Others

జాతీయ భాషగా హిందీ ఎందుకు వద్దంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామందిమి హిందీ భాషను ఇష్టపడతాం. హిందీ సినిమాలు చూస్తాం. హిందీ పాటలు వింటాం. మరి హిందీనెందుకు జాతీయ భాషగా అంగీకరించం? ఈ సందేహం చాలామందిని వదలడం లేదు. జాతీయ భాషగా హిందీ వద్దనే వాదనకి సూత్రప్రాయంగా అవునన్నా, సంపూర్ణంగా నిస్సందేహంగా మద్దతు పలకడం లేదు. జాతీయ భాష వాదన తెచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన వాదన విడిచిపెట్టి, అబ్బే అలా అనలేదు.. అని అన్నా, ఆ ఆలోచనలో లొసుగు ఇంకా బాగా అర్థం కావాల్సి ఉంది.
‘ఒకే దేశం- ఒకే భాష’ అన్నది ఒక అవసరం లేని ఆలోచన. ఎవరి భాషలు వారికి ఉన్నప్పుడు, వాటితో బాగానే ఉన్నప్పుడు ఒకే భాష అని వేలాడడం దేనికి? కేవలం భాష కారణంగా భార్యాభర్తలనే కలిపి ఉంచలేం, దేశ ప్రజల్ని కట్టి ఉంచగలమా? దంపతులు కలిసి ఉన్నారంటే కుటుంబం అన్న భావన, పెళ్లి అన్న సామాజిక కట్టుబాటు వంటివి కారణాలు. అలాగే దేశం కలిసి ఉన్నది మనమంతా భారతీయులం, అన్నదమ్ములం అన్న భావం వల్ల లేదా రాజ్యాంగం వల్ల.
ఒకే భాషతో ఏకరూపత సాధిస్తే మంచిదే కదా అనొచ్చు. ఏకరూపత కన్నా ఐక్యత గొప్పది కదా. అయినా అన్నింట్లో ఏకరూపతను బలవంతంగా తీసుకురావడం అవసరమా? ఒకే సైజులో కత్తిరిస్తే క్రోటన్ మొక్కలు బాగానే కనబడతాయి. అవి ప్రదర్శనకి తప్ప మరిదేనికీ పనికిరావు కాబట్టి ఓకే. అదే పని పండ్లమొక్కలకు చేస్తామా? చేస్తే నష్టం తప్ప లాభం ఉంటుందా?
మరి మాతృభాషని పట్టుకు వేళ్ళాడితే ఏం ప్రయోజనం? అని అడగొచ్చు. మాతృభాష అంటే అమ్మ భాష. ఊహ తెలిసినప్పటి నుంచీ అమ్మానాన్నా, ఇరుగు పొరుగూ అలవాటు చేసిన భాష. సహజంగా అబ్బిన భాష. కాబట్టి ఆ భాషలో బాగా భావ ప్రకటన చెయ్యగలం. బాగా నేర్చుకోగలం. జీవితపుముఖ్య దశలో అమ్మభాషలో విద్య ఉంటే అదనపుశ్రమ లేకుండా జ్ఞానార్జన హాయిగా సాగుతుంది. పునాది బలంగా ఉంటుంది. పైగా మనదైన వాడుక భాష ముందుతరాల వరకూ మనగలుగుతుంది. సంస్కృతి సజీవంగా సాగుతుంది. అదే పరాయి భాష అయితే భావంతోపాటు భాషాజ్ఞానం నేర్చుకోవాల్సిరావడం కొంచెం ఎక్కువ శ్రమ.
మరి ఆంగ్లాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకోవడం? అని అడగొచ్చు. అమ్మ భాష కాని ప్రతీదీ పరాయి భాషే. గిరిజనులకు (కొన్ని తెగలకు) తెలుగు పరాయి భాష, తెలుగువాళ్లకు అరవం అయినా, ఆంగ్లం అయినా పరాయి భాషలే. అవి నేర్చుకోడానికి కష్టం ఒకటే. కష్టం ఒకటే అయినపుడు, లాభం దేనికి ఎక్కువో చూడాలి. అమెరికా తరువాత ఎక్కువ ఆంగ్లం మాట్లాడే దేశం మనదే. పైగా ఆ భాష ప్రపంచ భాష. సాంకేతిక జ్ఞానం, సకల విజ్ఞానం అందులోనే ఉంది. విదేశీ ఉద్యోగాలు సాధించడంలో భారతీయులు మిగతా దేశాలకన్నా ముందున్నారంటే ముఖ్యకారణం ఆంగ్లం బాగా తెలిసి ఉండడమే. ఆ విషయం తెలిసీ చైనా, గతంలో ఫ్రెంచ్ పాలనలో ఉన్న కొన్ని దేశాలు ఇంగ్లీషు బాటపట్టాయి. హిందీతో ఆ సౌలభ్యం ఉండదు కదా. హిందీని జాతీయ భాషచేస్తే ఏం నష్టం? అని అడగొచ్చు. కారణాల్లో మొదటిది ఆ అవసరం లేదు. ఎవరి భాషలు వారికున్నాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటే గొప్పదేశం మనది. మనందరినీ భాషాపరంగా కలిసి ఉంచడానికి ప్రపంచ భాష ఇంగ్లీష్ ఉంది. రెండో కారణం జరిగే నష్టం. హిందీని బలవంతంగా మనకి తప్పనిసరి చెయ్యడం వల్ల అటు స్వంత వాడుక భాష వాడకం తగ్గి ప్రాధాన్యత కోల్పోతుంది. ఇటు ప్రపంచాన్ని జయించగల అవకాశం ఉన్న ఇంగ్లీష్ ఎంతోకొంత దూరమై ఇప్పటికీ ప్రాభవం కోల్పోతాం. పైగా ఇది సువిశాల భారతదేశంలో రెండుసార్లు విఫలమైన ప్రయోగం. మళ్ళీ హిందీపై వివాదం అవసరమా? కాబట్టి ఎప్పటిలాగే త్రిభాషా సూత్రం పాటించడమే మంచిది. హిందీని ఎటూ ద్వితీయ భాషగా నేర్చుకుంటున్నాం. ఏ మాత్రం ద్వేషించడం లేదు. హిందీ సినిమాల్ని, హిందీ సాహిత్యాన్ని ప్రేమిద్దాం. ఒకే దేశం- ఒకే భాష లాంటి విఫల, వివాదభరిత యత్నాలెందుకు? విభిన్నతని గౌరవిస్తూ ఒకే దేశం-ఒకే ఆత్మగా ఉండడానికి ప్రయత్నిద్దాం.

-డా. డి.వి.జి.శంకరరావు 94408 36931