Others

పానకం స్వీకరించి పాపాలను పోగొట్టే స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృతయుగంలో తేనె, త్రేతాయుగంలో నెయ్యి, ద్వాపరంలో పాలు, కలియుగంలో పానకం నైవేద్యంగా తీసుకునే స్వామీ మంగళగిరి స్వామి. ఈ స్వామిని వేడుకున్నవారికి వేడుకున్నట్టు కోరికలు తీరుస్తారని ప్రతీతి.కోరికలున్నవారు తమ కోరిక నెరవేర్చమని పానకాన్ని స్వామికి నివేదిస్తారు. ఇక్కడ ఉన్న పూజారులు ఆ పానకాన్ని నోరు తెరుచుకుని ఉన్న నరసింహస్వామి నోట్లో పోస్తారు. ఎపుడు ఆ పూజారులు పోయడం ఆపుతారు. పోసిన పానకంలో కాస్తంత స్వామి నోట్లో నిలిచి పోతుంది. దానే్న స్వామి ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. ఇలాచేయడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని అంతకుముందు చేసిన పాపాలను కడిగివేయబడుతాయని ఇక్కడి భక్తులు చెబుతుంటారు. ఇలా యుగయుగాలనుండి మహిమలు చూపుతూ, భక్తావళిననుగ్రహించే పుణ్యక్షేత్రంమే మంగళగిరి. ఈ ప్రదేశానికి సంబంధించిన ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది.
పురాణ కథ:
పూర్వకాలంలో ఆహీమని పుత్రుడైన పారియాత్రుడనే రాజు, అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శ్రీహరినే ధ్యానించేవాడు. అతని కుమారుడే హ్రస్వశృంగి. ఇతనికి అంగవైకల్యం ఉండటంచే, దానిని తొలగించుకోవడానికై తీర్థయాత్రలు చేయడం ప్రారంభించాడు. ‘ఓం నమో నారాయణ’ అంటూ అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ, ఈ స్థలానికి వచ్చేసరికి దేవతలు దర్శనమిచ్చి తపస్సు చేయమని చెప్పారు. అక్కడే తపోనిష్ఠలో ఉండగా, అతని చెంతకు తండ్రి వచ్చి తీసుకొని వెళ్లాలని ఎన్నో విధాలుగా యత్నించాడు. కాని కొడుకు మాత్రం స్వామిని వదిలి రాలేనని చెప్పాడు. తండ్రి మాత్రం రమ్మని బలవంతంగా చేస్తుంటే తండ్రినుంచి తప్పించుకుని స్వామిని చేరాలనుకొన్న హ్రస్వశృంగి, ఏనుగువలె ఒదిగిపోయాడు. తన మంత్ర ప్రభావంతో కొండలా మారిపోయాడు. కాని స్వామిని స్మరించడం మానలేదు. స్వామిని తనపై కొలువై వుండమని మనసులో ప్రార్థించాడు. భక్తుని కోరిక మన్నించిన శ్రీహరి, లక్ష్మీదేవితో కలిసి వచ్చి నృసింహస్వామిగా శుభప్రదమైన గిరిగా మారిన భక్తుని దేహంపై కొలువై వెలసినాడు. అదే సమయంలో అచటి గుహలో దాగివున్న ‘నముచి’ అనే రక్కసుని కూడా స్వామి తన చక్రంతో ముక్కలు చేసిరాక్షసుని వల్ల బాధపడే భక్తాళిని సంరక్షించాడు. అదే మంగళగిరిగా, దానిపై వెలసిన స్వామియే పానకాల స్వామిగా ప్రఖ్యాతమయ్యాడు. అందుకే ఈ కొండను దూరంనుంచి చూస్తే ఏనుగు ఆకారంలో కనబడుతుంది. దగ్గరకు వచ్చి చూస్తే ఒదిగిన ఏనుగునే గుర్తుచేస్తుంది. ఈ కొండపై విగ్రహమేదీ లేదు. అదే కొండలో చెక్కబడిన స్వామి ముఖచిత్రం మాత్రం కనబడుతుంది.ఇప్పటికీ స్వామి నోట్లో ఎంత పానకం పోసినా గుట గుట శబ్దం మాత్రమే వినబడుతుంది. శబ్దం ఆగిందా, పోసే పానకం పైకే వస్తుంది. అది ప్రసాదంగా స్వీకరించి భక్తులు మురుస్తారు!
ఈ స్వామికి పూర్వం క్షీర సముద్రాన్ని మథించినపుడు శ్రీమహాలక్ష్మి అవతరించింది. సమస్త సంపదలు రూపుదాల్చినట్లున్న ఆ మహాలక్ష్మి కోసం ఓ చక్కని పుష్కరిణిని దేవతలు నిర్మించారు. అందు అన్ని పుణ్యనదులలోని తీర్థాల్లోని జలాన్ని తెచ్చి ఉంచారు. అందే మహాలక్ష్మి మునిగి, శ్రీమన్నారాయణుని స్మరించి ధ్యానించి తనను సమర్పించుకొన్నది. ఆ పవిత్ర పుష్కరణియే నేటికి లక్ష్మిపుష్కరిణి అనే పేరుతో మంగళగిరిలో వుంది.
శ్రీరాముడు తానెంతో ధర్మంగా పాలించాడు. అయినా ఈ కొండను సందర్శించాకే తరించాడని, అందువల్లనే దీనిని ‘తోతాద్రి’ అని అంటారు. మంగళగిరి దిగువనున్న లక్ష్మీ నరసింహస్వామిని ధర్మరాజు ప్రతిష్ఠించి అర్చించాడని అంటారు. ఈ క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి. లోకకళ్యాణార్థం మారుతిని ఈ మంగళగిరి కొండపై కొలువై ఉండమని శ్రీరాముడాదేశించాడంటారు. ఇక్కడున్న శాసనాలను పరిశీలిస్తే ఎందరెందరో మహారాజులు, భక్తులు స్వామిని దర్శించి అర్చించినట్లు తెలుస్తోంది. శ్రీచైతన్య మహాప్రభువులు స్వామిని దర్శించినట్లుగా అక్కడున్న వారి పాద చిహ్నాలు, శ్లోకమే సాక్షి!
బహుళ అంతస్తులతో విరాజిల్లే గాలిగోపురాన్ని తనివితీరా చూడాల్సిందే! దారుశిల్పాలతో భారత భాగవత రామాయణ గాథలు చూస్తుంటే రెండు కనులు చాలవు. ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు ఇచట 12 రోజులు జరుగుతాయి. స్వామి జయంతులు, శ్రీరామనవమి మహోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుపుతారు. ఇవి చూచి తీరాల్సిన వేడుకలే కానీ వర్ణించవీలులేనివి. నేత్రోత్సవంగా జరిగే ఈ పండుగలు ఇహపర ముక్తిబోధకాలు. పాపనాశనం చేసే మంగళగిరి స్వామిని దర్శించుకోవడానికి తండోప తండాలుగా భక్తులు నిరంతరం తరలివస్తుంటారు.

- ధరణీప్రగడ సత్యమూర్తి