Others

పాక్‌లో ఔరత్ ఆజాదీ మార్చ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్నటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాకిస్తాన్‌లో ‘ఔరత్ ఆజాదీ మార్చ్’ పేర పాక్ యువతులు వీధుల్లో ఊరేగింపులు నిర్వహించారు. ఆశ్చర్యం! మత రాజ్యంగా ఉన్న పాకిస్తాన్‌లో సంప్రదాయ, ఛాందసవాదులు ఎక్కువగా కనిపించే పాక్‌లో వీధుల్లో మహిళలు ప్లకార్డులు- బ్యానర్లు పట్టుకుని, పిడికిళ్ళు బిగించి నినాదాలుచేస్తూ ముందుకు సాగడం విస్మయం కలిగించింది.
మహిళల స్వేచ్ఛ-స్వాతంత్య్రాలను కాంక్షిస్తూ పాక్ మహిళలు ముఖ్యంగా యువతులు రోడ్లపైకి రావడం ఆశ్చర్యపరిచే విషయమే! ఇది పాక్ సమాజంలో కల్లోలం సృష్టించింది. బురఖాలు, పరదాల మాటున మగ్గిన మహిళలు పిడికిలి బిగించి ఆజాదీ కావాలని నినదించడం సాధారణమైన సంగతేమీ కాదు.
పితృస్వామ్య వ్యవస్థ, మగవారి నియంతృత్వ వైఖరి, దాష్టీకం తదితర విషయాలను సహించేదిలేదని వారు ఎలుగెత్తి నినదించారు. మహిళా సాధికారతను కోరుతూ స్వేచ్ఛ-స్వాతంత్య్రాలు కావాలని వారు ఊరేగింపులు జరిపారు. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, హైదరాబాద్, సుక్కూర్ లాంటి అనేక నగరాల్లో ‘ఉమెన్ డెమొక్రటిక్ ఫ్రంట్’ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంనాడు ఈ ఊరేగింపులు నిర్వహించారు.
ఈ విప్లవాత్మక పరిణామాన్ని తట్టుకోలేని కొందరు సంప్రదాయ- ఛాందస వాదులు ఇస్లామాబాద్‌లోని ‘లాల్ మసీదు’ప్రాంతంలో మహిళల ఊరేగింపుపై దాడి చేశారు. వారిపై చెప్పులు, కర్రలు, రాళ్లు, ఇటుకలను విసిరారు. కొందరిని గాయపరిచారు. అయినా జంకకుండా ఎర్రటి గుడ్డపై తెల్లటి అక్షరాలుగల నినాదాల బ్యానర్లను, ప్లకార్డులను పట్టుకుని ఆవేశంతో ఊగిపోతూ ‘ఆజాదీ’నినాదాలు చేశారు. అంతకుముందు ‘‘ఔరత్ ఆజాదీ మార్చ్’’ కొనసాగించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కొందరు లాహోర్ హైకోర్టును ఆశ్రయించగా వారి పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దాంతో రెట్టింపు ఉత్సాహంతో యువతులు, విద్యార్థినులు బిగుతైన దుస్తులు ధరించి, ఇస్లాం మత సంప్రదాయాలను పక్కనపెట్టి ప్రదర్శనల్లో పాల్గొన్నారు. దీనికి పోటీగా కొందరు పురుషులు ఊరేగింపు జరిపారు. దాంతో ఇస్లామాబాద్‌లో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ మహిళల ఊరేగింపులో లింగ మార్పిడి చేయించుకున్నవారు, పిల్లలు సైతం పాల్గొనడం విశేషం. తమకు మాట్లాడే హక్కు ఉందని, తమ ఉనికిని గుర్తించాలని, హక్కులను గౌరవించాలని నినాదాలుచేశారు.
ఇందులో ‘‘మేరి జిస్మ్... మేరి మర్జి...’’ (నా శరీరం- నా ఇష్టం) అన్న నినాదం వివాదాస్పదమైంది. మహిళా హక్కుల పోరాటవాదులు, రాడికల్ భావాలుగలవారు ఈ నినాదాన్ని గట్టిగా సమర్ధించగా, సంప్రదాయవాదులు, మత తత్వవాదులు దీనిపై మండిపడ్డారు. బరితెగించారని విమర్శించారు. నానా శాపనార్థాలు పెట్టారు. పాక్ సంస్కృతిని సర్వనాశనం చేసేందుకు పూనుకున్నారని విరుచుకుపడ్డారు. ఈ విమర్శలను, బెదిరింపులను లెక్కచేసేది లేదని మహిళా ఉద్యమకారులు తెగేసి చెబుతున్నారు. టెలివిజన్ ఛానళ్ళలో పాల్గొని తమ భావాలను, ఆలోచనలను, ఆధునిక వస్తధ్రారణను బలంగా చాటుకున్నారు.
