Others

జోగిందర్‌నాథ్ మండల్‌కు ‘జై’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశం ఇప్పడొక సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. అసత్యాలు, అర్థసత్యాలు, అబద్ధాలతో కొన్ని రాజకీయ శక్తులు, వ్యక్తులు తమ పబ్బం గడుపుకునేందుకు ఆత్రుత పడుతున్నారు. దేశంలో తప్పుడు భావజాలాన్ని పాదుకొల్పేందుకు తమ శక్తినంతా ధారపోసే పనిలో పడ్డారు. ఏడు దశాబ్దాల క్రితం దేశ విభజన సమయంనాటి పరిస్థితులను, భావజాలాన్ని, దుష్ప్రచారాన్ని ఇప్పుడు పునరావృత్తం చేస్తున్నారనిపిస్తోంది. విషతుల్యమైన ఆలోచనల్ని, అభిప్రాయాల్ని అంతటా విస్తరింపజేసేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. దేశస్వాతంత్య్ర సమరం నాటి ‘ముస్లిం లీగ్’ భావజాలం మరో విధంగా తన విశ్వరూపం ప్రదర్శిస్తోంది. విచిత్రంగా, విడ్డూరంగా ఇప్పటికీ ఆజాదీ (స్వాతంత్య్రం) నినాదాలు వారి నోట వినిపిస్తున్నాయి. ద్విజాతి సిద్ధాంతం ఆధారంగా, మత ప్రాతిపదికన పాకిస్తాన్‌ను కోరుకుని కుట్రలు... కుతంత్రాలు... బెదిరింపులు... హెచ్చరికలు, బ్లాక్‌మెయిల్ పద్ధతుల ద్వారా కొత్త దేశం ఆవిర్భవించిన అనంతరం కూడా దేశాన్ని టుక్డే టుక్డే (ముక్కలు ముక్కలు) చేస్తామని రణ నినాదాలు చేయడం చూస్తుంటే ఈ సమాజం.. దేశం ఎటువెళుతోంది? అన్న ఆందోళన అందరిలో ఏర్పడుతున్నది.
ఈ నేపథ్యంలో 70 ఏళ్ళ క్రితం పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన ఓ దళిత నాయకుడు జోగిందర్‌నాథ్ మండల్ అనుభవాలను, ఆలోచనలను, అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకోవడం తప్పనిసరి. అతని దృష్టికోణంతో వర్తమాన పరిస్థితులను తిలకిస్తే, అంచనావేస్తే సరైన మార్గం లభించగలదనిపిస్తోంది. చారిత్రకాంశాలు తెలియడమేగాక చరిత్ర ఎలా పునరావృతం అవుతున్నదో అర్థమవుతుంది. భీమ్‌రావు అంబేద్కర్ సమకాలికుడు దళిత నేత జోగిందర్‌నాథ్ మండల్. వీరిద్దరి మధ్య కొన్ని సామ్యాలు కనిపిస్తాయి. సమాజంలోని అట్టడుగువర్గాల పట్ల, దళితుల పట్ల వీరికి అవ్యాజ్యమైన ప్రేమ ఉంది. వీరిద్దరూ దళితులు కావడం అందుకు కారణం.
