Others

ఇంధనం ప్రగతికి మూలధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత ఉరుకులు, పరుగులు జీవనంలో మానవుల పని సులువుగా సాగడంలో ఇంధనం ప్రముఖ స్థానాన్ని పోషిస్తోంది. ఉదయం తేనీరు తయారీ మొదలుకుని రాత్రి పడుకునే గదిలో తిరిగే ఫ్యాన్ వరకు వివిధ రూపాల్లో ఇంధనంతోనే మన జీవనం ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో ఇంధన పొదుపు ఆవశ్యకతను వివరిస్తూ 2001నుంచి ఏటా డిసెంబర్ 14నుంచి 20వరకు ఇంధన పొదుపు వారోత్సవాలుగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వారోత్సవాల్లో భాగంగా ఇంధన పొదుపుపై విస్తృతంగా ప్రచారంచేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తాయి. మండించినప్పుడు శక్తిని ఉత్పత్తిచేయు పదార్థాన్ని ఇంధనం అంటారని అందరికీ తెలిసిందే. వాహనాలు నడవడానికి, విద్యుత్ ఉత్పత్తిచేయడానికి, వంట చేయడానికి ఉపయోగపడును. మనం శ్రమించాలంటే శక్తి ఎలా అవసరమో ఏ వస్తువు ఆ పనిచేయాలన్నా దానికి తగిన ఇంధనం కావాలి. విద్యుత్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధన వనరులు మనకు రోజువారీ అవసరం. మనం ఇళ్లలో వాడే దాదాపు అన్ని వస్తువులకు విద్యుత్ అవసరం. ఆర్థిక రంగంలో సరళీకృత విధానాల ద్వారా ఇంధనం డిమాండ్ అధికమైంది. వీలైనంత తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తూ, యథావిధిగా పని కొనసాగితే చూడటమే ఇంధన పొదుపు. సూర్యుడు మనకు శక్తినిచ్చే ప్రాథమిక వనరు. అంతేగాక వీచే గాలివల్ల ఇండియాలో 45వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిచేయగల అవకాశం ఉంది.
ఇంధన పొదుపు ఆవశ్యకత
ఇంధనాన్ని ఎక్కువగా వాడడంవల్ల పర్యావరణం దెబ్బతింటుంది. నిత్యం మనిషి జీవన గమనంలో చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే ఇంధనాన్ని పొదుపు చేయడంతోపాటు మానవ మనుగడకు దోహదం చేసినట్టే. వాహనాలు, వంట గ్యాస్ వినియోగదారులు, గృహాల్లో విద్యుత్ వాడకంలో మెళకువలు పాటించాలి. దీంతో ఇంధనం పొదుపుచేసినట్లే కాకుండా ఖర్చు తగ్గించుకున్నట్లవుతుంది. ప్రస్తుతం విద్యుత్ వినియోగం అంతాఇంతా కాదు. అయితే గ్రామాలు, పట్టణాల్లో నిరంతరాయంగా వెలిగే వీధి దీపాలు, వేలాడే తీగలు, సక్రమంగా పనిచేయని యంత్రాలు.. ఇలా అనేక కారణాలతో నిత్యం లక్షల యూనిట్ల విద్యుత్ వృథాఅవుతోంది. అదే సమయంలో వినియోగదారులకు బిల్లుల మోత మోగుతోంది. విద్యుత్ కాంతి పెరిగేకొద్దీ ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉత్పత్తి అవుతాయన్న ఆందోళన కొంతమందిలో ఉంది. ఐరోపా దేశాల కూటమి (ఐయు) కూడా విద్యుత్ వినియోగాన్ని 2020నాటికి 20 శాతం తగ్గించుకోవాలనుకుంటోంది. ఇక సాంప్రదాయపరంగా వస్తున్న సాధారణ బల్బులు, ఫ్లోరోసెంట్ ట్యూబ్‌ల స్థానంలో సీఎఫ్‌ఎల్ బల్బులు, బెడ్ బల్బులు వినియోగాన్ని అగ్ర దేశాలతోపాటు ప్రపంచ దేశాలు కూడా విస్తృత ప్రచారం చేస్తున్నాయి. దీనివల్ల విద్యుత్ బిల్లుల భారం గణనీయంగా తగ్గించుకోగలమన్నది అందరి భావన. మన దేశంలో ఇప్పటికే అతిపెద్ద సోలార్ పార్క్‌ను రాజస్థాన్‌లో నిర్వహిస్తున్నారు. ఉదయంవేళ తలుపులు కిటికీలు తెరిచి లైట్లు ఆఫ్ చేయడం, ఎల్‌ఈడీ లైట్ల వినియోగాన్ని పెంచడం, ఏసీల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు మిక్సీల వినియోగంలో కంపెనీల సూచనలు పాటిస్తే విద్యుత్ ఆదాచేసినట్లే అవుతుంది.
