Others

సీఏఏపై ముఖ్యమంత్రి చిర్రుబుర్రు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై మరోసారి మండిపడ్డారు. సాక్షాత్తు శాసనసభలో సీఏఏపై, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్)పై విరుచుకుపడ్డారు. తనదైన ప్రత్యేకశైలిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
వాస్తవానికి జాతీయ జనాభా పట్టిక ఎలా ఉండనున్నదో ఎవరికీ తెలియదు. అందులో ఆక్షేపించదగ్గ అంశాలు ఏముంటాయో తెలియదు. దాని నమూనాను ప్రభుత్వం ప్రకటించలేదు. అలాంటి దానిపై ఎవరు ఆగ్రహం వ్యక్తంచేసినా అర్థంలేదు. ఇక మూడు పేజీల సీఏఏ భారత పౌరులెవరికీ సంబంధం లేనిది. కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్‌లో మతపీడనను, మత దౌర్జన్యాలకు గురైన అల్పసంఖ్యాక వర్గాలు భారత్‌కు గతంలో వచ్చి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి భారత పౌరసత్వం ఇవ్వడానికి చేసిన చట్టం అది. ఈ చట్టానికి దశాబ్దాల నేపథ్యం ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ అంశం నానుతూ ఉంది. ఆ తారీఖులు- దస్తావేజులన్నీ ప్రజల అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలోచన నిన్నమొన్న పుట్టుకొచ్చింది కాదు. ఈ విషయాన్ని విస్మరించి కేసీఆర్ లాంటి ప్రముఖులు సైతం మాట్లాడటం వింతగా, విచిత్రంగా ఉంది.
తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సీఎం సమాధానమిస్తూ, సీఏఏ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ప్రకటించారు.
గత మూడు మాసాలుగా దేశవ్యాప్తంగా అపోహ ఆధారంగా సీఏఏపై అనేక ఆందోళనలు, ధర్నాలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ అయితే అతలాకుతలమైంది. 50 మందికి పైగా మరణించారని తెలుస్తోంది. కోట్లరూపాయల ఆస్తి బుగ్గిపాలయింది. దీని వెనకాల ఒక వర్గం అసహనంతోపాటు విద్రోహ శక్తుల హస్తం ఉందని అనుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఢిల్లీ గడ్డపై కాలుపెట్టిన క్షణం నుంచి హింస, విధ్వంసానికి తెగబడి దేశ ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న దుర్బుద్ధితోనే ఆ చర్యలకు పాల్పడ్డ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అందులో పెద్ద ‘కుట్ర’ దాగి ఉందన్న విషయం క్రమంగా బయటపడుతోంది. పోలీసు నిఘా విభాగం అధికారిని క్రూరంగా, అత్యంత హేయంగా చంపిన విషయాలు లోకం తిలకించింది. ఒక పోలీసు కానిస్టేబుల్‌పైకి షారుఖ్ అనే వ్యక్తి పిస్తోల్ ఎక్కుపెట్టి బెదిరించిన దృశ్యం అందరినీ కలవరపరచింది. డీసీపీ స్థాయి అధికారి తల పగులగొట్టారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ సీఏఏ దేశాన్ని కుదిపేస్తున్నది. ప్రజలకు అనుమానాలు, అపోహలు వున్నాయి, దేశం మొత్తం ఉద్రిక్తంగా ఉంది. ఇప్పటికే ఐదారు రాష్ట్రాల శాసనసభలు సీఏఏకు, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. ఇక శాసనసభలోనూ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం అన్నారు.
ఇంతవరకూ బాగానే వుంది. కేసీఆర్‌ను ఆక్షేపించేందుకు ఏమీ లేదు. కానీ బర్త్ సర్ట్ఫికెట్ (పుట్టిన తేదీ ధ్రువీకరణ) నాకే దిక్కులేదు, ఇక పేదల సంగతేమిటి? నా బర్త్ సర్ట్ఫికెట్ లేనప్పుడు మా నాయన బర్త్ సర్ట్ఫికెట్ ఎక్కడినుంచి తేవాలి? ప్రజలు, పేదలు ఈ పత్రాలను ఎక్కడి నుంచి తెస్తారు? అని ప్రశ్నించారు. తనదైన శైలిలో అనేక ప్రశ్నలను ఆయన సంధించారు. సీఏఏకు ఈ ప్రజలకు ఏమైనా సంబంధమున్నదా? అని ఎవరికివారు ప్రశ్నించుకోవడం లేదు.
