Others

తెల్లదొరల పాలిట సింహస్వప్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం అలనాడు జరిగిన పో రాటంలో ఎందరో ధీరులు ప్రాణాలర్పించారు. తెల్లదొరలపై యు ద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్య్ర సమర యోధుడు మంగళ్ పాండే. బ్రిటిష్ వారి పెత్తనానికి తలవొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు వౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్య్రాల వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే. దేశానికి స్వేచ్ఛ, స్వతంత్రాలు కావాలని కలలుకన్న మహనీయుడు అతడు. బ్రిటిష్ వారి గుండెల్లో చలి జ్వరం పుట్టించిన సింహస్వప్నం మంగళ్ పాండే జయంతి రోజున ఆయన జీవిత విశేషాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
మంగళ్ పాండే 1827 జూలై 19న యూపీలోని నగ్వ గ్రామంలో జన్మించాడు. 22 సంవత్సరాలప్పుడు తనకు తెలిసిన వ్యక్తి బ్రిటీషు సైన్యంలో చేరుతుంటే అతని సహాయంతో ఈస్టిండియా కంపెనీలోని 34వ బెంగాల్ రెజిమెంట్లో సిపాయిగా పనిచేశాడు. 1857-58 మధ్యకాలంలో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. చరిత్రకారులు ఈ తిరుగుబాటును ప్రథమ స్వతంత్య్ర సంగ్రామంగా భావిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకి బ్రిటిష్ అధికారులకీ మధ్యగల జాతీయ, సాంస్కృతిక, సామాజిక వైరుధ్యాలు తిరుగుబాట్లకి దారితీశాయి. బానిసత్వానికి, చులకన భావానికి నిరసనగా భారతీయులు బ్రిటిష్ పాలనను వ్యతిరేకించారు. డౌల్హాసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం వంటివి ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో బ్రిటిష్ వారు సిపాయిలను ఇబ్బందులకు గురి చేశారు.
ఆ రోజుల్లో బ్రిటీషు పాలకులు సిపాయిలకు ‘ఆవు, పంది కొవ్వును పూసి తయారుచేసిన తూటాల’ను ఇచ్చేవారు. ఆ తూటాలను నోటితో కొరికి తొక్క తొలగిస్తేనే పేలతాయి. అలా నోటితో కొరకాల్సి రావడం హిందూ, ముస్లిం మతస్థులకు నచ్చలేదు. ఈ నేపథ్యంలో మంగళ్ పాండే ఇతర సిపాయిలతో- ‘బయటకు రండి- యూరోపియన్లు ఇక్కడ ఉన్నారు, ఈ తూటాలను కొరకడం నుంచి మేము అవిశ్వాసులవుతాము.. మీరు నన్ను ఇక్కడికి పంపించారు, మీరు నన్ను ఎందుకు అనుసరించరు’ అని ఎలుగెత్తి అరిచాడు. దీంతో బ్రిటీష్ అధికారులు భారత సైనికులను వత్తిడికి గురిచేశారు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ- కలకత్తా సమీపంలోని బారక్‌పూర్ వద్ద 1857, మార్చి 29న సైనికుడైన మంగళ్ పాండే బ్రిటిష్ సార్జెంట్ మీద దాడి చేసి, అతని సహాయకుడిని గాయపరచాడు. వెంటనే అక్కడికి వచ్చిన జనరల్ జాన్ హెగ్డే మంగళ్ పాండేను ‘మత పిచ్చి పట్టినవాడి’గా భావించి, అతడిని బంధించాలని జమిందారీ ఈశ్వరీ ప్రసాద్‌ను ఆజ్ఞాపించాడు. ఈశ్వరీ ప్రసాద్ ఆ ఆజ్ఞను తిరస్కరించాడు.
పాండే పారిపోవడానికి ప్రయత్నించి తనను తాను కాల్చుకున్నాడు. ప్రాణాలు పోలేదు కానీ బలమైన గాయమైంది. బ్రిటీష్ అధికారులు అతనిని బంధించారు. పాండేను బంధించని కారణంగా ఈశ్వరీ ప్రసాద్‌కు, సైనికుడిగా ఉంటూ తిరుగుబాటు చేసినందుకు పాండేకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనతో సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటీష్ వారిని భారత సిపాయిలు ఊచకోత కోశారు. మంగళ్ పాండేకు ఉరిశిక్ష ఏప్రిల్ 18న జరగాల్సి ఉన్నా, పది రోజుల ముందు అంటే ఏప్రిల్ 7వ తేదీన శిక్షను అమలు జరిపారు. జమీందార్ ఈశ్వరీ ప్రసాద్‌ను ఏప్రిల్ 21న ఉరితీశారు. పాండే స్ఫూర్తితో మధ్య భారతదేశంలో ఝాన్సీరాణి, నానాసాహెబ్ లాంటి ధీరులు స్వతంత్య్ర సంగ్రామంలో పోరాడారు. పాండేకు గుర్తుగా 1984లో కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. మంగళ్ పాండే ధైర్యసాహసాల నుంచి నేటి యువత ప్రేరణ పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది.
(నేడు మంగళ్ పాండే 192వ జయంతి)

-దామరాజు నాగలక్ష్మి