Others

కరోనా కలవరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరోనా కలవరం.. ఈ మహమ్మారి వైరస్ మన దరిచేరకూడదని సకల జనులు కోరుకుంటున్నారు. ఈ ఛాయలపై అక్కడక్కడ ప్రకంపనలున్నా, భయాందోళనలు ఎక్కువయ్యాయి. రోజువారీ వస్తువినియోగంపై ప్రభావం సంగతి అటుంచితే, అన్ని చర్యలకు సన్నద్ధమంటూ సర్కారు వల్లెవేస్తోంది. ప్రజల ఆరోగ్యం విషయంలో ముందు జాగ్రత్తలు పాటించడం, విస్తృత వౌలిక వైద్య వసతులు ఏర్పరచడం అన్ని దేశాల తక్షణ కర్తవ్యం. ప్రకృతి ముందు మనమందరం నిమిత్తమాత్రులమేనన్న నిజాన్ని గ్రహించాలి..! కరోనా.. కరోనా.. ఎక్కడ చూసినా, ఎక్కడికెళ్లినా ఈ ప్రకంపనలే.. సామాన్య మానవుణ్ణి సైతం ఈ వైరస్ ఆలోచింప చేస్తోంది. అభివృద్ధి చెందిన/చెందుతున్న దేశంగా పేరొందుతున్న మన దేశంలో వైద్యం ప్రతి ఒక్కరికీ నిత్యావసరవౌతోంది. ఉదహరిస్తే ప్రపంచంలోనే మధుమేహ పీడిత రోగగ్రస్తదేశంగా ఎదిగిపోతున్న భారత్‌లో వైద్య అవసరాలు నానాటికీ తలకుమించిన భారమవుతున్నాయి. వాతావరణం, గ్లోబలైజేషన్‌లో మార్పులకనుగుణంగా పలుదేశాల్లో ఈ వైరస్‌లు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. వీటి బారినుంచి గట్టెక్కేందుకు ఎన్నో పరిశోధనలు, ఆవిష్కరణలు తెరముందుకొస్తున్నా, ఎందుకో ఎక్కడలేని భయాందోళనలు తరుముతున్నాయి. ఏం కొనాలన్నా, తినాలన్నా నడుస్తున్న చరిత్రలో ఈ కరోనా సంగతులే ఆలోచింపజేస్తున్నాయి.
శాస్త్ర, వైజ్ఞానికరంగాల్లో ముఖ్యంగా వైద్యరంగంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయి. చైనా దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా ఎల్లెడలా భయకంపితుల్ని చేస్తోంది. ఈ వైరస్‌కు చైనాలోని బీజింగ్ నగరం బోసిపోయింది. వాణిజ్య సూచీలు పతనవౌతున్నాయి. కరోనా వైరస్‌ను 1937లోనే గుర్తించారు. ఈ వైరస్ ఎక్కువగా కోళ్లు, చుంచు ఎలుకలు, కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పందులు, ఆవులు, గేదెలు, ఒంటెలు, గబ్బిలాల ఊపిరితిత్తుల వ్యాధులకు దారితీస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ఈ వైరస్ సోకినవారిలో జలుబు, జ్వరం, గొంతు నొప్పి లక్షణాలు ఉంటాయని శాస్తజ్ఞ్రులు తేల్చారు. ఈ వైరస్ జీవనం రెండు వారాలుంటుంది. ఆ రోజులు జాగ్రత్తగా ఉంటే మళ్లీ ఇక దరిచేరదు. ఈ వైరస్ రాకముందే ప్రతిఒక్కరూ జీవనశైలి, ఆహార విధానాలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచిస్తోంది. అందుకే భారత్‌లోని విమానాశ్రయాల్లో విరుగుడు మందు (పిల్స్)ను పంపిణీ చేస్తున్నారు. కరోనా వైరస్ పూర్తిస్థాయి విరుగుడుకు కొనే్నళ్లు పడుతుందని, ఖర్చుకూడా భారీగానే అవుతుందని శాస్తవ్రేత్తలు ఉదహరిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచమంతా ఈ కరోనా ప్రస్తావనే. చైనా దేశంలో ప్రబలిన ఈ వైరస్ తాకిడికి పలువురు బలవుతున్నారు. నిన్నటిదాకా సిరిసంపదలతో, సాంకేతిక పరిజ్ఞానంతో, వినూత్న ఉత్పత్తులకు విశ్వవ్యాప్త దిగ్గజంగా యావత్ ప్రపంచాన్ని శాసించిన చైనాలో ఇప్పుడు జరుగుతున్నదేమిటి? అన్నదే సకలజనులకు ఆసక్తిరేకెత్తిస్తోంది. అగ్రరాజ్యాలను సైతం తమ అణుఆయుధాలతో