Others

రేషన్.. పరేషాన్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేషన్... ఎక్కడ చూసినా ఇవే ప్రకంపనలు. గ్రామాల్లో, పట్టణాల్లో ఇదే చర్చ, కార్డుల ఏరివేత, వడపోత, జల్లెడ.. ఏదైనా ఉన్నట్టుండి తెరపై కొత్త కార్డుల ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి సవాలక్ష నిబంధనలు, సమాధానం దొరకని అంశాలు ముందుకొచ్చాయి. జీవనాధారమైన పింఛన్ పోతోంది. నోట్లోకి నాలుగు ముద్దలు పంపే తెలుపు రేషన్ కార్డు ఉంటుందో ఊడుతుందో తెలియదు. రేషన్ బియ్యం తమ సంచుల్లోకి ఎప్పుడొస్తాయో అనేదే సకల జనుల సందేహాల సమాహారం!!
రేషన్.. ఇప్పుడు పలువురికి పరేషాన్. అనర్హుల తొలగింపే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ రేషన్ కార్డుల ప్రక్షాళన సామాన్య, అట్టడుగు వర్గాలకు దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సంక్షేమ పథకాల భారం తడిసిపోపెడవుతున్న తరుణంలో నాణ్యమైన సరుకులు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ పంపిణీ చేసేందుకు ఈ బృహత్ కార్యం చేపట్టామని ప్రభుత్వవర్గాలు వల్లెవేస్తున్నాయి. అయితే ఎన్నో ఏళ్లుగా తాము తీసుకుంటున్న, పొందుతున్న రేషన్ సౌకర్యాన్ని రద్దుచేయటం లేదా రీ వెరిఫికేషన్ చేయడంతో సమాజంలోని పలు వర్గాల్లో ఆవేదన పెల్లుబుడుతోంది. సంస్కరణల మాటెలా ఉన్నా.. అసలు సిసలు లబ్ధిదారులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. గత ప్రభుత్వలు ప్రణాళికలు, ఆలోచనల మేరకు ఈ రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి ఇప్పటిదాకా కొనసాగించి... ఇక ఇప్పుడు వడపోత అనేసరికి సాధారణంగానే అసంతృప్తి, నిర్వేదం మిగులుతాయి.
గతంలో ఈ రేషన్ కార్డుల ప్రయోజనాలు కొంతవరకు పరిమితంగానే ఉండేవి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చౌక బియ్యం, చక్కెరతోపాటు పరిమిత సరుకులు ఇస్తే తీసుకునేందుకు రేషన్‌కార్డులు ఉపయోగపడేవి. అప్పటి అవసరాలకనుగుణంగా ప్రభుత్వం ఇస్తే రేషన్ కోసం ఇబ్బడిముబ్బడిగా తెల్లరేషన్ కార్డులు జనం పొందారు. మొన్నటికి మొన్న గత టీడీపీ ప్రభుత్వం సంతృప్తి స్థాయిని లక్ష్యంగా చేసుకొని ఉదారంగా తెల్లకార్డులు ఇచ్చేసింది. ప్రజాసాధికార సర్వే ప్రామాణికంగా దరఖాస్తు చేసుకోకపోయినా కార్డులు ఇచ్చేశారు. అడగకపోయినా ఎలాగు ప్రభుత్వం ఇచ్చేసింది కదా అనుకుంటూ తిరస్కరించడమెందుకని చాలామంది వాటిని కొసాగించుకోవడం గమనార్హం.
