Others

విజయం..ఎడతెగని పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో పలువురు నాయకులన్నప్పటికీ గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చినపుడు బాధిత ప్రజలు, రైతులు, కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి ఆయన సహాయం కోరారు. ఆయన ప్రయత్నాలవల్లే చంపారన్‌లో శతాబ్దాల నుంచి నడుస్తున్న బలవంతపు నీలి సేద్యం రద్దయ్యింది. ఒప్పందాల పద్ధతి రద్దు అయింది. ఒక ప్రాంతానికి పరిమితమైన స్థానిక సమస్యలను తమంతట తామే పరిష్కరించుకొనేలా ఆయన ప్రజలను ప్రోత్సహించేవాడు. అలాంటి ఉద్యమాలన్నీ ప్రచారం పొంది మొత్తం భారతదేశాన్నంతటినీ ఆకర్షించడం ప్రారంభించాయి.
ఎప్పుడు ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించినా గాంధీ ఒకే వ్యూహాన్ని అనుసరించేవాడు. భారతదేశంలోని తన 30 సంవత్సరాల నాయకత్వ కాలంలో ఆయన చంపారన్, ఖేడా, బర్దోలిలోని రైతులకు మార్గదర్శనం చేయడంతోపాటు నాలుగు భారీ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ఆయన భారతదేశం అంతటా పర్యటించి తన ముందున్న సమస్యలను అధ్యయనం చేశాడు.
ఆయన వేలాదిమందిని ఇంటర్వ్యూలు చేశాడు, ప్రభుత్వంతో పోరాటంలో సంబంధం వున్న వ్యక్తులతో మాట్లాడి సమాచారం సేకరించేందుకు రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేశాడు. వేలాది బహిరంగ సమావేశాలలో ప్రసంగించాడు. క్రమశిక్షణకు సంబంధించి ఏర్పర్చుకున్న నిబంధనలను వివరించాడు, ‘‘్భరతదేశం ముందు కత్తిదూయడం అనే హింసాత్మక మార్గం కూడా వుంది. కానీ అదే సాధ్యమైతే ప్రజలు అహింస గురించిన బోధనలు అసలు వినేవారే కాదు. ఊరేగింపుల ద్వారా, ఉపన్యాసాల ద్వారా స్వరాజ్యం రాదు, పని చేయాలనే పట్టుదల నశించకూడదు, పారిపోవడం తెలియని వీర సైనికులం కావాలి. ప్రాణాలు త్యాగం చేయడానికైనా మనం సిద్ధం కావాలి. దీన్ని సాధించడానికి అసాధారణ శక్తి కావాలి.
చంపడానికి బదులు చావడానికి సిద్ధపడాలి. ఇతరుల ప్రాణాలను తీసేందుకు మన ప్రాణాలను పణంగా పెట్టడం తేలికైనప్పుడు, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు మన ప్రాణాలను ఒడ్డటం మానవాతీతమైన పనిగా ఎందుకు భావిస్తున్నాం? ఇతరులను చంపడం వీరత్వం కాదు. స్వాతంత్య్రం కోసం, గౌరవం కోసం మరణించడమే వీరత్వం’’ అని ఆయన అహింసను సమర్థించుకొనేవాడు.
మహిళలు, పిల్లలు, వృద్ధులు ఆయన అహింసా సైన్యంలో ఉండేవారు. పిల్లల సైన్యాన్ని వానరసేన అనేవారు. ఎక్కడైనా హింస తలెత్తితే గాంధీ సత్యాగ్రహాన్ని ఆపేసేవాడు. ఆయనకు రహస్యంగా వ్యవహరించడమంటే అసహ్యం. తన భావి ఎత్తుగడలను ఆయన బహిరంగంగా ప్రకటించేవాడు. తమ హృదయాల్లోంచి కోపం, ద్వేషం, ప్రతీకారాలను ప్రజలు తొలగించి వేయాలని ఆయన కోరుకునేవాడు.
అవిశ్రాంత పోరాటయోధుడైన గాంధీ ఎప్పుడూ తన అనుచరులకు లేనిపోని ఆశలు కల్పించేవాడు కాదు. ఉద్యమంలో లాఠీ దెబ్బలు తినాల్సి వుంటుందనీ, తుపాకీ తూటాలను ఎదుర్కోవాల్సి వుంటుందనీ, జైలుశిక్ష అనుభవించాల్సి వుంటుందనీ, ఉరికంబం ఎక్కాల్సి వుంటుందనీ, వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనీ తన సైనికులను గాంధీ హెచ్చరించేవాడు. ఆయన నినాదమైన ‘డూ ఆర్ డై’ పరమార్థం బాధలను అనుభవించడమే. బాధలను అనుభవించడం ద్వారానే ప్రత్యర్థుల హృదయాలను కరిగించగలనని ఆయన నమ్మేవాడు.
విదేశీ వస్త్రాలను భోగిమంటల్లో వేయడం, భూమిశిస్తును చెల్లించకపోవడం, ఉప్పు తయారీ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాల బహిష్కరణతో పాటు నిర్మాణాత్మకమైన పని కూడా చేయాలని ఆయన ప్రజలకు సూచించేవాడు. నూలు వడకటం, నేయడం, గ్రామ పంచాయతీలను పునరుజ్జీవింపజేయడం, జాతీయ విద్యాలయాలను స్థాపించడం వంటి పనులు చేయాలని ఆయన సూచించాడు. ఒక ఏడాదిలో స్వరాజ్యం తెస్తానన్న ఆయన వాగ్దానం నెరవేర్చుకోలేకపోయినా ప్రజలను భయాలనుంచి విముక్తులను చేశాడు. ప్రజాబాహుళ్యంలో చైతన్యం రావడం అనేది పెద్ద ప్రయోజనం. దండి గ్రామానికి ఆయన చేసిన యాత్ర మంత్ర ప్రయోగంలా పనిచేసింది.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614