Others

ఎపుడూ లేని ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలింగ్ ముగిసినప్పటికీ ఫలితాల కోసం దాదాపు నెలన్నర రోజుల పాటు ఎదురుచూపులు..! అసెంబ్లీతో పాటు లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎడతెగని ఉత్కంఠను ప్రజలు, రాజకీయ పార్టీలు ఎదుర్కొనక తప్పని స్థితి. ఈ నిరీక్షణ ఇలా కొనసాగుతుండగా- వోటింగ్ సరళిపై రాజకీయ విశే్లషకులు, వివిధ పార్టీల నేతలు ఎవరి అంచనాల్లో వారు మునిగితేలుతున్నారు. లోక్‌సభ ఎన్నికలను ఏడు విడతలుగా నిర్వహిస్తున్నందున దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరుమోసిన భారత్‌లో ఎన్నికల నిర్వహణ మహా యజ్ఞం లాంటిదే. బ్రిటన్ వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆధారంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ ఒకేరోజు నిర్వహిస్తారు. సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేస్తారు. రాత్రికి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి మరుసటిరోజు ఉదయానికల్లా మొత్తం ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు. భారతదేశం వైశాల్యంలోనూ, జనాభాలోనూ పెద్దది కావడంతో ఎన్నికలు జరపడంలో అనేక వ్యయప్రయాసలు తప్పవు. 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలతో దేశం మొత్తం 32,87,263 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. 90 కోట్లకు మించి ఓటర్లు ఉన్నందున ఇక్కడ ఒక రోజులో పోలింగ్, ఫలితాల వెల్లడి సాధ్యం కాదు. ఎన్నికలంటే శాంతిభద్రతల సమస్య కూడా ఉంటుంది.
ఈ ఏడాది జూన్ 3నాటికి ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగుస్తుంది. 2019 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను కూడా ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. వీటన్నిటి దృష్ట్యా ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది. తొలి విడత, రెండో విడత పోలింగ్ ఈనెల 11, 18వ తేదీల్లో ముగిసింది. మూడో దశ ఏప్రిల్ 23, నాలుగో దశ ఏప్రిల్ 29, ఐదో దశ మే 6, ఆరో దశ మే 12, ఏడో దశ మే 19న నిర్వహిస్తారు. మే 23న ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. తొలి విడత మన రాష్ట్రంతోపాటు 20 రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించారు.
ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల (ఈవీఎం)ను వినియోగించడంపై తెలుగుదేశం పార్టీతోపాటు 21 రాజకీయ పార్టీలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఎన్నికల ఫలితాలు ఆలస్యమైనా ఫరవాలేదని, ఈవీఎంల ఫలితాలను 50 శాతం పీవీప్యాట్ చీటీలను లెక్కించి వాటితో సరిపోల్చాలని ఆ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఆ పార్టీలు సుప్రీం కోర్టుకు విన్నవించాయి.
ఏపీలో ఎన్నికల ఫలితాలకు ఇంకా చాలా గడువు ఉండటంతో పలురకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన పార్టీలు తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గెలుపునకు వారి వారి కారణాలు చెబుతున్నారు. తమ విజయానికి సంబంధించి టీడీపీ ధీమా వ్యక్తం చేస్తూ పలు కారణాలను చెబుతోంది. పారిశ్రామిక ప్రగతి, ఉపాధి అవకాశాలు పెరగడం, అమరావతి, పోలవరం నిర్మాణం వంటి అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాల ద్వారా తమకు అనుకూలంగా పోలింగ్ జరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పసుపు-కుంకుమ పథకం ద్వారా మహిళలు, నిరుద్యోగ భృతి ద్వారా యువత, పెన్షన్ల ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులు టీడీపీ వైపు మొగ్గు చూపారన్న అంచనాలున్నాయి. చాలాకాలంగా బీసీలు, ముస్లింలు టీడీపీకి అండగా ఉన్నారు. అనుభవశాలి అయిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే అభివృద్ధి కొనసాగుతుందన్న భావనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకోవడం, ఆంధ్ర వ్యతిరేకులతో చేతులు కలపడం, విపక్ష ఎమ్మెల్యేలు శాసనసభకు రాకపోవడం వంటి అంశాలు తమకు అనుకూలంగా ఉన్నాయని తెదేపా నేతలు చెబుతున్నారు.
వైసీపీ కూడా తన విజయానికి సంబంధించి కొన్ని కారణాలు చెబుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ బాగా పెరిగిందని, అధికార పార్టీలోని ఒక వర్గం పెత్తనం పెరిగిపోవడంతో జనం విసిగిపోయారని, బడుగువర్గాలు సహా మైనారిటీలు తమకు అండగా ఉన్నారని వైకాపా చెబుతోంది. రాజకీయ పార్టీల నేతలు ఎలా తమ వాదనలు వినిపిస్తున్నప్పటికీ, ఈసారి పోలింగ్ శాతం అంచనాలకు మించి పెరిగింది. మహిళలు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. మహిళలు తమకే వోట్లు వేశారని టీడీపీ వారు చెబుతుంటే, పోలింగ్ శాతం పెరగడం వల్ల తమకు మేలు జరుగుతుందని వైకాపా ధీమాగా ఉంది. ఏది ఏమైనా ఈసారి పోటీ తీవ్రస్థాయిలోనే జరిగింది.
మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలోనే పోలింగ్‌లో పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాలలో ఈవీఎంలు మొరాయించినా ఓటర్లు అర్ధరాత్రి వరకు బారులుతీరి మరీ ఓట్లువేశారు. అయితే, వీరంతా ఎవరికి, ఏ స్థాయిలో వోట్లు వేశారన్నది ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎక్కడ నలుగురు కలిసినా- ఎన్నికల ఫలితాల గురించి అంచనాలే చోటు చేసుకుంటున్నాయి. ఓటరు నాడి ఎవరికీ అంతుబట్టడం లేదు. టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ తీవ్రంగా ఉందని, జనసేన పార్టీ ప్రభావం పెద్దగా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేనకు ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం లేదని అంటున్నారు. కొద్ది మెజారిటీతోనైనా గట్టెక్కుతామని తెదేపా, వైకాపాల నేతలు ఆశలు పెంచుకుంటున్నారు. ఏ పార్టీ గెలిచినా 90-100 మధ్య స్థానాలను మాత్రమే గెలుచుకోగలుగుతుందని కొందరు విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఊహాగానాలు, అంచనాల సంగతెలా ఉన్నా- గెలుపు ఎవరిదో తెలుసుకోవడానికి మే 23వరకు నిరీక్షించవలసిందే!

-సూర్యభరత్ 94939 95880