ఈ రకమైన వాదన ప్రశ్నలు దేశమంతా వ్యాపింపజేశారు. పుకార్లను సృష్టించారు. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్న చందంగా దేశమంతా ఉద్రిక్త పరిస్థితులను నెలకొల్పారు. సాధారణ ప్రజలను, అమాయకులను, నిరక్షరాస్యులను, అవగాహన లేనివారిని ఆకర్షించి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ వారందరికన్నా ఎంతో భిన్నం కదా? గొప్ప రాజనీతిజ్ఞత, గొప్ప జ్ఞాపకశక్తి, భాషా పటిమ, భావుకత గలవారు ఇలా సీఏఏ ఏం చెబుతున్నదో తెలుసుకోకుండా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలను, తాత తండ్రుల పుట్టిన తేదీ పత్రాలను చూపమంటారని, అవి నా దగ్గరే లేదు, సాధారణ ప్రజల వద్ద ఎలా ఉంటాయి? అన్న ప్రశ్నను లేవనెత్తి అసంఖ్యాకుల్ని ఆకర్షించడం సరైనదేనా? సీఏఏ భారత పౌరులెవరికీ సంబంధం లేనప్పుడు పౌరులు బర్త్ సర్ట్ఫికెట్ ఎందుకు చూపాల్సి వస్తుంది? ప్రజల్ని గందరగోళపరిస్తే అదెలా న్యాయమనిపించుకుంటుంది? ఇంత సరళమైన సాధారణమైన అంశాన్ని క్లిష్టతరం చేసి గందరగోళపరిచి ఆందోళన చెందేలా ప్రకటనలు వస్తే ఎలా? సీఏఏ భారత ప్రజలెవరికీ ఏ మాత్రం సంబంధంలేదన్న సంగతి ముఖ్యమంత్రికి తెలియదనుకోవాలా? సీఏఏ కాకపోతే ఎన్‌పీఆర్ సందర్భంలో అడుగుతారేమోనన్న ఊహ చేయడం విచిత్రంగా వుంది. ఆ జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) నమూనా ఏమిటో ఎలా వుంటుందో ఎవరికీ తెలియదు. ప్రధాని ఇప్పటికే ఈవిషయమై స్పష్టతనిచ్చారు. ఎన్‌పీఆర్ గూర్చిన చర్చ ప్రభుత్వం చేయలేదన్నారు. కేంద్రంలో ఆ విషయమై కదలిక లేనప్పుడు ఇంతగా ఆందోళన చెందడంలో ఏమైనా అర్థం ఉందా? తెలంగాణలో ఒక మాట వాడుకలో ఉంది.. ఏమిటంటే, ‘పిల్ల పుట్టకముందే కుల్ల (తలకు కట్టుకునే టోపీ) కుట్టినట్లు’ అని. అచ్చం అలాగే ఉంది ఎన్‌పీఆర్‌పై స్పందించేవారి వ్యవహారం.
ఎవరి వ్యవహారం ఎలా వున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా మాట్లాడితే ఎలా? ఆయన స్థాయి, వ్యక్తిత్వం, హోదా, దార్శనికత, అవగాహన అన్నీ పక్కకు నెట్టేసి పిల్ల పుట్టకముందే కుల్ల కుడితే ఎలా సబబమనిపించుకుంటుంది? దేశ రాజకీయాల్ని సైతం శాసించే జ్ఞానం, సత్తా వున్న వ్యక్తి నుంచి ఇలా అతి సాధారణ అంశంపై పదే పదే తేలిపోయే ప్రకటనలు చేయడం ఆయన స్థాయికి తగదు. గతంలో పత్రికా ప్రతినిధుల సమావేశంలోనూ ఇలాగే స్పందించారు. అనంతరం దేశంలో అనేక చర్చలు, సదస్సులు, సమాలోచనలు జరిగాయి. వాటి సారాంశాన్ని పట్టుకోవాలి కదా?
ఇటీవల సుప్రీంకోర్టు యువ మహిళా న్యాయవాది సుబహిఖాన్ హైదరాబాద్‌కువచ్చి పాతబస్తీలో సీఏఏపై, ఎన్‌పీఆర్‌పై ఒవైసీ సోదరుల విషప్రచారాన్ని తిప్పికొట్టారు. బారిస్టర్ చదివిన అసదుద్దీన్‌కు విషయాన్ని ఎలా వక్రీకరించాలో తెలుసని, అలా వ్యక్తీకరణకు పూనుకుని దేశమంతా విద్వేషం పెంచుతున్నారని ఆమె విరుచుకుపడ్డారు. ఆర్టికల్ 14 గూర్చి లేవనెత్తిన అంశాల్ని సైతం ఆమె నివృత్తిచేశారు. ఆ న్యాయవాది ప్రసంగం సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అయింది. ఆమె వాదన, వివరణ, సీఏఏ నేపథ్యం అంతా పూసగుచ్చినట్టు వివరించాక దానిపై ఈగ కాలంత అనుమానం ఎవరికీ ఉండనవసరం లేదు.