ఏ రకంగా చూసినా ఇది పూర్తిగా రాడికల్ పరిణామం. పాకిస్తాన్‌లాంటి ఛాందసవాద సమాజంలో ఇంతటి విప్లవాత్మక భావజాలం వెలుగుచూడటం, అదీ వీధుల్లోకి రావడం, మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద చర్చనీయంకావడం మామూలు విషయంకాదు. మహిళలు బురఖాలేకుండా ఇంటి గడపదాటనిచోట బురఖాలేకుండా, బిగుతైన దుస్తులు ధరించి, శిరోజాలు విరబోసుకుని, ఆజాదీ... స్వేచ్ఛ-స్వాతంత్య్రం కావాలని శివంగుల్లా కదలడం పెద్ద కుదుపు... కొత్త కెరటంగా భావించక తప్పదు.
ఆడ పిల్లలపై అత్యాచారాలు ఆపాలని, వారి ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలని, శిశుమరణాలను నిరోధించాలని, ప్రసవ సమయంలో మరణాలను అరికట్టాలని, పరదానుంచి విముక్తి కల్పించాలని, ఆస్తిలో హక్కు ఇవ్వాలని, మహిళా రిజర్వేషన్లు పాటించాలని, మహిళల మనోభావాలను గౌరవించాలని ఈ ఉద్యమకారులు బలంగా కోరుతున్నారు.
ఒకప్పటి ఫెమినిజం... వుమెన్ లిబ్ ఆలస్యంగా పాక్‌లో ప్రవేశించిందని కొందరు విశే్లషకులంటున్నారు. రాడికల్ ఫెమినిజంతో పాశ్చాత్య దేశాల్లో అనేక ఉద్యమాలు కొనసాగిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. దాని పరావర్తనంగానే పాకిస్తాన్‌లో ఈ ‘ఔరత్ ఆజాదీ మార్చ్’లని వారు అంటున్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు క్రమంగా తెరమరుగవుతున్న వేళ ఈ రాడికల్ భావజాలం మహిళల్లో పాతుకోవడం పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. రుతుక్రమంగూర్చి, ఆ సమయంలో ఉపయోగించే పాడ్స్‌గూర్చి బహిరంగంగా చర్చచేయడాన్ని పాక్ సంప్రదాయశక్తులు తట్టుకోలేకపోతున్నాయి. భారత రాజధాని ఢిల్లీలో కొంతకాలం క్రితం జెఎన్‌యూ, జామియామిలియా తదితర విద్యాసంస్థల్లో వినిపించిన నినాదాలన్నీ ఇప్పుడు పాకిస్తాన్‌లో వినిపిస్తుండటం ఆశ్చర్యం. ముఖ్యంగా ‘ఆజాదీ’ నినాదాలు యువకులు వీధుల్లో గినె్నల్ని గరిటెలతో మోగిస్తూ చేయడం విస్మయం కలిగిస్తుంది. ఢిల్లీ విద్యార్థులకన్నా ఎక్కువ ఆవేశం, ఆక్రోశం పాక్ యువకులు ప్రదర్శించారు. తమ ప్రాథమిక హక్కులకోసం వారు సాహసాన్ని ప్రదర్శించారు. లింగ వివక్షను సహించమని తెగేసి చెబుతున్నారు. గృహహింస, లైంగిక వేధింపులు, బలవంతపు పెళ్లిళ్లు, రేప్‌లను నిరసిస్తూ పెద్దఎత్తున బహిరంగ నిరసన తెలుపుతూ ప్రపంచ మీడియాను ఆకర్షించడం అనూహ్యమైన అంశం.
