Others

రాజ్యాంగాన్ని గౌరవించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులవ్యవస్థ పదఘట్టనల కింద నలిగిపోతున్న మన దేశ ప్రజానీకానికి ‘ భారత రాజ్యాంగం’ అనే వరాన్ని అందించాడు డా.బి.ఆర్.అంబేద్కర్. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగంగా ఇది ప్రసిద్ధి చెందింది. స్వాతంత్య్రానంతరం 1949 నవంబర్ 26 నుండి అమల్లోకి వచ్చిన ఈ రాజ్యాంగం భారతీయ బహుజనులకు వరప్రదాయిని. నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా లాంటి మహానీయులెంతోమంది భారత రాజ్యాంగాన్ని సర్వోత్తమ రాజ్యాంగంగా పేర్కొన్నారు. వేల ఏళ్లుగా వర్ణవ్యవస్థ పీడితులై అనేక కులాలుగా విభజనకు గురైన భారతీయులను బి.సి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలుగా శాస్ర్తియ విభజన చేశాడు అంబేద్కర్. అంతకుముందు లేని ఓటుహక్కును భారతీయులందరికీ కల్పించాడు. అమెరికాలోని నీగ్రోల కంటే ముందే మన దేశ బహుజనులకు ఓటుహక్కు కల్పించాడు. సామాజికంగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న కులాలకు రిజర్వేషన్లు కల్పించింది రాజ్యాంగం.
భారత్‌ను సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ప్రకటించింది రాజ్యాంగం. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. అందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు, భావ ప్రకటన స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ, ప్రజలందరిలో సమైక్యతాభావాన్ని, అఖండతాభావాన్ని, సోదరభావాన్ని పెంపొందించడం రాజ్యాంగం లక్ష్యాలు. నిర్బంధ ఉచిత విద్య, ఓటుహక్కు, ఆహారం హక్కు లాంటి మానవీయ ప్రాథమిక హక్కులను రాజ్యాంగం కల్పించింది. ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడిన ప్రజాస్వామిక ప్రభుత్వం ఉండటం రాజ్యాంగం ధ్యేయం. మనుధర్మ పాలన నుండి భారతీయులను విముక్తం చేసి ప్రజాస్వామిక పాలనను అందించడానికి రాజ్యాంగం దోహదం చేసింది.
కానీ ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు అనే మాట మొదట్నుంచి అపహాస్యం పాలే అవుతుంది. డెబ్బై రెండేళ్ళ స్వాతంత్య్ర పాలనలో బహుళ సంఖ్యాకులైన ప్రజల ప్రభుత్వం ఏ ఒక్కసారీ రాలేదు. వీరి కోసం ఇంతవరకు ఒక్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు. రాష్ట్రాల్లోనూ, కేంద్రంలోనూ అల్పసంఖ్యాకులైన త్రివర్ణాల, అగ్రవర్ణాల పాలనే కొనసాగుతోంది. బడ్జెట్ ప్రతిపాదనలూ అలాగే ఉన్నందున పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా మారిపోతున్నారు. ఆ ధనికులంతా పాలక కులాలకు చెందిన అగ్రవర్ణాలవారే. కులం మెట్ల సమాజం ఉన్న ఈ దేశంలో వర్ణమూ, వర్గమూ దాదాపు ఒక్కటిగానే ఉండటం గమనించవచ్చు. ఏ పార్టీ అధికారంలోఉన్నా అగ్రవర్ణాల ఆధిపత్యం, అగ్రవర్ణ బడా పారిశ్రామికవేత్తలు మల్టీ మిలియనీర్స్‌గా ఎదగడం తప్ప మెజారిటీ ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అందుకు ప్రబల ఉదాహరణ 1% అగ్రవర్ణ పారిశ్రామికవేత్తల చేతుల్లో 74% దేశ సంపద ఉండటం, 7% చేతుల్లో 93% సంపద కేంద్రీకృతమై ఉండటమే 85%గా ఉన్న బహుజనుల చేతుల్లో రాజకీయాధికారాలు కానీ, సంపద కానీ, సామాజిక గౌరవంకానీ ఉండటం నామమాత్రంగానే సామాజికంగా దుస్థితిలో ఉన్నవారికి అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లను కూడా అమలుచేయని దుస్థితి. రాజ్యాంగం కల్పించిన సామాజిక వెనుకబాటు తనపు రిజర్వేషన్లను అపహాస్యంపాలు చేస్తూ అగ్రవర్ణ పేదల పేరుమీద పది శాతం ‘కోటా’ ఇవ్వడం రిజర్వేషన్ల స్ఫూర్తిని అపహాస్యం చేయడమే. ఇలా భారత రాజ్యాంగం అమలు చేయడంలో నిర్లక్ష్యం, రాజ్యాంగాన్ని కించపరచడం భాజపా పాలనలో పరాకాష్టకు చేరింది.