బెదిరించిన పెద్దన్న చైనా కథ నేడు అడ్డం తిరిగింది. దీనికి కారణం ‘కరోనా’ అనే సూక్ష్మక్రిమి అని లోకానికి తెలిసింది. చైనాలో ఇప్పటికే 2000 మందికి పైగా మరణించారని, 65 వేల మందికి పైగా ఈ కొవిడ్ 19 (కరోనా) బారినపడ్డారని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్యసంస్థే తెలిపింది. వాస్తవానికి ప్రపంచానికి కరోనా వైరస్ కొత్తేమీకాదు. ఎనిమిదేళ్ల క్రితం సౌదీ అరేబియాలో తొలుత గుర్తించారు. అప్పట్లోనూ అది ప్రపంచమంతా విస్తరించింది. కానీ ప్రచార మాధ్యమాలగోల లేకపోవడంతో అంత అలజడి జరగలేదు. వెంటనే ఆయా దేశాలు ప్రజల ఆరోగ్య విషయమై అప్రమత్తం కావడంతో అది ప్రాచుర్యం చెందలేదు. కానీ ఇప్పుడు చైనా ప్రజల ఆరోగ్యం విషయంలో అధమస్థానం ఇవ్వడంతో, అక్కడి ప్రజల ఆటవికపు ఆహారపు అలవాట్లు, విశ్వంలో లభించే అన్ని జీవరాశులను ఆహారంగా తినే చైనీయుల ఆరోగ్యం మార్చలేకపోయాయి. చైనాలో ఆరోగ్యానికి అవసరమైన వౌలిక వసతులు, ఆస్పత్రులు, మందులు వైద్య పరిశోధనలు లేవు. దాని ఫలితమే కరోనా వైరస్ దావానలంలా విజృంభించి ప్రజలను బలిగొంటోంది. ఈ మహమ్మారి అక్కడికి వచ్చే పర్యాటకులవల్ల ఇతర దేశాలకు కూడా మెల్లమెల్లగా అంటుకుంటోంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ దేశాలకూ ఈ వైరస్ పాకింది. ఇక భారత్‌లోనూ ప్రవేశించినట్లు వార్తలు పెల్లుబుకుతున్నాయి. ఏతావాతా కరోనా ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. చైనాతో ప్రపంచ దేశాలన్నిటికీ వ్యాపార సంబంధాలు బలపడి ఉన్నాయి. అక్కడి ఉత్పత్తుల్ని భారీ పరిమాణంలో అందరూ దిగుమతి చేసుకుంటున్నారు. ఉత్పత్తిరంగాన మేలురకం, చౌకగా నైపుణ్యతతో కూడిన వస్తువులు మార్కెట్లోకి అందుబాటులోకి రావడంతో చైనా పలు దేశాలకు కేంద్ర బిందువైంది. చైనాతో వాణిజ్య సంబంధాలు కరోనా కలవరంతో స్థంభించిపోయాయి.
ఇటీవలే ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మేఘాలు ఆవరించిన సంగతి తెలిసిందే. పలురకాల వస్తువుల సుంకాలు, దిగుమతులపై ఉభయుల మధ్య ప్రకంపనలు రేపాయి. ఇదిలా ఉండగా ఇక ఇప్పుడు కరోనా వైరస్ వంతొచ్చింది. నిజానికి అమెరికాలోని సింహభాగం వస్తువులన్నీ చైనా తయారీయే కావడం గమనార్హం. కరోనా కారణంగా ఉత్పత్తిరంగంపై చైనాలో చూపే ప్రభావం అమెరికాపైనే ప్రముఖంగా ఉంటుందని వ్యాపారవర్గాలు ఉటంకిస్తున్నాయి. కరోనా వైరస్ ప్రభావం మన దేశంపైనా ఉందనే సంకేతాలు వెలువడుతూనే ఉన్నాయి. వివిధ రంగాల్లో ఇది ప్రస్ఫుటవౌతోంది. సూక్ష్మంగా పరిశీలిస్తే.. కొత్త కొత్త అంశాలు బోధపడుతున్నాయి. అందరికీ అవసరమయ్యే పెళ్లిళ్ల సీజన్లో శుభకార్యాల రోజుల్లో పసిడి ధర ఎగబాకింది. కేవలం 2,3 రోజుల్లో భారీ పెరుగుదల కన్పించింది. ఇక వెండి ధర షరామామూలే. చైనాలో పరిస్థితుల కారణంగా గ్లోబల్ ఎకానమీపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే ఆందోళన మళ్లీ మొదలైంది. దీనివల్లే బంగారం ధర గ్రాముకు రూ.4000 పైనే పలుకుతోందని అంటున్నారు. చైనాలో కరోనా వైరస్ మృత్యుకేళి కారణంగా ఆ దేశ పర్యటనకు పలు దేశాలు హడలెత్తిపోతున్నాయి. ఆ వైరస్ తమ దేశానికి ఎక్కడ అంటుకుంటుందోనన్న