస్టులు మాత్రం సంప్రదాయ, పిడివాద వైఖరికి బానిసలై ప్రజలకన్నా సిద్ధాంతం పవిత్రమైనదని ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆయుధాలతో కదులుతున్నారు. హిమాలయాలకు ఆవలవున్న చైనా దేశ పురోభివృద్ధిని పట్టించుకోకుండా, అక్కడ అనుసరిస్తున్న విధానాలను గమనించకుండా, ఒకప్పుడు, ఆదర్శవంతమైన రష్యా-చైనా, తూర్పు యూరప్ దేశాల ‘నడక’ ఎలా మారిందో, మారుతున్నదో పసిగట్టడంలో మావోలు విఫలమయ్యారు. పారిశ్రామిక రంగంలో శరవేగంగా జరుగుతున్న పరిణామాలపై అసలు దృష్టి సారించకుండా స్టాలిన్-మావో కాలం నాటి సంప్రదాయ - పిడివాద విధానాలకు అంకితమై ఆధునిక కాలంలో కొనసాగుతామని భీష్మించుకొని కూర్చోవడం అవివేకం. మరతుపాకులు -మందుపాతరలు పేలుస్తూ, జరిగిన కొద్దిపాటి అభివృద్ధిని సైతం ధ్వంసం చేసేందుకు కంకణం కట్టకుంటే ఎలా? ఆదివాసీల అమాయకత్వంతో ఆడుకోవడానికి, వారిని బలిపశువులను చేసేందుకు తెగిస్తే అదెలా దార్శనికత అనిపించకుంటుంది? 50 సంవత్సరాల నక్సల్‌బరి పోరాట ప్రభావం ఎలా ఉందో?.. 40 సంవత్సరాల చైనా సంస్కరణల ప్రభావం ఏ మేరకుందో అంచనా వేసుకోకుండా, పరిశీలన చేయకుండా, ప్రపంచ పరిస్థితుల్ని, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, మారిన డైనమిక్స్‌ను గమనంలోకి తీసుకోకుండా ఎంతకాలం అరణ్యాలలో మావోలు దాగులుమూతలు ఆడతారు? ఆర్థిక వ్యవస్థను ఉరకలెత్తించి ప్రజల దారిద్య్రం పారదోలాలంటే జనారణ్యంలో ఉండి పనిచేయాలే తప్ప కీకారణ్యంలో మకాం వస్తే దక్కేది హళ్ళికి హళ్ళి.. సున్నకు సున్నా మాత్రమే! మరి ఈ మాత్రం దానికి ఇన్ని ‘త్యాగాలు’ అవసరమా కామ్రేడ్స్?

-వుప్పల నరసింహం 99857 81799