Others

రహదారుల రక్తదాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్లను నిర్మిస్తున్నా, భద్రత రీత్యా మోటారు వాహనాల ప్రమాణాలు పెంచుతున్నట్టు సంబంధిత కంపెనీలు గొప్పలు చెబుతున్నా- రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రతినిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో మరణిస్తున్నారు, ఇంకెందరో క్షతగాత్రులవుతున్నారు, ఎన్నో కుటుంబాలు విషాదం పాలవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణాలుగా- ప్రజారవాణా వ్యవస్థ విస్తరించక పోవడం, వాహన చోదకులు నిబంధనలు పాటించకపోవడం, ప్రమాదాలను నివారించాల్సిన విభాగాల అధికారులు నిర్లిప్తతగా ఉండడం వంటివి కనిపిస్తున్నాయి. గతుకుల మయమైన రహదారులు, రోడ్డుపై కనిపించని హెచ్చరిక బోర్డులు, అవి ఉన్నా పట్టించుకోని వాహనదారులు, రహదారుల పక్కనే జోరుగా మద్యం విక్రయాలు ఈ ప్రమాదాలకు హేతువులవుతున్నాయి.
గత మూడేళ్లుగా తెలంగాణలో నమోదైన రోడ్డుప్రమాదాలు ఆందోళనకర రీతిలో ఉన్నాయి. 2017లో 22,811 ప్రమాదాలు చోటు చేసుకోగా 7,219 మంది మృతిచెందగా, 24,217 మంది క్షతగాత్రులయ్యారు. 2018లో 22,484 ప్రమాదాలు జరుగగా 6,596 మంది మృతి చెందారు. 24,017 మంది క్షతగాత్రులైనారు. 2019లో ప్రమాదాలు 11,302 జరుగగా 3628 మృతులు కాగా, 11,715 మంది అంగవైకల్యం పొందారు. ఏటా దేశవ్యాప్తంగా 4,80,652 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ 2016లో ఇచ్చిన నివేదిక చెబుతోంది. 68% ప్రమాదాలు మితిమీరిన వేగం వల్లేనని తేలింది.
రహదారుల పక్కనే మద్యాన్ని అందుబాటులో ఉంచడం పాలకుల తప్పిదం కాదా? ప్రభుత్వాలకు ప్రధానంగా ఆదాయం మద్యం ద్వారానే వస్తున్నప్పటికీ మరోవైపు రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా మద్యం షాపులు స్వాగతం పలుకుతున్న పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్న విషయం ప్రభుత్వాలకు తెలియదా? ఎక్సయిజ్, ఆర్‌టిఓ, పోలీస్ శాఖల మధ్య సమన్వయం ఏర్పరిచి రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలకు పూనుకోవాలి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలి. మనం స్వీయ నియంత్రణ చేసుకుంటూ ప్రయాణించాలనే కనీస బాధ్యతలను మరువరాదు. ప్రయాణ సమయంలో నిదానంగా వెళుతూ గమ్యాన్ని క్షేమంగా చేరుకోవాలి.
మన దేశంలో రోడ్ల పరిస్థితుల ఆధారంగా ఏ వాహనానికైనా గరిష్టంగా వేగ పరిమితి గంటకు 80 కి.మీ మాత్రమే, అంతకుమించి వెళ్లరాదు. కాని కార్లు ఇతర వాహనాలు గంటకు 120 కి.మీ దాటిన వేగంతో ప్రయాణం చేస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్లు ధరించాలి. కార్లు, జీపుల్లో ప్రయాణించే వారు సీటుబెల్టు పెట్టుకోవాలి. భారీ వాహనాలతో సుదీర్ఘ ప్రయాణం చేసే డ్రైవర్లు తగినంత నిద్ర ఉండేలా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలదే. ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి వద్ద జరిగిన ప్రమాదంలో కారు ఫ్లైఓవర్ పైనుంచి పడేందుకు ప్రాథమిక కారణం మితిమీరిన వేగం ఒకటైతే, ఫ్లైఓవర్ నిర్మాణంలో డిజైన్ లోపమని భావిస్తున్నారు. ఏదైనా దుర్ఘటన జరిగాక సంబంధిత శాఖల అధికారులు కొంత హడావుడి చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా ఆటోలు,ట్రక్కులు, ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనాల్లో ప్రజలను తరలించడం షరామామూలైంది. నిబంధనలను అతిక్రమించి ప్రయాణికులతో భారీ వాహనాలు శరవేగంగా ప్రయాణిస్తున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు ఇంతలా జరగవు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వివిధ శాఖలు కఠినంగా వ్యవహరించాలి. పోలీసుశాఖ వారు డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులపై దృష్టిసారిస్తున్నప్పటికీ ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగానే ఉంది.
రోడ్డుప్రమాదాలలో అత్యధికంగా యువకులు మృత్యువు బారిన పడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలో విద్యావంతులే ఎక్కువగా ఉన్నందున విద్యాసంస్థల్లో కౌనె్సలింగ్ జరుపుతూ ప్రమాదాల తగ్గుదలకు పాటుపడాలి. వీఐపీలకు చెందిన వాహనాలు రోడ్లపైకి రాగానే ట్రాఫిక్ పోలీసులు నిబంధనలన్నింటినీ పక్కన పెడుతున్నారు. విఐపీలకు నిబంధనలు వర్తించవా? ప్రజాప్రతినిధుల వాహనాలు అతివేగంగా దూసుకెళ్తుంటే ప్రయాణదారులు చోద్యం చూస్తూ వారు వెళ్లేదాకా ఆగాల్సివస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే అనే నిబంధనలకు వీఐపీలు అతీతులా? అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ నియమిత వేగంతో ప్రయాణిస్తే ఇతరుల ప్రాణాలకు హాని జరగదు. రహదారుల నిర్మాణం నాసిరకం ఉండడం కూడా ప్రమాదాలకు కారణంగా మారుతోంది. నాణ్యత లోపించిన రహదారులకు వెంటనే పునర్నిర్మాణం చేయాలి. చిన్న చిన్న ప్యాచ్‌వర్క్‌లను నిర్లక్ష్యంగా వదిలివేయడంతో రాత్రివేళల్లో దారి కనిపించక చాలా ప్రమాదాలు జరుగుతున్నది. కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ శాఖ అధికారుల అవినీతి కారణంగా రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించి ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు పైకెక్కిన ప్రయాణ వాహనదారుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే? అంబులెన్స్ వస్తుంటే దారి ఇవ్వలేని అమానవీయతతో వారు కాలం వెళ్ళదీస్తున్నారు. అదే మంత్రులు, ప్రజాప్రతినిధులు రోడ్డుమార్గాన వెళ్లేలా ట్రాఫిక్ అడ్డు తొలగిస్తున్న విధానంపై విమర్శలు తగ్గాలి. అంబులెన్స్‌లో కొనఊపిరితో కొట్టుకుంటున్న రోగుల కన్నా వీఐపీల ప్రయాణం మిన్న కాదు. వాహన చోదకులు, పాదచారులు క్షేమంగా గమ్యాన్ని చేరేలా పరిస్థితులను చక్కదిద్దాలి. అంతవరకూ రహదారులు రక్తమోడుతూనే ఉంటాయి.

-మేకిరి దామోదర్ 95736 66650