ఆందోళన వెంటాడుతోంది. భారత్‌లోనూ ఎయిర్ ఇండియా విమానాలను కొన్ని నెలలపాటు జూన్ 30దాకా బుకింగ్‌లు ఆపేసినట్లు ప్రకటించారు. ప్రైవేటు విమానాల సంస్థలు కూడా హాంకాంగ్ సహా పలు చైనా పట్టణాలకు విమానాలను రద్దుచేసుకున్నాయి. ఇక అక్కడే నిలిచిపోయిన భారత పౌరులు, ఉద్యోగులను నెమ్మది నెమ్మదిగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. భారత విదేశాంగశాఖ కూడా ఆ పనిలో నిమగ్నమై చైనాతో సంప్రదింపులు జరుపుతోంది. కరోనా వైరస్‌వల్ల విమానయాన సంస్థల ఆదాయంపై తీవ్ర ప్రభావం ఉంటోందని వార్తలు వచ్చాయి. అంతర్జాతీయ విమానయాన సంస్థల ఆదాయంలో రూ.2 లక్షల కోట్లకు పైగా ఆదాయం తగ్గొచ్చని అంచనాగా ఉంది. 13 శాతం విమానయాన గిరాకీ తగ్గుతుందని లెక్కలు కడుతున్నారు. 2005లో సార్స్ వైరస్ వచ్చినా విమానాల గిరాకీ ఒక్కసారిగా తగ్గినా, మళ్ళీ అదే స్థాయిలో పుంజుకొంది.
చైనాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువకాలం ఉంటే మన దేశంలోని ఔషధ పరిశ్రమకు ఇబ్బందులేనని ఆ రంగ నిపుణులు వక్కాణిస్తున్నారు. మనకు అత్యావసరమైన ప్రాణాధార, సాధారణ మందులు ఎన్నో చైనా నుంచి రావడాన్ని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికయితే ప్రభావం లేకున్నా మున్ముందు నిల్వ ఉన్న ఔషధాలు అయిపోతే మాత్రం సమస్యేనని ఫార్మారంగ పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం అందరికీ వినియోగ, అత్యవసర వస్తువైన సెల్‌ఫోన్ల రంగంపై కూడా కరోనా నీలినీడలు కమ్మాయి. మొన్నటిదాకా సెల్‌ఫోన్ దుకాణాల్లో హోరెత్తిన చైనా ఫోన్లకూ ఈ జాఢ్యం ఉంటుందనే సంకేతాలొచ్చాయి. ధర తక్కువుండే చైనాఫోన్లు అందుబాటులో మార్పులొచ్చినట్లు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. మార్చి త్రైమాసికంలో తమ ఆదాయ అంచనాలను కరోనావల్ల చేరుకోలేకపోవచ్చని, ఇప్పుడు మార్కెట్లో సంచలనాల కేంద్ర బిందువైన ఐ ఫోన్ తయారీ సంస్థ ఈసరికే ప్రభావం ఉంటుందని వ్యక్తపరిచింది.
ఎలక్ట్రానిక్స్ రంగాన్ని స్థూలంగా పరిశీలిస్తే.. కరోనా ప్రభావం ఇలాగే ఉంటే సమీప భవిష్యత్‌లో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయని వ్యాపారవర్గాలు నిర్ణయానికొచ్చాయి. వాస్తవానికి మన దేశానికొచ్చే స్మార్ట్ఫోన్ల విడిభాగాలు 85 శాతం చైనానుంచే వస్తాయి. టీవీలకైతే 75% విడిభాగాలు చైనావే ఉంటాయి. ఏసీలు, ఫ్రిజ్‌ల వాటా కూడా భారీగానే ఉంటుంది. కరోనాతో చైనాలో చాలా ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కరోనా తీవ్రత తగ్గుతుందని అంటున్నా, అక్కడ కార్మికుల హాజరీ అంత బాగాలేదని వార్తల్లో ప్రసారమాధ్యమాల్లో విన్పిస్తోంది. ఈ పరిస్థితిని గమనించే కొన్ని కంపెనీలు డిస్కౌంట్లు తగ్గిస్తున్నాయని బిజినెస్ వర్గాల్లో స్పష్టవౌతోంది. దేశీయ పరిశ్రమలు, ఎగుమతుల రంగాలను కరోనా వైరస్ ప్రభావం నుంచి కాపాడేందుకు తగుచర్యలను త్వరలో ప్రకటిస్తామని, కేంద్ర ఆర్థిక మంత్రి బాసట కల్పిస్తున్నారు. మొత్తంమీద ఈ కరోనా కంపనలు మన దరికి చేరకూడదని, జనజీవనానికి అంతరాయం కలిగించరాదని అందరూ కోరుకోవడం సుస్పష్టం..!

- చెన్నుపాటి రామారావు, 99590 21483