గతంలో రాష్ట్రంలో బియ్యం, నిత్యావసరాలు పొందేందుకు తెల్లరేషన్ కార్డుల్ని ప్రవేశపెట్టారు. తాజాగా రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఈ కార్డుల్ని జల్లెడపట్టాలని నెత్తికెత్తుకుంది. ఇక్కడ సమస్యలు పుట్టకొచ్చి అట్టడుగు వర్గాల ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత తెల్లరేషన్ కార్డులు ఇక చెల్లుబాటు కావని ప్రభుత్వం పేర్కొంది. వాటి స్థానంలో తాజాగా ఆరోగ్యశ్రీకి, సామాజిక పెన్షన్‌కు, రేషన్ బియ్యానికి, ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌టు.. ఇలా వేర్వేరు కార్డులు జారీచేయాలని ప్రభుత్వం తలపోస్తోంది. ఇప్పటివరకు తెల్లకార్డుపై కుటుంబ సభ్యుడి ఆదాయం మేరకు ఇతరత్రా సంక్షేమ కార్యమాల్లో లబ్ధిపొందేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ కార్డులనే రద్దుచేయడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఆదాయం కోసం గానీ, పేదరికానికి దిగువన ఉన్నారనడానికి గాని పాత రేషన్ కార్డులు పనిచేయవు. వాస్తవానికి 2005లో అప్పటి ప్రభుత్వం ఆదాయం తక్కువగా ఉన్న కుటుంబాల వారికి పేదరికానికి దిగువన ఉన్నట్లుగా గుర్తించి నిబంధనల మేరకు బీపీఎల్ కార్డులిచ్చింది. ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల వారికి పింక్ (గులాబీ) కార్డులను జారీచేసింది. ఆ తర్వాత క్రమంగా పింక్ కార్డులవల్ల ఉపయోగం సన్నగిల్లడంతో అవి కొంతకాలంగా మనుగడలో లేవు. ఇప్పుడిక తెల్లకార్డుల వంతొచ్చింది. వాటి ఉనికి కోల్పోతోంది. వాస్తవానికి రెండేళ్ల క్రితమే తెల్లరేషన్ కార్డులకు సంబంధించి నియమ నిబంధనలు వచ్చాయి. అవి బియ్యం తెచ్చుకోవడానికి తప్ప ఆదాయానికి సంబంధించి రికార్డుగా ఉండవని, ఇతర అవసరాలకు పనికిరావని అప్పట్లోనే ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేశాయి. ఇప్పటిదాకా తెల్లరేషన్ కార్డులో మొత్తం కుటుంబ సభ్యుల ఫొటోలు ఉండగా,కొత్త రేషన్ కార్డులో కుటుంబ పెద్ద ఫొటో మాత్రమే ఉంటుదం. ఇలా తెల్లరేషన్ కార్డు 14 ఏళ్ల తర్వాత కనుమరుగవుతోంది.
కొత్త బియ్యం కార్డుల జారీకి ప్రభుత్వం పేర్కొంటున్న నిబంధనలు పలువురికి మింగుడు పడటం లేదు. అయితే కార్డుల ఏరివేతవల్ల ఎవరికీ అన్యాయం జరగదని ప్రభుత్వం, నేతలు పేర్కొంటున్నా.. క్షేత్రస్థాయిలో సమస్యలు బోలెడన్ని తిష్టవేశాయి. రూల్స్‌తోపాటు ఏరివేత యంత్రాంగం నిర్దేశకాలు, సిబ్బంది, వాలంటీర్ల వ్యవస్థలోనే తల నొప్పులు ఎక్కువయ్యాయని పలుచోట్ల ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు కొన్నింటిని పరిశీలిస్తే.. విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లు ఉండాలని నిబంధనలు చెబితే, ఒక నెలలో 300 యూనిట్లు వచ్చిందంటూ అనర్హులుగా చేర్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంటిని ఎవరికైనా అద్దెకు ఇచ్చి సెపరేటు మీటర్ తీసుకునే వారి విషయంలోనూ స్పష్టత లేదు. అద్దెకుండేవారు ఉపయోగించిన విద్యుత్ బిల్లును కూడా పరిగణిస్తూ అనర్హత వేటు వేయడం గమనించాల్సి ఉంది. మరోపక్క ఆదాయం విషయమై పలు అంశాలు బయటకొచ్చాయి. ఒకప్పుడు ఆదాయం ఎక్కువగా ఉండి పన్ను చెల్లించి ఉండొచ్చు. ఆ పిమ్మట పన్ను చెల్లించేంతా ఆదాయం లేకపోయినా అతన్ని ఆదాయం పన్ను చెల్లింపుదారుగా పరిగణిస్తూ అనర్హ జాబితాలో చేర్చారు.
సాధారణంగా అనర్హుల తొలగింపును ఎవరూ సమర్థించరు. కానీ అర్హత కలిగి ఉన్నా తొలగించడంవల్ల కార్డుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దిద్దుబాట చర్యలకు ఉపక్రమించింది. రీవెరిఫికేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. నిబంధనలను సవరించి కార్డులు సవ్యదిశలో అందరికీ అందించాలన్న భావన కార్డు బాధితుల్లో వ్యక్తవౌతోంది. ఇక పింఛన్ల అంశంలోనూ కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నగదు రూపేణ అందుకున్న ప్రత్యక్ష సాయం ఆగిపోతే ప్రతి పెన్షనరు బాధపడటం సహజమే. ఒక్క రేషన్ కార్డులో పలు పేర్లున్నాయంటూ పెన్షన్‌ను ఆపేయడం తగదని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటిదాకా తమ కుటుంబ అవసరాలు, వైద్యఖర్చులకు, ఇతరత్రా ఎన్నింటికో ఆసరా ఉన్న ఈ పెన్షన్ రాకపోతే అది మా జీవనంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సాధారణంగానే నిరసన, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నానరు. ఇదిలా ఉండగా.. చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామాల్లో రాజకీయ ప్రయోజనాలు బేరీజు వేసుకుంటున్న నేతలు, విపక్షాలకు చెందిన వారి పింఛన్లను అనర్హుల జాబితాలోకి కార్డుల వడపోత ద్వారా వచ్చేట్లు చూస్తున్నారని అక్కడక్కడా విమర్శలొస్తున్నాయి.