జోగిందర్‌నాథ్ 1904 జనవరి 29న బెంగాల్‌లో జన్మించారు. 1935 సంవత్సరంలో ఎల్‌ఎల్‌బి చేశారు. వకీలుగా కొంతకాలం ప్రాక్టీసు చేశారు. ఇప్పటి బంగ్లాదేశ్‌లోని ప్రాంతంనుంచి వచ్చిన జోగిందర్‌నాథ్‌కు అక్కడి దళితులు, పేదలకు ఎక్కువ సేవలు అందించారు. ఆ రకంగా ఆయన పట్ల వారికి అమిత అభిమానం ఏర్పడింది. సమాజంలోని వివిధ వర్గాల వారికి సేవచేయాలంటే కేవలం సామాజిక సేవ, న్యాయసేవ, ఎంతోకొంత ఆర్థిక సహాయం చేయడంవల్ల సమస్య పరిష్కారంకాదని గ్రహించి రాజకీయంవైపు ఆయన అడుగేశారు. అప్పటికే అగ్రవర్ణాలకు చెందిన సామాజిక సంస్కరణల వార్తలు వెలువడుతున్నప్పటికీ ఆ సంఘసంస్కర్తల ప్రభావం సమాజంపై కనిపిస్తున్నప్పటికీ అస్పృశ్యులకు పెద్దగా ఒరిగిందేమీలేదు. దాంతో ఆయన అంబేద్కర్ స్థాపించిన ఎస్‌సి కులాల సమాఖ్య శాఖను బెంగాల్‌లో ప్రారంభించారు. మంచి వక్త, విద్యావంతుడు, ప్రజలను సమీకరించడంలో కౌశలమున్న నాయకుడు కావడంతో ఎన్నికల్లో పాల్గొని ఎన్నికయ్యాడు. మంత్రిగా పనిచేశాడు.
ఈ సమయంలోనే ‘‘ముస్లింలీగ్’’ ప్రభావం పశ్చిమ బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్) ప్రాంతంలో ఎక్కువ కనిపించసాగింది. కాంగ్రెసు ప్రాబల్యం సైతం ఎక్కువే ఉంది. ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ ప్రబలంగా వినిపిస్తున్న సమయమది. ద్విజాతి సిద్ధాంతం ఆధారంగా, మెజార్టీగా ఉన్న ముస్లిం ప్రాంతాలతో పాకిస్తాన్‌ను ఏర్పాటుచేయాలన్న ఒత్తిడి బ్రిటీషు పాలకులపై పెరిగింది. ముస్లిం లీగ్‌లో కేవలం ముస్లింలే గాక హిందువులను కలుపుకున్నారు. సమాజంలోని అట్టడుగువర్గాలకు, పేదలకు, బలహీనులకు, నిరక్షరాస్యులకు ప్రత్యేక దేశంలోనే న్యాయం జరుగుతున్న ‘‘భ్రమ’’ను ముస్లిం లీగ్ నాయకులు విస్తృతంగా కల్పించారు. ఆ రకమైన రాజకీయ వాతావరణాన్ని సృష్టించారు. శక్తిమంతమైన ముస్లిం నాయకులు పాకిస్తాన్ వైపు మొగ్గుచూపడంతో అగ్రవర్ణాల అణచివేత నుంచి విముక్తి పొందేందుకుగాను జోగిందర్‌నాథ్ మండల్ లాంటి దళిత, బలహీన వర్గాల నాయకులు ముస్లిం లీగ్‌కు దగ్గరయ్యారు. వారికి అనేక ఆశలు చూపారు. ప్రత్యేక దేశం ఏర్పడ్డాక కీలకమైన పదవులు ఇస్తామని ఆశ చూపారు. దాంతో దళితులు, అణగారిన వర్గాల నాయకులు ముస్లిం లీగ్ వెనకాల నిలిచారు. ముస్లిం లీగ్ స్వరం పెరిగింది. వారి బలం ద్విగుణీకృతమైంది. అలా ‘ఒత్తిడి’ రాజకీయాలతో, కుట్రలతో, కుతంత్రాలతో అనేకానేక అసంబద్ధ అంశాలతో దేశ విభజన 1947 ఆగస్టు 15న జరిగిపోయింది. భారతదేశానికి రెండువైపులా గల భూభాగాన్ని పాకిస్తాన్‌గా ప్రకటించారు. తూర్పు పాకిస్తాన్‌గా పిలిచే ప్రస్తుత బంగ్లాదేశ్‌నుంచి జోగిందర్‌నాథ్ మండల్ ప్రాతినిధ్యం వహించారు.