భారత రాజకీయాల్లో ‘సెక్యులర్’ అనే పదం భాజపా నాయకులకు ఓ బూతుపదమయింది. నెహ్రూ కాలంలో తప్ప ఈ పదమెప్పుడూ సరైన అర్థంలో ఉపయోగింపబడలేదు. నెహ్రూ, అంబేద్కర్‌లు ఈ పదాన్ని రాజ్యాంగంలో చేర్చిన అర్థం మతాతీత లౌకిక రాజ్యమని, మతాతీతంగా, మనిషి కేంద్రంగా దేశంలో పాలన కొనసాగాలని, మతమంటే అదో వ్యక్తిగత ఇష్టం. అది పాలనారంగంలో ప్రధాన పాత్ర వహించకూడదు. నెహ్రూ మాత్రం ఈ పదానికి పూర్తి న్యాయం చేసాడు. ఏ మత విశ్వాసాన్ని ప్రోత్సహించలేదు, అగౌరవపరచ లేదు. అంబేద్కర్ అయితే ఏ మతాన్నీ ఆశ్రయించకుండా మత లక్షణాలే లేని బౌద్ధ ధర్మాన్ని ఆశ్రయించాడు. మిగతా రాజకీయ నాయకులకు, పార్టీలకు సెక్యులర్ అంటే ఏ మతం వారితో ఆ మతం వేషధారణ చేసుకొని తిరగడం. అన్నీ మతాలను ప్రోత్సహించడం. మరి భాజపాకు అయితే సెక్యులర్ పదం కంటగింపు పదం. దేశమంటేనే మతం. అదీ హిందూ మతం మాత్రమే. దేశాన్నంతా హిందూమయం చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. మతం వీరికి ఓట్లురాల్చే యంత్రం. తమకు ఓట్లురాలటానికి సెంటిమెంట్లతో రెచ్చగొట్టడం, సెక్యులర్ పదాన్ని భ్రష్టుపట్టించడం వీరికి వెన్నతోపెట్టిన విద్య. రాజ్యాంగం పీఠికలో పొందుపరిచిన సోషలిస్టు పదం కూడా చాలా పార్టీలకు, ముఖ్యంగా మనువాద భాజపా, ఇతర ప్రాంతీయ పార్టీలకు కంటగింపయిన పదమే.
నెహ్రూ పాలన ఉన్నంతవరకు సెక్యులర్ పదం కాంగ్రెసుకు ఓట్లురాల్చే పదంగా ఉపయోగపడినా మతవాద, ప్రాంతీయ పార్టీలకిది తిట్టుపదమే. రష్యా సోషలిస్టు కల భగ్నమైన తర్వాత సామ్రాజ్యవాద శక్తుల ఎదుగుదల పెరిగిన తర్వాత భారతదేశంలో ఈ పదాన్ని మరీ చులకన చేశారు. తొలి ప్రధాని నెహ్రూ సోషలిస్టు రష్యా ప్రభావంతో ప్రభావితుడైనా, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సోషలిజాన్ని కోరుకున్నా, కాలక్రమంలో భాజపా బలపడటం, ప్రాంతీయ పార్టీలు విజృంభించడంతో ఈ పదమూ పలుచబడిపోయింది. ఇలా సామ్రాజ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య పదాలను చాలా రాజకీయ పార్టీలు పూర్వపక్షం చేసాయి. చేస్తున్నాయి. ఇది రాజ్యాంగాన్ని గౌరవించడమవుతుందా? ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలుగకుండా పాలించడం ప్రాంతీయ పార్టీలకు సాధ్యం కాదు. భాజపాలా ఇతర జాతీయపార్టీలు ఫెడరల్ స్ఫూర్తిని భంగం చేయవు. రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్లు కేంద్రంలో బలమైన, ఫెడరల్ స్ఫూర్తిని కాపాడే జాతీయపార్టీ పాలనను కోరుకోవాలి.