కేవలం వంట గదిలో పరాటాలు(రొట్టెలు) చేయడమే తమ పనికాదని, అన్ని రంగాల్లో తమ సత్తాచాటుతున్నామని, అందుకే తమకు సమాన హక్కులు కల్పించాలని వారు సివంగులై చరిత్ర సృష్టిస్తున్నారు. వీరికి వివిధ మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సున్నితమైన అంశాలపై పత్రికల్లో వ్యాసాలు ప్రచురించారు. ఎలక్ట్రానిక్ మీడియా చర్చల్లో పాల్గొన్నారు. తమ గొంతు బలంగా వినిపిస్తున్నారు. కొంతమంది యువతులు టీ-షర్టులు ధరించి ఊరేగింపుల్లో ఉత్సాహంగా పాల్గొనడాన్ని గతంలో పాక్ ఎన్నడూ చూసి ఉండదు. నిరభ్యంతరంగా, ధైర్యంచేసి ఆధునిక వస్తధ్రారణతో యువతులు వీధుల్లోకొస్తున్నారు. తమ దృక్పథాన్ని చాటుతున్నారు.
పితృస్వామ్య వ్యవస్థ శవయాత్రను నిర్వహించి వారు ఊరేగడమంటే వారి తెగింపు ఎలాంటిదో ఇట్టే ఊహించవచ్చు. ఇంతవరకు అనుభవించిన అష్టకష్టాలు చాలు...ఇంకానా?... ఇకపై వాటికి చెల్లుచీటి పలకాలని వివిధ నగరాలలో స్ర్తిశక్తి నినదించింది. ప్రజాస్వామ్య విలువలు పాదుకోవాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచంతో కలిసి పయనించాలని ఆశిస్తున్నారు. ఇస్లాంలో మహిళ పట్ల ఉన్న వివక్షతను వారు నిశితంగా విమర్శిస్తున్నారు. లింగ వివక్షను సహించేది లేదని బల్లగుద్దిమరీ చాటుతున్నారు. మహిళలకు సంపూర్ణ సాధికారత రావాలని కోరుతున్నారు. ‘‘ఇప్పుడు మన సమయం వచ్చేసింది’’అన్న ప్లకార్డులు పట్టుకుని తమకుతాము ధైర్యం చెప్పుకుంటున్నారు.
మూడు సంవత్సరాల క్రితం (2018) చిన్నగా ప్రారంభమైన ఈ ‘ఔరత్ ఆజాదీ మార్చ్’ ఈ సంవత్సరం పెద్దఎత్తున జరిగింది. వివిధ నగరాలకు విస్తరించింది. నా శరీరం నా ఇష్టం... నా పెళ్లి నా ఇష్టం...లాంటి నినాదాలు పాక్ యువతులను ఆకర్షిస్తున్నాయి. ఆలోచింపజేస్తున్నాయి. సరికొత్త తీరాలకు చేరుకునే మార్గం లభించినంతగా సంబరపడుతున్నారు.
మరోపక్క ఈరకమైన వాదనలకు ‘ఇస్లాం’లో స్థానంలేదని, షరియత్‌కు విరుద్ధమని సంప్రదాయవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పాక్ కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడానికే ఈ ‘ఆజాదీ మార్చ్’లు ఉపకరిస్తాయని, దీనికి విదేశీ నిధులు అందుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా ఇప్పుడు పాకిస్తాన్ సమాజంలో సరికొత్త భావవిప్లవం బలంగా ప్రవేశించింది. దీనికితోడు సోషల్ మీడియా అనూహ్యంగా విస్తరించింది. పాశ్చాత్య పోకడలను అనుసరించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ పరిస్థితుల్ని పోకడల్ని అర్ధంచేసుకుంటూ అడుగుముందుకేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాంతో రాడికల్స్, లిబరల్స్ వర్సెస్ సంప్రదాయవాదుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దాంతో ‘ఇస్లాం’ మతంలో సంస్కరణలకు సమయం ఆసన్నమైంది. మతంకన్నా తమ ఆత్మగౌరవంమిన్న...అన్న కొత్తతరం పాకిస్తాన్‌లో కనిపిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వ కళ్లుతెరిపిస్తోంది నవతరం.
ఇప్పుడైనా పాక్ భారత్‌పై విషంగక్కడం ఆపుతుందని, విద్వేషం చిమ్మడం నిలుపుతుందని ఆశిద్దాం!

- వుప్పల నరసింహం, 9985781799