తెల్ల కార్డులున్న భూ యజమానులకు కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అసలు తెల్లకార్డుదారులు పెద్దపెద్ద కమతాలను లేదా ఖరీదైన భూములను లేదా వాణిజ్య స్థలాలను ఎలా కొంటారన్న కొత్త కోణం ఇటీవలే తెరపైకొచ్చింది. భూములు కొన్న తెల్లకార్డుదారులపై నమోదవుతున్న కేసులే దీనికి నిదర్శనంగా పేర్కొంటున్నారు. రాజధాని అమరావతిపై ప్రస్తుతం జరుగుతున్న సందిగ్ధత విషయంలోనూ, భూముల వ్యవహారంలోనూ ఈ తెల్లకార్డుల అంశం వెలుగు చూసింది. అమరావతి చుట్టుపక్కల భూములు కొన్నవారిలో 797 మంది బీపీఎల్ (దారిద్య్రపు రేఖకు దిగువన) కుటుంబాలు తెల్లకార్డులున్న వారేనని సీఐడి దర్యాప్తులో తేలిందని ప్రభుత్వవర్గాలు ఉటంకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసుల నమోదును బట్టి చూస్తే ఎక్కడైనా భూములు కొనాలన్నా ముందువెనకా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందేమోనని పరిశీలకులు అంటున్నారు.
గ్రామ వలంటీర్లు చేపట్టిన సర్వే సింహభాగం తప్పుల మయంగా ఉన్నట్లు ఫిర్యాదులున్నాయి. భారీగా భూములున్నాయని, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని పేర్కొంటూ రేషన్ కార్డులు రద్దుచేస్తున్నారు. దీంతో వారంతా రీ వెరిఫికేషన్‌కోసం తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులనుంచి స్పష్టత లేకపోవడంతో వారిది అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. ఇప్పటివరకు లభించిన సమాచారం మేరకు రాష్ట్రంలో 7 లక్షల మందికి పింఛన్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల వాలంటీర్లకు సరైన అవగాహన లేకపోవడంవల్ల రికార్డుల్లో తప్పులు వచ్చినట్లు చెబుతున్నారు. మరోపక్క ప్రభుత్వం విధించిన నిబంధనలపై రోజుకో రకమైన అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఉదాహరణకు భూముల నిబంధననే తీసుకుంటే.. రాయలసీమలో పదెకరాల పొలం ఉన్నా రైతులు దుర్భిక్షం వల్ల దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని నిపుణుల వ్యాఖ్య. అదే రూలు సాగునీటి సౌకర్యం పుష్కలంగా ఉన్న డెల్టాకూ వర్తిస్తోందని వారి వాదనగా ఉంది. వెనుకబడిన ప్రాంతాలకు, కరువుసీమకు ప్రత్యేక నిబంధనలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్ కార్డులున్నాయి. ఇందులో దాదాపు 90 లక్షల కార్డులకు కేంద్రం రాయితీ ఇస్తుండగా, 50 లక్షల కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే రాయితీ భరిస్తోంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై పెరుగుతున్న ధరలవల్ల భారం పడుతోందని పౌరసరఫరాల శాఖ మొత్తుకుంటోంది. దాదాపు లక్ష మంది వరకూ ప్రభుత్వ ఉద్యోగులు కూడా తెల్లరేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు గణాంకాలు ఉదహరిస్తున్నాయి. వీరితోపాటు వివిధవర్గాల వారి చేతుల్లో లెక్కకు మించి కార్డులున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. అందుకే 1.47 కోట్ల కార్డుల్లో 20 లక్షల వరకూ కార్డులు తొలగించాలని ప్రభుత్వమే సంకల్పించింది. అందరికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇంత మందికి కార్డులెలా ఉన్నాయన్న దానిపై దృష్టి సారించింది.

- చెన్నుపాటి రామారావు, 9959021483