Others

అనర్థహేతువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోపం రాని వారు అంటూ ఎవరూ ఉండరు. సత్వగుణులకైనా ధర్మాగ్రహం వచ్చితీరుతుంది. కాని కోపం రావడం సహజం. ఆ వచ్చిన కోపాన్ని నిగ్రహించుకొని ఎవరు మీద ఎంత వరకు కోపాన్ని ప్రదర్శించాలో అంతవరకు ప్రదర్శించి త్వరగా ఉపశమింపచేసుకొనేవారు గొప్పవారుగా కీర్తించబడుతారు. రాముడు సాత్వికుడు. రాము నికి కోపమే రాదు అని చెప్పినా సముద్రుని మీద వారధి కట్టబోతుంటే సముద్రుడు ఉప్పొంగి వస్తూ వారధి కట్టడానికి వీలు కాకపోతే సముద్రునిమీద రామునికిఎక్కడ లేని కోపం వస్తుంది. సమస్త భూమండలాన్ని ఎదరించగలశక్తి ఉన్న నన్ను గుర్తించడం లేదు సముద్రుడు అంటాడు రాముడు. ఇదిగో ఇక్కడే కోపం రావడానికి కారణం. రాముడు నేను మానవ మాత్రుడిని. దశరథుని పుత్రుడిని మాత్రమే కానీ ఏ మహా విష్ణువు అవతారమని తన రామావతారంలో దేవతలందరూ ఆఖరికి బ్రహ్మదేవుడు చెప్పినా ఒప్పుకోడు. అట్లాంటి రాముడు సముద్రుని దగ్గరకు వచ్చేసరికి నేను అనే అహంకారం చూపుతాడు. అది ఆయనకు చెల్లింది అని చెప్పు కున్నా సామాన్యమానవులకు కూడా ఈ అహం కారమే ఇతరులపైన కోపం రావడానికి కారణం అవుతుంది.
నేను చెపితే వినరా... నేను చెప్పితే చేయరా.. ఏమదీ అంటూ అహాన్ని ప్రదర్శించి గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకుంటారు. అందుకే వివేకులు ఎపుడైనా కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి అనే చెప్తారు. పేదవానికోపం పెదవికి చేటు అనీ దీనివల్లనే సామెత పుట్టుకొచ్చింది. ధనికులు, పదవిలో ఉండేవారు ఏదైనా తప్పు చేసినా వారికి అసలు విషయం చెప్పకుండా కోపాన్ని వారి మీద చూపితే వారు వెంటనే తమ తప్పును సరిదిద్దుకొనకపోగా కోపం చూపించిన వారికి కీడు చేస్తారు. కోపాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉన్నపుడైనా సరే వ్యక్తిగతంగా కాక కేవలం ఏ విషయం పైన కోపం వచ్చిందో దాన్ని చెప్పి అవతల వారికి వారి తప్పును తెలుసుకొనే ట్టు చేయాలి. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని ఇవ్వాలి. లేకపోతే కోపంవల్ల నలుగురిలో చులకన అవుతారు. కోపిష్టి అనే ముద్ర పడుతుంది. అకారణంగా కోపగించుకోవడం అనర్థానికి దారితీస్తుంది. ఒక్కోసారి కారణం లేకుండానే కోపగించుకుని తరువాత పశ్చాత్తాపపడుతూ వుంటారు కొందరు. చిన్నచిన్న విషయాలకు కూడా కొందరు కోపగించుకుంటూ వుంటారు. అటువంటివారి జోలికి ఎవరూ పోరు. అలుక, కినుక అనే పదాలను అందంగా ప్రయోగిస్తూంటారు కానీ అవి కూడా ముదిరితే చీకాకులే మరి. కోపం వల్ల మనిషిలోని శక్తి, ఉన్న సమయమూ వృధా అవుతాయి. మనశ్శాంతి లోపిస్తుంది. దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. తరచుగా కోపగించుకునేవారిపట్ల ఎవరికీ లక్ష్యభావం ఉండదు. కోపం అగ్నిలాంటిది. లోపల లోపల కాల్చివేస్తుంది. ఇది కనిపించని శత్రువు, అంతశ్శత్రువు. అరిషడ్వర్గంలో కోపం ఒకటి.
‘‘క్రోదాద్భవతి సమ్మోహః సమ్మోహత్ స్మృతి విభ్రమః
స్మృతి భ్రంశాల్ బుద్ధినాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి’’ అని శ్రీకృష్ణుడు క్రోధం పతనానికి దారితీస్తుందని చెప్పాడు. అందుకే కోపాన్ని విడిచిపెట్టడమే మేలు చేస్తుంది. కోపం వల్ల జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. చిత్త చాంచల్యం జరుగుతుంది.యుక్తాయుక్త విచక్షం నశిస్తుంది. వాక్పురుష్యం కలుగుతుంది. ఈ పరుషపదాల వల్లే సమాజంలో చెడు పేరు వస్తుంది. దానితో సర్వమూ నాశనమైపోతుంది. మానవుని పతనానికి కోపమే కారణ మవుతుంది. క్రోధమధి శత్రువు అంటారు ఏనుగు లక్ష్మణ కవి. కోపం వుంటే వేరే శత్రువుతో పనిలేదు. కొన్ని సందర్భాల్లో చేతకానితనం, అసమర్థత, కోపానికి కారణమవుతాయి. కనుక ఏది ఏమైనా కోపాన్ని దూరం చేసుకోవడం చాలా మంచిది.

- పురందర్