అలాగే కేరళ గవర్నర్ అరీఫ్ మహ్మద్‌ఖాన్ ఈ చట్టంలోని లోపమేమిటో చూపమని పలుసార్లు ఆందోళనకారుల్ని అడిగారు. గుడ్డిగా వ్యతిరేకించడం తప్ప తప్పును చూపలేకపోయారు. ఆయనను తూలనాడారు. ఆయన ప్రసంగాలను అడ్డుకున్నారు. వారి వాస్తవ మానసిక స్థితిని చాటుకున్నారు.
ఇక తారేఖ్ పతేహ్ అనే రచయిత, మేధావి, టీవీ వ్యాఖ్యాత ఢిల్లీలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని భారత ముస్లింల మానసిక స్థితిని తప్పుపట్టారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో ముస్లింలు ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని, సర్వ హక్కులతో సాధికారతతో బతుకుతున్నారని, సీఏఏ భారత మైనారిటీలకు ఏ మాత్రం సంబంధం లేదని, ‘చదువుకున్న మూర్ఖులు’ విశ్వవిద్యాలయాల నుంచి ఈ ఆందోళనను ప్రారంభించారని, అందులో ఏమాత్రం అర్థంపర్థం లేదని నిశితంగా విమర్శించారు. స్వయంగా ఆయన ముస్లిం మతానికి చెందినా భారత్‌లో ముల్లాల ప్రవర్తనను, ఖురాన్‌పై వారి వ్యాఖ్యానాలను తీవ్రంగా తప్పుపట్టారు.
ఢిల్లీలోని విద్యావంతులైన అనేకమంది ముస్లిం యువతీ యువకులు సామాజిక మాధ్యమాల్లో సిఏఏ వ్యతిరేకులను, షాహీన్‌బాగ్ ఆందోళనకారుల్ని, రాజకీయ పబ్బం గడుపుకునే కాంగ్రెస్ తదితర రాజకీయ నాయకుల్ని తీవ్రంగా ఎండగడుతూ ‘పోస్టులు’ పెట్టారు. పైన చెప్పిన వారంతా ముస్లిం మతాన్ని ఆచరిస్తున్నవారే. విచక్షణాజ్ఞానం గలవారే. సీఏఏ ముస్లింలకు నష్టం కలిగించేదే అయితే వారెందుకు ఇంతలా సమర్థిస్తారు. ఇంతలా ఎందుకు వాదిస్తారు? ఒవైసీ ఇంటి సమీపంలోనే ఎలా సవాలు విసురుతారు?
ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షా, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ చట్టంపై అనేక సందర్భాల్లో వివరణలు ఇచ్చారు. ఇది పౌరసత్వం ఇచ్చేదే తప్ప తొలగించేది కాదని స్పష్టం చేసినప్పటికీ, భారత పౌరులెవరికీ ఆ చట్టంతో సంబంధం లేకపోయినప్పటికీ, సుప్రీంకోర్టులో దీనిపై వ్యాజ్యం నడుస్తున్నప్పటికీ ఎవరి మాటను విశ్వాసంలోకి తీసుకోకుండా నమ్మకుండా ఇలా రెచ్చగొట్టేలా వ్యవహరించడం ఏవిధంగా సబబు అనిపించుకుంటుంది. తప్పుడు అవగాహనతో ప్రజల్ని గందరగోళానికి గురిచేయడం ఎలా సమ్మతమవుతుంది?
కేసీఆర్‌లాంటి అత్యంత బాధ్యత గల నాయకుడు విచక్షణతో పాలు-నీళ్లు వేరుచేసి చూసే తత్వంతో, వాస్తవిక దృష్టికోణంతో సీఏఏపై స్పందిస్తే బాగుండేది. ఓవైసీ సోదరులు చెప్పింది.. చెబుతున్నది సత్యమా? కాదా? అన్న వివేచన చేయాలి. విజ్ఞత ప్రదర్శించాలి తప్ప తన అభిమానులను నిరాశపరచవద్దు. న్యాయం, ధర్మం, సత్యం ఆధారంగా చేసిన పోరాట వారసత్వాన్ని కాపాడుకుంటూ కేసీఆర్ ముందుకు కదలాలి తప్ప కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో సీఏఏ వ్యతిరేక తీర్మానాలు చేశారని తెలంగాణ అసెంబ్లీలో అలాంటి తీర్మానం చేయాలనుకోవడం ఎలా వివేకవంతమైన ఆలోచన అవుతుంది? సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సీఏఏను సమర్థిస్తున్న సంగతి విస్మరిస్తే ఎలా?

-వుప్పల నరసింహం 99857 81799