ఈ సమయంలో లక్షలాది మంది ప్రజలు హత్యలకు గురయ్యారు. మారణహోమం జరిగింది. లక్షలాది మహిళల మానభంగాలు జరిగాయి, పిల్లల్ని సైతం హతమార్చారు. మత మార్పిడులు పెద్దఎత్తున జరిగాయి. ఇట్లా ఓ భయంకర ‘జినోసైడ్’ జరిగింది... సంక్షోభం చోటుచేసుకుంది. కోట్ల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆస్తులను ఆప్తులను కోల్పోయారు. భవిష్యత్ అంధకారమైంది. స్వాతంత్య్రానికి కొంతకాలం ముందునుంచే ఈ మత ఘర్షణలు పెరిగినా, గాంధీని సైతం కలవరపరిచినా, ఆ వైషమ్యాల మధ్యనే ‘‘దేశ విభజన’’ చోటుచేసుకుంది. ‘‘పార్టీ లైన్’’కు కట్టుబడి మండల్ కిమ్మన లేదు. పాకిస్తాన్ ఏర్పడ్డాక జోగిందర్‌నాథ్ మండల్ పాకిస్తాన్ జాతిపితగా భావించే ‘జిన్నా’కు మరింత దగ్గరయ్యారు. దళితులు, బలహీన వర్గాల ప్రతినిధిగా జోగిందర్‌ను కొంతకాలం బాగానే చూశారు. విశాల జన బాహుళ్యం ఆయన వెంట వున్నారు కాబట్టి- ఆయన అవసరాన్ని గుర్తించి లియాకత్ అలీ ప్రభుత్వంలో ఆయనను న్యాయ, కార్మికశాఖ మంత్రిని చేశారు. ఆ తరువాత ముస్లింలీగ్ అసలు స్వభావం, స్వరూపం బయటపడ సాగింది. జిన్నా మరణంతో మరింత నగ్నంగా వాస్తవం వెలుగుచూసింది. క్రమంగా ముస్లిమేతరులను ‘‘కాఫిర్లు’’గా చూడ్డం ప్రారంభమైంది. అవసరమున్నప్పుడు ఎంతో ‘మర్యాద’గా వ్యవహరించారు. క్రమంగా హిందువులపై, ఇతర మైనార్టీలపై దాడులు పెరిగాయి. ఆయాచోట్ల చెప్పుల దుకాణాలను, మాంసం విక్రయ కేంద్రాలను... ఇట్లా అనేక అకృత్య పనులకు కేంద్రంగా వాటిని మార్చేశారు. నిరసన తెలిపినా, వ్యతిరేకించినా హింసాయుతంగా జవాబిచ్చారు. ‘‘సెక్యులరిజం’’్ఛయలు లేవు. పూర్తి మతపరమైన పద్ధతిలో పాలన ప్రారంభమైంది. ఈ రకమైన అమానవీయ అకృత్యాలు, మత మార్పిళ్లు, దమనకాండ, ఆస్తుల ధ్వంసం, ‘జజియా’ పన్ను భారీగా విధించి దోచుకోవడం అటు తూర్పు... ఇటు పశ్చిమ పాకిస్తాన్‌లో విజృంఖలమవడంతో జోగిందర్‌నాథ్ కలలన్నీ కల్లలయ్యాయి. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి, తోటి మంత్రుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేదు, పట్టించుకోలేదు. ఇదంతా ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగమేనని, తమ మత ప్రాబల్యం పెంచుకోవడానికి, ఇస్లాం మత వ్యాప్తికోసమే ఈ ‘‘నాటకం’’ ఆడారని జోగిందర్‌కు అర్థమయ్యేసరికి చాలా ఆలస్యమైంది. దాంతో జోగిందర్ 1950లో ఆగ్రహోదగ్రుడై, ఖిన్నుడై లియాకత్ అలీకి తన రాజీనామా పత్రాన్ని సమర్పించాడు. ముస్లింలీగ్ విష కౌగిలినుంచి విముక్తి