రాజ్యాంగంలో పొందుపరుచబడిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కొంచెం ఎక్కువ తక్కువగా అన్ని పార్టీల్లోనూ మృగ్యమే అయింది. ఈ మూడు రంగాల్లోనూ ఈ దేశ జనాభాలో 85%గా ఉన్న బహుజనం దురన్యాయానికే గురవుతుంది. సామాజికంగా వెనుకబడి ఉన్న కులాలే ఆర్థికంగాను రాజకీయంగానూ వెనుకబడి ఉన్నాయి. మెజారిటీ కులాలకనుకూలమైన రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత బహుజన శక్తులను అణచివేయడం మరింత నగ్నంగా భయోద్విగ్నంగా కొనసాగుతోంది. బహుజనులకు భావప్రకటన స్వేచ్ఛ కరవైంది. ప్రజలంతా దేశపౌరులుగా ఒక్కటిగాకాకుండా మతాలుగా, అంటరానివారిగా, కులాలుగా విభజింపబడుతున్నారు. కుల నిర్మూలనకు బదులు దేశంలో కులాలు మరింత స్థిరీకరింపబడుతున్నాయి. దేశానికే అవమానకరమైనదైన అంటరానితనం డెబ్బై ఏళ్ళ స్వాతంత్య్రం తర్వాత కూడా ఉందంటే అంతకంటే దౌర్భాగ్యమేముంది? సోషియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరగాల్సిన సమయంలో మాకు సామాజిక న్యాయం కావాలన్న స్థితిలో మెజారిటీ ప్రజలున్నారంటే మనం రాజ్యాంగానె్నంత గౌరవిస్తున్నామో అర్థమవుతుంది.
సామాజిక దురన్యాయానికి గురవుతున్న కులాలకిచ్చిన నామమాత్రపు రిజర్వేషన్లను కూడా అమలు చేయలేని ప్రభుత్వాలు మనవి. బి.జె.పి. వచ్చాక రిజర్వేషన్లను కూడా బంద్ చేయడానికి ప్రతీఘాత ఉద్యమాలు వస్తున్నాయి. వచ్చాయి. రాజ్యాంగాన్ని సమీక్షించాలని ఒకరంటే, మొత్తం రాజ్యాంగానే్న మార్చివేసి మనుధర్మ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాలని సాంప్రదాయవాదులు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాళ్ళే అధికారంలో ఉన్నందువల్ల రాజ్యాంగానికి పెనుముప్పు సంభవించనుంది. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రపంచ మేధావుల మన్ననలు పొందడమేకాకుండా ప్రపంచ రాజ్యాంగాల్లోనే సర్వోత్తమమైనదిగా ప్రఖ్యాతిగాంచింది. అంబేద్కర్ జన్మదినాన్ని ఐక్యరాజ్యసమితి ‘విశ్వశ్రేయస్సు దినం’గా ప్రకటించింది. అమెరికన్ డాలర్‌పై అంబేద్కర్ ఫొటోనూ ముద్రించారు. భాజపా అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానికే తూట్లుపొడిచి మార్చివేసే పరిస్థితులొచ్చాయి.
భారతదేశ కుల స్వభావాన్ని, భారతీయతను, దేశ స్వరూప స్వభావాలను, భారత ప్రజల ఆకాంక్షలను అంబేద్కర్ అర్థం చేసుకున్నంతగా మరెవ్వరూ అర్థంచేసుకోలేదు. భారతమాతను హృదయానికి హత్తుకున్న నిజమైన భారతీయుడు అంబేద్కర్. అలాంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుచేసే స్థానంలో రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళుండాలి. కాని క్రమక్రమంగా భారతదేశ పాలన రాజ్యాంగాన్ని అమలుచేసేవారి చేతుల నుంచి మనుధర్మ రాజ్యాంగాన్ని అమలుచేసే వారి చేతుల్లోకి పోతుంది, పోయింది. గత ఐదు సంవత్సరాలుగా మనమీస్థితిని చూస్తున్నాం. భారత రాజ్యాంగాన్ని అమలుచేసే సత్తా, అంకితభావం ప్రాంతీయ పార్టీలకుగాని, ప్రాంతీయ పార్టీల సమ్మేళనానికి గాని, బి.జె.పి.కి కానీ, సాయుధ పోరాటమనే కమ్యూనిస్టులకు గాని లేదు, ఉండదు. ఉంటేగింటే జాతీయ పార్టీలైన బి.ఎస్.పి.కి గాని, సెమీ మనువాద, సెమీసోషలిస్టు, లౌకిక స్వభావమున్న కాంగ్రెస్‌కుకానీ ఉంటుంది. రాజ్యాంగానికి సముచిత గౌరవం లభించాలంటే ఈ రెండు పార్టీలు అధికారంలోకి రావాల్సిన అవసరముందని గత చరిత్ర చెబుతోంది. కాదంటారా?

-డా. కాలువ మల్లయ్య 91829 18567