తక్షణ కర్తవ్యం
మన దేశం అవసరాలకు కావాల్సిన ఇంధనంలో 26శాతం మనవద్దే ఉత్పత్తి అవుతున్నది. మిగిలిన 74 శాతంకోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాం. మన దేశంలో ఇంధన పరిరక్షణ చట్టాన్ని 2001లో తెచ్చారు. ఈ చట్టం అమలుకోసం 2002లో ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ’అనే సాధికారిక సంస్థను ఏర్పరచారు. విద్యుత్ పరికరాల ప్రమాణాలను నిర్ణయించడం, వాణిజ్య భవనాలకు ఇంధన పొదుపు గుర్తింపు ఇవ్వడం అన్ని రంగాల్లో ఇంధన పొదుపు సామర్థ్యం పెంపు తదితర చర్యలు తీసుకోవడం ద్వారా దేశంలో విద్యుత్ పొదుపు సాధించాలనేది ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం. విద్యుచ్ఛక్తి వినియోగంలో ఆధునిక విధానాలు, పొదుపుపాఠాలు నేర్చుకుని ఫలితాలు సాధిస్తున్న దేశాలలో అమెరికా, ఇంగ్లాండ్, చైనా, దక్షిణ కొరియా ఉన్నాయి. మనం వాటి అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు విద్యుచ్ఛక్తి వినియోగాన్ని తగ్గించడానికి సంప్రదాయేతర విధానాలను ప్రోత్సహిస్తున్నాయి. సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నించే వారికి అండగా ప్రభుత్వాలు నిలుస్తున్నాయి. 2040నాటికి దేశంలో ఏర్పడే విద్యుత్ గిరాకీని తీర్చాలంటే థర్మల్ కేంద్రాల్లో స్థాపిత ఉత్పత్తిసామర్థ్యం 330 లక్షల మెగావాట్లకు చేర్చాల్సి ఉంటుందని నీతి ఆయోగ్ చెబుతున్నది. దీనికి ఏటా 100 కోట్ల టన్నులవరకూ బొగ్గునూ మండించి బూడిదగా మార్చాల్సి ఉంటుంది, దీంతో కాలుష్యం ఎంతమేరకు పెరుగుతుందో అర్థం చేసుకోవాలి. విద్యుత్‌ను పొదుపుగా వాడుకుంటే ప్రతీ సంవత్సరం కోట్ల టన్నుల బొగ్గును మండించకుండా పరిరక్షించుకున్న వాళ్ళమవుతాము. ప్రస్తుతం వినియోగిస్తున్న విద్యుత్‌లో కనీసం 25 శాతం ఆదాచేయగల పరిజ్ఞానం మనకుంది. కానీ ఈ పరిజ్ఞానం సామాన్యులకు చేరడం లేదు.
ఇంధన వృథా- జాతికి వ్యధ
మనం ఇండ్లలో వాడే విద్యుత్‌లో ఆదాచేసే ఒక యూనిట్ విలువ రెండు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి సమానం. పెట్రోల్ లేకపోతే బండి, బస్సు ఏదీ కదలదు. విద్యుత్ లేకపోతే టీవీ, మిక్సీ, రిఫ్రిజిరేటరు, మైక్రోవేవ్ ఏవీ పనిచేయవు. సిలిండర్‌లో గ్యాస్ నిండుకుంటే అన్నం, కూరలు, కాదుకదా గుక్కెడు కాఫీకూడా వెచ్చబడదు. ఇంధనం వృథా అవడానికి మరో ముఖ్య కారణం చవకబారు యంత్రాలు, నైపుణ్యం లేని ఉద్యోగులు. ఇంధనాలు అమూల్యమైనవి. ఆ వనరులను కాపాడుకోవడం మన బాధ్యత. ఇంటినుంచి బయటకు వెళ్తున్న సమయంలో అన్నిరకాల స్విచ్‌లను నిలిపివేయాలి. బి.ఈ.ఈ. స్టార్ లేబిల్ గృహోపకరణాలనే వాడాలి. ఫ్రిజ్, ఫ్రీజర్‌లను అవసరాలకు మాత్రమే వాడాలి. ప్రెషర్ కుక్కర్స్ ద్వారా వంటచేస్తే ఇంధనం ఆదాఅవుతుంది. నవంబరునుంచి ఫిబ్రవరి వరకు ఏసిల వాడకాన్ని నిలిపివేస్తే మంచిది. ఇంధనం అంటే కేవలం విద్యుత్ ఒకటేకాదని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటివి కూడా ఇందులో ఉంటాయి. అవసరంమేరకే వాహనాలను వాడటంద్వారా ఇంధనాన్ని ఆదాచేసుకోవచ్చు. చిన్నచిన్న పనులకోసం బయటకువెళ్ళేవారు కాలినడకన వెళ్లడం ద్వారా ఆరోగ్యంతోపాటు ఇంధనం పొదుపుచేయవచ్చు. దేశ ఆర్థిక, సామాజిక ప్రగతికి శక్తి వెనె్నముక. ప్రస్తుత భవిష్యత్ తరాల అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని శక్తి భద్రతను సాధించాలంటే సౌరశక్తి వంటి పునర్వినియోగశక్తి వనరులపై ఆధారపడటం తప్పనిసరి. అందుకే చిన్నప్పటినుంచి ఇంధన పొదుపుపై విద్యార్థులకు అవగాహన కలిగించాలి.
ఇంధన ఆదా మార్గాలు
వాహనాలు కాసేపు ట్రాఫిక్ రద్దీలో నిలిచిపోయినా, పెట్రో ఇంధనాలు వృథాగామారి కాలుష్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. మన దేశంలో సుమారు 20కోట్లకు పైగా కుటుంబాలకు విద్యుత్ సదుపాయం ఉంది. ఒక్కో కుటుంబం రోజుకొక యూనిట్ వినియోగం తగ్గించుకున్నా 20 కోట్ల యూనిట్లమేర విద్యుత్ ఆదాఅవుతుంది. ప్రకృతి ద్వారా మనకు లభించిన సహజ ఇంధన వనరులను వినియోగించుకోవడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించగలం.
- నేడు ఇంధన పొదుపు వారోత్సవాలు -

- కె. రామ్మోహన్‌రావు, 94414 35912