పొందాడు. మంత్రి పదవికి తానెందుకు రాజీనామా చేస్తున్నానో తెలియజేస్తూ పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాకత్ అలీకి ఒక లేఖ రాశారు. అనంతరం ఆ లేఖ ప్రజల ముందు పెట్టారు. అందులో ఎన్నో హృదయ విదారక సంఘటనలను ఉటంకించారు. వేలాది మంది దళితులు ముస్లింల చేతిలో మరణించడాన్ని ప్రశ్నించారు. వేలాది హిందూ దళిత మహిళలపై అత్యాచారాల గూర్చిన వివరాలను పొందుపరిచారు. వృద్ధులు-పిల్లలు అన్న తేడాలేకుండా అందరినీ పోలీసులు, సైనికులు, ముస్లింలు దాడులుచేసి వారి ఆవాసాలను దగ్ధంచేసిన తేదీలు... ప్రాంతాలతో సహా ఉటంకించారు. పెద్దఎత్తున మత మార్పిడులు జరిగాయి. షరియా ప్రకారం ముస్లింల పాలనలో ఉన్న ముస్లిమేతరులపై ‘జజియా’ను విధించి దోచుకోవడం పెరిగింది. సింథ్ పంజాబ్ ప్రాంతంలో లక్ష మందికి పైనే హిందువుల మత మార్పిళ్ళకు పాల్పడ్డారు. ప్రతిఘటించిన వారి ప్రాణాలు తీశారు. బంగ్లా ప్రాంతంలో నిత్యం దగ్ధకాండ కొనసాగింది.
‘డైరెక్ట్ ఆక్షన్’ పేర స్వాతంత్య్రానికి పూర్వం ముస్లిం లీగ్ చేసిన అకృత్యాలు, దాడులు సెక్యూలర్ పాకిస్తాన్ ఆవిర్భవించాక మరింత జోరుగా కొనసాగాయి. ఈ విషయాలన్నీ ఆయన ప్రజలముందు పెట్టారు. ఆ చరిత్ర ఇప్పుడు అందుబాటులో ఉంది. సాక్ష్యాలున్నాయి. చారిత్రక పత్రాలున్నాయి. సెక్యులర్ పాకిస్తాన్ వ్యవస్థాపకుల్లో ఒకడిగా ఉన్న దళిత నాయకుడు జోగిందర్‌నాథ్ మండల్ ఆత్మ ఎంతగా క్షోభించిందో అంచనాకట్టేందుకు అవసరమైన ‘తూకంరాళ్లు’ ఇప్పుడు ఎవరి దగ్గరలేవు. వర్తమానం (2020)లోనూ ‘‘హిందూ-ముస్లిం భాయిభాయి’’ అన్న నినాదం తిరిగి తెరపైకి ‘ముస్లింలీగ్’ వారసులు తీసుకొస్తున్నారు. ‘సెక్యులర్ పాకిస్తాన్’ అని చెప్పి ఎంతోమందిని బలిగొని, ఇస్లాం దేశంగా మార్చారు. ఇప్పుడు 70 ఏళ్ళ క్రితం మిగిలిపోయిన కార్యక్రమాన్ని పూర్తిచేసేందుకు కొత్తరూపంలో సిఏఏ వ్యతిరేకత ముసుగులో ముస్లిం లీగ్ వారసులు ముందుకొచ్చారు. జోగిందర్‌నాథ్ మండల్ మోసపోయిన చందంగా వర్తమానంలో ఎవరూ మోసపోరాదు. సెక్యులర్ పేర పుట్టిముంచే వ్యవహారాల వైపు పయనించవద్దు. విజ్ఞతతో, చరిత్ర నేర్పిన అనుభవంతో మరోసారి దేశ విభజనవైపు పాదం కదుపరాదు. ఇప్పటివరకు కార్చిన కన్నీళ్లు చాలు! జోగిందర్‌నాథ్ మండల్ మాటలను మనసులో నిలుపుకోవలసిన సమయమిది. ఆయన రాసిన పత్రాన్ని పదిలపరచుకుని పదే పదే చదువుకోవలసిన సందర్భమిది! చరిత్ర పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలి!

- వుప్పల నరసింహం, 9985781799